డబుల్ ఓకే గూగుల్!
భోజన ప్రియులకు ఫుడ్ ఫెస్టివల్‌లా... వాహనాలు ఇష్టపడేవాళ్లకు ఆటో ఎక్స్‌పోలా... షాపింగ్ నచ్చేవాళ్లకు భారీ డిస్కౌంట్ మేళాలా... గూగుల్ ప్రోడెక్ట్‌ల గురించి సమాచారం ఇవ్వడానికి ఏటా ఓ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ‘గూగుల్ ఐ/ఓ’గా పిలిచే ఈ టెక్ పండగలో ఈ ఏడాది కొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఆ విశేషాలేంటో చూద్దామా!
‘అసిస్టెంట్’ కొత్త అస్త్రాలు
‘గూగుల్ అసిస్టెంట్’ ఇప్పటి వరకు పిక్సల్ మొబైళ్లు, గూగుల్ ఆలో ఆప్‌లోనే అందుబాటులో ఉంది. ఇప్పుడు దీన్ని ఆపిల్ మొబైళ్లకూ విస్తరించారు. అంతేకాదు అసిస్టెంట్ అమ్ములపొదిలో మరికొన్ని కొత్త అస్త్రాలు చేర్చారు.
* గూగుల్ లెన్స్ సహాయంతో ‘లాంగ్వేజ్ విజువల్ ట్రాన్స్‌లేషన్’ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. మీకు తెలియని భాషలో ఉండే ఏదైనా నోటీసు బోర్డును అసిస్టెంట్‌లోని ‘లెన్స్’తో ఫొటో తీస్తే... అది ఆ సమాచారాన్ని మీకు కావల్సిన భాషలోకి మారుస్తుంది.
* ఏదైనా కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌ను లెన్స్ ఐకాన్‌తో క్లిక్ చేస్తే... దాని ఎంట్రీ పాస్‌లు, సమయం... లాంటి అంశాలు ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి.
* ఇప్పటివరకు గూగుల్ అసిస్టెంట్ నుంచి రెస్టరెంట్‌ల సమాచారం మాత్రమే తెలుసుకోగలిగారు. త్వరలో అసిస్టెంట్ నుంచి సమాచారం తెలుసుకోవడంతోపాటు, అక్కడ దొరికే ఐటెమ్స్‌ను కొనుగోలు చేయొచ్చు కూడా. ఆండ్రాయిడ్ పే, ఫింగర్‌ప్రింట్ పేమెంట్ ప్రక్రియల ఆధారంగా అసిస్టెంట్ నుంచి మీకు కావల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయొచ్చు.
‘ఓ’ సంగతులు
మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ నుంచి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రాబోతోంది. ప్రస్తుతానికి ‘ఆండ్రాయిడ్ ఓ’గా పిలుస్తున్న ఈ ఓఎస్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫీచర్లు బయటికొచ్చాయి. వాటి విషయంలో గూగుల్ స్పష్టత ఇచ్చింది.
* ఒకేసారి రెండు ఆప్స్ వినియోగించుకునేలా కొత్త ఓఎస్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు.
* సోషల్ మెసేజింగ్ ఆప్స్ నోటిఫికేషన్లు చూసుకోవడానికి కొత్త ఆప్షన్ వస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన ఆప్ ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన అదనపు సమాచారం కనిపిస్తుంది.
* సిస్టమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసుకున్న యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఇకపై మొబైల్‌లోనూ యాక్సెస్ చేసుకోవచ్చు.
* అంతర్జాలంలోని సమాచారంపై డబుల్ ట్యాప్ చేస్తే త్వరలో అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. ఉదాహరణకు బావర్చీ రెస్టరెంట్ అనే పదాలపై డబుల్ ట్యాప్ చేస్తే ‘దానికి దారి తెలిపేలా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* గూగుల్ ప్లేస్టోర్‌లోని ఆప్స్ మరింత రక్షణ కల్పించేలా గూగుల్ ప్లే ప్రొటక్ట్ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు.
‘లెన్స్’ మాయలు
ఏదైనా వస్తువును ఫొటో తీస్తే దాని పుట్టుపూర్వోత్తరాలు తెలిసిపోతాయా? ఇప్పుడు కుదరదు కానీ త్వరలో గూగుల్‌తో కనిపెట్టొచ్చు. ‘గూగుల్ లెన్స్’ పేరుతో కొత్తగా ప్రారంభిస్తున్న సర్వీసుతో ఇది సాధ్యమవుతుంది.
