ఆరోగ్యానికి కల్పవల్లి
200 గ్రాముల కరివే పాకులు తీసుకుని, 250 మి. లీ. కొబ్బరి నూనెలో మరిగించి ఆ తర్వాత వడగట్టి, ఆ నూనెను రోజూ తలకు రాసుకుంటే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి.
కరివేపాకు, వేపాకులు ముద్దగా నూరి, స్పూను మోతాదు ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున రోజూ తీసుకుంటే, మధుమేహం అదుపులో ఉంటుంది.
కరివేపాకు ఆకులు మెత్తగా నూరి, నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే అవి త్వరగా మానడమే కాకుండా మచ్చలు కూడా కనుమరుగవుతాయి.
కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమభాగాలుగా తీసుకుని ముద్ద చేసి రాత్రిపూట వారం రోజులు రాసుకుంటే, కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద రాస్తే చారలు తగ్గుతాయి.
కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి పచ్చడి చేసుకుని రోజూ తింటూ ఉంటే దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
ఒక స్పూను కరివేపాకు రసాన్ని ప్రతి రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల సమస్యలు తగ్గిపోతాయి.
కొత్తిమీరతో కొలెస్ట్రాల్ దూరం!
గుడ్ ఫుడ్
వంటకాన్ని అలంకరించడానికి కొత్తిమీర చల్లుతారు. వంటలో చివరగా వాడినా ఆరోగ్యంలో మొదటిస్థానం కొత్తిమీరదే! కారణం... కొత్తిమీరలో పుష్కలంగా ఉండే ఆరోగ్య అంశాలు. వాటిలో కొన్ని ఇవి...
⇒ కొత్తిమీరలో క్యాలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్ ఉండకపోగా, ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ గురించి దిగులు పడేవాళ్లు కొత్తిమీర తింటే చాలు... స్థూలకాయాన్ని తేలిగ్గా నివారించవచ్చు / అదుపులో ఉంచుకోవచ్చు.
⇒ కొత్తిమీరలో పొటాషియమ్, క్యాల్షియమ్, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియమ్ సమృద్ధిగా ఉంటాయి. పొటాషియమ్ జీవకణం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
⇒ కొత్తిమీరలోని ఐరన్ రక్తహీనతను నివారించడంతో పాటు ఎర్ర రక్తకణాల ఉత్పాదనకు తోడ్పడుతుంది.
⇒కొత్తిమీరలో విటమిన్–ఏ, విటమిన్–బి కాంప్లెక్స్, విటమిన్–సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొత్తిమీరలో విటమిన్–సి పాళ్లు ఎంత ఎక్కువంటే ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన విటమిన్–సిలో 30 శాతం కొత్తిమీరతోనే లభ్యమవుతుంది.
⇒ కొత్తిమీర నోటిక్యాన్సర్లను నిరోధిస్తుంది. న్యూరాన్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ∙రక్తాన్ని గడ్డ కట్టించడంలో కీలక భూమిక నిర్వహించే విటమిన్–కె కొత్తిమీరలో పుష్కలం. ఇందులోని ఔషధ గుణాలు అలై్జమర్స్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగపడతాయి.
మొక్కజొన్న కండె హెల్దీ టైమ్‌పాస్
గుడ్ ఫుడ్
సరదాగా బయటకు వెళ్లినప్పుడో లేదా ఎక్కడైనా టైమ్‌పాస్ కోసం ఏదైనా నమలాలనుకున్నప్పుడు మొక్కజొన్న కండెలు తినడం చాలామంది చేసే పనే. అయితే దాన్ని ఏదో టైంపాస్ కోసం అన్నట్లుగా తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న కండెలతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అలా అలా సరదాగా సమయం గడపుతూ, టైంపాస్ చేస్తున్న సమయంలోనే ఆరోగ్యాన్ని అవెలా సమకూరుస్తుంటాయో తెలుసుకుందాం.
