MohanPublications Print Books Online store clik Here Devullu.com

నీరసమా..! నీ మూలాలెక్కడ?-Feeling Tired



నీరసమా..! నీ మూలాలెక్కడ?

ఉన్నట్లుండి శరీరం నీరసించి, డస్సిపోయి, చతికిల పడిపోయే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఏమిటి ఇదంతా అని గాబరాపడిపోతాం. ఎంత నిబ్బరంగా ఉందామన్నా లోలోపల ఏదో భయం మొదలవుతుంది. ఎందు కంటే అంతకు ముందు ఎప్పుడూ అలా లేము కదా!నిజానికి అప్పుడో ఇప్పుడో వచ్చే ఆ కాస్త నీరసానికి ఎవరైనా అంత ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. వరుసగా నాలుగు రోజుల పాటు నిద్రలేకపోవడం, ఆహారమేదీ సరిగా తీసుకోకపోవడం, వారం రోజులు అవిశ్రాంతంగా పనిచేయడం ఇలాంటి కారణాలేవో శరీరాన్ని నీరసింపచేసి ఉండవచ్చు. ఆ స్థితి నుంచి కోలుకోవడానికి ఓ నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. రెండు రోజులు ఆసుపత్రిలో ఉండి నాలుగు సెలైన్‌ బాటిల్స్‌ ఎక్కించుకుంటే శరీరం మళ్లీ పూర్వస్థితికి వచ్చేస్తుంది. అలా అని అందరి విషయంలోనూ, అన్నిసార్లూ, ఈ నీరసం, నిస్సత్తువ అంత తేలిగ్గా తీసివేసే విషయం కాదు.

‘‘ఎందుకో ఈ మధ్య తొందరగా అలసిపోతున్నా..! మునుపటిలా ఏదీ చేయలేకపోతున్నా! ఏ చిన్న పనిచేసినా అలసిపోతున్నా’’ నీరసం, నిస్సత్తువల కారణంగా డాక్టర్‌ వద్దకు వచ్చిన చాలా మంది ఇలా అంటూ ఉంటారు. మరికొందరే మో, నాకీ మధ్య దేనీ మీదా మనసు లగ్నం కావడం లేదు. వృత్తిపరమైన సామర్థ్యం క్రమేపీ తగ్గిపోతోంది.’’ అంటూ తమ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. త్వరత్వరగా అలసిపోవడం, శరీరం శక్తి హీనంగా అనిపించడం, పనిచేయడంలో అనాసక్తత, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి కారణాలతో వచ్చే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగానే ఉంటోంది. అయితే, మనసంతా ఏదో కల్లోలంగా ఉండడం, నిద్ర తగ్గిపోవడం, ఆకలి మందగించడం, అన్యమనస్కంగా ఉండడం వంటి లక్షణాలతో వచ్చే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు.

చాలా మంది ఈ స్థితిని పూర్తిగా మానసికమైనదిగా చెబుతుంటారు. అయితే వచ్చేవారిలో ఓ 30 శాతం మంది దిగులు, ఆందోళన, మానసికమైన కుంగుబాటు వంటి మానసిక కారణాలతో వచ్చే మాట నిజమే అయితే ఓ 60 శాతం మందిలో కొన్ని రకాల జబ్బులే ఈ నీరసం, నిస్సత్తువలకు కారణాలుగా ఉంటాయి. దీర్ఘకాలికమైన కొన్ని వ్యాధులు ముఖ్యంగా గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు కూడా ఈ నీరసానికి కారణంగా ఉంటాయి. ఓ 10 శాతం మందిలో దాని వెనుకున్న కారణమేమిటో స్పష్టంగా బోధపడదు. ఇలాంటి వాటిని కారణరహితం (ఈడియోపథిక్‌) అంటూ ఉంటారు. కాకపోతే పైకి కనిపిస్తున్న లక్షణాల ఆధారంగా ఆ రుగ్మతలను నయం చేయవలసి ఉంటుంది. నీరసం, నిస్సత్తువ రావడానికి గల పలు కారణాలనుఒక్కొక్కటిగా చూస్తే..

