MohanPublications Print Books Online store clik Here Devullu.com

సౌరశక్తి జిందాబాద్‌_Solar System_

సౌరశక్తి జిందాబాద్‌!

ఒక్కడే సూర్యుడు... ప్రపంచానికి వెలుగిస్తాడు, పాడి పంటలకు జీవమిస్తాడు, పశుపక్ష్యాదులకు రక్షణగా నిలుస్తాడు, మనిషి మనుగడకు ప్రాణం పోస్తాడు. ఇప్పుడదే సూర్యుడు... వాహనాల్ని నడిపిస్తున్నాడు, పొలాలకు నీళ్లిస్తున్నాడు, వైద్యరంగాన్ని మలుపు తిప్పుతున్నాడు, మొత్తంగా మన అభివృద్ధినే శాసిస్తున్నాడు. అనంతమైన సౌరశక్తిని సరిగ్గా వాడుకుంటే, అంతమవుతున్న సహజ వనరుల గురించి చింతించాల్సిన అవసరం రాదు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆ దిశగానే అడుగేస్తోంది.
భూమ్మీద మనిషి కాలుమోపాక నీళ్లు తగ్గిపోయాయి. అడవులు క్షీణించాయి. గాలి నాణ్యత కోల్పోయింది. ఇసుకా, చమురూ, గనులూ, పర్వతాలూ అన్నీ ‘అభివృద్ధి’ గొడ్డలి పోటుకు గురయ్యాయి.
విద్యుత్తుని కనిపెట్టాక...దాన్ని ఉత్పత్తి చేయడానికి జలాశయాలు ఆవిరయ్యాయి. బొగ్గు నిక్షేపాలు అడుగంటాయి. పైపెచ్చు ఆ విద్యుదుత్పత్తి వల్ల కాలుష్య భూతం భూగోళాన్ని కమ్మేసింది. అణువిద్యుత్తు పేరుతో మరో నిశ్శబ్ద ఉపద్రవం ముంచుకొచ్చింది. దాని వల్ల ఉత్పన్నమయ్యే రేడియేషన్‌ ప్రభావం మానవాళిని వణికిస్తోంది. వాహనాల వినియోగం మొదలయ్యాక ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గార కేంద్రాల్లా తయారయ్యాయి. ఫలితంగా ప్రజల బతుకులు పొగచూరుతున్నాయి.

అన్ని రంగాల మనుగడకూ, అభివృద్ధికీ చమురు, విద్యుత్తు ద్వారా ఉత్పత్తయ్యే శక్తే ఆధారం. అలాగని సహజవనరుల్ని హరిస్తూ, భవిష్యత్తుని ప్రమాదంలో పడేసుకోలేం. ఈ పరిస్థితుల్లో మనముందున్న ఏకైక మార్గం... ఎన్నటికీ తరగని సౌరశక్తిని రెండు చేతులా అందుకోవడమే. సరిగ్గా వాడుకుంటే భానుడికి మించిన శక్తి భాండాగారం సృష్టిలో మరోటి లేదు. ఆ విషయాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు సౌరశక్తిని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కీలక రంగాల్లో దాని సాయంతో కొత్త మార్పులకు తెరతీస్తున్నారు. అవన్నీ సత్ఫలితాలనిస్తే, మనిషి అవసరాలన్నింటినీ సౌర శక్తి ద్వారా తీర్చుకోగలిగితే జరిగిన నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవచ్చు. ఇకపైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు.

వ్యవసాయం, పరిశ్రమలూ, ఆటోమొబైల్స్‌... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పాశ్చాత్య దేశాలతో పోటీలో మనమెప్పుడూ వెనుకే! కానీ సౌరశక్తి విషయంలో మాత్రం ఆ తీరు మారుతోంది. భారత్‌ ఇప్పుడు సూర్యుడి నుంచి శక్తిని ఉత్పత్తి చేయడంలో అమెరికా, చైనా, జపాన్‌ లాంటి దేశాలకు దీటుగా నిలుస్తోంది. మరో ఐదేళ్లలో వంద గిగా వాట్ల సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మన సామర్థ్యం(12.3గి.వా.)తో పోలిస్తే అది ఎక్కువే అనిపించొచ్చు, కానీ మూడేళ్ల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచీ ఏటా మన సౌర శక్తి ఉత్పత్తి రెట్టింపవుతూ వస్తోంది. అదే వేగం కొనసాగితే అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే రెండు మూడేళ్లలో సౌరశక్తి వినియోగంలో మొదటి మూడు దేశాల్లో భారత్‌ చేరుతుంది.

