MohanPublications Print Books Online store clik Here Devullu.com

నడినెత్తిన నిప్పుల వాన! వడగాడ్పులు విపత్తు కాదా?summer



నడినెత్తిన నిప్పుల వాన!
వడగాడ్పులు విపత్తు కాదా?

ప్రకృతిలో సహజసిద్ధంగా జరగాల్సిన దానికి విరుద్ధంగా ఏమి చోటుచేసుకున్నా అది వైపరీత్యమే. వానలు కురవాలి- ఎండలు కాయాలి, కానీ ఆ వానలు కుండపోతగా కురిసి వరదలు పోటెత్తితే విపత్తు. భూకంపాలతో ధరణి దద్దరిల్లితే, కొండ చరియలు విరిగి పడితే, క్షామం తలెత్తితే అది ప్రకృతి విపత్తు. కానీ ఎండలు సాధారణ స్థాయిని మించి భగభగ మండుతూ, చండ ప్రచండమై, భూగోళాన్ని నిప్పుల కొలిమిగా మార్చి తీవ్ర వడగాలులతో ప్రజల ప్రాణాలను తోడేస్తున్నా, ఏటా దాదాపు వెయ్యి మంది ప్రాణాలను బలిగొంటున్నా ప్రకృతి విపత్తుల జాబితాలో వాటిని చేర్చకపోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఎండదెబ్బలకు తాళలేక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. మండే ఎండలకు వేడిగాలులు తోడవుతున్నాయి. రోహిణికార్తెకన్నా ముందే రోళ్లు పగిలే ఎండలు కాస్తున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్యమైన మార్పుల వల్ల ఎండ తీవ్రత అధికమై ప్రజారోగ్యం దెబ్బతింటోంది. వడదెబ్బ, డీహైడ్రేషన్‌, గుండెపోటు, శ్వాసకోశ సమస్యలతో ఎంతోమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. భారత ప్రభుత్వ భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం గడచిన నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులకు 4620 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిలో 92 శాతం, అంటే 4246 మంది తెలుగు రాష్ట్రాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. భారత వాతావరణ శాఖ అభిప్రాయం ప్రకారం అధిక ఎండల తీవ్రత సుదీర్ఘకాలం (మార్చి నుంచి జూన్‌ వరకు) కొనసాగుతుండటం వల్లే పరిస్థితులు ఆందోళనకరంగా మారి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత సరళిని పరిశీలిస్తే 2016 సంవత్సరం అత్యధిక ఉష్ట సంవత్సరంగా నమోదైంది. 2017లో కూడా అసాధారణ స్థాయిలో ఎండలు కాస్తాయని భారత వాతావరణ శాఖ ముందస్తుగానే సూచించింది. వాయవ్య భారత్‌, హిమాలయాలను ఆవరించి ఉన్న మైదాన ప్రాంతాల్లో సైతం ఈ వేసవిలో ఎండల తీవ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌ అధికంగా ఉంటుందని పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ్‌బంగ, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ అసాధారణ స్థాయిలో ఎండలు కాస్తాయని భయంకరమైన వడగాలులు వీస్తాయనీ అది ముందే హెచ్చరించింది.
గతి తప్పిన రుతుపవనం
భారత వాతావరణ శాఖకు చెందిన 103 పరిశోధన కేంద్రాల నుంచి సేకరించిన దీర్ఘకాలిక సమాచారాన్ని క్షుణ్నంగా పరిశీలించినప్పుడు 1961 నుంచి 2010 మధ్యకాలంలో భూ ఉష్ణోగ్రతలు వూహించని రీతిలో పెరిగాయని స్పష్టమైంది. 2001 నుంచి 2010 మధ్యకాలంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లోనే అత్యధిక ఎండలు నమోదయ్యాయి. ఈమధ్య కాలంలోనే దేశంలో ఉష్ణోగ్రతలు 0.8 నుంచి ఒక డిగ్రీ సెల్సియస్‌ మేర పెరగడమే కాకుండా, మండే ఎండల రోజుల సంఖ్యా గణనీయంగా పెరిగిందని శాస్త్రీయంగా రుజువైంది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం- 1964లో 30 అత్యంత వేడి రోజులతో ఉష్ట పట్టణంగా నెల్లూరు నమోదైంది. 1996 నాటికి వేడిరోజుల సంఖ్య 35కు పెరిగింది. వడగాలులు వీచే రోజులు 15కు పెరిగాయి. గడచిన 50 ఏళ్లలోనే 40 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వాతావరణశాఖ సాధారణ వర్గీకరణ ప్రకారం రాజస్థాన్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, ఝార్ఖండ్‌, తెలంగాణ, తీరాంధ్ర, దక్షిణ తమిళనాడు ప్రాంతాలు తీవ్రమైన వడగాలులను ఎదుర్కొంటాయి. ఈ దుర్భర స్థితి ఏటా అనేక రోజులు కొనసాగుతుంది. మామూలుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ మించితే మైదాన ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయి. కొండలు, పర్వత సానువుల ప్రాంతాల్లోనైతే 30 డిగ్రీల సెల్సియస్‌ దాటగానే వేడి గాలులు వీస్తాయి. ఈ వేడిగాలులు తీవ్రమై ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు విశ్లేషించారు. గతంలో 2002లో, 2010లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల వల్ల రెండు వేల మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ అమెరికాలోని పసిఫిక్‌ తీరంలో సంభవించే ‘ఎల్‌ నినో’ భారత్‌లో రుతుపవన వ్యవస్థపై చూపే తీవ్ర ప్రతికూల ప్రభావమే వడగాలులకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడం ‘ఎల్‌ నినో’ ఫలితమేనని స్పష్టమవుతోంది. వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి బృందం అయిదో మదింపు నివేదిక పరిశీలనలో వెల్లడైన అంశాలూ ఇదే వాస్తవాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఐరాస వాతావరణ మార్పుల కమిటీ తాజా నివేదిక ప్రకారం 1850 నుంచి పరిశీలిస్తే - ముఖ్యంగా గడచిన మూడు దశాబ్దాలుగా కాస్తున్న ఎండలే అత్యంత తీవ్రమైనవని తేలింది. భూగోళం మీద ఉష్ణోగ్రతలు నానాటికీ తీవ్రమవుతుండటానికి ప్రధాన కారణం- వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ (బొగ్గు పులుసు వాయువు) మోతాదు దాదాపు 40 శాతానికి చేరడమే. ఫలితంగా భూ వాతావరణంలోనూ, సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరిగే ఉష్ణోగ్రతలకు తోడు హిమనీ నదాలు వేగంగా కరిగిపోతుండటం, అడవుల శాతం తరిగి పోతుండటంతో వాతావరణ చక్రంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. మానవ చర్యల మూలంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు హద్దుమీరుతున్నాయి. పర్యవసానంగానే తీవ్ర భూతాపం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు కొట్టుకుపోవడం వంటి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.

