MohanPublications Print Books Online store clik Here Devullu.com

కైలాసగిరి పై సాంస్కృతిక తెలుగుమ్యూజియం-Kailasagiri Museum



కైలాసగిరి పై స్కృతిక తెలుగుమ్యూజియం
భావితరాలకు కరదీపిక సాంస్కృతిక మ్యూజియం
పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మణిహారం
రాష్ట్రంలోనే ఏకైక ప్రాంగణం
రూ.12.73 కోట్ల వ్యయం
19న ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం
రోజూ మూడు ప్రదర్శనలు
రివాల్వింగ్‌ డయాస్‌తో కూర్చుని వీక్షించే సదుపాయం

విశాఖపట్నం: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరో అపురూప నిర్మాణం సిద్ధమైంది. తెలుగు జాతి చరిత్ర, సంస్కృతిని భావితరాలకు చాటిచెప్పేందుకు అద్భుతమైన మ్యూజియం ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. నాటి రాజులు, వారి కోటలు, మందిరాలు, ఆస్థాన కవులు, సంస్కృతి, రచనలు, కళాకారులు, సంప్రదాయాలు అన్నింటిని ఓ చోట చేర్చిన అద్భుత కళాఖండం ఈ మ్యూజియం. ప్రాంగణాన్ని వివిధ కళా రూపాల్లో ఆవిష్కరించారు. శిల్పాలుగా, కుడ్య చిత్రాలుగా, విగ్రహాలుగా తీర్చిదిద్దారు. ఆనాటి ప్రాకృత, సంస్కృత భాషల లిపిని, శాసనాలను కళ్ల ముందు ఆవిష్కరింపజేశారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను చిత్రాల ద్వారా విశ్లేషించారు. ఈ బృహత్‌ ప్రయత్నాన్ని ప్రపంచ తెలుగు సమాఖ్య భుజాన వేసుకోగా దానికి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) అండగా నిలిచింది. పదేళ్ల క్రితం మ్యూజియం ఆలోచనకు అంకురం పడింది. ఇప్పటికి పూర్తయిన ఈ మణిహారాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకోనుంది. మ్యూజియంకు ‘తెలుగు సాంస్కృతిక కళానికేతన’ అని నామకరణం చేశారు.