‘ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌’... ప్రధాని మోదీ ప్రతిపాదించి, చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన సౌర కూటమి ఇది. సూర్య కిరణాల ప్రభావం పుష్కలంగా ఉండే దేశాలను ఆయన ‘సూర్య పుత్రులు’గా అభివర్ణించారు. ఆ దేశాలన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతో ‘ఐఎస్‌ఎ’ ప్రాణం పోసుకుంది. దాని ప్రధాన కార్యాలయానికి గతేడాది ‘గురుగ్రామ్‌’లో పునాది పడింది. 121 దేశాలు ఆ కూటమిలో సభ్యులుగా చేరాయి. సౌరశక్తిని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయాలనీ, ఆ విషయంలో ‘సూర్య పుత్రులు’ ఒకరికొకరు సహకరించుకోవాలన్నదే ఆ కూటమి లక్ష్యం.
ప్రభుత్వమూ ప్రజలూ కలగలిస్తేనే ఓ దేశం సౌర శక్తి సంపన్నమవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఆ విషయంలో మన ప్రభుత్వం రెండడుగులు ముందే ఉంది. మిగిలిందల్లా, ప్రజలూ ఆ వేగాన్ని అందుకొని ‘సౌర కుటుంబం’లో భాగం కావడమే..!
సూర్యుడే డ్రైవర్‌

మనిషి జీవితంలో వేగం మొదలైంది చక్రాన్ని కనిపెట్టాకే. కానీ ఇప్పుడదే చక్రం మన జీవన ప్రమాణాల్ని కుంటుపడేస్తోంది. భూమ్మీద నడిచే వాహనాలూ, గాల్లో ఎగిరే విమానాలూ, నీటిపైన వెళ్లే పడవలూ... అన్నీ ఇంధనం కోసం చమురు ఉత్పత్తుల మీద ఆధారపడ్డవే. ఫలితంగా నేలా, నీరూ, నింగీ కలుషితమైపోయాయి. ఆ సమస్యనుంచి గట్టెక్కడానికి ‘సౌర వాహనాలే’ సరైన పరిష్కారం. తొలిసారిగా పూర్తిగా సౌర శక్తితో పనిచేసే కార్లకు రోడ్డు మీద తిరిగే అనుమతి కల్పిస్తూ ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత ఇరవైఏళ్లుగా తరచూ అంతర్జాతీయ సోలార్‌ కార్‌ రేసులు జరుగుతున్నాయి. వాటిలో పోటీ పడేందుకు అనేక సంస్థలు ఎప్పటికప్పుడు శక్తిమంతమైన కార్లను తయారుచేస్తూనే ఉన్నాయి. భారత్‌ నుంచి కూడా నాలుగైదు కార్లు తయారైనా మార్కెట్‌ ప్రమాణాల్ని అందుకోలేకపోయాయి. ఆస్ట్రేలియాలో మాత్రం ‘సన్‌ స్విఫ్ట్‌’ పేరుతో పూర్తిగా సౌరశక్తితో పనిచేసే కారు రహదారిపైన అడుగుపెట్టింది.
ఓ విమానం గంటసేపు గాల్లో ఎగరాలంటే ఐదు టన్నులకిపైగా ఇంధనం అవసరం. అంటే కాలుష్యమూ ఖర్చూ రెండూ ఎక్కువే. సూర్యుడి రూపంలో అంతపెద్ద పవర్‌ బ్యాంక్‌ ఆకాశంలో ఉన్నప్పుడు మరో ఇంధనం గురించి ఆలోచించడం ఎంత విడ్డూరం! స్విట్జర్లాండ్‌కి చెందిన శాస్త్రవేత్తలకు వచ్చిన ఈ ఆలోచన నుంచి ప్రాణం పోసుకుందే ‘సోలార్‌ ఇంపల్స్‌’. కేవలం సౌరశక్తితో ఎగిరే విమానం ఇది. ఇప్పటికే కొన్ని వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి అనేక దేశాల్ని చుట్టేసింది. రెండేళ్ల క్రితం మన దేశంలో కూడా వారం పాటు చక్కర్లు కొట్టిన ఈ సౌర విమానం, ‘భవిష్యత్తంతా సౌర శక్తిదే’ అని చాటి చెబుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తోంది. దాని స్ఫూర్తితో కమర్షియల్‌ సౌర విమానాలనూ అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేలకూ, ఆకాశానికే పరిమితం కాకుండా నీళ్లపైనా సూర్యుడి ప్రభావం పడింది. ఎండని నమ్ముకొని బోలెడన్ని భారీ పడవలు సముద్రాల్లో ప్రయాణిస్తున్నాయి. మన దేశంలోనూ ఈ ఏడాదే తొలి ‘సోలార్‌ పవర్డ్‌ బోట్‌’ కేరళలో ప్రారంభమైంది. ఆదిత్యుడి శక్తితో నడుస్తుంది కాబట్టి ‘ఆదిత్య’ అని పేరు పెట్టుకున్న ఆ పడవ, రోజూ పదహారు వందల మంది ప్రయాణీకుల్ని తమ గమ్యాలకు చేరుస్తోంది... అదీ ఇంజిన్ల రణగొణ ధ్వనీ, డీజిల్‌ వాసనా లేకుండా. ఈ జోరు ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో నింగీ, నేలా, నీరుపైన ఆధిపత్యమంతా సూర్యుడిదే.
పల్లెల్లో ‘వెలుగు’

