MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆహార వృథాను అరికడదాం_Food waste_



తినేదెంత.. పారేసేదెంత!
ఆహార వృథాను అరికడదాం
అన్నార్తుల్ని ఆదుకుందాం
వేడుకల్లో లెక్కకు మించి వంటకం..
అనేక చోట్ల విచ్చలవిడిగా పడేసే ధోరణి
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తీరు
మారుతున్న జీవనశైలి ఓ కారణం

మీరు ఈ మధ్య ఏదైనా పెళ్లికి వెళ్లారా? వడ్డించుకున్నదంతా తిన్నారా? ఏమైనా వదిలేశారా? అలా వదిలేయడం సరికాదని మీకు అనిపించలేదా!! మీరే కాదండోయ్‌... ఈ ప్రపంచంలో చాలామంది ఇలాంటి తప్పునే చేస్తున్నారు. ఆరుగాలం శ్రమిస్తూ అన్నదాత తిండిగింజల్ని పండిస్తుంటే... కొన్ని గంటల్లోనే ఆ తిండి కుప్పతొట్టెలకు చేరుతున్న దారుణమైన పరిస్థితి!! దేశంలో కోట్ల మంది ప్రజలు ‘అన్నమో రామచంద్రా’ అంటూ ఆహారం కోసం అలమటిస్తుంటే... ఇంకోవైపు కొందరు వేడుకలు, పెళ్లిళ్లలో విచ్చలవిడిగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. పొట్ట పట్టేంత కాకుండా.. అమితంగా ఆహారాన్ని వడ్డించుకుని... చివరికి దాన్ని చెత్తకుప్పలో పారేస్తున్న వారు కోకొల్లలు. ఫలితంగా విపరీతమైన ఆహార వృథా జరుగుతోంది. ఈ వృథాను అరికడితే కొన్ని కోట్ల మంది అన్నార్తులకు ఆహారాన్ని అందివ్వవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విపరీత ధోరణి తీవ్రంగానే ఉంది. ఆహార వృథా వల్ల జరుగుతున్న నష్టంపై, నివారణ మార్గాలపై ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఈ వృథాను ఆపుదాం!

* ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆహార వృథా: 130 కోట్ల టన్నులు
* ప్రపంచ ఆహార ఉత్పత్తిలో ఇది మూడో వంతు
* దీని విలువ: రూ.47 లక్షల కోట్లు
* దీనివల్ల వెలువడే గ్రీన్‌ హౌస్‌ వాయువులు: 330 కోట్ల టన్నులు
* దేశంలో ఏటా వృథా అవుతున్న ఆహారం సగటున 6.7 కోట్ల టన్నులు
* దేశంలో ఆకలితో అల్లాడుతున్న వారి సంఖ్య దాదాపు 20 కోట్లు (భూక్‌ అనే సంస్థ అంచనా ఇది)
అంత వృథానా!
ఆకలి తీర్చాల్సిన అన్నం కుప్పతొట్లు పాలవుతోంది. ఓ వైపు పిడికెడు మెతుకుల కోసం కోట్ల మంది ‘అన్నమో రామచంద్రా’ అని పరితపిస్తుంటే... మరోవైపు వేల కోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని కొందరు ప్రబుద్ధులు దిబ్బల్లో పారబోస్తున్నారు. అవసరాలకు, అంచనాలకు మించి వండి.. మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తకుప్పల పాలు చేస్తున్నవారు కొందరైతే... ప్లేట్లలో వడ్డించుకున్న దాన్నీ పూర్తిగా తినకుండా నేలపాలు చేస్తున్న వారు మరికొందరు. దేశంలో ఏడాదికి సగటున 6.7 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఇది బిహార్‌ రాష్ట్ర ప్రజలకు ఒక ఏడాదంతా కడుపు నింపేందుకు సరిపోతుంది. అంటే వృథా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు వృథాను అరికడితే దేశంలో ప్రతి రాత్రీ 20 కోట్ల మంది ఖాళీ కడుపుతోనే నిద్రించే పరిస్థితే ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆహార వృథా గణనీయంగా ఉంది.
వృథాకు ఇదీ కారణం..
* మారుతున్న జీవనశైలి, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం దీనికో ప్రధాన కారణం. డబ్బు ఉంది కదా అని అనేక మంది వివాహాలు, ఇతర వేడుకలను అంత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విందుల కోసం భారీగా ఖర్చుచేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయిన విందుల్లో రకరకాల వంటలను అందుబాటులో ఉంచుతున్నారు. మధ్యతరగతి వారూ దీనిని అనుకరిస్తున్నారు.
* వేడుకలకు అతిథుల్ని ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. వారు తిన్నది కొంతైతే, పడేస్తున్నది మరికొంత.
* అతిథుల సంఖ్య సరిగ్గా అంచనా వేయలేకపోవడం మరో కారణం.
* ఆతిథ్య రంగం విస్తరించడమూ మరో కారణంగా కనిపిస్తోంది.
ఇలా అరికట్టొచ్చు..
* ఇంట్లో భోజనం చేసినా, హోటల్‌కు వెళ్లినా తినగలిగేటంతే వేసుకోవాలి.
* వేడుకలు నిర్వహించేటప్పుడు అతిథుల సంఖ్య విషయంలో పక్కాగా అంచనా వేసుకోవాలి. ఆ మేరకే సిద్ధం చేసుకోవాలి.
* అవసరమైతే అతిథుల సంఖ్యను తగ్గించుకోవడం మంచిది.
* తినగలిగే స్థాయిలోనే వంటకాల సంఖ్యను కుదించాలి.
* అప్పటికీ మిగిలిపోతే.. అలా మిగిలిన ఆహారాన్ని అన్నార్తులకు అందించే స్వచ్ఛంద సంస్థలకు అందజేయాలి.
పెళ్లిళ్లలోనే 30%
ఆహారం ఎక్కువగా వృథా అవుతున్నది వివాహాలలోనే. సగటున 30 శాతం పారబోస్తున్నారన్నది క్యాటరింగ్‌ నిర్వాహకుల అంచనా. కొన్ని సందర్భాల్లో ఒకేరోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దీని వల్ల అతిథుల సంఖ్య తగ్గడం, వచ్చినవారు కూడా సరిగా తినకపోవడం వల్ల ఆహారం మిగిలిపోతుంది. మాంసాహారం, శాకాహారం రెండు రకాలు వడ్డించే చోట వృథా అధికంగా ఉంటోంది.
చట్టాలతోనే సమస్య పరిష్కారం కాదు
అసోం, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, మిజోరాం వంటి రాష్ట్రాలు దశాబ్దాల క్రితమే ఆహార వృథాను అరికట్టేందుకు పలు చట్టాలు చేసినా అవి అమలు కావడంలేదు. పాకిస్థాన్‌ వంటి దేశాల్లోనూ దీనికోసం ప్రత్యేక చట్టాలు చేశారు. వేడుకల్లో ఆహార పదార్థాల సంఖ్యపై నియంత్రణ విధించారు. అదంతా కాగితాలకే పరిమితం అవుతోంది. అసోంలో ఉన్న ‘అతిథి నియంత్రణ చట్టం-1960’ ప్రకారం సాధారణ వేడుకలకు 25 మంది, వివాహాలకైతే 100 మందికి మించి ఆహ్వానించడానికి వీల్లేదు. రాజస్థాన్‌లోనూ అంతే. కానీ ఈ చట్టాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే దీనికి కొంతైనా పరిష్కారం లభిస్తుంది.