* మొబైల్‌లో ఈ ఆప్/సర్వీసును ఆన్ చేసి మీరు ఏదైనా వస్తువును ఫొటో తీస్తే దాని సంక్షిప్త చరిత్ర మీ మొబైల్ తెర మీద ప్రత్యక్షమవుతుంది. ఏదైనా దుకాణం బోర్డును క్లిక్ చేస్తే దాని వివరాలూ తెలిసి పోతాయి.
* విహారయాత్రలకు వెళ్లినప్పుడు రకరకాల ప్రదేశాల ఫొటోలు తీసుంటారు. తర్వాత వాటిని చూసినప్పుడు ‘ఇదెక్కడిదబ్బా’ అనుకుంటారు. అలాంటప్పుడు ‘లెన్స్’ ఐకాన్‌ను క్లిక్ చేస్తే ఆ ప్రదేశం లేదా వస్తువు గురించి శోధించి మీకు సమాచారం అందిస్తుంది. ఈ ఆప్షన్ త్వరలో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ఫొటోస్‌లోకి వస్తుంది.
‘హోమ్’ చాలా చేస్తుంది
ఫలానా పాట వినిపించు... సలాడ్ తయారీ ఎలా... ఇన్నాళ్లూ గూగుల్ హోమ్‌తో ఇలాంటి సమాచారం మాత్రమే తెలుసుకుంటూ వస్తున్నారు. త్వరలో మరిన్ని పనులు చేయొచ్చు.
* మీ మొబైల్‌లోని క్యాలెండర్‌లో మీరు నోట్ చేసుకున్న అంశాలను ‘హోమ్’ యాక్సెస్ చేస్తుంది. ఉదాహరణకు సాయంత్రం సినిమాకి వెళ్లడానికి టికెట్‌లు బుక్ చేసుకున్నారు. సమయం దగ్గరపడుతోంది. వెంటనే గూగుల్ హోమ్ నుంచి ‘నువ్వు సినిమాకి వెళ్లాలి. ఇప్పుడున్న ట్రాఫిక్ దృష్ట్యా నువ్వు ఫలానా సమయానికి బయలుదేరితే అక్కడికి సరైన టైమ్‌లో చేరగలవు’ అంటూ మీకు సమాచారం వినిపిస్తుంది.
* త్వరలో గూగుల్ హోమ్ నుంచి హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాలనుకుంటున్న నంబర్, పేరును చెబితే అదే కాల్ చేసి పెడుతుంది. కాల్ కనెక్ట్ నుంచి డిస్‌కనెక్ట్ వరకు బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. తొలుత ఈ సౌకర్యం అమెరికాలో అందుబాటులోకి వస్తుంది.
* ఇకపై గూగుల్ హోమ్ ద్వారా స్పాటిఫై, సౌండ్‌క్లౌడ్, డీజర్ లాంటి మ్యూజిక్ ఆధారిత వెబ్‌సైట్/ఆప్‌లోని పాటలు వినొచ్చు. దీనికి బ్లూటూత్ డివైజ్‌నూ యాడ్ చేసుకోవచ్చు. హెచ్‌బీవో, హూలూ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లూ చూడొచ్చు.
‘ఫొటోస్’ వూసులు
డూప్లికేట్ ఫొటోల్ని వెతికి తొలగించడం, బేసిక్ ఎడిటింగ్, చిన్న చిన్న వీడియోల తయారీ... ‘గూగుల్ ఫొటోస్’తో ఇలా చాలా పనులు చేయొచ్చు. ఈ వరుసలో మరికొన్ని వచ్చి చేరబోతున్నాయి.
* స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి... మీ మొబైల్‌లో వందల ఫొటోలు క్లిక్ చేశారు. అందులో ఎవరివి వారికి పంపించాలంటే పెద్ద పనే. త్వరలో గూగుల్ ఫొటోస్‌తో ఈ పనిని సులభంగా చేసేయొచ్చు. ఈ ఆప్ మీ ఫొటోల్లోని ముఖాలను గుర్తుపట్టి వ్యక్తుల వారీగా గ్రూప్ చేసి షేర్ చేయడానికి సిద్ధం చేస్తుంది.
* మీ మొబైల్‌లో క్లిక్ చేసే ఫొటోలు మీ శ్రీమతి మొబైల్‌లోని గూగుల్ ఫొటోస్ ఆప్‌లోకి ఆటోమేటిక్‌గా చేరిపోతే బాగుంటుంది కదా. ‘ఫొటోస్’లో ఈ ఆప్షన్ త్వరలో రాబోతోంది. ఏ ఫొటోలు అలా షేర్ అవ్వాలనేది మీరే ఎంచుకోవచ్చు.
* మొబైల్‌లో తీసుకున్న ఫొటోలను ప్రింట్ తీసుకునేలా ‘ఫొటో బుక్’ పేరుతో ఓ ఆప్షన్ రాబోతోంది. మీకు కావల్సిన ఫొటోలను ఎంచుకొని ‘ఫొటో బుక్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఫొటో బుక్ సిద్ధమైపోతుంది. దాన్ని ఎంచక్కా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ సదుపాయం ఇప్పటికే అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు.