ఈ డిజిటల్‌ యుగంలో కూడా దేశంలోని కొన్ని వేల గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం అందని ద్రాక్షే. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పల్లెల్లో వెలుగులు రాలేదు. ఎందరు అధికారులొచ్చినా గ్రామీణుల జీవితాలు మారలేదు. అలాంటి వాళ్లందరికీ సూర్య భగవానుడే పెద్దదిక్కయ్యాడు. పల్లెల్లో తరాల తరబడి కూరుకుపోయిన చీకటి కష్టాలను దూరం చేస్తున్నాడు. వూపిరితిత్తులకు తూట్లు పొడిచే కట్టెల పొయ్యి కాలుష్యం నుంచి ‘సోలార్‌ స్టవ్‌’ రూపంలో ఉపశమనాన్నిస్తున్నాడు. కిరోసిన్‌ బుడ్డి తప్ప మరో వెలుగు తెలీని వాళ్లకు ‘సోలార్‌ లాంటర్న్‌’ కాంతుల్ని పంచుతున్నాడు. ప్రాణాంతక వ్యాధులను ప్రబలించే కలుషిత జలాల నుంచి ‘సోలార్‌ ప్యూరిఫయర్‌’గా మారి రక్షణ కల్పిస్తున్నాడు. ఇప్పటిదాకా విద్యుత్తు సదుపాయాన్ని అనుభవించని చాలా గ్రామాలు ఇప్పుడు సౌర వెలుగులతో ధగధగలాడుతున్నాయి. ప్రభుత్వాలూ, అధికారులూ ముందుకు రాకపోయినా, దేశవ్యాప్తంగా చాలా స్వచ్ఛంద సంస్థలు గ్రామస్థులను సౌర విద్యుత్తువైపు నడిపిస్తున్నాయి. తమ విద్యుత్తుని తామే సృష్టించుకునే పద్ధతులను నేర్పిస్తున్నాయి. యువకులతో సోలార్‌ గ్రిడ్‌లను ఏర్పాటు చేయించి వాళ్లను గ్రామ స్థాయి వ్యాపారులుగా మారుస్తున్నాయి. మహిళలకూ సౌరశక్తి కొత్త ఉపాధిని చూపిస్తోంది. ఝార్ఖండ్‌లోని పసంగి గ్రామం ఇన్నేళ్లుగా విద్యుత్తుకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడక్కడ మహిళలు రైతుల నుంచి ధాన్యాన్ని కొని, సౌర శక్తితో పనిచేసే ‘రైస్‌ హల్లింగ్‌’ యంత్రాల సాయంతో దాని పొట్టు తీసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు, అనంతగిరి లాంటి ప్రాంతాల్లోని వందల గ్రామాలు సౌర విద్యుత్తుపైనే ఆధారపడుతున్నాయి. ఒడిశా, ఝార్ఖండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని వందల గ్రామాలూ, ఆఫ్రికా ఖండంలోని వేల గ్రామాలూ సూర్యుడినే నమ్ముకొని జీవిస్తున్నాయి. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయులు చీకట్లోనే మగ్గుతున్నారు. ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుంటే, వాళ్ల ఆహారం, ఆదాయం, అభివృద్ధికి సూర్యుడే అభయమిస్తాడు.
వైద్యం ప్రకాశవంతం

