MohanPublications Print Books Online store clik Here Devullu.com

అదిగో అలంపురం-Alampur, Gadwal, Bala Brahmeswara


అదిగో అలంపురం
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల్‌ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. అన్ని క్షేత్రాలకు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది.

నవబ్రహ్మ ఆలయాలు ఇవి
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండటం, వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించడం కూడా విశేషం. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. నవబ్రహ్మల ఆలయాలన్నీ శివాలయాలే. బ్రహ్మ ప్రతిష్ఠించిన కారణంగా ఆ పేరు వచ్చింది.

ప్రధాన ఆలయంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వరుడు వెలసి ఉన్నారు. అక్కడ కాశీ... ఇక్కడ హేమలాపురం. అలంపురం పూర్వనామం హేమలాపురం. అయితే ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ హేమలాపురం, హతంపురం, యోగుళాపురం, జోగుళాపురం అని రూపాంతరం చెందుతూ ప్రస్తుతం అలంపురం క్షేత్రంగా వ్యవహారంలోకి వచ్చింది. కాశీలో ఉత్తరవాహిని గంగానది... అయితే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్రా నది. కాశీలో ఉన్నట్లే అలంపురంలో కూడా 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా జోగుళాంబ దేవి అలంపురంలో వెలసి ఉన్నారు.

గోష్పాద ముద్రిత లింగం!
సర్వసాధారణంగా లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ అలంపుర క్షేత్రంలో మాత్రం బాలబ్రహ్మేశ్వరుడు గోష్పాద ముద్రిత రసాత్మక లింగంగా వెలసి ఉన్నాడు. ఆవుపాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలసి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహంలో అనేకమైన రసాలు వెలువడుతుండగా రస సిద్ధులు కొందరు ‘పరశువేది’ అనే మూలికసహాయంతో ఆ రసాలను మిళితం చేస్తూ ఈ విగ్రహంలో నుండి బంగారాన్ని తయారు చేశారు. తద్వారా ఆ బంగారంతో ప్రధాన ఆలయానికి

శైవక్షేత్రాలకు తలమానికంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవటం వెలసి ఉన్నాయి. దాదాపు 14 వందల సంవత్సరాల క్రితం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల వంశంలో రెండవ పులకేశి ఈ ఆలయాలను నిర్మించినట్టు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. షణ్మతాలకు నిలయంగా ఇక్కడ సౌర, శాక్తేయ, కౌమార, గాణపత్య, ౖÔð వ, వైష్ణవ వైదికాలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి.

బాలబ్రహ్మేశ్వరుడు
పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మకారణం చేత పరమేశ్వరుడు వెలసినందుకు ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడు అని, విగ్రహం చిన్నదిగా ఉన్నందున బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. ఈ విగ్రహానికి ఆనుకుని విష్ణువుకు ప్రతిరూపమైన సాలగ్రామం వెలసింది. అందుకే శివాయ విష్ణు రూపాయ... శివరూపాయ విష్ణవే...అంటూ ఈ శైవæక్షేత్రంలో ధనుర్మాస పూజలు కూడా నిర్వహిస్తారు.
పాప వినాశి తీర్థం!
అలంపురానికి దక్షిణాన అరమైలు దూరంలో 24 ఆలయాల సముదాయమైన పాపనాశిని తీర్థం ఉన్నది. అది అష్టాదశ తీర్థాలలో ఎంతో ప్రాముఖ్యతగలది. మిగిలిన తీర్థాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. 24 ఆలయాల సముదాయం... ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతలో తులతూగుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ చిన్న, చిన్న గుడులు నిర్మించారు. ద్రావిడ, వేసర సంప్రదాయాలకు చెందిన ఆలయాలుగా వీటిని గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తర, దక్షిణ మూలలలో చక్కని ఆలయాలు, మంటపాలు ఉన్నాయి. వాటిలో స్తంభాల పైన రామాయణ గాథ శిల్పాలు, క్షీరసాగర మథనం, అపూర్వ రమణీయతలను చాటుతున్నాయి. ఈ తీర్థం శ్రీశైలం ప్రాజెక్టు మునకలో పోయినందున అక్కడి నుండి కిలోమీటర్‌ దూరంలో ఈ పాప వినాశిని పునః నిర్మాణం చేశారు.

‘‘లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం‘‘

అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన స్తోత్రంలో ఈ ధ్యాన శ్లోకాన్ని పేర్కొన్నారు. పూర్వం దక్షప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగంలో అందరి ముందు శివనింద చేయడంతో అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్ని కల్పించుకుని తాను దేహత్యాగం చేసుకుంటుంది.
ఈ విషయాన్ని పరివారగణం ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై వచ్చి అక్కడి యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజ స్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. పరమేశ్వరుడి కోపాగ్ని చల్లార్చేందుకు శ్రీ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 శకలాలుగా విభజిస్తారు. ఆ భాగాలు వేర్వేరు ప్రదేశాలలో పడగా ఆది శంకరాచార్యుల వారు వాటికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అవే నేడు 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. అందులో అలంపూర్‌లో దంతపంక్తి పైభాగం పడింది. అదే జోగుళాంబ శక్తిపీఠం.

నవబ్రహ్మ ఆలయాలు
ప్రధాన ఆలయ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, పద్మ, సర్గ బ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల మీద అష్ట దిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు, ముగ్ధ మనోహరంగా భావ గాంభీర్యం చెడకుండా సృష్టించబడ్డాయి. ఈ శిల్ప సౌందర్యం దేశ విదేశ విద్వాంసులు నుంచి ప్రశంసలు పొందింది. గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుషాది మూర్తులు చూపరులకు రమణీయంగా నిలిచాయి. ఇక్కడి శిల్పాల పైన మానవ మిథునాలు, పంచతంత్ర కావ్య కథా శిల్పాలు ఆదిత్యహృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార , నయన, ప్రియన్, శ్రీ కంఠాచార్యన్‌ తదితర శిల్పాచార్యుల పేర్లు నేటికి కనబడుతాయి.

సమీపంలో...
యోగనారసింహస్వామి ఆలయం ఉంది. దీనిని ప్రహ్లాద రాయలు నిర్మించారు. లక్ష్మీదేవి, గణపతి, ఆళ్వారులు, అనంత పద్మనాభస్వామి, ఆంజనేయస్వామి వెలసి ఉన్నారు. 14వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది.


– దిండిగల్‌ ఆనంద్‌శర్మ, సాక్షి అలంపూర్‌




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list