MohanPublications Print Books Online store clik Here Devullu.com

వంట చెరుకు, చెరుకు, రొయ్యలు-Insert, Prawns


వంట చెరుకు
పొయ్యిలో పెట్టేది... కాదండోయ్‌! ప్లేట్‌లో పెట్టుకునేది. చెరుకును పీకండి చెరుకును ముక్కలు చేయండి చెరుకును రసం తీయండి చెరుకును పీల్చి పిప్పి చేయండి ఎంజాయ్‌ ఐ సే!!
చెరుకు రసం రొయ్యలు
కావల్సినవి
రొయ్యలు పెద్దవి – 12 (పైన పొట్టు తీసి, శుభ్రపరిచినవి); చెరుకు రసం – పావు కప్పు;నిమ్మరసం – పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ;
ఉప్పు తక్కువగా ఉండే సోయా సాస్‌ – పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ; ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూన్‌; గోధుమరంగు పంచదార – టీస్పూన్‌; పొట్టు తీసిన వెల్లుల్లి తరుగు – పావు టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; నల్లమిరియాలు – 5;పైనాపిల్‌ ముక్కలు – 24 (2 అంగుళాల పరిమాణం); చెరుకు ముక్కలు – 12 (8 అంగుళాల పొడవు)

తయారీ
రొయ్యలను పెద్ద గిన్నెలో వేయాలి. మరో గిన్నెలో చెరుకురసం, నిమ్మరసం, సోయా సాస్, ఆలివ్‌ ఆయిల్, వెల్లుల్లి వేసి కలపాలి. తర్వాత దీంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో రొయ్యలను, సిద్ధం చేసుకున్న చెరుకు రసం మిశ్రమాన్ని పోయాలి. కవర్‌ చివరలను ముడేసి, అటూ ఇటూ తిప్పాలి.కనీసం పది–పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. దీంతో రొయ్యలకు మిశ్రమం బాగా పడుతుంది. తర్వాత సన్నగా నిలువుగా కట్‌ చేసుకున్న చెరుకు పుల్లలకు ఒక పైనాపిల్‌ ముక్క, తర్వాత రొయ్య తర్వాత పైనాపిల్‌ ముక్క తర్వాత రొయ్య ఇలా గుచ్చాలి. పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌ వేసి రొయ్యలను 3–5 నిమిషాలు వేయించాలి.
నోట్‌: పైనాపిల్‌ ముక్కలు లేకుండా కేవలం రొయ్యలతోనూ ఇలా చేసుకోవచ్చు.

చెరుకు రసం జ్యూస్‌ దోసె
కావల్సినవి
బియ్యం – 2 కప్పులు; మినప్పపు – కప్పు; చెరుకు రసం – కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు ; బెల్లం – అర కప్పు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ
బియ్యం, పప్పు కలిపి నాలుగు గంటలు నానబెట్టాలి. నీళ్లు వడకట్టి, పిండి రుబ్బాలి. దీంట్లో నీళ్లకు బదులు చెరుకురసం, బెల్లం, కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు వేసి మరొక్కసారి రుబ్బాలి. ఈ మిశ్రమం జారుగా కలుపుకోవాలి. దోసెల పెనం పొయ్యి మీద పెట్టి వేడయ్యాక గరిటెతో పిండి తీసుకొని దోసె వేయాలి. దోసె చుట్టూ నూనె వేసి, రెండువైపులా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తియ్యగా ఉండే ఈ దోసెను ఏదైనా సాస్‌ లేదా చట్నీతో సర్వ్‌ చేయాలి.

చెరుకు రసంఅల్లం జ్యూస్‌
కావల్సినవి
అల్లం తరుగు – టేబుల్‌ స్పూన్‌ చెరుకురసం – 5 కప్పులు పంచదార – అర కప్పు నిమ్మరసం – అర టేబుల్‌ స్పూన్‌ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా తగినంత

తయారీ
ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. వెడల్పాటి అల్యూమినియమ్‌ పాత్రలో ఈ మిశ్రమం పోసి, డీప్‌ ఫ్రిజ్‌లో కనీసం 5 గంటలసేపు ఉంచాలి. తర్వాత బయటకు తీసి, మిక్సర్‌ జార్‌లో వేసి బ్లెండ్‌ చేసి, గ్లాసులో పోసి వెంటనే సర్వ్‌ చేయాలి.