గిరిజన ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో కరెంటు కష్టాల వల్ల వైద్యానికి ఎన్నో పరిమితులు ఎదురవుతున్నాయి. ఆస్పత్రుల్లో కుట్లేసే సూదులూ, బ్లేడ్లూ వగైరా వైద్య పరికరాలు శుభ్రంగా లేకపోతే, రోగికి ఉన్న సమస్యలకి కొత్తవి తోడవుతాయి. వైద్యశాలల్లో అలాంటి వాటిని క్రిముల రహితంగా మార్చేందుకు ‘ఆటోక్లేవ్‌’ యంత్రంలో శుద్ధిచేస్తారు. అది పని చేయాలంటే విద్యుత్తు కావాలి. అసలు సమస్యంతా దాంతోనే కదా! దానికి పరిష్కారమే ‘సోలార్‌ ఆటోక్లేవ్‌’. సౌర శక్తి సాయంతో పనిచేసే ఈ ఆటోక్లేవ్‌లు గ్రామీణ వైద్య స్థితిగతుల్ని ఓ మెట్టు పైకెక్కిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లూ, అవి పని చేయడానికి విద్యుత్తు సదుపాయమూ లేక చిన్నారుల పాలిట సంజీవని లాంటి వ్యాక్సీన్లూ, ఇంజెక్షన్లూ చిన్న చిన్న గ్రామాలకు చేరలేకపోతున్నాయి. ‘సోలార్‌ వ్యాక్సీన్‌ రిఫ్రిజిరేటర్లు’ ఆ కష్టాన్ని గట్టెక్కిస్తున్నాయి. సౌరశక్తితో పనిచేసే ఆ చిన్న ఫ్రిజ్‌లు కావల్సినన్ని రోజులు టీకాల్ని నిల్వ ఉంచుతూ, అవసరానికి ఆదుకుంటున్నాయి. వినికిడి యంత్రాలూ, బీపీ ఆపరేటర్లూ, మెడికేటెడ్‌ టూత్‌బ్రష్‌ల లాంటి అనేక వైద్య పరికరాలు ప్రస్తుతం సౌరశక్తిపైన ఆధారపడి పనిచేస్తున్నాయి.
సూక్ష్మ సౌర ఫలకాల సాయంతో అంధులకు తిరిగి చూపు తెప్పించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. కనుగుడ్డులోపల అతి చిన్న సౌర ఫలకాల్ని అమర్చి, వాటి మీద సూర్యుడి వెలుగు పడగానే, అవి ఉత్తేజితమై మెదడుకి సంకేతాల్ని ఇచ్చేలా శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగం ఎలుకల్లో విజయవంతం కావడంతో, ప్రస్తుతం మనుషులపైన ప్రయోగిస్తున్నారు. ఆ ఫలకాలను క్యాన్సర్‌ చికిత్సలోనూ భాగం చేసే పనిలో ఉన్నారు. మొత్తంగా వైద్య పరికరాలకు కొత్త శక్తినిస్తూ, నేరుగా వైద్యంలోనూ భాగమవుతూ మనిషిని ఆరోగ్యవంతుడిని చేయడానికి సూర్యుడే సాయపడుతున్నాడు.
సౌర సేద్యం...

