పురోహితుడు వివాహముహూర్తంతోబాటే వివాహానికి మూడు నాలుగు రోజుల ముందుగానే శోభనస్తంభ (పందిరిరాట) ముహూర్తం నిర్ణయిస్తాడు. ఈ లగ్నంలోనే ముల్తైదువులు పురోహితునితో కలిసి విశ్వకర్మ కర్మశాలకు వెళ్తారు. తమతో తీసుకువచ్చిన సువర్ణానికి అగ్ని సంస్కారం చేయించి పంచామృతంలో శుద్ధి చేయిస్తారు. శుద్ధి అయిన సువర్ణానికి షోడశోపచార పూజ చేయాలి. విశ్వకర్మకు లగ్నం చెప్పి మాంగల్యం తయారు చేయమని చెప్పాలి. శుద్ధి చేసిన బంగారంలో ఇతర బంగారం కలపకుండా, ఇచ్చిన బంగారాన్ని మిగల్చకుండా తయారు చేయాలి. ఉప్పు, పటిక, చింతపండు, ఎర్రమట్టితో మాత్రమే మెరుగుపెట్టాలి.
మాంగల్యం తయారుచేసే విశ్వకర్మ వివాహితుడై, భార్యాసమేతుడై, సదాచార సంపన్నుడై వుండాలి, తయారు చేయడంలో ప్రవీణుడై ఉండాలి. ఏభైనాలుగు, నూటొక్కటి లేదా నూటఎనిమిది పోగుల నూలుదారాలతో మాంగల్యానికి గుచ్చి, పసుపు పూసి, కుంకుమ భరిణెలో భద్రపర్చుకోవాలి. పెళ్లి జరిగే రోజు ముల్తైదువులు మేళతాళాలతో విశ్వకర్మ వద్దకు వచ్చి, మాంగల్యాన్ని తీసుకురావాలి. కళ్యాణ వేదికపై మాంగల్యాన్ని మంగళగౌరిగా పూజచేసి ముల్తైదువులు, పెద్దలందరిచే తాకించి లగ్న పుష్కరాంశ ఘడియలో వరునిచే వధువు మెడలో మూడుముళ్ళు వేయించాలి. అదే పవిత్ర మాంగల్యం.
టాగ్లు: , wedding, మాంగల్యం, పెళ్లి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565