MohanPublications Print Books Online store clik Here Devullu.com

నటించినా తప్పే!-Natinchina Tappe


నటించినా తప్పే!
ధర్మపథం 
చెడు పనులు మనమే చేయనవసరం లేదు, మరొకరు చేయడానికి మనం ఏ విధంగా తోడ్పడ్డా ఆ నేరంలో మనమూ భాగస్వాములమే! మనుషుల్లో చెడ్డపనులు (అకుశల కర్మలు) జరగడానికి అనేక కారణాలుంటాయి. ఏ మనిషీ పుడుతూనే చెడ్డ పనులు నేర్చుకురాడు. సమాజంలోని పరిస్థితులు, స్నేహాలు, తాను ‘గొప్పవారు’ అనుకునే వారి ప్రభావాలు - ఇలా ఎన్నో కారణాలుంటాయి.
ప్రజల మనోభావాల మీద బలంగా ప్రభావం వేసే రంగాలు సాహిత్య, కళారంగాలు. వాటిలో కూడా కళారంగం వేసే ముద్ర అంతా ఇంతా కాదు. వీటిలో నాటకం, సినిమా, టీవీల ప్రభావం సమాజం మీద చాలా బలంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కళారంగంలో ఉండి, గొప్ప సినీ హీరోగా రాణించిన కన్నడ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన జీవిత కాలంలో నటించిన ఏ చిత్రంలోనూ మందు కొడుతూ, సిగరెట్‌ తాగుతూ కన్పించలేదట! కళను అంత పవిత్రంగా ఉపయోగించుకున్న నటుడతను! నటుల ప్రభావం జనం మీద ఎంతంగా ఉంటుందో ఎరిగిన జ్ఞాని కూడా.
బుద్ధుని కాలంలో తాళ పుత్రుడు అనేవాడు అలాంటి వాడే! తాళ పుత్రుడు శ్రీవస్తి వాసి. నటుడు. గాయకుడు. నృత్య రూపకాలు ప్రదర్శించేవాడు. మహానటుడిగా యావత్‌ జంబూ ద్వీపంలో పేరు పొందాడు. ‘మన మనస్సులు నిర్మలంగా ఉండాలి. మనం ఎలాంటి మనో మాలిన్యాలనూ అంటించుకోకూడదు’ అని చెప్పే బుద్ధుని ప్రబోధం విన్నాడు. బుద్ధుని మీద ఉన్న గౌరవంతో ఒకసారి బుద్ధుడు ఉండే జేత వనానికి వచ్చాడు. అందరితో పాటు కూర్చొని బుద్దుని సందేశం విన్నాడు.
బుద్ధుని దగ్గరకు వెళ్లి- ‘‘భగవాన్‌! నేను నటుణ్ణి. ఎన్నో పాత్రల్లో నటిస్తాను. నాయకునిగా, ప్రేమికునిగా, ప్రతి నాయకునిగా, తాగుబోతుగా, మూర్ఖునిగా, మందబుద్ధిగా నటించేటప్పుడు మాత్రమే నేనలా లీనమై పోతాను. ఆ తర్వాత వాటిలోని ఏ మోహాలూ, రాగాలూ, ఆవేశాలూ, క్రౌర్యాలు - నాలోకి రావు. రానివ్వను. కాబట్టి నేను నిర్దోషినే కదా! అని చెప్పుకున్నాడు. ‘‘తాళపుత్రా! నీవన్నది నిజమే! అది ఒక పార్శ్వమే! నీవు చేసే నట జీవితంలో నీకు తెలియకుండా చేసే దోషం ఎంతో ఉంది. నీ నటన చూసే ప్రేక్షకులు నీవు నటించిన పాత్రల్ని చూస్తారు. మోహరాగాల్ని పెంచుకుంటారు.
ఆవేశకావేశాలు, క్రూరమైన తలపుల్ని ఆకళింపు చేసుకుంటారు. వారిలో ఉన్న దోషాల్ని నీవు నీ పాత్రల ద్వారా మరింత వృద్ధి చేస్తావు. నీ నటనా ప్రభావం వారి నైతిక జీవితాన్ని దిగజారుస్తుంది. వ్యామోహంలో ముంచుతుంది. కామాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి నీ పాత్రల ప్రభావం నీ మీద లేకపోయినా, ప్రజల మీద బలీయంగానే ఉంటుంది. వారి అకుశల కర్మల్లో నీ వంతు కూడా ఉంటుంది. కాబట్టి ఆ భారం నీవు మోయాల్సిందే!’’ అని చెప్పాడు. తన నటజీవితం ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతుందో తాళపుత్రునికి అర్థమైంది. అప్పటి నుంచి బౌద్ధధర్మాన్ని, నైతిక జీవనవిధానాల్ని ప్రబోధిస్తూ, ప్రదర్శిస్తూ జీవించాడు. మహానటుడు, మంచి నటుడు అంటే గొప్పగా నటించేవాడు కాదనీ, మనుషుల మనసుల్లో మంచి భావాలు రేకెత్తించేవాడని రుజువు చేశాడు.
-బొర్రా గోవర్ధన్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list