దేశంలో దాదాపు ఇరవై కోట్ల మంది పల్లెవాసులు సరైన విద్యుత్‌ సదుపాయానికి దూరంగా బతుకుతున్నారు. వాళ్లలో అధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్లే. విద్యుత్తు లేకపోతే దేశంలో వ్యవసాయం ముందుకు కదిలే పరిస్థితి లేదు. మన దగ్గరేమో ఎక్కడా కరెంటు సరఫరా సమృద్ధిగా లేదు. రైతులను వేధిస్తున్న ఆ సమస్యనూ సూర్యుడే భుజాన వేసుకున్నాడు. సౌర యంత్రాల రూపంలో సాగుని గాడిన పెడుతున్నాడు. అర్ధరాత్రుళ్లు అందే ఉచిత కరెంటు ద్వారా తలెత్తుతున్న ప్రమాదాలూ, విష కీటకాల ప్రభావం నుంచి రైతుల్ని బయటపడేస్తున్నాడు. ‘సోలార్‌ పంపులు’ రైతుల కోసం పుష్కలంగా నీళ్లు తోడి పెడుతున్నాయి. ‘సోలార్‌ డ్రయర్లు’ రూపాయి ఖర్చులేకుండా పంటలో చెమ్మను దూరం చేసి పాడవకుండా కాపాడుతున్నాయి. సోలార్‌ శీతల గిడ్డంగులు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచుతున్నాయి. సోలార్‌ గ్రీన్‌ హౌజ్‌లు కాయగూరలు ఏపుగా పెరగడంలో సాయపడుతున్నాయి. సౌర శక్తితో పనిచేసే ట్రాక్టర్లూ, కోత యంత్రాలూ, పాలను సేకరించే యంత్రాలూ, హైడ్రోపోనిక్స్‌ పరికరాలూ, స్ప్రేయర్లూ, కంచెలూ... ఇలాంటి ఎన్నో పరికరాలు సేద్యానికి కొత్త శక్తినిస్తున్నాయి. ప్రభుత్వం కూడా సౌర సేద్య పరికరాలకు భారీ రాయితీలు కల్పిస్తూ రైతులను మరింత ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. నిత్యం పంటకి జీవమిచ్చే సూర్యుడు, రాబోయే రోజుల్లో మొత్తం వ్యవసాయ రంగాన్నే నడిపించబోతున్నాడు.
సోలార్‌ సాంకేతికత

భుజానికున్న బ్యాగులో ల్యాప్‌టాప్‌, జేబులో సెల్‌ఫోన్‌, చెవిలో బ్లూటూత్‌ ఇయర్‌ ఫోన్‌, చేతిలో ఐపాడ్‌... విద్యుత్తుతో పనిచేసే బోలెడన్ని గ్యాడ్జెట్లు మన ఒంటిమీద ఉంటున్నాయి. ఫ్యాన్లూ, ఏసీలూ, లైట్లూ, గీజర్లు... కరెంటు లేనిదే పనిచేయని ఎన్నో పరికరాలు మన ఇంట్లో ఉంటున్నాయి. వీటన్నింటితో మన జీవితాన్ని సౌకర్యంగా ఉంచేందుకు బోలెడన్ని సహజ వనరులు వృథా అవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా కాలుష్యం గాల్లో పేరుకుపోతోంది. మనం ఉపయోగించే పరికరాలన్నింటినీ సౌర శక్తితో నడిపిస్తే ఖర్చూ, కాలుష్యం, వృథా... అన్నీ తగ్గిపోతాయి. ఇప్పటికే మార్కెట్లోకి అలాంటి పరికరాలన్నీ వచ్చేశాయి. ఎల్‌జీ లాంటి సంస్థలు కూడా ‘సోలార్‌ ఏసీ’లను తయారు చేశాయి. నేరుగా సౌర ఫలకాలు అమర్చిన ఏసీలు విపణిలోకి వస్తున్నాయి. దాంతో ఎండాకాలంలో కరెంటు కోతలు ఇబ్బంది పెట్టే ప్రాంతాల్లో కూడా సోలార్‌ ఏసీలతో సుఖంగా నిద్రపోవచ్చు. అంత ఖర్చు పెట్టలేని వాళ్ల కోసం సోలార్‌ ఫ్యాన్లూ అందుబాటులో ఉన్నాయి. నీళ్లను వేడి చేసే గీజర్లూ, ఇన్వర్టర్లూ, సీసీ కెమెరాల్లాంటి అనేక గృహోపకరణాలు కాస్తంత ఎండతో రోజంతా పనిచేస్తున్నాయి. బెడ్‌ ల్యాంప్‌లూ, బొమ్మలూ, పూలకుండీలూ... ఇలా సౌరశక్తితో ఇంటి అందాన్ని పెంచే పరికరాలకైతే లెక్కే లేదు.
నిత్యం ప్రయాణాల్లో ఉండే ఉద్యోగులకీ, విహార యాత్రల్ని ఇష్టపడే కుర్రాళ్లకీ సోలార్‌ గ్యాడ్జెట్స్‌ అద్భుతమైన ప్రత్యామ్నాయం. అచ్చంగా సౌరశక్తితో పనిచేసే ల్యాప్‌టాప్‌లూ, కిండిల్‌ రీడర్లూ వచ్చేశాయి. హెడ్‌సెట్లూ, వాచీలూ, ఫిట్‌నెస్‌ బ్యాండ్లూ, హ్యాండ్‌ బ్యాగ్‌లూ, ఆఖరికి సౌరశక్తిని ఉపయోగించుకునే దుస్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంచడానికి ఆ బట్టలు పనికొస్తాయి. ప్రపంచానికి వెలుగిచ్చే సూరీడు, ఇంటినీ ఒంటినీ కూడా మరింత సౌకర్యంగా మారుస్తున్నాడన్న మాట.
సౌర ఇంధనం