చిలగడ దుంప చెరుకురసం హల్వా
కావల్సినవి చిలగడదుంపలు – 2; చెరుకు రసం – 2 కప్పులు; పంచదార – టేబుల్‌ స్పూన్‌; నెయ్యి – 6టేబుల్‌ స్పూన్లు; యాలకులు – 4 (పొడి చేయాలి); కుంకుమ పువ్వు – 5 రేకలు; జీడిపప్పు – 10 పలుకులు

తయారీ
చిలగడ దుంపలను ఉడికించాలి. వేడి తగ్గాక పై తొక్క తీసి, గరిటెతో గుజ్జు చేయాలి. మూకుడు పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో జీడిపప్పులు వేసి వేయించి, తీయాలి. అదే నూనెలో చిలగడ దుంప గుజ్జు వేసి 3–4 నిమిషాలు కలపాలి. దీంట్లో పంచదార, చెఱకురసం పోసి, కలిపి 4–5 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. మిశ్రమం గట్టిగా అయ్యాక పైన కొద్దిగా నెయ్యి , జీడిపప్పులు వేసి మూత పెట్టాలి. ఈ హల్వాని వేడిగానూ, చల్లగానూ వడ్డించవచ్చు.

చెరుకురసం ఖీర్‌
కావల్సినవి
చెరుకు రసం – లీటరు బియ్యం – పావు కేజీ పాలు – పావు కప్పు జీడిపప్పు, బాదంపప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ
బియ్యం కడిగి, అర గంటసేపు నానబెట్టాలి. మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి వేడి చేసి దీంట్లో చెరుకురసం పోయాలి. చెరుకు రసం మరిగించి, దీంట్లో పాలు పోసి కలపాలి. పైన నురుగులాగ వచ్చిందాన్ని తీసేయాలి. దీంట్లో బియ్యం వడకట్టి మరుగున్న చెరుకు రసంలో పోసి కలపాలి. సన్నని మంట మీద బియ్యం ఉడికేంతవరకు ఉంచాలి. మిశ్రమం ఉడికి చిక్కగా అయ్యాక దీంట్లో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, వేయించిన జీడిపప్పు, బాదంపప్పు పలుకులు వేసి మూత పెట్టి దించాలి. తర్వాత స్వీట్‌ కప్పులోకి తీసుకొని సర్వ్‌ చేయాలి.

చెరుకు రసం వడ
కావల్సినవి
చెరుకు రసం – కప్పు ఆవపొడి – పావు టీ స్పూన్‌ ఉప్పు – తగినంత మినపప్పు – పావు కప్పు (నానబెట్టాలి) నూనె – వేయించడానికి తగినంత నెయ్యి – టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర – టీ స్పూన్‌ ఇంగువ – పావు టీ స్పూన్‌ కారం – టీ స్పూన్‌

తయారీ
ఒక గిన్నెలో చెరుకు రసం, నాలుగు కప్పుల నీళ్లు, ఆవపొడి వేసి, ఉప్పు వేసి కలపాలి. సూర్యకాంతి అంటే ఎండ తగిలేలా ఒక నాలుగు గంటలు ఉంచాలి. నాలుగు గంటలు నానబెట్టిన మినపప్పును నీళ్లు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో ఉప్పు కలపాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక మినప్పిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని నూనెలో వేసి వేయించాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. ఈ వడలు చల్లారాక సిద్ధంగా ఉంచుకున్న చెరుకు రసంలో వేయాలి. మరొక మూకుడు పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, కారం వేసి కలిపి చెరుకు రసంలో కలపాలి. దీనిని వెంటనే సర్వ్‌ చేయాలి.

చెరుకు రసం చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌
కావల్సినవి
చెరుకు ముక్కలు – 8 చికెన్‌ బ్రెస్ట్‌ – పావు కేజీ (ఖీమా చేయాలి) బ్రెడ్‌ క్రంబ్స్‌ – కప్పు వెల్లుల్లి తరుగు – పావు టీ స్పూన్‌ అల్లం తరుగు – పావు టీ స్పూన్‌ సోయాసాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు పైనాపిల్‌ జ్యూస్‌ – టేబుల్‌ స్పూన్‌ ఉప్పు – తగినంత మిరియాల పొడి – తగినంత

తయారీ
చెరుకు ముక్కల చివరకు కట్‌ చేసి, తీయాలి. తర్వాత చెరుకు ముక్కలను మందపాటి పుల్లలుగా కట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్‌ ఖీమా, వెల్లుల్లి, అల్లం, పంచదార, సోయా సాస్, పైనాపిల్‌ రసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. పాన్‌ మీద నూనె వేసి వేడి చేయాలి. చికెన్‌ మిశ్రమం చెరుకు ముక్కకు లాలీపాప్‌లా అతకాలి. ఈ చికెన్‌ పట్టీలను పాన్‌ మీద ఒక్కోవైపు 5–6 నిమిషాలు వేయించుకోవాలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list