MohanPublications Print Books Online store clik Here Devullu.com

బంగిన‌ప‌ల్లి బంగారం_Mango_






బంగిన‌ప‌ల్లి బంగారం

            అన్ని రకాల పండ్లలో మామిడి రారాజైతే... మామిడి పండ్లలో బంగినపల్లి మామిడి మహారాజు. ఈ పోలిక ఎలా ఉన్నా ప్రపంచ ప్రఖ్యాత మామిడి రకాల్లో అరుదైనది బంగినపల్లి రకం అని అంతా ఏక వాక్యంతో అంగీకరిస్తారు. బంగినపల్లి మామిడి పండుది చూపు తిప్పుకోలేని అందం.. పసిడి వన్నెపు మెరుపు.. నోరూరించే రుచి.. మత్తెక్కించే వాసన.. తినే కొద్దీ కమ్మని అనుభూతి.. మామిడి పండ్లలోనే అత్యంత మధురమైన పండు ఇది. తెలుగునాట ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి అనేక దేశాల ప్రజలకు అత్యంత ఇష్టమైన మామిడి పండుగా బంగినపల్లి రకం నిలుస్తోంది. బేనీషాన్‌ అనే ఈ మామిడి రకానికి తాజాగా భౌగోళిక విశిష్ట గుర్తింపు కూడా లభించింది. ఇది 'ఆంధ్రప్రదేశ్‌ సొంతం' అని నిర్ధారిస్తూ జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ వచ్చింది. మనకే సొంతమైన బంగినపల్లి మామిడి విశేషాలు .....
చూడటమే ఆలస్యం బంగినపల్లి మామిడిని తినాలనిపిస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బంగినపల్లి మామిడిని రుచి చూడకుండా ఉండలేరు. అంతగా నోరూరించే మామిడి పండును ఇంటికి కొనుక్కొచ్చుకోవడం కోసం మార్కెట్‌లు, సంతలు ఎంత గాలించైనా ఎంత ఎండలనైనా లెక్కచేయరు. బంగినపళ్లో అనే బుట్ట వ్యాపారుల అరుపుల కోసం అటెన్షన్‌గా లేని గృహిణులుండరు. కొనగలిగినా లేకున్నా కనీసం బేరం వంకతోనైనా కాసేపు చేతులతో తడుముతూ మురిసిపోయే దృశ్యాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ప్రత్యేక ప్రేమ మరే పండు మీదా కనిపించదు. మార్కెట్‌లోకి బంగినపల్లి రాగానే ఏదో మారాజు వచ్చినట్టు వార్త చకచకా చరచరా ఊరంతా పాకేస్తుంది. పని గట్టుకుని ఆ శుభవార్త మోసుకెళ్లాలని రోజుకు రెండు మూడు మార్లు అంగళ్ల చుట్టూ తిరిగే మామిడి ప్రియులు కనిపిస్తుంటారు. ఇదీ బంగినపల్లి క్రేజ్‌. ఉగాది నాటికే అన్ని రకాల మామిడి కాయలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో బంగినపల్లి ఎంట్రీ ఇస్తుంది. వేసవి తాపానికి విసిగిపోయి అలసిపోయి సొమ్మసిల్లిపోయి వర్షాల కోసం ఎలా ఎదురుచూస్తారో... అంతకు ముందు నానా మామిడి రకాల రుచులను చూసినా బంగినపల్లి రకం కోసం అలా ఎదురుచూస్తుంటారు. వర్షాల కన్నా ముందే తీపి కబురులా వచ్చే బంగినపల్లిని ఆస్వాదిస్తూ సంతోషంగా వేసవి సెలవులకు ముగింపు పలకడం కుదిరితే ఓ ఆచారం చేసేయొచ్చేమో. రాసుకోని ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మామిడి ఈ దేశపు జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. మామిడి రకాలన్నీ మాంగిఫెరా ప్రజాతికి చెందిన వృక్షాలే.
వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడి పళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటి నుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. స్వీట్లు తయారు చేస్తారు. ఇలా ఎన్నో రకాల ఆహార ప్రయోజనాలున్నాయి. అంతేకాదు ఆరోగ్య పోషకాలందించే కెరోటిన్‌, విటమిన్‌ సి, కాల్షియం వంటివి కూడా వీటిలో ఎక్కువే. తినే ఓపిక ఉండాలేగానీ మనదేశంలో వంద రకాలకుపైగా మామిడి పళ్ళు దొరుకుతాయి. వీటిలో అత్యంత రుచికరమైనది. మంచి సువాసనతో అందర్నీ మైమరపించేది బంగినపల్లి మామిడే.