రోజురోజుకీ పెట్రోల్‌, డీజిల్‌ లాంటి ఇంధనాలపైన ఆధారపడే వాహనాలూ, యంత్రాల వినియోగం పెరుగుతోంది. ఇంకోపక్క భూగర్భంలో వాటి నిల్వలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని రసాయన చర్యల ద్వారా కృత్రిమంగా వాటిని సృష్టించే క్రమంలో ఇతర విష పదార్థాలు గాల్లో కలుస్తున్నాయి. ఆ విషయంలోనూ సౌరశక్తి శాస్త్రవేత్తల్ని ఆదుకుంటోంది. కొన్ని రకాల మొక్కల నుంచి జీవ ఇంధనాన్ని సృష్టించినట్లే, సూర్య రశ్మి ద్వారా నీటిలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ పరమాణువులను వేరు చేసి, ఆపైన సౌరశక్తి సాయంతోనే ఇతర పదార్థాలతో రసాయన చర్యలు జరిపి సౌర ఇంధనాన్ని సృష్టిస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో భారీ రసాయన చర్యల కోసం కూడా విద్యుత్తూ, మంటపైన ఆధారపడకుండా సూర్య శక్తినే సాధనంగా వాడుకుంటున్నారు. సముద్రపు నీరు నుంచి సూర్యరశ్మి ద్వారా ‘డిటీరియం’ అనే శక్తిమంతమైన అణువులను వేరు చేసి ఇంధనంగా మారుస్తున్నారు. భవిష్యత్తులో సౌర శక్తిని వినియోగించడానికి వీలుపడని యంత్రాలకు ఈ సౌర ఇంధనమే ఆధారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లాభాలెక్కువ... నష్టం తక్కువ!

బొగ్గు తరిగిపోతుంది. చమురు ఆవిరవుతుంది. నీరు అడుగంటుతుంది. కానీ ఎంత వాడుకున్నా ఎప్పటికీ అరిగిపోనీ, తరిగిపోనీ, కరిగిపోనీ శక్తి సూర్యుడిది. బొగ్గూ, చమురు లాంటివి కొన్ని దేశాలకే పరిమితం. కానీ సూర్యుడు ప్రపంచమంతా ప్రకాశిస్తాడు. ప్రతి దేశమూ విద్యుదుత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించగల సామర్థ్యాన్నిస్తాడు. రోజూ భూమ్మీదపడే సూర్యకిరణాల నుంచి లక్షా ఇరవై వేల టెరావాట్ల విద్యుత్తుని సృష్టించొచ్చు. అంటే ప్రపంచమంతా వినియోగించే విద్యుత్తుకి ఇరవై వేల రెట్లు ఎక్కువగా, అదీ ఎలాంటి శబ్ద, జల, వాయు, భూ కాలుష్యం లేకుండా. గత ఐదేళ్లలో సౌర విద్యుత్తు ఉత్పాదక ఖర్చు ఎనభై శాతం తగ్గింది. ఏడాది కాలంలో మన సౌర విద్యుత్‌ ఉత్పత్తి రెండు రెట్లు పెరిగింది. సౌర ఫలకాలకు ప్రభుత్వాలు మంచి రాయితీలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణ ఖర్చూ తక్కువే. గ్రిడ్‌ కనెక్షన్‌తో పనిలేకుండా అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్లు కూడా ఇంటికో సౌర ఫలకాన్ని అమర్చుకొని చీకటి సమస్యను దూరం చేసుకోవచ్చు. ఏ విధంగా చూసినా ఇతర మార్గాల కంటే సూర్యుడి ద్వారా మన అవసరాలకు కావల్సిన శక్తినీ, ఇంధనాన్నీ సృష్టించడం ఎన్నో రెట్లు మేలు.
సౌర శక్తి విషయంలో లాభాలతో పోలిస్తే నష్టాలు నామమాత్రమే. ఉత్పాదక వ్యయం ఎక్కువగా ఉండటం ఇప్పటిదాకా ఇక్కడ మొదటి ప్రతికూలత. కానీ కొంత కాలంగా ఆ ఖర్చు భారీగా తగ్గుతూ వస్తోంది. సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి కావల్సిన స్థలమూ ఎక్కువే. అందుకే తక్కువ స్థలంలోనే ఎక్కువ శక్తిని సృష్టించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. సృష్టించిన శక్తిని పెద్ద ఎత్తున నిల్వ చేయడంలోనూ కొన్ని పరిమితులున్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ ఆంశంపైనే దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పోలిస్తే ఈ అడ్డంకులు చాలా చిన్నవి. వీటిని కూడా దాటేయగలిగితే, రానున్న రోజుల్లో సూర్యుడి కిరణాలే ప్రపంచానికి వెలుగుల వరాలిస్తాయి.
మనదే రికార్డు