∙ మొక్కజొన్నలో డయటరీ ఫైబర్ (పీచు పదార్థాలు) చాలా ఎక్కువ. వాటిలోని సాల్యుబుల్ ఫైబర్ మలం మృదువుగా వచ్చేలా చేస్తుంది. అందుకే అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి.
∙ ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో 18.4 శాతం డయటరీ ఫైబర్ ఉండటం వల్ల మొలలు (పైల్స్) సమస్యను నివారిస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్‌కూ నివారణగా పనిచేస్తాయి. అంతేకాదు నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
∙ ఐరన్ లోపాలను అధిగమించేలా చేసి రక్తహీనతను తగ్గిస్తాయి. కొత్త రక్తకణాలు పుట్టేందుకు మొక్కజొన్న బాగా దోహదపడుతుంది.
∙ మొక్కజొన్నలో ఖనిజలవణాలైన ఫాస్ఫరస్, మెగ్నీషయమ్, మ్యాంగనీస్, ఐరన్, కాపర్ పాళ్లు చాలా ఎక్కువ. అంతేకాదు... అరుదైన సెలీనియమ్ పాళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫాస్ఫరస్ ఎదుగుదలకూ, ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. మెగ్నీషియమ్ మంచి గుండె ఆరోగ్యంతో, ఎముకలకు బలాన్నిస్తుంది.
. దీని పసుపుపచ్చ రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్–ఏ ను సమకూర్చేందుకు అవసరమైన బీటా–కెరటిన్ ఉంటుంది. అందుకే మొక్కజొన్న చూపును మెరుగుపరచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటిజబ్బులను నివారిస్తుంది.
∙మొక్కజొన్నలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–ర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
ఊదా రంగు ఉత్తమం
మన ఆహార పదార్థాల్లో ఊదారంగు పండ్లో, కాయగూరలో ఉండేలా చూసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అత్యధిక మొత్తంలో ఉండే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కేన్సర్, పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి.
ఊదా, నీలిరంగు పండ్లు వర్ణాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ప్రత్యేకించి బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ పండ్లల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ-ర్యాడికల్స్ వల్ల కలిగే న ష్టాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
ఊదా రంగు క్యాబేజీ, బ్లాక్ బెర్రీలు, ఊదా రంగు ఉల్లి, ఊదా రంగు ద్రాక్షల్లోని ప్లేవనాయిడ్లు రక్తపోటును తగ్గించడంతో పాటు కొన్ని రకాల కేన్సర్లను ఎదుర్కొనే శక్తినిస్తాయి.
ఊదారంగులో ఉండే చిలగడదుంపల్లో యాంతో సియానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఏర్పడే వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంశాలు సమ్దృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కణవిచ్ఛిత్తిని అరికడతాయి.
ఊదా రంగు ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఊదా రంగు క్యారెట్లలో అత్యధిక స్థాయి ఆంథోసియానిన్లతో పాటు కెరోటినాయిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ దాడిని తిప్పి కొడతాయి. ఇవి రక్తంలోని చక్కెర నిలువల్ని నియంత్రిస్తాయి. బ్లాక్ బెర్రీల్లో శరీర క్షయ వేగాన్ని తగ్గించే గుణం ఉంది. జుత్తు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది. బీట్‌రూట్లలో శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపే అంశాలు ఉన్నాయి. సూప్స్‌లోనూ, సలాడ్స్‌లోనూ వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
నూరేళ్లూ హుషారుగా!
వార్ధక్యం సహజమూ, అనివార్యమే కావచ్చు. అయితే, వార్థ్యక్యాలన్నీ ఒక్కటి కావు. సహజ వార్థక్యం, అకాల వార్థక్యం- అంటూ ఇది రెండు రకాలు. ఏ 80 ఏళ్ల తర్వాతో శరీర భాగాలు వశం తప్పుతున్నాయంటే అది సాధారణం, సహజం. కానీ, ఈ రోజుల్లో చాలా మంది శరీరాలు పెద్ద వయసు రాకముందే కుంటుపడుతున్నాయి. ఈ స్థితినే అకాల వృద్ధాప్యం అంటాం. సహజ కాలానికన్నా ముందే ఎందుకిలా అంటే? దానికి కారణాలు అనేకం...
