MohanPublications Print Books Online store clik Here Devullu.com

దైవంలో ఉండటమే భక్తుడి లక్షణం-God, Spiritually, దైవం, ఆత్మీయం

దైవంలో ఉండటమే భక్తుడి లక్షణం
ఆత్మీయం
దేవుడు చాలా పెద్దగా ఉంటాడేమో అన్నది ఓ పదేళ్ల బాలుడి సంశయం. అదే విషయం తండ్రిని అడిగాడు. అప్పుడే ఆకాశంలో వెళుతున్న ఒక విమానాన్ని చూపించి, అంతుంటాడు దేవుడని తండ్రి చెప్పాడు. దేవుడంత చిన్నవాడా అన్నాడా బాలుడు నిరుత్సాహంగా. మరునాడు తండ్రి విమానాశ్రయానికి తీసుకెళ్తే అక్కడ విమానాల్ని దగ్గర నుండి చూసి ‘విమానాలు ఇంత పెద్దవా?’ అన్నాడా బాలుడు.
‘‘అవును దూరం నుండి అన్నీ చిన్నవే. దేవుడూ అంతే. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనెంత పెద్దవాడో అర్థమవుతుంది’’ అన్నాడు తండ్రి.
ధర్మశాస్త్రోపదేశకుడొకాయనను ‘దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైనదేది?’ అనడిగాడు ఒకతను. ప్రాముఖ్యమైనవి ఒకటి కాదు రెండున్నాయంటూ, దేవుని సంపూర్ణంగా ప్రేమించాలన్నది మొదటిది కాగా, దేవుని సంపూర్ణంగా ప్రేమించినట్టే, మన పొరుగువాడిని కూడా అంతే ప్రేమించాలన్నది రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని జవాబిచ్చాడు. ‘నిజమే, బలులివ్వడం, హోమాలు చేయడం కన్నా ముఖ్యమైనది. దేవుని, మన పొరుగువానిని ప్రేమించడమే ముఖ్యమని అతను అంగీకరించాడు. అందుకు ఆ ఉపదేశకుడు, నీవు స్వర్గానికి దూరంగా లేవని వ్యాఖ్యానించాడు.
దైవానికి దూరంగా ఉండటం కన్నా, దగ్గరగా ఉండటం మంచిదే! కాని ఈ రెండింటి కన్నా దైవంలో ఉండేవారు నిజంగా ధన్యులు. దేవుని మహా లక్షణాలు, ఆయన శక్తి భక్తునికి సొంతమవుతాయి. లోకమన్నా, లోకభోగాలన్నా అందరికీ ఆకర్షణే! దీపం పురుగులకూ దీపానికి ఉన్న ఆకర్షణలాంటిదే ఇది. చివరకు ఆ పురుగులన్నీ దీపం వెలుగులో తిరుగుతూనే దీపం మంటలో పడి అంతమవుతాయి. లోకానికి వెలుగు, మంట రెండూ ఉన్నాయి. లోకం వెలుగులో ఎదిగి బాగుపడాలనుకునేవారు చివరకు దాని మంటలో మాడి మసైపోక తప్పదు.
ఒకటి రెండు మాటల్లోనే మోక్షజ్ఞానాన్ని ఇస్తారా?
అమెరికాలో జరిగిన ప్రపంచ దేశాల మత సమ్మేళనంలో భారతదేశం తరపున పాల్గొన్న స్వామి వివేకానంద ప్రసంగం ఒక సంచలనమే సృష్టించింది. ఆయన ప్రసంగ విశిష్టత గురించి ప్రపంచదేశాల పత్రికలన్నీ ప్రముఖంగా రాశాయి. అవన్నీ చూసిన అమెరికాలోని ఒక పెద్ద వ్యాపార వేత్త, స్వామి వివేకానందను కలవాలనుకున్నాడు. స్వామీజీ క్షణం తీరికలేకుండా ఉన్నా, తన పరపతినంతా ఉపయోగించి ఎలాగోలా అపాయింట్‌మెంట్‌ సంపాదించాడు. అనుకున్న సమయానికి ఆ వ్యాపార వేత్త స్వామి వివేకానంద ఉన్న ప్రత్యేక గదిలోకి ప్రవేశించాడు. ’’స్వామీ! నేను క్షణం తీరిక లేని వ్యాపారిని. అయితే నేను తీవ్రమైన ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసిని కూడా. కాకపోతే నాకున్న సమయం చాలా తక్కువ. అందువల్ల వే దాలు ఉపనిషత్తులు చదవమని గానీ, సాధువుల ప్రసంగాలు వినాలనిగానీ, యోగా, ధ్యానాలు చేయాలని గానీ దయచేసి నాకు చెప్పొద్దు. వీటితో ఏ మాత్రం సంబంధం లేకుండా, ఒకటి రెండు మాటల్లోనే నాకు జ్ఞాన సిద్ధి కలిగించే మోక్ష మార్గమేదైనా మీకు తెలిస్తే చెప్పండి.’’ అన్నాడు. ’’అదైనా నిజంగానే అలా మీరు ఒకటి రెండు మాటల్లో చెప్పగలరనుకుంటేనే సరే అనండి. లేదంటే వెంటనే వెళ్లిపోతాను.
ఎందుకంటే నాకు మీ వద్ద ఎక్కువ గంటలు గడిపేటంత సమయం లేదు’’ అన్నాడు వ్యాపారి. అతని మాటలు విన్న వివేకానంద మందహాసం చేస్తూ....’’ మీరు నిశ్చింతగా ఉండండి. మీరు ఆశించినట్లే ఒకటి రెండు మాటల్లోనే మీకు జ్ఞానం కలిగేలా చేస్తాను. మీరు వేదాలు, ఉపనిషత్తులు ఏమీ చదవొద్దు, సాధువుల ప్రసంగాలేమీ వినొద్దు. యోగా, ధ్యానాలేమీ చెయ్యొద్దు’’ అన్నాడు ఆ మాటలు వినగానే వ్యాపారి ముఖంలో అంతులేని అనందం తొణకిసలాడింది. ’’మరైతే నన్ను ఏం చేయమంటారు స్వామీజీ! అన్నాడు వ్యాపారి ఎంతో ఉత్కంఠగా.’’ చాలా సింపుల్‌. రోజుకొకసారి మీ మరణాన్ని నువ్వు గుర్తు చేసుకోండి చాలు. మీకు జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇక నేను చెప్పాల్సింది అయిపోయింది.
ఇక మీరు బయల్దేర వచ్చు’’ అన్నాడు వివేకానంద. ఆ మాటల్లోని అంతస్సారమేమిటో ఆ వ్యాపారికి సాకల్యంగా అర్థమైపోయింది. అతని మనసు సంభ్రమాశ్యర్యాలతో నిండిపోయింది. ప్రతి రోజూ మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఏమిటి? జీవితం ఎంత చిన్నదో గుర్తు చేసుకోవడం. ఇంత చిన్న జీవితంలో శుష్కమైన, హీనమైన కార్యకలాపాలకు, తావులేకుండా, ఉన్నతమైన ఆలోచనలతో ఉత్కృష్టమైన జీవితాన్ని సాగించాలన్న సంకల్పానికి రావడం. స్వామీజీ మాటల్లోని ఈ సత్మం వ్యాపారికి అర్థమైపోయింది. వెంటనే లేచి స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసి నిండు ఆనందంతో వెళ్లిపోయాడు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list