ప్రపంచంలో సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసే అతిపెద్ద కేంద్రం మన దేశంలోనే ఉంది. తమిళనాడులోని ‘కాముతి’ పట్టణంలో 2500 ఎకరాల పరిధిలో విస్తరించివున్న ఆ కేంద్రం నుంచి 648 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. దాని సాయంతో లక్షా యాభై వేల గృహాలకు విద్యుతు సరఫరా చేయొచ్చు.
* సౌర శక్తిని ఉత్పత్తి చేయడానికి కాస్త ఎక్కువ స్థలమే కావాలి. ఆ పరిమితిని అధిగమించడానికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం మంచి మార్గాన్ని కనిపెట్టింది. నార్మండీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఒక కిలోమీటరు పొడవున సౌరఫలకాలు అమర్చిన రహదారిని నిర్మించింది. చుట్టు పక్కల గ్రామాలకు అక్కడ నుంచి సేకరించిన విద్యుత్తునే అందించడం మొదలుపెట్టింది. ఫలితాలు బావుండటంతో దేశవ్యాప్తంగా సౌర రహదారులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తొంది.
* దుబాయిలో అడుగుపెడితే రోడ్లపైన సౌరశక్తితో పనిచేసే కృత్రిమ ఈత చెట్లు కనిపిస్తాయి. వీధుల్ని అందంగా ఉంచడం కోసం అమర్చిన ఆ చెట్లకు ఉన్న తెరపైన పర్యటకులు దుబాయి మ్యాప్‌ను చూసుకోవచ్చు. ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. గ్యాడ్జెట్లకు ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు
* ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ రాత్రుళ్లు విద్యుద్దీప కాంతుల ధగధగలతో వెలిగిపోతుంది. ఆ బల్బులు వెలగడానికి కావల్సిన విద్యుత్తునంతా ఆ టవరే సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. ఈఫిల్‌ టవర్‌కి అమర్చిన సౌర ఫలకాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తుని దాని అవసరాలకు పోగా, పక్కనున్న రెస్టరెంట్లూ కొంత వాడుకుంటున్నాయి.
* ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ లాంటి దేశాల్లో కొన్ని క్యారవాన్లు వీధుల్లో తిరుగుతూ ఆసక్తి ఉన్న వాళ్ల కోసం పాత సినిమాలూ, లఘు చిత్రాలనూ ప్రదర్శిస్తుంటాయి. ప్రస్తుతం అవన్నీ సౌరశక్తితోనే పనిచేస్తున్నాయి. అందుకే వాటి పేరు కూడా ‘సోల్‌ సినిమా’గా మారిపోయింది.
* షిరిడీలోని సాయినాథుని సన్నిధిలో ఉన్న అన్నదాన కేంద్రం రోజూ వేలాది మంది భక్తులకు కమ్మని భోజనం వండి పెడుతోంది. సౌర శక్తి ద్వారా ఆవిరిని సృష్టించి, దాంతో పనిచేసే ఆ కేంద్రంలోని వంటగదే ప్రపంచంలోని అతిపెద్ద ‘సోలార్‌ కిచెన్‌’. ఆ తరవాతి స్థానం తిరుపతిలోని టీటీడీ వంటశాలది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list