బేనిషాన్‌ మామిడి అంటే
బనగానపల్లె మామిడిని వ్యవహారంలో బంగినపల్లి మామిడిగా మార్చారు. మరి బేనిషాన్‌ మామిడి అని మరో పేరు ఎలా వచ్చిందన్న సందేహానికి కూడా సమాధానం ఉంది. బనగానపల్లె సంస్థానం నవాబు మీర్‌ గులాం అలీఖాన్‌ (1905-1922)కు మామిడి పండ్లపై మక్కువ ఎక్కువ. ఆయన ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్‌) చెక్కించేవాడు. అయితే ఈ రకం మామిడి చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్‌) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషాన్‌ అయ్యింది.

ప్రత్యేక గుర్తింపు- జీఐ
అపురూపమైన ప్రత్యేకతలున్న బంగినపల్లి మామిడికి వారం కిందటే ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలుగింట పుట్టి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల నోరూరించే ఈ రకం మామిడి 'ఆంధ్రప్రదేశ్‌ సొంతం' అని నిర్ధారిస్తూ భౌగోళిక విశిష్ట గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటికేషన్‌ - జీఐ) లభించింది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ ఓపీ గుప్తా ఈ నెల ప్రారంభంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఒక మహిళ, పురుషుడు (రైతులు), పసుపు పచ్చ వర్ణంలో మామిడిపండ్లతో బనగానపల్లె నవాబు యుద్ధ నిధుల మొహరీ రూపొందించారు. దానిపై... 'బనగానపల్లె మామిడిపండ్లు - ఆంధ్రప్రదేశ్‌' అని రాయించారు. ఇదే ప్రధాన ఆధారంగా బంగినపల్లి మామిడిపండ్లకు జీ.ఐ. గుర్తింపు లభించింది. ఏదైనా ఒక వస్తువు, ఉత్పత్తి మూలాలు, లక్షణాలు ఒక ప్రాంతానికి సొంతం అని నిర్ధారించేందుకు ఇది అధికారికమైన గుర్తింపు. బంగినపల్లి మామిడికి మన రాష్ట్రానికి జీఐ రిజిస్ట్రేషన్‌ ఇవ్వాల్సిందిగా 2011లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీఐ రిజిస్ట్రీని కోరింది. అప్పటి హార్టికల్చర్‌ కమిషనర్‌ రాణీ కుముదిని దీనికి సంబంధించిన ఆధారాలతో నివేదిక రూపొందించారు. ''కర్నూలు జిల్లాల్లోని బనగానపల్లె, నంద్యాల, పాణ్యం మండలాలే బంగినపల్లి మామిడికి పుట్టిల్లు. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు... తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు ఈ రకం మామిడికి రెండో పుట్టిల్లుగా చెప్పవచ్చు. 7.66 లక్షల కుటుంబాలు బంగినపల్లె మామిడిపండ్లను సాగు చేస్తున్నాయి, బంగినపల్లి మామిడిపండ్ల వార్షిక టర్నోవర్‌ సుమారు రూ.1,461 కోట్లు, వివిధ ప్రాంతాల్లో వీటిని బెనెషాన్‌, బనెషాన్‌, సఫేద అని కూడా పిలుస్తారు. '' అని అప్పట్లో ఆ నివేదికని సమర్పించారు. దీనికి సంబంధించిన ఆధారాలను ధ్రువీకరించుకున్న అనంతరం బంగినపల్లి మామిడిపై ఆంధ్రప్రదేశ్‌కు జీఐ గుర్తింపు ఇచ్చారు. రైతులకు మెరుగైన మార్కెట్‌ ధర లభించేందుకు జీఐ ట్యాగ్‌ ఉపకరిస్తుంది. మేథో సంపత్తి హక్కుల్లో జీఐ ట్యాగ్‌ కూడా ఒక భాగం.

అందర్నీ మెప్పిస్తూ
ఏమాత్రం పీచు లేకుండా పూర్తిగా గుజ్జు మాత్రమే ఉండడం బంగినపల్లి మామిడి ప్రత్యేకత. పండే కాదు కాయ కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పండుని కూడా తొక్క తీయకుండా ఆలానే తినేయొచ్చు. దీని రుచి ఎందరో మహామహులను కట్టిపడేసింది. పెండేకంటి వెంకటసుబ్బయ్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి బనగానపల్లె నుంచి బంగినపల్లి పండ్లను పంపించేవారు. అనంతరం రాజీవ్‌గాంధీ కూడా బంగినపల్లి మామిడి తెప్పించుకొని రుచి చూశారు.