ఎనీమియాతో నీరసం
అలసట, నీరసం రావడానికి అత్యధికుల్లో కనిపించే ప్రధాన కారణం రక్తహీనత (ఎనీమియా). రక్తంలో హీమోగ్లోబిన్‌ నిలువలు పడిపోవడం వల్ల వచ్చే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ముందుగా హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయుంచడం జరుగుతూ ఉంటుంది. రక్తహీనత అనేది కొంత మేరకు బాహ్యంగా చూసే క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అంటే, కళ్లు, నాలుక, చర్మం, గోళ్ల వర్ణాన్ని చూడటం ద్వారానే తెలిసిపోతుంది. కాకపోతే ఒక స్పష్టమైన అంచనాకు రావడానికి రక్తపరీక్షలు, మరికొన్ని ఇతర పరీక్షలు అవసరమవుతాయి. మౌలికంగా హిమోగ్లోబిన్‌ నిలువలు పురుషుల్లో 13 గ్రాములు. స్త్రీలలో అయితే 12 గ్రాములు. చిన్న పిల్లల్లో అయితే 11 గ్రాములు ఉంటాయి. అయితే కొందరిలో ఈ నిలువలు 8 శాతానికి పడిపోయినా, వాళ్లల్లో నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలేమీ కనిపించవు. మరికొందరైతే హిమోగ్లోబిన్‌ నిలువలు 4 గ్రాములకు పడిపోయినా ఏ అలసటా లేకుండా, నడుచుకుంటూ హాస్పిటల్‌కు వచ్చేస్తారు. సమస్య ఏమిటంటే, ఒక రుగ్మత శరీరంలో నిదానంగా వస్తున్నప్పుడు శరీరం దానికి అలవాటుపడిపోతుంది. అందుకే ఆ వ్యక్తికి ఆ తాలూకు ఇబ్బందులేవీ తె లిసిరావు. కానీ, వైద్య చికిత్సలేవీ అందక ఆ స్థితి అలాగే కొనసాగితే ఒక దశలో చాలా తీవ్రమైన వ్యాధిగా బయటపడవచ్చు, ఒక్కోసారి ప్రాణాపాయానికే దారి తీయవచ్చు.

రక్తహీనతకు కారణాలు
పోషకాహార లోపం కావచ్చు. రక్తస్రావాలు కారణం కావచ్చు. తిన్నది ఒంటికి పట్టని స్వీకృతి లోపాలు (అబ్జార్‌ప్షన్‌ ప్రాబ్లమ్స్‌) కారణం కావచ్చు. లేదా రక్తకణాలు ఉత్పత్తి అయ్యే ఎముక మజ్జ (బోన్‌ మేరో) వ్యాధిగ్రస్తం కావడం కారణం కావచ్చు. వీటితోపాటు ఇనుము, బి-12, ఫోరిక్‌ యాసిడ్‌ లోపాలు కారణం కావచ్చు. నిజానికి, రక్త ఉత్పత్తిలో ఇనుము పాత్ర ఎంతో కీలకం. మనం తినే ఆహారంలో ఇనుము గానీ, ఇనుము, బి-12, ఫోరిక్‌ యాసిడ్‌ గానీ, కావలసిన పరిమాణంలో లేనప్పుడు ఈ రకమైన రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. కండరాల నొప్పులు, ఒంటినొప్పులు, బరువుతగ్గడం, కాళ్లల్లో వాపులు రావడం వంటివి కూడా రక్తహీనత లక్షణాలుగా ఉంటాయి. శరీరంలో ఎక్కడ ఏ రకం ఇన్‌ఫెక్షన్లు దీర్ఘకాలికంగా ఉన్నా అవి ఎముక మజ్జను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. టి.బి వంటి క్రానిక్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా. రక్తహీనత ఏర్పడుతుంది. .ఇది నిస్సత్తువనూ, నీరసాన్నీ కలిగిస్తుంది. కాకపోతే ఆ ఇన్‌ఫెక్షన్లను కనిపెట్టి వైద్యం చేస్తే శరీరం తిరిగి కోలుకుంటుంది. కొందరిలో బ్లడ్‌ కేన్సర్‌ కారణంగా, మైలో ఫైబ్రోసిస్‌ ఏర్పడి లోపలున్న మజ్జ అంతా ఫైబ్రస్‌ టిష్యూగా మారిపోతుంది. దీనివల్ల రక్తనిలువలు చాలా వేగంగా పడిపోతాయి. తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి.

