MohanPublications Print Books Online store clik Here Devullu.com

సావిత్రి_SAVITRY


సావిత్రి పవిత్ర ప్రేమ
ప్రేమతో మరణాన్ని కూడా జయించవచ్చనీ, అవ్యాజమానమైన ప్రేమ, మంచితనం ఆలంబనగా ఏర్పరచుకుంటే అంతకన్నా కావలసిందేంటనీ వ్యక్తీకరించిన అసలు సిసలైన భారత స్త్రీ సావిత్రి. ప్రతి స్త్రీ సావిత్రిలా ఉండాలని కోరుకుంటుంది. తన సర్వస్వాన్నీ ధారపోసి మగాడి జీవితాన్ని నిలబెట్టాలనుకుంటుంది. కానీ, సావిత్రి జీవితాన్నే తన భర్తకు తిరిగి ప్రసాదించింది. అందుకు ఆమెకున్న ప్రేమ, విశ్వాసం, అమితమైన మంచితనం ప్రతీకలుగా నిలిచి ఆమె జీవితాన్ని ఆదర్శాలకే బాసటగా నిలిపేలా చేసాయి.
తలచుకోవాలే గాని చేయలేనిదంటూ ఏమీ ఉండదని నిరూపించే మానవజన్మకు ఒక స్త్రీగా నిండుదనాన్ని ఆపాదించింది సావిత్రి. జీవితంలో జరుగనున్న పరిణామాలను ముందే తెలుసుకున్నా మనసుపై ఆ భయం తాలూకు ఛాయను పడనీయకుండా జాగ్రత్తపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ధీరవనిత సావిత్రి. 
అశ్వపతి రాజు ఒక్కగానొక్క కూతురు సావిత్రి. మంచితనానికీ, అందానికీ ప్రతిరూపంగా పెరిగిందామె. రాజు పుట్టుక పుట్టినా గర్వమిసుమంతైనా లేని నిఖార్సైన మనిషి. సావిత్రికి తన వరున్ని తానే ఎన్నుకునే స్వేచ్ఛనిచ్చి పంపాడు అశ్వపతి. తమ పెంపకంపై నమ్మకం, స్త్రీ స్వేచ్ఛను ప్రోత్సహించడం ఆనాటి తల్లిదండ్రులకే చెల్లింది. అందుకు తగ్గట్టుగానే తమ వ్యక్తిత్వాల్ని తీర్చిదిద్దుకునేవారు ఆడపిల్లలు. అందులో సావిత్రిది మొదటి స్థానం. పరిరక్షకులతో, సేవకులతో రథాన్నెక్కి అనేక రాజ్యాలను తిరిగింది సావిత్రి. కానీ తనకు తగిన వరుడు కానరాలేదు. చివరికి ఒక ఆశ్రమానికి చేరుకుంది. రాజధర్మం తెలిసింది కనుక సావిత్రి ఆశ్రమధర్మాన్ని పాటించి అందులోకి ప్రవేశించింది.
ఆ ఆశ్రమంలో కంటిచూపు పోయి రాజ్యాన్ని కోల్పోయిన ధ్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని చూసి ప్రేమించింది. గొప్పగొప్ప రాజుల్లో లేని ఆకర్షణ సత్యవంతునిలో చూసింది సావిత్రి. వెంటనే తండ్రిని చేరి విషయం చెప్పింది. ఆ ప్రస్తావనలో భాగంగా అక్కడే ఉన్న నారదుని ద్వారా మరో పన్నెండు నెలల్లో సత్యవంతుడు మరణించనున్నాడని తెలుసుకుంది. నీ నిర్ణయాన్ని మార్చుకోమంటూ సలహా ఇచ్చిన తండ్రితో, మంచితనం ధీరత్వం గల సత్యవంతున్ని నేను మనసులోనే వరించాను. నా పాతివ్రత్యంపై నాకు నమ్మకముందని నిశ్చయంగా చెబుతుంది. 