స్టాండ్ అలోన్... వీపీఎస్
గతేడాది ‘డేడ్రీమ్’తో వర్చువల్ రియాలిటీలో కొత్తదనం చూపించిన గూగుల్ ఈ ఏడాది స్టాండ్ అలోన్ వీఆర్‌ను ప్రకటించింది. దీంట్లో మొబైల్‌ను ఇన్‌సెర్ట్ చేయక్కర్లేదు. వీఆర్‌కు మించిన ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఏడాది ఆఖరులో ఈ డివైజ్‌లు అందుబాటులోకి వస్తాయి. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్) రంగంలోనూ కొత్త ఆప్షన్లు రాబోతున్నాయి. జీపీఎస్ తరహాలో వీపీఎస్ (విజువల్ పొజిషనింగ్ సర్వీసు)ను తీసుకురాబోతున్నాయి. రోడ్ల మీద దారులు చూసుకునేలా దీని ద్వారా ఓ పెద్ద షాపింగ్ మాల్‌లో మీకు కావల్సిన వస్తువు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
టీవీలో 360డిగ్రీలు
వీడియోల గని యూట్యూబ్ ఇప్పుడిప్పుడే స్మార్ట్ టీవీల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. క్రోమ్‌కాస్ట్ లాంటి డివైజ్‌లతో టీవీల్లో యూట్యూబ్‌ను ఆస్వాదిస్తున్నారు. త్వరలో టీవీల్లో యూట్యూబ్‌ను మరింత కొత్తగా చూడొచ్చు.
* ఇన్నాళ్లూ మొబైల్‌లో చూసి ఆనందించిన 360 డిగ్రీల వీడియోలను త్వరలో టీవీల్లోనూ చూడొచ్చు. టీవీలో యూట్యూబ్ ఆప్ ఓపెన్ చేసి 360 డిగ్రీల్లో వీడియోల మజాను ఆస్వాదించొచ్చు. టీవీ రిమోట్‌లోని బటన్ల ద్వారా వీడియోలను అన్ని కోణాల్లో కదుపుతూ వీక్షించొచ్చు.
* యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు చూస్తుంటారు. పక్కన బాక్స్‌లో కామెంట్లు వరదలా వచ్చేస్తుంటాయి. అందులో మీ కామెంట్ ప్రత్యేకంగా కనిపించాలని ఉంది కదా. త్వరలో మీరు అనుకున్నది కుదురుతుంది. ‘సూపర్ ఛాట్’ ఆప్షన్‌తో ఇది సాధ్యమవుతుంది. అయితే దీనికి యూట్యూబ్ డబ్బులు వసూలు చేస్తుంది. ఆ డబ్బు ఆ వీడియోను రూపొందించిన వారికి అందుతుంది.
‘ఆండ్రాయిడ్ గో’ వస్తోందోచ్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు లైట్ వెర్షన్‌ను సిద్ధం చేసింది గూగుల్. ‘ఆండ్రాయిడ్ గో’గా పిలిచే ఈ ఓఎస్‌తో రూపొందించిన మొబైళ్లను తక్కువ మెమొరీ, కనీస అంతర్జాల వాడకంతో వినియోగించుకోవచ్చు.
* ఒక జీబీ లేదా అంతకంటే తక్కువ ర్యామ్‌తో ఆండ్రాయిడ్ గో ఆధారిత మొబైళ్లను రూపొందిస్తున్నారు. ఆప్టిమైజేషన్‌ను పెంచడం ద్వారా ఈ మొబైళ్లు తక్కువ ర్యామ్ ఉన్నా వేగంగా స్పందిస్తాయి.
* మొబైల్ డేటా వినియోగంలోనూ ఈ డివైజ్‌లు ఓ కన్నేసి ఉంచుతాయి. గూగుల్ క్రోమ్ తదితర ఆప్స్‌లో ఉండే డేటా సేవర్ ఫీచర్ ఈ ఓఎస్ ఆధారిత మొబైల్స్‌లో ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి ఉంటుంది. యూట్యూబ్ గో ఆప్ ఇలాంటి అవసరం కోసం రూపొందించినదే.
* ఆండ్రాయిడ్ గో మొబైల్‌లో జీబోర్డు కీబోర్డు సాయంతో పదికిపైగా ప్రాంతీయ భాషల్లో టైప్ చేయొచ్చు. మీరు ఇంగ్లిష్‌లో టైప్ చేసినా అది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యి అవతలి వ్యక్తికి చేరుతుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565