పారబోయడమే ఎక్కువ
వినియోగించని ఆహారాన్ని ఇతరులకు ఇచ్చే సంస్కృతి 25 శాతంలోపే ఉంది. క్రమం తప్పకుండా ఇచ్చేవారు 10 శాతంలోపే ఉన్నారు. మరో 15 శాతం మంది అప్పుడప్పుడు ఇస్తుంటారు. మిగతావారు నేలపాలు చేస్తుంటారు. చాలా హోటళ్లల్లో శీతల నిల్వ కేంద్రాలు ఉండడం లేదు. ఇవి ఉంటే వృథాయ్యే వాటిని కొన్నిగంటలపాటు ఉంచేందుకు వీలుంటుంది. సాధారణంగా వృథా అనేది అయా కార్యక్రమాలు ముగిసినా తర్వాత వెలుగుచూస్తుంది. అప్పటికప్పుడు దీన్ని తరలించేందుకు సరైన వ్యవస్థ.. నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో చెత్తకుప్పలకు తరలిస్తున్నారు. ఈ వృథా ఇదే పద్ధతిలో కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయంలో ఉత్పత్తిని మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
స్వచ్ఛందంగా..
విదేశాల్లో ఇలా అదనంగా ఉండే ఆహారాన్ని నిర్ణీత ప్రదేశాల్లో ఉంచితే కావాల్సినవారు వచ్చి తీసుకెళ్తారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి అవసరం ఉన్నవారికి అందించడానికి వేల మంది స్వచ్ఛందంగా పనిచేస్తారు. మన దేశంలో రాబిన్‌హుడ్‌ ఆర్మీ(దిల్లీ, హైదరాబాద్‌ సహా ఎనిమిది నగరాలు), ఫీడింగ్‌ ఇండియా (దిల్లీ మరో 16 నగరాలు), డబ్బావాలాల రోటీబ్యాంక్‌ (ముంబయి), మేరా పరివార్‌ (గురుగ్రామ్‌), అన్న క్షేత్ర (జయపుర), శివకుమార్‌ (బెంగళూరు), షెల్డర్‌ డాన్‌ బాస్కో(ముంబయి), శాంతిమందిరం (తిరువనంతపురం), కారుణ్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (తెలుగు రాష్ట్రాలు) సహా పలు సంస్థలు ఇలాంటి సేవ చేస్తున్నాయి.

నెలకు 8 లక్షల భోజనాలు
రాబిన్‌హుడ్‌ సంస్థ 44 నగరాల్లో 4,500 మంది సహాయంతో.. హోటళ్లు, కార్పొరేట్‌ కేఫ్టిరియాలు, క్యాటరర్స్‌, వివాహ వేదికల నుంచి మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి అనాథలు, వృద్ధులు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇంకా అవసరమున్న ఇతరులకు అందిస్తోంది. వీరు నెలకు 8 లక్షల మందికి ఇలా భోజనాలు సమకూరుస్తున్నారు. 2014లో ప్రారంభించిన ఈ సంస్థ 12 దేశాల్లో పనిచేస్తోంది. విద్యార్థులు, వృత్తి నిపుణులు, ఉద్యోగులు ఈ సైన్యంలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువే
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆహారం వృథా భారీస్థాయిలో ఉంటోంది. ఏటా లక్షల కొద్దీ వివాహాలు జరుగుతుంటాయి. ఇవి కాకుండా విందులతో ముడిపడి ఉన్న లక్షలాది కార్యక్రమాలు ఉంటున్నాయి. వీటన్నిటిలోనూ 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతున్నట్లు అంచనా. ఇది కాకుండా చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు అన్ని చోట్లా హోటళ్లలోనూ తినకుండా వదిలేసిన ఆహారం భారీగా ఉంటోంది.
150 రకాలు తినేదెవరు?

రాజమండ్రిలో ఇటీవల ఓ ప్రముఖుడి కుటుంబంలో నిర్వహించిన వివాహంలో 150 రకాల వంటకాలు వడ్డించారు. అన్ని రకాలు ఎవరూ తినే అవకాశం లేకపోవడంతో వృథా తప్పలేదు.
ఆ ఒక్క పెళ్లిలోనే 1,000 మందికి సరిపడా భోజనం వృథా
ఇటీవల హైదరాబాద్‌లో ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో వివాహం జరిగింది. వందలాది వంటకాలు ఏర్పాటు చేశారు. చివరకు 1000 మందికి సరిపడేటంత ఆహారం తినకుండానే మిగిలిపోయింది. దీని విలువ రూ.6 లక్షలని అంచనా.
ఏపీ హోటళ్లలో ఇలా...

