దైవనామస్మరణ
ఈ రోజుల్లో పిల్లలకు అర్ధంలేని పేర్లు పెడుతున్నారు. పిల్లలకు దైవ సంబంధమైన పేర్లు పెట్టాలి. దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటి అని కొందరికి సందేహం కలుగుతుంటుంది. ఇది తెలియనందువల్లనే అర్థరహితమైన పదాలను పిల్లలకు పేర్లుగా పెట్టేస్తుంటారు. అయితే మన పూర్వులు మాత్రం ఎంతో ఆలోచించి, అర్థం పరమార్థం అన్నీ సమకూరేలా పేర్లు పెట్టేవారు. అలా దేవుని పేర్లు పిల్లలకు ఎందుకు పెట్టాలో తెలుసుకోవాలంటే వరాహ పురాణంలోని ఈ కథ చదవాలి.
మన సంప్రదాయం ప్రకారం ముక్తిని ప్రసాదించే భగవన్నామాలు అనేకానేకం ఉన్నాయి. సంతానం కలిగినప్పుడు వారికి ఆ భగవన్నామాలనే పేర్లుగా పెడుతుంటారు. ఇది ఎంతో మేలన్న విషయం ఎన్నెన్నో పురాణ కథలు వినిపిస్తున్నాయి. అలాంటి వాటిలో వరాహ పురాణం ఆరో అధ్యాయంలోని పుండరీకాక్ష స్తోత్రం అనే కథ కూడా ఒకటి. భగవత్ సంబంధమైన పేర్లుతో ఉన్న వారిని పిలుస్తూ ఉన్నందువల్ల కలిగే పుణ్య ఫలితాన్ని ఈ కథాంశం వివరిస్తోంది. వరాహ అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు భూదేవికి ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు.
పూర్వం వసురాజు ఓ ఉత్తమ వ్రతాన్ని తలపెట్టాడు. పుండరీకాక్ష స్తోత్రాన్ని తాను చేస్తున్న వ్రతంలో భాగంగా పారాయణ చేశాడు. ఆ స్తోత్రంలో భగవన్నామాలు అనేకం ఉన్నాయి. అలా ఆయన స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు ఆయన శరీరం నుంచి ఒక పురుషుడు వెలువడ్డాడు. ఆ పురుషుడు నల్లగా మహాతీక్షణంగా భయంకరంగా ఉన్నాడు. ఎర్రటి కళ్ళతో పొట్టిగా, మాడిన రంగులో ఉన్న ఆ పురుషుడు వసురాజుకు నమస్కరించాడు. ఆ కిరాత రూపాన్ని చూసిన మహారాజుకు ఆ పురుషుడు తనకు, రాజుకు పూర్వజన్మలో ఉన్న సంబంధాన్ని వివరించాడు. వసురాజు పూర్వజన్మలో దక్షిణాపథంలో జనస్థానంలో ఓ మంచి రాజుగా ఉండేవాడు. ఆయన ఓ రోజు వేటాడాలన్న ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు. అక్కడ లేడి రూపంలో ఓ ముని సంచరిస్తున్నాడు. రాజుకు ఉత్సాహం పెరిగి లేడి మీదకు తన బాణాలను సంధించాడు. లేడి రూపంలో ఉన్న ఆ ముని పక్కనే ఉన్న పర్వతం మీదకు పరుగెత్తుకొని వెళ్ళి అక్కడ ప్రాణాలు విడిచాడు. రాజు తన బాణపు దెబ్బ తగిలిన లేడిని చూడటానికి వెళ్ళి ఆ ప్రదేశంలో తన బాణం గుచ్చుకొని మరణించి ఉన్న మునిని చూసి భయకంపితుడయ్యాడు. కొన్ని రోజుల తరువాత ఆ పాపం పోగొట్టుకోవటానికి ఒక శుభవ్రతాన్ని ప్రారంభించి ఉపవాసం ఉండి గోదానం కూడా చేశాడు. అయితే అంతలోనే విపరీతమైన కడుపునొప్పి వచ్చి మరణించాడు. రాజు భార్య పేరు నారాయణి. ప్రాణం పోతూ ఉన్న సమయంలో రాజు నారాయణ నారాయణ అంటూ పిలిచాడు. ఆ కారణంగా రాజుకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. కానీ మునిని హత్య చేసినందువల్ల అతనిలో మహాపాపం కిరాతరూపంలో అలాగే ఉంది. వైకుంఠంలో ఉన్నప్పుడు కూడా ఆ పాపం అతడిని విడిచి పెట్టలేదు. వైకుంఠంలో ఉండే పుణ్య కాలమంతా అయిపోయాక రాజు మళ్ళీ సుమనుడు అనే కాశ్మీర దేశపు రాజు ఇంట్లో జన్మించాడు. మహాపాపం ఈ జన్మలో కూడా రాజును విడువలేదు. అయితే సుమనుడి తరువాత రాజ్యాన్ని చేపట్టినప్పుడు రాజు ఎన్నెన్నో యజ్ఞాలు చేశాడు. కానీ వాటిలో భక్తిభావం, భగవన్నామ స్మరణం లేనందువల్ల రాజు శరీరం నుంచి పాపం తొలగలేదు. ఆ తరువాత ఆ రాజే మరుసటి జన్మలో వసురాజుగా జన్మించాడు. వసురాజు ప్రస్తుతం త్రికరణశుద్ధిగా విష్ణునామ స్మరణం చేసినందువల్లనే జన్మజన్మల నుంచి అతడిలో కిరాత రూపంగా ఉన్న తాను వెలుపలికి రావాల్సి వచ్చిందని ఆ మహాపాపం వసురాజుకు కథనంతా వివరించింది. కథ విన్న రాజు భగవన్నామ స్మరణ వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకొన్నాడు. అంతేగాక ఆ ఆనందంలో కిరాత రూపంలో ఉన్న ఆ మహాపాపానికి ఒక వరం కూడా ఇచ్చాడు. ధర్మవ్యాధుడు అనే పేరుతో ఆ కిరాతకుడు జీవనం సాగించేలా అనుగ్రహించి అతడిని వసురాజు పంపివేశాడు. ఈ కథా సందర్భంలో నారాయణి అనే పేరు స్మరించినందువల్ల రాజుకు గత జన్మలో ఉత్తమలోకం ప్రాప్తించింది. కానీ మరుసటి జన్మలో విష్ణు స్మరణ లేకుండా ఆయన యాగాలను చేశాడు. అందుకే తగిన ఫలితం దక్కలేదు. వసురాజుగా జన్మించినప్పుడు మళ్ళీ త్రికరణశుద్ధిగా పుండరీకాక్ష స్త్రోతం చేసినందువల్ల పాప విముక్తుడయ్యాడు. నవ విధ భక్తుల్లో నామస్మరణానికి ఉన్న ప్రత్యేకతను ఈ కథ ఇలా వివరిస్తోంది.
మన పిల్లలకు మనం దేవుని పేరు పెట్టుకుంటే వారిని పిలిచినప్పుడల్లా దేవునిపేరు స్మరించిన పుణ్యం వస్తుంది. అర్ధం తెలుసుకుని పేర్లు పెట్టాలి.అర్ధం పర్ధం లేని అక్షరాలను కలిపి పెట్టుకుంటే భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని మనం చేతులారా వదులుకున్నట్లే.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565