ఈ సడలని దృఢ నిర్ణయం సావిత్రికున్న నిశ్చయత్వాన్ని వ్యక్తపరుస్తుంది. ఆమెకున్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది. కృతనిశ్చయం, దృఢమైన ప్రేమ సావిత్రి సత్యవంతున్ని పెళ్ళి చేసుకునేందుకు కారణాలు అయ్యాయి. రాజభోగాలను వదిలి అరణ్యానికి పయనమైంది సావిత్రి. ముసలివాళ్ళైన అత్తమామలనూ, సత్యవంతున్నీ ప్రేమగా చూసుకుంటూ కాలం గడుపుతుంది. ఇలా కాలం సాగిపోతుంది. ఇంకా మూడు రోజులే సత్యవంతుడు బతుకుతాడు. కనిపించని కన్నీటితో ధైర్యంగా జీవిస్తుంది సావిత్రి. ఆ భయంకరమైన రోజు రానే వచ్చింది. ఆనాడు పండ్లు, ఫలాలను తేవడానికి అడవిలోకి బయలుదేరిన భర్తతో తానూ కదిలింది. మిట్ట మధ్యాహ్నం వేళ శరీరంలో శక్తి తగ్గి, కళ్ళు మసకబారి స్పృహ కోల్పోతున్న సత్యవంతున్ని తన ఒడిలో సేదదీరమంటుంది. అంతే, కొన్ని క్షణాల్లోనే సత్యవంతుని ప్రాణం పోయింది. సావిత్రి కన్నీరు మున్నీరవుతూ భర్త శరీరాన్ని వదలక అలాగే కూర్చుంటుంది. యమదూతలు వచ్చి సావిత్రి సత్యవంతుల చుట్టూ ఏర్పడిన అగ్ని వలయాన్ని దాటి వెళ్ళి ప్రాణాల్ని తీసుకెళ్ళే సాహసం చేయలేకపోయారు. సావిత్రి ప్రేమ స్వచ్ఛమై వెలుగుతున్న అగ్నివలయమది. యముడే దిగివచ్చి మరణం అనివార్యమని, తన ధర్మాన్ని నిర్వర్తించక తప్పదనీ అంటే సరేనని ఒప్పుకుంది సావిత్రి. కానీ పతి ప్రాణాల్ని తీసుకెళ్తున్న యముడిని వెంబడిస్తూ కదిలింది.
మనుషులందరి గతీ ఇంతేకదా! నన్ను ఎందుకు వెంబడిస్తున్నావని అడిగిన యముడితో, నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించూ, నా ధర్మం భర్త వెంటే నేనూ అనుగమించడం. సావిత్రిలోని నిర్భయత్వం, నిజాయితీ యమున్నే కరిగించాయి. సత్యవంతునికి ప్రాణం పోసేలా చేశాయి. ప్రేమ మృత్యువును జయించింది. సావిత్రి గుండె నిబ్బరం ఎంతటిదంటే కొంతకాలంలో చనిపోతాడన్న సత్యవంతున్ని పెళ్ళి చేసుకొని అతని ప్రాణాన్ని, అత్తమామల సంతోషాన్ని తిరిగి పొందగలిగేంత గొప్పది. యమధర్మరాజు సావిత్రి శాశ్వత యథార్థ ప్రేమ ముందు నిర్వీర్యున్ని చేసేంత ఘనమైంది.సావిత్రి అంటేనే పవిత్రమంత్రం. అందుకే పవిత్ర ప్రేమకు చిహ్నంగా జీవితాన్ని మలుచుకున్న సావిత్రి ప్రేమతో మరణాన్ని సైతం గెలువవచ్చని నిరూపించింది. మరణాన్నే గెలిచేంత ప్రేమ స్త్రీలలో ఉంటే సమాజంలోని చిన్నపాటి సంఘర్షణలు స్త్రీని ఏ మాత్రం కదిలించలేవని తెలియజెప్పింది సావిత్రి జీవితగాథ.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list