రకస్రావాలు...
ఒక్కోసారి మనకు దృష్టికి రానంత సూక్ష్మ పరిమాణంలో పొట్టలోంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి పెద్ద వయసు వారిలో పెప్టిక్‌ అల్సర్ల వల్లగానీ, కేన్సర్ల వల్లగానీ, మైక్రోస్కో్‌పలో మాత్రమే కనిపించే స్థాయిలో రక్తస్రావం అవుతూ ఉంటుంది. పైగా, మలమూత్రాల్లో కూడా రక్తపు ఛాయలేమీ కనిపించవు. కానీ, రోజురోజుకూ నీరసం, నిస్సత్తువా పెరిగిపోతుంటాయి. స్టూల్‌ అకల్ట్‌ బ్లడ్‌ టెస్ట్‌లో మాత్రమే ఈ రక్తస్రావం గురించి తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్‌ రిపోర్ట్‌ వస్తే, ఆ తర్వాత మరింత స్పష్టత కోసం, ఎండోస్కోపీగానీ, కొలనోస్కోపీ గానీ చేయించాల్సి ఉంటుంది. కొందరిలో నులిపురుగుల కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది.

మందుల మోతాదు పెరిగినా...
కొన్ని రకాల మందులు, ముఖ్యంగా గుండె జబ్బులకు వాడే డయూరిటిక్‌ మందుల మోతాదు పెరిగినప్పుడు కూడా నీరసం రావచ్చు. మూత్రం ఎక్కువగా విసర్జింపడటానికి ఇచ్చే ఈ డయూరిటిక్స్‌ మోతాదు పెరిగితే శరీరంలోని సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రలాయిడ్స్‌ శరీరంలో త గ్గిపోయి నిస్సత్తువ, నీరసం వచ్చేస్తాయి. అలాగే బీటా బ్లాకర్స్‌, వినోదం కోసం వాడే మాదక ద్రవ్యాల వల్ల కూడా నీరసం ఆవరిస్తుంది. మానసిక రుగ్మతల కారణంగా వేసుకునే యాంటీ-డిప్రెసెంట్‌లు, యాంటీ- యాంగ్జిలైటిస్‌ వంటి మందులు కూడా కొందరిలో తీవ్రమైన నీరసాన్ని నింపుతాయి. నీరసాన్ని కలిగించే మరో ప్రధాన అంశం విటమిన్‌ - డి లోపాలు. దీని లోపం వల్ల శరీరంలో కాల్షియం త గ్గిపోయి, నీరసంతో పాటు కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్యలేవీ లేకుండా కేవలం మానసిక రుగ్మతల కారణంగానే నీరసించి పోయేవారు 30 శాతం దాకా ఉంటారు. ఈ రుగ్మతలు ఉన్న వారికి ప్రధానంగా నిద్ర సరిగా ఉండదు. ఆకలి తగ్గిపోతుంది. వీరిలో నీరసం, నిస్సత్తువ కలగడానికి ఇవీ కారణమే.