ప్రత్యేక సాంస్కృతిక మ్యూజియం 
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా ఓ తెలుగు సాంస్కృతిక మ్యూజియం ఏర్పాటు చేయాలన్న తెలుగు సమాఖ్య ఆలోచనలకు జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రాణం పోశారు. మరో రచయిత యు.వి.ఫణి సహకారం అందించారు. ప్రముఖ సినీ కళాదర్శకుడు తోట తరణి వాటికి రూపమిచ్చి ప్రాణం పోశారు. శిల్పాలు, విగ్రహాలు, కుడ్యచిత్రాలు రూపుదిద్దుకున్నాయి. వందేమాతరం శ్రీనివాస్‌ నేపథ్య సంగీతాన్ని అందించగా, ప్రముఖ నటుడు సాయికుమార్‌ గాత్రదానం చేశారు. అంతా కలిసి 49 రూపాలతో తెలుగు చరిత్రను సజీవంగా కైలాసగిరిపై ఆవిష్కరించారు.
ఎన్నో విశేషాలు
మ్యూజియం లోపలకు అడుగుపెట్టగానే తొలుత ఎడమవైపు తెలుగుతల్లి విగ్రహం కనిపిస్తుంది. అక్కడి నుంచి చరిత్ర, శిలాశాసనాలు, రాజులు, కోటలు, మందిరాలు, కవులు, సంప్రదాయాలు, ఆధునిక హంగులు.. ఇలా అన్నీ కళ్ల ముందు ఓ చిత్రంలా వృత్తాకారంలో సాక్షాత్కరిస్తాయి. శాతవాహనులు, శ్రీకృష్ణదేవరాయులు, ఆయన ఆస్థాన కవులైన అష్టదిగ్గజాలు, గౌతమ బుద్ధుడు, అన్నమాచార్య, యోగి వేమన, కాకతీయ రాణి రుద్రమదేవి, ఇలా సాగి చివరకు నాగార్జునసాగర్‌తో ముగుస్తుంది.
ప్రదర్శన ఇలా 
రోజుకు మూడు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వుడా నిర్ణయించింది. సుమారుగా 50 నిమిషాలు వుండే ఈ ప్రదర్శన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మ్యూజియం నిర్మాణాన్ని వృత్తాకారంలో చేపట్టారు. శిల్పాలను అదే క్రమంలో అమర్చారు. హాలు మధ్యలో వలయాకారంలో భారీ రివాల్వింగ్‌ డయాస్‌ ఏర్పాటు చేశారు. అందులో 94 మంది కూర్చొనే సదుపాయం వుంది. అద్భుతమైన లైటింగ్‌ స్కీమ్‌ సమకూర్చారు. ప్రదర్శన మొదలు కాగానే లైట్లన్నీ ఆరిపోతాయి. కేవలం ఒకే ఒక లైటు ఓ శిల్పంపై పడుతుంది. అపుడు దాని చరిత్ర, ప్రత్యేకతను సాయికుమార్‌ గాత్రంతో వినిపిస్తారు. దీనికి నేపథ్య సంగీతం కూడా తోడవుతుంది. అలా ఒక్కొక్క శిల్పం గురించి చెప్పుకుంటూ వెళతారు. మధ్యలో డయాస్‌ శిల్పాల వైపు నెమ్మదిగా తిరుగుతుంది. 49 విగ్రహాల చరిత్రను వీక్షించడానికి 50 నిమిషాలు పడుతుంది. డయాస్‌ ఒక్క రౌండ్‌ తిరగడానికి అంతే సమయం సెట్‌ చేశారు. ఈ ప్రదర్శన ఓ మధురానుభూతిని కలిగించేలా, తెలుగు ‘వాడి’ని సగర్వంగా చెప్పుకొనేలా, జాతి గురించి సర్వం తెలుసుకునేలా ఉంటుందని వుడా వీసీ బాబూరావునాయుడు ఉద్వేగంగా వివరించారు.
రూ.12.73 కోట్ల వ్యయం 
మొత్తం 12 కోట్ల 73 లక్షల వ్యయంతో ఈ మ్యూజియం నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. వాస్తవంగా ప్రారంభంలో దీని అంచనా వ్యయం రూ.5 కోట్లు. కైలాసగిరిపై ఐదెకరాల స్థలం, రూ.1.2 కోట్లు వుడా సమకూర్చితే మిగిలిన రూ.3.8 కోట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య సమకూర్చేలా ఒప్పందం జరిగింది. రెండున్నర ఎకరాల్లో వృత్తాకారంలో 100 అడుగు వ్యాసార్థంతో భవన నిర్మాణానికి డి జైన్‌ రూపొందించారు. మొత్తం 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించారు. ప్రాజెక్టు కాలయాపన జరగడంతో వ్యయం పెరిగిపోయింది. మొత్తం రూ.12.73 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.11 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో వుడా వాటా రూ.7.5 కోట్లు కాగా ప్రపంచ తెలుగు సమాఖ్య రూ. 5 కోట్లు వెచ్చించింది.
ఎన్‌టీఆర్‌ విగ్రహంతో నిండుదనం 
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్‌.టి.రామారావు విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేయడానికి వుడా ఏర్పాట్లు చేసింది. మ్యూజియం లోపలకు వెళ్లే ముందు హాలులో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. 19న మ్యూజియంను ప్రారంభించి ప్రజలకు అందించనున్నామని వుడా వీసీ టి.బాబూరావునాయుడు తెలిపారు. ఇది విశాఖ పర్యాటకానికి కేంద్ర బిందువు కానుందని చెప్పారు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list