గురువుకు ఆ శక్తి ఉంటుంది
-ఆచార్య దేవోభవ
కుక్కుట దీక్ష లేదా స్పర్శదీక్షలాగానే గురువు శిష్యుణ్ణి అనుగ్రహించే పద్ధతులలో మరొకటి నయన దీక్ష. గురువు కేవలం తన చూపులచేత అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు పూరీ శంకరాచార్యుల వారు రమణ మహర్షిని ఇలాగే అనుగ్రహించారు. ఎదురుగా కూర్చున్న శిష్యుణ్ణి గురువు ఒక్కసారి పరమ ప్రేమతో అలా చూస్తాడు. అంతే! శిష్యుడికి జ్ఞానబోధ జరుగుతుంది. తత్త్వం తెలుసుకోవాలని పాల్‌బ్రాంటన్ అనే ఒక విదేశీయుడు భగవాన్ రమణుల దగ్గరికి వచ్చారు. రోజూ రమణుల సమక్షంలో కూర్చునేవారు. రమణులు మౌనస్వామి. ఎప్పుడో తప్ప నోరువిప్పేవారుకారు. అక్కడ ఒక ఆసనంలో కూర్చుని తనలోతాను రమిస్తుండేవారు. పాల్‌బ్రాంటన్ రోజూ రావడం, అక్కడ కూర్చోవడం, రమణులు ఏమీ మాట్లాడకపోవడం.. ఇలా చాలాకాలం జరిగింది.
ఆయన విసిగిపోయి ఇక వెళ్ళిపోదామని నిర్ణయించుకుని తన సామాను సర్దుకుని ఇక గురువుగారికి చివరగా ఓ నమస్కారం పెట్టడానికి వచ్చి కూర్చున్నాడు. రమణులు తీక్షణంగా ఆయనకేసి చూశారు. అంతే! అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి బ్రాంటన్‌కు. భారతీయ తత్త్వవైభవాన్ని ప్రపంచానికి అందించడానికి ఎన్ని పుస్తకాలు రాశాడో ఆయన! అదీ నయన దీక్ష.. గురువు తన కంటి చూపుతో పాల్‌బ్రాంటన్‌ను అనుగ్రహించాడు. ఎందరో మహాత్ములు కేవలం తమ దృష్టిచేత అనుగ్రహిస్తారు.
నేనొకసారి విశాఖపట్టణ నివాసి అయిన మా దగ్గరి బంధువుతో కలిసి అరుణాచలం కొండమీదికెళ్ళా. కొంతమంది విదేశీయులు నూలుచీరలు కట్టుకుని బొట్లుపెట్టుకుని కొండమీద తిరుగుతూ కనిపించారు. మా బంధువు అది చూసి ‘మీరు చాలా సుదూర దేశాలనుంచి వచ్చారు. ఇక్కడ ఎలా అనిపిస్తున్నది’ అంటూ కరచాలనం కోసం చెయ్యిచాపారు. వాళ్ళు దానికి ప్రతిగా ‘‘ఇంతటి మహాపురుషుడు (రమణులు) తిరుగాడిన భూమిని సేవించడానికి కావలసిన వాఙ్మయాన్ని పునాదిగా పొందిన కర్మభూమి భారతదేశంలో పుట్టిన మీకు చేతులెత్తి నమస్కరిస్తాం’’ అన్నారు. అదీ ఈ దేశ వైభవం.
జీవశాస్త్రంలో ఏముందో కానీ, వేదాంత శాస్త్రంలో చెప్పేదేమిటంటే– ఒక నదిలో చేపగుడ్లు పెట్టినప్పుడు అవి ముందు తేలుతూ వెళ్ళిపోతుంటాయి. చేప వాటి వెనకో ముందో వెడుతూ ‘అవి పిల్లలు కావాలి’ అని ప్రేమతో వాటికేసి చూస్తుందట. ఆ చూపులకే అవి పొదగబడి పిల్లలవుతాయి. చూపులచేత పోషించి ఆత్మశక్తిని, ఆత్మానుభవాన్ని ఇవ్వగలిగిన దక్షత ఉన్న గురువు చూపు కనుక నయనదీక్ష. దానికి మీనాక్షీ పరదేవత సంకేతం.
అలాగే కమఠ దీక్ష అని మరొకటి ఉంది. దానిని స్మరణ దీక్ష అని కూడా అంటారు. గురువు ఎక్కడో ఉండి పరమ ప్రేమతో శిష్యుణ్ణి స్మరిస్తాడు. నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, అనుగ్రహింపబడాలి–అని ఒక్కసారి అనుకుంటాడు. స్మరించినంత మాత్రాన శిష్యుడికి వైభవం అందుతుంది.
గురువు స్మరణచేత, చూపులచేత శిష్యుణ్ణి కాపాడగలడు, ఉద్ధరించగలడు. నీకు ఆ శక్తి లేదు కదా అని ఎవరికీ ఉండదనకూడదు.ఉంటుంది. ‘నాకు లేదు’ అను– తప్పు కాదు. ఎవరికీ ఉండదండీ’ అనకు అది తప్పు. నీకు జ్వరం ఎప్పుడూ రాలేదు కాబట్టి ‘జ్వరమేమిటండీ’ అనకు. జ్వరం అనేది ఒకటి ఉంది, దాని బాధేమిటో వచ్చిన వాడికి తెలుస్తుంది. అలా లోకంలో తపశ్శక్తి ఉన్న వాళ్ళకుంటుందా శక్తి. మీరు చేస్తే మీకూ వస్తుంది. అంతేకానీ చెయ్యకుండా అలా ఉండదండీ అనకూడదు. అది మూర్ఖత్వం.-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565