మానవ శరీరంలో ప్రతి క్షణం అనేకానేక జీవకణాలు క్షీణిస్తూ కొత్త కణాలు పుడుతుంటాయి. అయితే ఈ జీవకణాల ఆయుఃకాలం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. శరీరంలో అనుక్షణం ఉత్పత్తి అయ్యే జీవకణాల సంఖ్య కంటే మరణించే కణాల సంఖ్య ఎక్కువ కావడం, లేదంటే ఉత్పత్తి అయ్యే కణాల సంఖ్యే బాగా తగ్గిపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఇలా ఆరోగ్యానికి హాని చేసే మృత క ణాలు పెరిగిపోవ డమో లేదా జీవకియ్రల్లో భాగంగా ఆ మాలిన్యాల ఉత్పత్తి పెరగడమో ఇందుకు కారణమవుతుంది. మనిషి జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండడం అసలైన ఆయుర్దాయంగా పరిగణనలోకి వస్తుంది. సహజ క్రమంలో కాకుండా అకాల వృద్ధాప్యం అంటూ వస్తే దాన్ని ఒక వ్యాధిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ అకాల వృద్ధాప్యం వెనుక, మనిషి, వృత్తి, ప్రవృత్తి వాతావరణంలో సంతులనం తప్పి పోవడం ఒక మౌలిక కారణం. ఈ సంతులనం తప్పినప్పుడు కలిగేదే అకాల వృద్ధాప్యం,
ఫ్రీ- ర్యాడికల్స్....
శరీరంలోని జీవ క ణాలు ఉత్పత్తికంటే ఎక్కువగా నశించినప్పుడు అనేక వ్యర్థపదార్థాలు (ప్రీ- రాడికల్స్/ ఆక్సిడెంట్స్) తయారవుతాయి. అయితే వివిధ ప్రక్రియల ద్వారా ఈ వ్యర్ధపదార్థాలను ఎప్పటికప్పుడు విసర్జించడం శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాకపోతే, సహజ పరిణామానికన్నా మించి, శరీరంలో మలినాలు తయారైనప్పుడు శరీరం వ్యధకు గురవుతుంది. వ్యాధుల పాలవుతుంది. అయితే శరీరంలో పేరుకుపోయిన ప్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడానికి, ప్రకృతి సహజంగానే శరీరంలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు (వ్యర్థ పదార్థాల నిరోధకాలు) ఉత్పన్నమవుతాయి. అయితే యాంటి- ఆక్సిడెంట్ల వ్యాధి నిరోధక శక్తిని మించి, వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కోవ డానికి, ఆహారం, ఔషధ రూపాల్లో అదనంగా మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది.
యౌవనంలోనే..
వార్థక్యంలో ధాతుక్షయ వేగం పెరగడం వల్ల సహజంగానే, శరీరం త్వరితంగా శక్తిహీనమవుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి శరీరం తరుచూ వ్యాధిగ్రస్థమవుతూ ఉంటుంది. అందుకే ప్రతి మనిషీ యవ్వనంలో ఉన్నప్పుడే సరియైున ఆహారం, అవసరమైనప్పుడు ఔషధాలు సేవిస్తే, ఓజస్సు (జీవ శక్తి) పెరిగి, వార్థక్యంలో వచ్చే వ్యాధులు సమర్థంగా నిరోధించబడతాయి. ఇందుకోసం, ఆహారం విషయంలో వృద్ధులు విధిగా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యంగా...
మాంసాహారం బాగా తగ్గించాలి.
మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడాలి.
ఆహారం మృదువుగా, సులభంగా నమిలే రీతిలో ఉండాలి.
పాల వంటి క్యాల్షియం ధాతు ప్రధానమైన ఆహారం రోజూ తీసుకోవాలి. చేపలు లేదా వృక్ష సంబంధ ప్రొటీన్ తరుచూ తీసుకోవాలి.
