MohanPublications Print Books Online store clik Here Devullu.com

స్నాతకోత్సవం_అంతర్యామి_Antaryami



స్నాతకోత్సవం
క్షరం కానిది అక్షరం. ఆ అక్షర ఉపాసన జ్ఞాన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. విశ్వమంతటినీ చూడగలిగేలా చేస్తుంది. వ్యక్తి ఉత్తమ జీవిత లక్ష్యాలు ఏర్పరచుకొనేందుకు అది దోహదపడుతుంది. అతడి నడక, నడత ఆదర్శవంతమయ్యేలా చేయగలిగేది జ్ఞానోపాసనే!
విద్యార్జన పూర్తయ్యాక పట్టా ప్రదానం చేస్తారు. ఆ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయాల్లో ‘స్నాతకోత్సవం’ పేరిట నిర్వహిస్తారు. ఫలితంగా విద్యార్థులు పట్టభద్రులవుతారు.
స్నాతకోత్సవ సంరంభం అంటే- జీవన గమ్యాన్ని, సత్యాన్ని ఎరుకపరచే ఓ ఉపదేశ వేదిక. దీన్ని మనకు ప్రాచీన రుషి పరంపర ప్రసాదించింది. స్నాతకమే జీవితాన్ని, ధర్మనియతిని సంధానిస్తుంది. ఒకప్పుడు విద్యార్థి గురుకుల ఆశ్రమాల్లో విద్య నేర్చుకునేవాడు. అదొక దీక్షా కాలం. అతడు తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శిక్షణాలయమది. అనంతరం కలిగే గృహస్థ జీవితం అనేక బాధ్యతలతో కూడి ఉంటుంది. వంశ గౌరవాన్ని నిలబెట్టాల్సిన విధి అతడిదే!
శిష్యుడు గురుకులాన్ని వదిలే ముందే- సమాజంలో నెరవేర్చాల్సిన కర్తవ్యాల్ని, గృహస్థాశ్రమ ధర్మాల్ని వివరించేవారు. అప్పటివరకు అతడికి గురువే దైవం, విద్యే ప్రపంచం! అతడు స్నాతకుడవుతాడు. స్నాతక వ్రతం ఆచరిస్తాడు. అతడి రూపం మారుతుంది. జీవన దశ పరిణామం చెందుతుంది.
జనకుడి ఆహ్వానం మేరకు, మిథిలలో శ్రీరామచంద్రుడి కల్యాణానికి దశరథుడు తరలి వెళతాడు. విశ్వామిత్ర, వసిష్ఠ మహామునుల నేతృత్వంలో- కల్యాణానికి ముందుగా రాముడికి స్నాతకోత్సవం జరిపిస్తాడు. వివాహ వేడుకలోనూ స్నాతకం అనేది ప్రాధాన్యం గల ఓ ఘట్టం!
స్నాతకమే కాలగమనంలో స్నాతకోత్సవంగా మారింది. విద్యాలయాలు కేవలం నాలుగు అక్షరాలు నేర్పడానికే పరిమితం కాకూడదు. విద్యార్థుల్ని ఉన్నత విలువలు గల పౌరులుగా రూపొందించే బాధ్యతనూ అవి స్వీకరించాలని ‘తైత్తిరీయోపనిషత్తు’ చెబుతోంది. అందుకు ప్రాథమికంగా పన్నెండు అంశాలు అత్యవసరమవుతాయి.
విద్యార్థికి క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అలవడాలి. సత్యసంధత కావాలి. అవసరాల్ని కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవడం, ఉద్వేగాల్ని నియంత్రించడం, మనసు ప్రశాంతంగా ఉండేలా చూడటం, లోకం నుంచి అతడు పొందినవి తిరిగి ఇవ్వడం- ఉత్తమ లక్షణాలు. దేవతలు, రుషులు, పితృదేవతలతో పాటు సకల జీవుల ప్రీత్యర్థం అతడు యాగాలు నిర్వహించాలి. అగ్ని ఆరాధనతో పాటు అతిథి సత్కారం సాగించాలి. తోటివారికి మేలు కలిగించే గుణాల్ని విద్యార్థి తనకు తానుగా వృద్ధి చేసుకోవాల్సి ఉంది. గృహస్థుగా మంచి సంతానాన్ని పొందడం ద్వారా వారిని ఉదాత్త పౌరులుగా తీర్చిదిద్దాలి. ఆ సంకల్పం అతడికి విద్యార్థి దశలోనే ఏర్పడాలి.
ఇక రెండో పార్శ్వంలో- పట్టభద్రుడైన వ్యక్తి ప్రగతి సాధకుడిగా మారాలి. దైనందిన విధానంలో నేర్చిన విద్యను జీవితానికి అనుసంధానించగలిగే నిపుణత పుణికి పుచ్చుకోవాలి. అప్పుడే కుటుంబానికి, సమాజానికి అతడు ఘనమైన వారసత్వం అందించినట్లవుతుంది.
శాస్త్రాల్లోని తత్వాల్ని జీవితంలో ఆచరణకు తేవడం విద్యార్థి విధి. అది కొరవడినప్పుడు, అతడు ఎంత నేర్చినా నిష్ప్రయోజకం! శాస్త్రాల్ని చదివినంత మాత్రాన భగవత్‌ తత్వాన్ని నిరూపించలేరు. అలా చేయాలని చూడటం- కాశీనగరాన్ని పటంలో చూసి, ఇతరులకు వర్ణించడం వంటిదని రామకృష్ణ పరమహంస అనేవారు.
వాస్తవ జీవితం సవాళ్లు విసురుతుంటుంది. విద్యార్థి చదివినదానికి, సమాజంలో ఎదురయ్యే పరిస్థితికి సంబంధం లేదనిపిస్తుంది. అంతమాత్రాన- ఉపదేశాల్ని, సందేశాల్ని ఎన్నటికీ మరవకూడదు. నేర్చుకున్న విద్య దీపం వంటిది. ఆ వెలుతురులో ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ!
- దానం శివప్రసాదరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list