స్వీకరించలేకపోవడం
కొంత మంది ఎంత మంచి పోషకాహారం తీసుకున్నా, ఆ పోషకాలు ఒంటపట్టకుండా చేసే స్వీకృతి (అబ్జార్‌ప్షన్‌) లోపాలు ఉంటాయి. దీన్నే మాల్‌ అబ్జార్‌ప్షన్‌ అంటారు. దీనికి పేగుల్లోని లోపలి పొర మ్యూకస్‌ మెంబ్రేన్‌ వ్యాధిగ్రస్తం కావడం కారణం. ముఖ్యంగా సీలియక్‌, ఇన్‌ఫ్లమేషన్‌ బౌవెల్‌ డిసీజ్‌ వంటి జబ్బులు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. దీనివల్ల మెంబ్రేన్‌ తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతుంది. దీన్నే మాల్‌ అబ్జార్‌ప్షన్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారు. ఈ జబ్బు ఉన్న వారు ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా క్రమంగా బరువు తగ్గిపోతుంటారు. తరుచూ విరేచనాలు అవుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కొలనోస్కోపీ గానీ, ఎండోస్కోపీ గానీ చేయించి, పేగుల్లోంచి ఒక ముక్క తీసి పరీక్షకు పంపితే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది.

ఆ రెండూ వేరు కాదు
నరాలు, కండరాలూ ఈ రెండూ ఒక యూనిట్‌గా ఉంటాయి. అందువల్ల నరాల్లో ఏదైనా సమస్య వస్తే కండరాలు బలహీనపడతాయి. కండరాల్లో ఏదైనా సమస్య వస్తే, నరాలు బలహీనపడతాయి. ఈ పరిణామాల్లో కూడా శరీరం నీరసించిపోతుంది. అందుకే ఈ రెండింటికీ సంయుక్తంగా వైద్యం చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్‌, ఆర్థరైటిస్‌, ఎస్‌.ఎల్‌.వి, జోగ్రాన్‌ సిండ్రోమ్‌ వంటి కనెక్టివ్‌ టిష్యూ డిసీజె్‌సలో కూడా నీరసం, నిస్సత్తువా ఉంటాయి.

క్రానిక్‌ ఫెటిగ్‌ సిండ్రోమ్‌
తీవ్రమైన నీరసానికి కారణమయ్యే ‘క్రానిక్‌ ఫెటిగ్‌ సిండ్రోమ్‌’ అనే మరో వ్యాధి కూడా ఒకటుంది. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా, నార్మల్‌గా ఉన్న వ్యక్తి ఏదైనా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల గానీ, లేదా ఏదో ఒక చిన్న అనారోగ్యం వల్ల గానీ, హఠాత్తుగా ఒక తీవ్రస్థాయిలో నీరసించిపోతాడు. అయినవాళ్లూ, ఆత్మీయులు ఏమైపోతుందోనని బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆ వైర్‌సను, ఆ అనారోగ్యాన్ని కనిపెట్టి వైద్యం చేస్తే మళ్లీ మమూలు స్థితికి వచ్చేస్తారు. కాకపోతే ఈ సిండ్రోమ్‌ నుంచి పూర్తిగా కోలుకోవడం అంత వేగంగా ఉండదు. కొందరికి అలా కోలుకోవడానికి ఆరు మాసాలు కూడా పట్టవచ్చు. నీరసానికీ, నిస్సత్తువకూ కారణమయ్యే వాటిల్లో నిద్రలేమి కూడా ఒక ప్రధాన సమస్యే. కాకపోతే కౌన్సెలింగ్‌, కొద్దిపాటి ట్రాంక్విలైజింగ్‌ మాత్రలతో ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ నీరసమూ ఉండదు. సిస్సత్తువా ఉండదు. మానసిక కారణాల వల్ల వచ్చే నీరసం నిస్సత్తువల నుంచి విముక్తం చేయడంలో సైకాలజిస్టుల, సైకియాట్రిస్టుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.. కౌన్నెలింగ్‌, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ వంటి విధానాల ద్వారా అవసరమైప్పుడు కొద్దిపాటి మందలు ద్వారా వారు ఆ సమస్య నుంచి విముక్తం చేస్తారు.