ఆంధ్రప్రదేశ్‌లో హోటళ్లు, రెస్టారెంట్లలో రోజూ 5-8 శాతం పదార్థాలను ఆరుబయట పారబోస్తున్నారు. పెద్దపెద్ద హోటళ్లల్లో రోజుకు 200 కిలోలు, చిన్న వాటిల్లో వంద కిలోల వరకు ఆహారపదార్థాలు వృథా అవుతున్నట్లు విజయవాడకు చెందిన ఫార్చున్‌, మెట్రోపాలిటన్‌ హోటళ్ల యజమాని మురళి వెల్లడించారు.
* ‘‘ప్రతి శుభకార్యంలో 10 నుంచి 15 శాతం వరకు ఆహార వృథా ఉంటోంది. కొన్నిసార్లు 20 నుంచి 25 రకాల వంటకాలు తయారుచేస్తున్నాం. ఇలాంటి సమయంలో అన్నింటినీ రుచి చూడాలనే దృక్పథం, అన్ని వేసుకొని వేటినీ పూర్తిగా తినలేక పడేయడం జరుగుతోంది’’ అని కృష్ణాజిల్లా ఇందుపల్లికి చెందిన క్యాటరింగ్‌ నిర్వాహకులు చెరుకుపల్లి ఆంజనేయులు చెప్పారు.
* ‘‘బిర్యానీలాంటి వంటకాలు ఉన్నప్పుడు వృథా ఎక్కువగా ఉంటుంది. హోటళ్లల్లో నిర్వహించే శుభకార్యాలకు ముందస్తుగా ఇచ్చే ఆర్డర్ల ప్రకారం పదార్థాలు సిద్ధం చేస్తారు. అతిథుల సంఖ్య తగ్గినా.. కొన్నింటిని కొందరు తినకపోయినా మిగతా మొత్తం వృథా అవుతోంది. కార్యక్రమం ముగిసిన తర్వాత మిగిలిపోయిన వాటిని ఎవ్వరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకుంటుంది. రాత్రి 12 గంటల తర్వాత పదార్థాలు మిగిలిన విషయం తెలుస్తుంది. ఆ సమయంలో వీటిని పంపిణీ చేయలేం. అలాగని ఉదయం వరకు నిల్వ చేయలేని దుస్థితి’’ అని విజయవాడకు చెందిన గ్రిల్‌ వి ఫంక్షన్‌ హాల్‌ మేనేజర్‌ రంగనాథ్‌ వెల్లడించారు.
విదేశాల్లో ఇలా..

* జర్మనీలో ఎవరైనా హోటళ్లు, రెస్టారెంట్లలో ప్లేట్లలో ఆహారాన్ని వదిలేస్తే ఒకటి నుంచి రెండు యూరోలు జరిమానా వేస్తారు. ఇక్కడ ‘తిను లేదా చెల్లించు’ పథకాన్ని అమలు చేస్తున్నారు. జరిమానాతోనైనా ఆహారం వృథాకు అడ్డుకట్టపడుతుందని అక్కడి పాలకులు భావించి, దీన్ని ప్రవేశపెట్టారు.
* స్విట్జర్లాండ్‌లో ఏడాదికి రెండు మిలియన్‌ టన్నుల మంచి ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టడం కోసం ఇక్కడ జరిమానా పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్లేట్లో ఆహారం వదిలేస్తే ఇక్కడ రెస్టారెంటు, హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో అదనంగా ఐదు ఫ్రాంక్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
* ఫ్రాన్స్‌ ఇటీవల ఓ చట్టాన్ని తెచ్చింది. ఆహారం చెడిపోవడానికి ముందే వినియోగించేటట్లు చూడాలి. ఒకవేళ ఆహారం చెడిపోయే పరిస్థితికి వస్తే ముందుగానే ధార్మిక సంస్థలకు వితరణ చేయాలి.
ఫోన్‌ చేస్తే చాలు..