ఆర్టీసీ బస్సులపై లోగోగా
ఒకప్పుడు ఆర్టీసీ డిపోలకు స్థానిక ప్రత్యేక చిహ్నాలు ఉన్న సమయంలో... బనగానపల్లె డిపో బస్సులపై మూడు బంగినపల్లి మామిడి పండ్ల గుత్తి 'లోగో'గా కనిపించేది. ఈ రకం మామిడి బనగానపల్లెకు ప్రత్యేకం అంటూ అప్పట్లోనే ఆర్టీసీ సంస్థ గుర్తించడం విశేషం.

విదేశాలకూ ఎగుమతి
బంగినపల్లి మామిడి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. కొన్ని వందల సంవత్సరాలుగా విదేశాలకు కూడా ఎగుమతౌతోంది. బాగా మంచి పరిమాణంలో ఉన్న ఈ మామిడి రకం ఒక పండు రెండు కిలోల బరువుతూగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బనగానపల్లె నుంచే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు ఈ రకం మామిడి సాగు
విస్తరించింది. ప్రతి ఏటా ఆరువేల టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. శీతలీకరణ నిల్వ (కోల్డ్‌ స్టోరేజ్‌) లో మూడు నెలల వరకూ తాజాదనం కోల్పోకుండా ఈ పండ్లు ఉంటాయి.
ఆరోగ్యానికి కూడా
మామిడి శారీరక ఆరోగ్యానికి మార్గదర్శిగా నిలుస్తోంది. బంగినపల్లి మామిడిలోనూ ఈ ప్రత్యేక లక్షణాలున్నాయి. మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుంది. ఈ మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికి తెచ్చినట్టు గుర్తించారు.

ఔషధంగా బంగినపల్లి మామిడి
కపాదాల పగుళ్ల నివారణకు మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించాలి.
కపంటినొప్పి, చిగుళ్ళ వాపు వంటి దంత సమస్యల నివారణకు రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంతసేపు మరగనివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలించాలి. అవసరాన్ని బట్టీ ఇలా రోజుకు రెండుమూడుసార్లు చేయాలి.
కకడుపులో పురుగుల సమస్య నివారించాలంటు మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో జాగ్రత్తచేసుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
ఆర్శమొలల సమస్య నివారణకు అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగుమీది తేటతో కలిపి తీసుకోవాలి.
కమామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
కమామిడి ఆకుల బూడిదను 'డస్టింగ్‌ పౌడర్‌'లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
కఎగ్జిమాను పోగొట్టుకోవాలంటే మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
కమామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించాలి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, గాయాలనును కడిగితే త్వరగా తగ్గుతాయి.
కబంగినపల్లి మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి తీసుకుంటే నీరసం మటుమాయమౌతుంది.
కవడదెబ్బకు గురౌతామని భయంగా ఉందా! పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
కచెమట కాయలకు చెక్‌ చెప్పడానికి రెండు పచ్చి మామిడి కాయలను గిన్నెలో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించాలి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
కకాలేయపు సమస్యలు రాకుండా గుప్పెడు బంగినపల్లి మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
కవేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్‌ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
కవేసవిలో వచ్చే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్‌, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.
కపచ్చి బంగినపల్లి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్‌ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.
కమామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్‌ సీ పుష్కలంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది.

ఇతర ఉత్పత్తుల్లో ..
మామిడి తాండ్ర ను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు, మరియు, ప్యాక్‌ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్‌ షేక్‌, లస్సీ పండ్ల రసాల అంగడి లో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్‌ క్రీం లో బంగినపల్లి మామిడి గుజ్జును, ఫ్రూట్‌ సలాడ్‌ లో బంగినపల్లి మామిడి ముక్కలను వేస్తారు.

బంగినపల్లి అంటుమామిడి
బంగినపల్లి మామిడి మొక్కలు వాటి టెంకలు (విత్తనాలు) నుంచి రావు. అంటు కట్టడం ద్వారా మొక్కలను ఉత్పత్తి చేస్తారు. ''ట్రీ టాప్‌ గ్రాఫ్టింగ్‌'' ద్వారా బంగినపల్లి మామిడిని తయారు చేస్తారు. ఇదెలా అంటే...? బాగా ఎదిగిన పెద్ద మామిడి చెట్టుకున్న పెద్ద కొమ్మలను కొట్టి వేయాలి. మూడు నెలలకు, కొట్టిన ప్రతి కొమ్మకు కొన్ని చిగుర్లు వస్తాయి. అవి చేతి వేలు ప్రమాణం వచ్చి నపుడు వాటిని సన్నటి పదునైన చాకుతో ఏట వాలుగా కోయాలి. మనకు కావలసిన అనేక రకాల మామిడి రకాల చెట్టు కొమ్మల నుండి చేతి వేలి లావున్న కొమ్మలను ఏటవాలుగా కోసి ( నాలుగు అంగుళాల పొడవు) ఈ చెట్టుకు కోసిన కొమ్మలకు అతికించి గట్టిగా కట్టాలి. ఆవిధంగా అన్నికొమ్మలకు కావలసిన బంగినపల్లి కొమ్మలను అతికించి కట్టాలి. ఇలా మొక్కలు తయారౌతాయి. కొన్ని చోట్ల వేరే రకం మామిడికే అంటు కట్టడం ద్వారా కొన్ని కొమ్మల్లో బంగినపల్లి మామిడి కాయలు వచ్చేలా ప్రయోగాలు చేసి మంచి ఫలితాలను పొందుతున్నారు.