కార్యాచరణతో ముందుకు...
వడగాలులు, ఎండ తీవ్రత బాధితులను ఆదుకోవాలంటే దేశంలో వికేంద్రీకృత, బహుముఖీన ప్రతిస్పందన వ్యవస్థ అత్యవసరం. ప్రభుత్వంలోని విభిన్నమైన విభాగాలు, మంత్రిత్వశాఖలు సమన్వయంతో, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ప్రభావవంతంగా కృషిచేయాలి. నీడ, నీటి సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రజలను చైతన్యవంతం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పటిష్ట సమాచార వ్యవస్థ ద్వారా అప్రమత్తం చేయాలి. చికిత్సలపై వైద్య, నర్సింగ్‌ సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పించడం, అత్యవసర చికిత్స గదులను ఏర్పాటుచేయడం, తగినన్ని ఐస్‌ప్యాక్‌లను సరఫరా చేయడం, జనసమ్మర్థం ఉండేచోట్ల భారీ హోర్డింగ్‌లపై సూటిగా, సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రజలకు సంక్షిప్త సమాచార రూపంలో సందేశమివ్వడం, ప్రచార, ప్రసార సాధనాలైన రేడియో, టెలివిజన్‌, వార్తాపత్రికల ద్వారా ముందస్తు సూచనలు, హెచ్చరికలు జారీచేయడం వంటి చర్యలు చేపట్టాలి. వడగాలులనూ ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చినట్లయితే- బాధితులకు ఎంతో సాంత్వన చేకూరుతుంది. సంబంధిత ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థలు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. బాధితులకు సత్వరం పరిహారం అందించే వీలుంటుంది. వాస్తవ ప్రభావాన్ని అంచనా వేయడం సులువవుతుంది. రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణ శాఖ విభాగాలు మరింత సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయడానికి మార్గం సుగమం అవుతుంది. మండే ఎండలకు, వేడిగాలులకు ప్రజల ప్రాణాలు రాలిపోకుండా చూడాలంటే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లక తప్పదు. వడగాలులను ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక, ప్రభావిత రాష్ట్రాలు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది.

