MohanPublications Print Books Price List clik Here BhaktiBooks.In

ఫోను, ఫేస్‌బుక్‌.. అప్పుడు వద్దు!

జుట్టుకు ఆలివ్‌నూనె.. కలబంద
నల్లని ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు. కానీ హార్మోన్ల ప్రభావం, అనారోగ్యాలు... వంటివాటితో పాటు మరికొన్ని కారణాలు తోడైతే.. జుట్టు విపరీతంగా రాలుతుంది. మరి దానికి ఏంటి పరిష్కారం అంటారా..
* కొందరి జుట్టు కాలంతో పని లేకుండా పొడిబారినట్లు అవుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే రాలడం ఖాయం. ఇలాంటప్పుడు ఆలివ్‌, కొబ్బరి నూనెల్ని సమపాళ్లలో తీసుకుని మరిగించాలి. దాన్ని తలకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఆపై గంటాగి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
* తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గ్రీన్‌టీని మరగకాచి చల్లార్చి..అందులో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె కలిపి జుట్టు కుదుళ్ల నుంచీ కొసల వరకూ తడపాలి. అరగంట తరవాత తలస్నానం చేస్తే జాలువారుతూ మెరిసిపోతుంది. రాలే సమస్యా తగ్గుతుంది.
* జుట్టు బలహీనంగా మారి వూడిపోతున్నప్పుడు.. కొబ్బరిపాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరవాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి.


వెన్ను నొప్పి తగ్గిస్తాయి ఈ దిండ్లు!
ఒక్కసారి పరుపూ, దిండ్లూ కొన్నామంటే.. వాటి మన్నిక పోయినా సరే.. ఏళ్ల తరబడి వాడేస్తుంటాం. ఆ నిర్లక్ష్యమే మనకు మెడ, వీపు, నడుము నొప్పులకు కారణం అవుతుంది. ఓ స్నేహితురాలికి ఎదురైన ఈ సమస్యను గుర్తించిన మేఘన.. పరుపులూ, దిండ్ల తయారీ మొదలుపెట్టింది. అవీ సాధారణమైనవి కావు. మెడా, నడుము నొప్పుల్ని తగ్గించేవి. అదెలా అంటారా.. చదవండి మరి.

సాధారణ ఫోమ్‌ కాకుండా మెమరీ ఫోంతో దిండ్లూ, పరుపులూ, కుషన్లు తయారుచేయడం మేఘన ప్రత్యేకత. దీన్ని వ్యోగాములు వాడేందుకు 1970లో నాసా అందుబాటులోకి తెచ్చిందని చెబుతుంది మేఘన. శరీర ఉష్ణోగ్రతకూ, ఆకృతికి తగినట్లుగా మారడం ఆ ఫోం ప్రత్యేకత. అలాగే సాధారణ దిండ్లూ, పరుపులూ కొంతకాలం వాడాక ఆకృతి కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ దీంతో చేయడం వల్ల అవి ఎక్కువకాలం మన్నడమే కాదు.. ఆకృతీ త్వరగా కోల్పోవు. పైగా నొప్పిని నివారించే ప్రత్యేకత కూడా ఈ ఫోంకి ఉంది. అవన్నీ గుర్తించాకే మెమరీ ఫోంతో ప్రత్యేకంగా ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతోంది. మేఘన చదివింది డిగ్రీ. స్వస్థలం దిల్లీ. తండ్రికి సాధారణ ఫోం తయారీ సంస్థ ఉంది. ఓసారి ఆమె స్నేహితురాలు దిండ్లు వాడటం వల్ల వీపు నొప్పి వచ్చిందని డాక్టర్‌ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్‌ వెంటనే దిండ్లు మార్చమని సలహా ఇచ్చారట. తరవాత ఆమె మేఘనను కలిసి తన సమస్య వివరించి సలహా అడిగింది. అప్పటికి ఏదో చెప్పినా.. తరవాత దాని గురించి ఆలోచించింది మేఘన. అలా దొరికిన పరిష్కారమే ‘ది వైట్‌ విల్లో’ సంస్థ. రెండేళ్లక్రితం దాన్ని ప్రారంభించినా, అంతకుముందే మెమరీ ఫోం ఎక్కడ దొరుకుతుంది.. దానివల్ల కలిగే లాభాలు, మన్నే కాలం, మార్కెట్లో ఎలా విడుదల చేయాలి... ఇలా ఎన్నో విషయాలపై తనదైన అధ్యయనం చేసింది.
సమస్య తప్పలేదు..: చివరకు రెండేళ్లక్రితం దిండ్లూ, పరుపుల తయారీ మొదలుపెట్టినా.. వాటిని ఎలా, ఎక్కడ అమ్మాలో అర్థంకాలేదు. కారణం ఖరీదు ఎక్కువ కావడమే. పైగా మెడా, వీపూ, నడుమునొప్పి లేకుండా చేస్తుందని చెబితే ఒక్కరూ నమ్మలేదని అంటుంది మేఘన. ఓ వైపు వినియోగదారులకు వాటి ప్రత్యేకతల్ని వివరిస్తూనే, మరోవైపు వైద్యులకూ చెప్పడం మొదలుపెట్టింది. కొత్తల్లో అయితే ఒకటీ అరా మాత్రమే కొనేవారు. కనిపించిన ప్రతీవారితో మాట్లాడటం, ఉత్పత్తుల గురించి వివరించడం, మరికొంత అధ్యయనం చేశాక ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు మొదలుపెట్టింది. వినియోగదారులు పెరిగేసరికీ, వస్తువుల్ని సమయానికి వారి ఇళ్లకు చేరవేసేందుకు సరైన కొరియర్‌ సేవలు వెతుక్కోవడం కూడా తనకెదురైన సవాలే అంటుందామె. దాన్నీ అధిగమించింది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో దిండ్లూ, పరుపులూ, కుషన్లూ.. తయారుచేస్తోంది.