వంటల్లో కూడా బంగినపల్లి అదుర్స్‌

మామిడికాయల సీజన్‌ వచ్చిదంటే బంగినపల్లి రకంతో పచ్చి పచ్చడి, ఉరువు పచ్చడి, మామిడికాయ పప్పు, తియ్యమామిడి పులుసు, పులిహౌర, వడ తప్పనిసరిగా వండుతారు. స్వీట్సులో అయితే బంగినపల్లి మామిడితో హల్వ, ఖీర్‌, బట్టర్‌ షేక్‌, యోగర్ట్‌ చేస్తారు.
ఇన్ని విశిష్టతలున్న బంగారం లాంటి బంగినపల్లి మామిడి పండంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరికీ అత్యంత అభిమాన ఫలమైన బంగినపల్లిని ఆస్వాదిద్దామా మరి!
పేరు వెనుక
బంగినపల్లి మామిడి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఒక ఊరి పేరే ఈ మామిడికి బ్రాండ్‌ నేమ్‌గా మారిపోయింది. అదేమిటంటే కర్నూలు జిల్లాలోని బనగానపల్లె. ఈ ఊరిపేరు వినగానే కాలజ్ఞానం చెప్పిన పోతులూరి వీరబ్రహ్మం గుర్తొచ్చారు కదా. అయితే ఆయనే చెప్పలేనంతగా ఈ ఊరి పేరుతో మామిడి రకం ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందుతోంది. మూడున్నర శతాబ్దాల కిందట ఈ బనగానపల్లె నివాసులైన నవాబులు విదేశాల నుంచి తీసుకొచ్చి అంటుకట్టిన మామిడి రకాలలో ఒక మామిడి రకం ఇది. రుచిలోను, రంగులోను, పరిమాణంలోను విశేషమైన ఖ్యాతిని సంపాదించడంతో ఈ చెట్టుకు కాసిన మామిడి పండ్లను అనేక ప్రాంతాల వారు తీసుకుని వెళ్లి నాటారు. ఈ చెట్టు ఎక్కడ నుంచి తెచ్చి నాటారు అని అడిగినప్పుడు ఇది బనగానపల్లి మామిడి చెట్టు అని చెబుతుండేవారు. ఈ విధంగా బనగానపల్లి మామిడిగా అందరినోటా నానుతూ ఇది కాలగమనంలో బంగినపల్లి మామిడిగా పేరు మారింది.
మధురమైన మామిడి తాండ్ర
తాండ్ర అనేది బంగినపల్లి మామిడిపండ్ల రసాలని ఆరబెట్టి తయారు చేసే తియ్యని పదార్థం తాండ్ర. మేంగో జెల్లీ అనే పేరుతో మంచి ప్రాచుర్యంలో ఇది ఉంది. ఈ తాండ్రని చెయ్యడానికి ఏ పండు రసమైనా వాడవచ్చు. కాని దీనిని ఎక్కువగా బంగినపల్లి మామిడి పండ్లతో చేస్తారు. పాశ్చాత్య దేశాలలో కూడ పండ్ల రసంతో తాండ్ర వంటి చిరుతిండిని చేసి అమ్ముతారు. కాని బంగినపల్లి మామిడి తాండ్రకి ఉన్న రుచి, ప్రాచుర్యం మిగిలినవాటికి లేవు.
మామిడి తాండ్రని మామిడి పండు రసం నుండి తయారుచేస్తారు. పొరలు పొరలుగా ఉండి పులుపు, తీపి సమ్మేళనంతో అత్యంత మదురంగా ఉంటుంది ఇది.
మామిడి రసాన్ని వెడల్పాటి అల్యూమినియం పళ్ళాలలో గాని, పెద్దవైన తాటాలు తట్టలలో గాని పొరలు పొరలుగా పోస్తారు. ఒక పల్చటి పొరలా రసాన్ని పళ్లెంలో కాని తట్టలో కాని పోసి, దానిని ఎండలో పెట్టి, అది గట్టి పడిన తరువాత మరొక వాయ రసం, మరొక పొరలా పోస్తారు. అలా కావలసిన మందం వచ్చే వరకూ పోస్తూ ఎండబెడుతూ పోతారు. ఈ తతంగం అంతా అవడానికి 2-4 వారాలు కాలం పట్టవచ్చు. బాగా ఎండిన తదనంతరం దానిని నలు చదరంగా ముక్కలు ముక్కలుగా కోసి అమ్మకానికి తీసుకువెళ్తారు.