ఆకలిని పెంచే సూప్స్ భోజనానికి ముందు ప్రత్యేకంగా తీసుకోవాలి.
అవసరమైన మేరకు మంచి నీళ్లు తాగడంతో పాటు వ్యర్థపదార్థాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు గల ఆహార పదార్థాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.
విటమిన్లూ అంతే ముఖ్యం
విటిమిన్ ‘ఎ’ కెరోటినాయిడ్స్ రూపంలో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో ఉంటుంది. ముఖ్యంగా, క్యారట్, ముల్లంగి, టమాట, మునగ, బొస్పాయి, పచ్చిమిర్చి, మామిడి పండ్లు, చేమ ఆకులు, పాలకూర, మెంతికూరలో ఉంటుంది. అందుకే వీటిని తరుచూ వాడుతూ ఉండాలి. నేరుగా విటమిన్ ఏ రూపంలో చేపలు, మాంసం, పాలు, వెన్న, నెయ్యి గుడ్లు, లివర్‌లో ఉంటుంది.
విటమిన్ -సి అధికంగా, సిట్రస్ జాతిపండ్లైన నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి, సీతాఫలం, జామ, టమాట, మిర్చి, ఆకుకూరల వంటి వాటిలో అధికంగా ఉంటుంది.
విటమిన్- ఇ అధికంగా, నూనె గింజలు (ఆల్మండ్, ఎప్రికాట్స్) వెజిటబుల్ ఆయిల్స్ (సన్‌ఫ్లవర్, వేరుశెనగ, సోయా) కాడ్ చేపలు, మాంసం, మొలకెత్తిన గింజలలో (పెసర్లు, శనగలు, వేరు శనగ) ఉంటాయి.
లవణాల్లో ముఖ్యంగా సెలీనియం, కాపర్, జింక్, మెగ్నీషియం వంటివి నువ్వులు, వేరు శనగ, సోయా, ఆల్మండ్స్, నూనెగింజలు, రాగులు, అలచందలు జొన్నలు, సజ్జల వంటి చిరుధాన్యాలు, వివిధరకాల పప్పుధాన్యాల్లో ఉంటుంది, ముదురాకు పచ్చని ఆకు కూరల్లో కూడా ఈ లవణాలు ఎక్కువగానే ఉంటాయి. వీటిని తరుచూ తీసుకోవడం ద్వారా అకాల వృద్ధాప్యాన్ని అరికట్టవచ్చు.
రసాయనాలు కీలకం
వృద్ధాప్యాన్నీ, వృద్థాప్య లక్షణాల్నీ, ఆ వయసులో వచ్చే పలు రకాల వ్యాధుల్నీ ముందుగానే నిరోధించే ఔషధాల విషయంలో శ్రద్ధ వహించాలి. అలాంటి ఔషధాల్నే రసాయనాలు అంటారు. ఈ రసాయనాల్లో త్రిఫల రసాయనం, భృంగరాజ రసాయనం, మేధ్య రసాయనం, అశ్వగంధ రసాయనం, ధాత్ర్యాధి రసాయనం ముఖ్యమైనవి. వీటితో పాటు శిలాజిత్ రసాయనం, హరీతకీ రసాయనం, పిప్పలీ రసాయనం, పలాశ రసాయనం, అమలకీ ర సాయనం, హరీతకీ రసాయనం కూడా ఎంతో ప్రభావవంతమైనవి.
- ప్రొఫెసర్ చిలువేరు రవీందర్
డాక్టర్ బి. ఆర్. కే. ఆర్ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్
డైట్ రూల్స్
ఆరోగ్యం కావాలనుకుంటే అనారోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్‌కు మంగళం పాడేయాలి. అలాగే కొన్ని తప్పనిసరిగా తినాలి. ఇంకొన్నిటిని పూర్తిగా వదిలేయాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే ఈ డైట్ రూల్స్ పాటించాలి.
ప్రొటీన్ అవసరమే!