అందరికీ అందుబాటులో...: ఈ రెండేళ్లలో రకరకాల దిండ్లు ప్రవేశపెట్టింది. మేఘన. కొత్తగా తల్లులైన వారికీ, ప్రయాణాల్లో సౌకర్యంగా ఉండేందుకూ, మెడ నొప్పి, వీపు నొప్పులు ఉన్నవారికీ.. ఇలా దాదాపు ఇరవైరకాల దిండ్లూ, కుషన్లూ తయారుచేస్తోంది. పరుపులు కూడా ఉంటాయి. ‘ప్రస్తుతం మా దగ్గర పదిహేను మంది ఉద్యోగులు ఉన్నారు. ఆన్‌లైన్లో ఆర్డరు చేసుకుంటే పంపిస్తాం. ఇప్పటికయితే ప్రతినెలా పదిహేను వందలవరకూ అమ్ముతున్నాం. ఏడాదికి ఇరవై లక్షల రూపాయల వరకూ ఆదాయం అందుతోంది. ఒక్కో దిండు ఖరీదు పన్నెండు వందల రూపాయల వరకూ ఉంటుంది. అంత ధరా అనే వారికి ముందు మా ఉత్పత్తిని వాడి చూడండని చెబుతా. తరవాత కచ్చితంగా బాగుందనే చెబుతారనుకోండి. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం.


ఫోను, ఫేస్‌బుక్‌.. అప్పుడు వద్దు! 

ఇలా చదువు పూర్తి చేస్తూనే... అలా క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు యువత. అంతవరకూ బాగానే ఉంది కానీ చాలాసార్లు ఫోన్లూ ఇతరత్రా వ్యవహారాలతో మనసు పక్కదారి పడుతుంటుంది. ఆ ప్రభావం పనిపై పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. 
* మిమ్మల్ని పక్కదారి పట్టించే విషయాలేంటో గుర్తించి ఒక జాబితాగా రాసుకోండి. సాధారణంగా మనం రాసే విషయాల్లో ఫోన్‌లో మాట్లాడటం, సామాజిక మాధ్యమాల కోసం ఎక్కువ సమయం కేటాయించడం వంటివే ఉంటాయి. కాదు.. వ్యక్తిగత విషయాలు కూడా అంటారా? వాటినీ రాయండి. 
* ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లకు రోజులో కొంత సమయం పెట్టుకుని అప్పుడు మాత్రమే చూడండి. అత్యవసర ఆఫీస్‌ మెయిళ్లని కూడా రెండు గంటలకోసారి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. 
* మీరు చేయాలనుకున్న పనుల జాబితాను ఓ వరుసలో రాయండి. అందులో యాంత్రికంగా చేసే పనులని కాకుండా కాస్త సృజనాత్మకత నిండిన వాటిని ముందు వరుసలో ఉంచండి. వీలైతే పది నిమిషాల్లో చేసే పనిని ముందు చేయండి. అదిచ్చే కిక్‌ మరో పనిని వేగంగా చేసేందుకు కావాల్సిన ఉత్సాహాన్నిస్తుంది. 
* నిద్రతో రాజీపడొద్దు. ఫోనులకోసం కేటాయించే సమయాన్ని మంచి నిద్రకోసం కేటాయించండి. ఎక్కడలేని విశ్రాంతి దొరుకుతుంది.