అంతకు ముందు మామిడి పళ్ళను తొక్క తీసి మాగాయ పచ్చడికి తీసినట్టుగా పల్చని ముక్కలుగా కోసి టెంకలు పక్కన పెడతారు. ఇంట్లో చేసు కునేటప్పుడు రసాన్ని గిన్నెలోకి పిండుకుని చేసుకోవచ్చు. మామిడి ముక్కలను పెద్ద గ్రైండర్లలో పోసి మెత్తగా ఆయేవరకూ తిప్పి ఆరసాన్ని పెద్ద బానలలో తీస్తారు. చెక్కరగానీ, బెల్లంగానీ కలిపే ముందు కొందరు దానిని త్వరగా గడ్డకట్టేటందుకు నీళ్ళతో కలపి వేడి చేస్తారు. కొందరు గ్రైండింగ్‌ చేసేటపుడే చక్కెర కలిపి చేస్తారు. అలా వచ్చిన రసం పెద్ద పాత్రలలో బియ్యం జల్లెడలలో వేసి వడకడతారు వడకట్టిన రసం పెద్ద పాత్రలలోనే ఉంచి ఎండలో పెడతారు. పెద్ద అరపల మాదిరి తక్కువ ఎత్తులో పందిరి వేసి దానిపై చీరలు దుప్పట్లు వేసి వాటిమీద కొత్త తాటాకు చాపలు పరుస్తారు. పరిచిన చాపలను ఎత్తుపల్లాలు లేకుండా ఉండేలా రాళ్ళను పెట్టి చాపలపై నీళ్ళు కొడుతూ శుభ్రపరుస్తారు. చాపలు శుభ్రపడి ఎండిన తరువాత వాటిమీద కొంచెం చిక్కబడిన రసం మధ్యలో పోసుకు వెళతారు. చివరల వరకూ ఆఖరుగా పోస్తూ చేతులతో సరిచేస్తారు. చివరల వరకూ కారిపోకుండా చీరలను మడతపెట్టీ అడ్డుపెడతారు.
మళ్లీ మళ్ళీ పొరలు పొరలుగా మామిడి రసం పోసుకు పోతారు. అది తగిన మందం అయినపుడు దాన్ని అనుకొన్న పరిమాణంలో ముక్కలుగా కోస్తారు. వాటిని ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి అమ్మకానికి ఇస్తారు. బంగినపల్లి మామిడితో తయారు చేసే తాండ్ర వేలాది కుటుంబాలకు కుటీర పరిశ్రమగా ఉపాధికల్పిస్తోంది.
పోషక విలువలు పుష్కలం
బంగినపల్లి మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారం. తాజా మామిడి పండులో పదిహేను శాతం చక్కెర, ఒక శాతం మాంసక త్తులు, గణనీయంగా ఏ,బి,సి విటమిన్లు ఉంటాయి. ఈ మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉండి, కాయగా ఉన్న సమయంలో కూడా ఎక్కువ తియ్యగా కొంచెం పుల్లగా ఉంటుంది. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పొడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. ఈ రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. పిల్లలు, పెద్దలు వీటిని తినడానికి అమితంగా ఎగబడుతుంటారు. వీటిలో నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. ఈ కాయలతో ఎక్కువకాలం నిలవ ఉండే పచ్చళ్ళు (ఊరగాయలు) తయారు చేస్తారు. ఉత్తర భారతంలో ఈ మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్‌ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్‌ చూర్‌ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) ఏడాదంతా ఆహారంలో భాగంగా వాడుతారు. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. వీటిలో క్యాల్షియం, విటమిన్‌ బి పుష్కలంగా ఉంది. అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్‌ లో ఈ మామిడి కాయలను ష్రిమ్ప్‌ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్‌ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటల లో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పై తో చేస్తున్నారు. థారు లాండ్‌ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్‌) తో బంగినపల్లి మామిడిపండు ముక్కల్ని చేర్చి అందిస్తారు.
- బెందాళం క్రిష్ణారావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list