అధిక బరువు తెచ్చే అనర్థాలు తెలిసొచ్చాక బరువు తగ్గించే మార్గాల గురించి అన్వేషణ మొదలైంది. వెయిట్‌లాస్ కోసం కొందరు జిమ్‌కేసి పరుగులెత్తితే మరికొందరు ప్రొటీన్ ఇన్‌టేక్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ప్రొటీన్ ఇన్‌టేక్ పెంచటం ద్వారా బరువు తగ్గించుకోవచ్చనేది పాలియో డైట్ సూత్రం. అయితే ఇందుకు కొన్ని రూల్స్ పాటించాలి. ప్రొటీన్ ఇన్‌టేక్ పెంచటంతోపాటు కార్బ్స్ ఇన్‌టేక్ తగ్గించాలి. తీసుకునే ప్రొటీన్ కూడా వెజిటబుల్ బేస్‌డ్ అయితే మరీ మంచిది. మగవాళ్లైతే రోజుకి 56గ్రా, మహిళలైతే రోజుకి 46గ్రా ప్రొటీన్ తీసుకోవాలి. అయితే ఇందుకోసం సప్లిమెంట్ల మీద ఆధారపడకూడదు. లేదంటే ప్రొటీన్ ద్వారా ఎక్కువ కేలరీలు పొందేవారిలో వృద్ధాప్య ఛాయలు, క్యాన్సర్ రిస్క్ ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
తాజా తాజా ఆహారం
ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ తెచ్చే అనర్థాల మీద అవగాహన పెరగటంతో బాక్స్ ఫుడ్స్ జోలికి వెళ్లటం తగ్గించాం. దాంతో కంపెనీలు ఫలానా ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ తమ ప్రొడక్ట్స్‌నుంచి తీసేశాం అని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని తీశారు? అనే దానికంటే దేన్ని కలిపారు? అనే విషయం మీద దృష్టి పెట్టడం మంచిది. అలాగే లోఫ్యాట్, మెడిటరేనియన్, పాలియో, వేగన్ మొదలైన డైట్స్ అన్నిట్లో దేన్ని ఫాలో అవ్వాలి? అని తర్జనభర్జన పడే బదులు స్వచ్ఛమైన తాజా డైట్‌ని ఫాలో అయితే అసలు చిక్కే ఉండదు. అలాగే తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పప్పులు తినాలి.
ఫైబర్ తీసుకోవాల్సిందే!
ఎంత ఎక్కువ ఫైబర్ తింటే అంత మేలు. పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కాంపొజిషన్ వల్లే మనలో టైప్ 2 డయాబెటిస్, ఒబేసిటీ, ఇతరత్రా ఆటోఇమ్యూన్ డిసీజెస్ బారిన పడుతూ ఉంటాం. ఈ బ్యాక్టీరియా కాంపొజిషన్‌లో తేడాలు రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ ఫైబర్ తినాలి. మన పూర్వీకులు రోజుకి 150 గ్రా. పీచు తినేవారు. ఆ పీచు పెద్దపేగుల్లోని బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, ఫ్యాటీ యాసిడ్లు ఉత్పత్తి అయి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కాబట్టే మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇలాంటి ఆరోగ్యం సొంతం కావాలంటే ప్లాంట్ బేస్‌డ్ ఫైబర్ వీలైనంత ఎక్కువ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
జీరో కెలోరీ వద్దే వద్దు
ఆహారం నుంచి షుగర్‌ని కట్ చేయటం మంచి ఆలోచనే అయినా దానికి ప్రత్యామ్నాయంగా డైట్ కోక్‌లు, ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు తీసుకోవటం వల్ల ఉపయోగం ఉండకపోగా లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్న వాళ్ల మవుతాం. మామూలు చక్కెరకంటే కృత్రిమ చక్కెరలు మెదడును ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దాంతో ఆకలి మీద నియంత్రణ కోల్పోతాం. దానికి తోడు జీరో కెలోరీ డ్రింక్ తాగితే తీసుకునే ఆహారం నుంచి ఎక్కవ కెలోరీలు శరీరంలోకి చేరిపోతాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ షుగర్స్‌కు దూరంగా ఉండాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565