ఆహారం మిగిలిందని ఫోన్‌ చేస్తే చాలు మా స్వచ్ఛంద సేవకులు అక్కడికి వెళ్లి తీసుకుంటారు. దాన్ని అవసరమైన వారికి అందిస్తారు. శుభ్రంగా సేకరించడమే కాకుండా శుభ్రంగా అందించాలి. తినాలి అన్పించేలా ఉండాలి. అలా చేస్తేనే ప్రయోజనం.
- కొర్లెపర రామకృష్ణ ప్రసాద్‌, కారుణ్య ఛారిటబుల్‌ట్రస్ట్‌
అక్కడా వృథా కానివ్వం
హైదరాబాద్‌లో గచ్చిబౌలి, హైటెక్‌సిటీ చుట్టుపక్కల మిగులు ఆహారాన్ని సేకరించి అవసరమైనవారికి అందిస్తుంటాను. కారుణ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సుమారు 60 మంది వాలంటీర్లు పనిచేస్తున్నాం. ఎక్కడ ఆహారం ఉందని ఫోన్‌ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నాం. పది మందికి సరిపడా ఆహారం ఉన్నా తీసుకుంటాం. అవసరమైన వారికి అవసరమైనంత మాత్రమే ఇస్తాం. అక్కడ కూడా వృథా కాకూడనేది మా లక్ష్యం.
- చంద్రశేఖర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, గచ్చిబౌలి
ప్రజల వైఖరిలో మార్పు వస్తేనే ప్రయోజనం
పెద్ద పెద్ద వేడుకలు, పెళ్లిల్లలో ఆహార వృథా ఎక్కువగా ఉంటోంది. చాలా వేడుకల్లో కనీసం 20 శాతం పైగానే ఆహారం వృథా అవుతోంది. ఎంతో పక్కాగా లెక్కలు వేసుకున్నా ఇది జరుగుతోంది. కావాల్సిన దానికంటే ఎక్కువ వడ్డించుకుని తినకుండానే పడేస్తున్నారు. అనేక రకాల వంటకాలు చేయమంటున్నారు. నచ్చినవి అయిపోతాయి. మిగిలినవి మిగిలిపోతుంటాయి. శాకాహారంలో ఎక్కువ వృథా ఉంటోంది. ఎక్కువ మిగిలిపోతే అనాథ శరణాలయాలకు పంపుతున్నాం. ప్రజల్లో మార్పు వస్తేనే ఆహార వృథాను అరికట్టొచ్చు. కావాల్సినంత వడ్డించుకోవాలి. అయిపోతే మళ్లీ తినగలిగినంతే వడ్డించుకోవాలి. అప్పుడే వృథాను అరికట్టొచ్చు.
- యాదగిరి, క్యాటరర్‌, హైదరాబాద్‌
పదేళ్లలో రకాలు పెరిగాయి... సంఖ్యా పెరిగింది
నేను 20 ఏళ్లుగా క్యాటరింగ్‌ చేస్తున్నాను... గత పదేళ్లుగా ఆహారం విషయంలో చాలా మార్పులొచ్చాయి. గతంలో 500 మంది అతిథులంటే ఎక్కువగా భావించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెండు వేలు, మూడువేలకు పెరిగింది. మెనూ చాంతాడంత అయింది. అనేక రకాల వంటకాలు కావాలని అంటున్నారు. ఖర్చు విషయంలో వెనుకాడటంలేదు. పెళ్లి అంటే ఫంక్షన్‌ హాల్‌, ఆహారానికే ప్రాధాన్యం. గతంలో రైస్‌(అన్నం) అంటే రెండు రకాలు సాధారణం. ఇప్పుడు రైస్‌లో ఐదారు రకాలు విధిగా ఉంటున్నాయి. అన్నీ ఇంతే. సౌత్‌ ఇండియన్‌, నార్త్‌ఇండియన్‌, స్నాక్స్‌, టిఫిన్‌లు, కూల్‌ డ్రింక్‌లు ఏవి కూడా ఐదారు రకాలకు తగ్గవు. ఓ మోస్తరు పెళ్లి అంటేనే 30 నుంచి 40 రకాల వంటకాలు ఉంటున్నాయి. ఎక్కువ వంటకాల్ని రుచిచూడాలనే కోరికతో ప్రతీదీ ప్లేటులో వేసుకుని తినకుండానే సగానికి సగం వదిలేస్తున్నారు. కనీసం మూతలు కూడా తీయకుండానే వందల మందికి ఉపయోగపడే భోజనం వృథా అవుతోంది. ఈ వృథా దాదాపు 20 శాతం మేర ఉంటోంది. వచ్చిన వాళ్లు ఇబ్బంది పడకూడదని ఎక్కువ చేయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి వివరించినా కొందరు పట్టించుకోరు. వెడ్డింగ్‌ మేనేజర్లు చెప్పినట్లు వెళ్తున్నారు. సగం మంది కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది.
- క్యాటరర్‌, హైదరాబాద్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list