శారీరక వ్యాధుల కారణంగా వచ్చే నీరసం, నిస్సత్తువలు కొందరిలో వెంటనే కనిపించవు. చాలా నిదానంగా పెరుగుతూ వచ్చే ఈ సమస్యలు ఒక్కోసారి పరిస్థితి బాగా విషమించే దాకా బయటపడవు. అందుకే ఏడాదికొ ఒకసారైనా మాస్టర్‌ హెల్త్‌ చెక్‌పల ద్వారా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే, సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం వీలవుతుంది. సరియైున వైద్య చికిత్సలు తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని ఆనందంగా గడిపే పూర్తి అవకాశమూ లభిస్తుంది.

థైరాయిడ్‌ కారణంగా...

థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ జీవక్రియలు సజావుగా జరగడానికి చాలా అవసరం. హైపో థైరాయిడిజంలో థైరాక్సిన్‌ ఉత్పత్తి తగ్గడం వల్ల జీవక్రియల పనితనం తగ్గిపోతుంది. దీనివల్ల మనిషి అశక్తంగా, నీరసంగా మారిపోతాడు. చురుకుతనం కరువైపోతుంది. రోజు వారీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలనిపించడం, ఎప్పుడూ నిద్రపోవాలనిపించడం వంటి ధోరణితో ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఏ డాక్టర్‌ను సంప్రతించాలో కూడా తెలీదు. నిజానికి థైరాయిడ్‌ పరీక్షలు చేయించి ఎండోక్రైనాలజి్‌స్టను సంప్రతిస్తే కావలసిన పూర్తి చికిత్సలు అందుతాయి. తీవ్రమైన కాలేయ వ్యాధుల్లోనూ, కిడ్నీ వ్యాధుల్లోనూ, గుండె జబ్బుల్లోనూ నీరసం ఉంటుంది. జీవక్రియలకు అనుగుణంగా గుండె రక్తాన్ని పంపిణీ చేయలేనప్పుడు సహజంగానే ఆయాసం, నీరసం వస్తాయి. హైపర్‌ థైరాయిడిజంలో థైరాక్సిన్‌ ఉత్పత్తి పెరిగిపోయి మనిషి బాగా సన్నబడతారు. ఇది కూడా నీరసాన్నీ, అశక్తతనూ కలిగిస్తుంది.

ఆక్సిజన్‌ నిల్వలు తగ్గినా...

శరీరంలోని ఏ ధాతువు పనిచేయాలన్నా ఆక్సిజన్‌ అవసరం. మొత్తం శరీర కణజాలానికి ర క్తం ద్వారానే ఆక్సిజన్‌ అందుతుంది కాబట్టి, ఏ జబ్బు కారణంగానైనా గుండె ఆ స్థాయిలో రక్తాన్ని పంపిణీ చేయలేనప్పుడు ఆయాసం, నీరసం వస్తాయి. నిజానికి ఈ సమస్యల్ని గుర్తించడం కష్టమైన పనేమీ కాదు. ఒకసారి గుర్తిస్తే వాటిని నయం చేయడమూ కష్టం కాదు. ఆక్సిజన్‌ నిల్వలు సరిగా ఉండాలంటే గుండె, శ్వాసకోశాలు సమర్థంగా పనిచేయాలి. అవి సరిగా పనిచేయకపోతే శరీరంలో ఆక్సిజన్‌ నిల్వలు పడిపోతాయి. రక్తసరఫరా సరిగా ఉండదు. ఆస్తమా, న్యుమోనియా వంటి జబ్బుల వల్ల కూడా శ్వాసకోశాలు సరిగా పనిచేయక ఆక్సిజన్‌ నిల్వలు పడిపోతాయి. ఇవన్నీ శరీరం నీరసించడానికి కారణమవుతూ ఉంటాయి.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list