మండే ఎండ... ఏదీ అండ?
మధ్యకాలిక (2045-2065), దీర్ఘకాలిక (2081-2100) వ్యవధులపై ఐరాస వాతావరణ మార్పుల కమిటీ నివేదిక అంచనాలు, ముందస్తు హెచ్చరికలు దక్షిణాసియాకు, ప్రత్యేకించి భారత్‌లోని పరిస్థితులకు అద్దంపట్టేలా ఉన్నాయి. ఈ తాజా అంచనాల ప్రకారం ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయి. అదే సమయంలో దక్షిణ భారతంలో రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా హెచ్చుతాయి. పగటి ఉష్ణోగ్రతల్లో గరిష్ఠంగా 4 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల ఉంటుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాత్రుల సంఖ్య 80 వరకు ఉంటుందని కమిటీ నివేదికలో అంచనా వేశారు. అత్యంత అప్రమత్తంగా ఉండక తప్పదని దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. గడచిన వారం, పది రోజులుగా కాస్తున్న తీవ్ర ఎండలు, వేడిగాలులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ సగటున 20 మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలోని మొత్తం భూభాగంలో 60 శాతం భూకంపాల తాకిడికి గురయ్యే ప్రమాదం ఉంది. దాదాపు 12 శాతం భూభాగానికి వరద ముప్పు పొంచి ఉంది. ఎనిమిది శాతం భూభాగం తుపానులకు గురవుతోంది. ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఏటా సగటున 5000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు కోట్ల మంది ప్రతికూలంగా ప్రభావితులవుతున్నారు. వరదలు, సునామీలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, కరవు-కాటకాలు తదితర ప్రకృతి విపత్తులు సంబంధిత ప్రాంత ప్రజలతోపాటు, భూభాగాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. ప్రాణనష్టంతోపాటు ఆస్తినష్టం కూడా కలిగిస్తున్నాయి. మండే ఎండలతో వీచే వడగాలులు భూభాగానికి, ఆస్తులకు నష్టం కలిగించకపోయినా, అమూల్యమైన ప్రాణాలను బలిగొంటున్నాయి. 2012లోనూ అంతకు మునుపు వరుసగా మూడేళ్లు ఉత్తరాదిన భయంకరమైన శీతలగాలులు వందలాది మందిని బలిగొన్నాయి. దాంతో శీత గాలులనూ ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చాలని నాటి కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర విపత్తు నిధులు, సంబంధిత రాష్ట్రాల విపత్తుల నిర్వహణ నిధుల నుంచి సహాయం పొందడానికి శీతల గాలుల బాధితులకు దాంతో వీలుకలిగింది. అంతకుమించి ప్రజలను ప్రభావితం చేస్తున్న వడగాలులను విపత్తుల జాబితాలో చేర్చకపోవడం విచారకరం. 2013లో ఈ దిశగా కొంత కృషి జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి సాధించకపోవడం దురదృష్టకరం. వడగాడ్పులను ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి అప్పట్లో మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. కానీ, ఆ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఈ అంశం అటకెక్కింది. ప్రస్తుతం రోజురోజుకూ ఎండలు తీవ్రమై, వడగాడ్పులు ఉద్ధృతమవుతుండటంతో రాజకీయ పక్షాలు, ప్రజారోగ్య రంగం నిపుణులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సీనియర్‌ సభ్యులు సహా ప్రతిఒక్కరూ వడగాడ్పులనూ ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. ఉత్తరాదిన తరచూ కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలను విపత్తులుగా గుర్తిస్తున్నప్పటికీ, ఏటా వేలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న వడగాడ్పులను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణం. దీనిపై ప్రభుత్వాలు తక్షణం స్పందించాల్సి ఉంది.
- డాక్టర్‌ జి.వి.ఎల్‌.విజయ్‌కుమార్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list