వారానికోసారైనా హలో!
స్నేహితుల్ని చేసుకోవడం సులువే. కానీ ఆ బంధాన్ని పదిలపరచుకోవాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ అవేంటో చూసేద్దామా..
చనువు వద్దు: కొన్నేళ్ల బట్టీ తెలిసిన స్నేహితులైనా సరే చనువు తీసుకోవడం, వ్యక్తిగత విషయాల్లో తల దూర్చడం సరికాదు. ఏదయినా సరే.. వాళ్లు చెప్తేనే వినాలి. అవసరమైతేనే సలహా ఇవ్వాలి.
భావవ్యక్తీకరణ ముఖ్యం: స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పదే పదే ఫోన్లు చూసుకుంటూ, ఇతరులతో ఛాటింగ్‌ చేస్తుంటారు కొందరు. మీరు అవతలివారి మాటలకు ప్రాధాన్యం ఇవ్వరనే విషయం ఆ చర్య వల్ల అర్థమవుతుంది. మరెలా అంటారా.. స్నేహితులు ఎదురుగా ఉన్నప్పుడు పూర్తిగా వాళ్లతోనే మాట్లాడాలి. వాళ్లు చెప్పేది వినాలి.
నమ్మకం ముఖ్యం: స్నేహితులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలనూ లేదా చెప్పిన రహస్యాన్నీ మూడో వ్యక్తికి చెప్పకుండా ఉండటం, ఏ సమస్య వచ్చినా మీరు వాళ్లకు అండగా ఉంటారనే ధైర్యాన్ని ఇవ్వడమే నమ్మకాన్నిస్తుందని మరవకండి.
సమయం కేటాయించాలి: చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వేరే ప్రాంతంలో ఉంటున్నా సరే.. స్నేహితులకోసం కొంత సమయం కేటాయించాలి. అలాగని రోజూ మాట్లాడక్కర్లేదు. కలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కనీసం వారం లేదా పదిహేను రోజులకోసారి వారితో ఫోను మాట్లాడటం, లేదా కలిసి గడిపేలా చూసుకోవాలి.
వాదన వచ్చిందా: గట్టిగా అరవడం, మీ మాటే నెగ్గాలని చూడటం, అదేపనిగా వాదించడం ఇవేవీ చేయకూడదు. సమస్య ఎలాంటిదయినా సరే.. అవతలివారు చెప్పేదీ వినాలి. కేవలం సమస్య, దానికి సంబంధించిన పరిష్కారం గురించే ఆలోచించాలి. ఒకవేళ పొరపాటు మీదని మీకనిపిస్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా క్షమాపణ చెప్పేందుకూ సిద్ధంగా ఉండాలి.


రోజులో మూడుసార్లు హెవీగా తినడానికి బదులు రోజుకి ఐదారుసార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. ప్రతి భోజనానికి మధ్యలో రెండు మూడు గంటలు విరామం ఇవ్వాలి. దీని వల్ల మెటబాలిజం వేగవంత మవు తుంది. తద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.

ఆహారంలో 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్స్, 15 నుంచి 20 శాతం ప్రొటీన్స్, 10 నుంచి 15 శాతం ఫాట్స్‌ ఉండేలా చూసుకోవాలి. తినేటప్పుడు బాగా నములుతూ మెల్లిగా తినాలి. ఇలా చేయడం వల్ల దేహానికి తగినంత ఆహారం కడుపులో చేరగానే మెదడు నుంచి ఇక చాలనే సంకేతాలు జారీ అవుతాయి. ఆహారం పరిమాణం తగ్గుతుంది.No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం