MohanPublications Print Books Online store clik Here Devullu.com

నోరు మంచిదైతే_fresh_mouth



నోరు మంచిదైతే
       పొద్దున్నే బ్రష్‌ మీద పేస్ట్‌ వేసి తోమేయటం మినహా దంతాలు, చిగుళ్లు... వాటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. పళ్లు జివ్వుమంటుంటే ఆ కొద్దిసేపు బాధపడి మర్చిపోతాం. నోటి నుంచి దుర్వాసన వెలువడుతున్నా ఎదుటివాళ్లు చెప్పేదాకా తెలుసుకోలేం! ఆఖరుకి చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతున్నా...తీవ్రమైన సమస్యగా భావించం.
ఈ నోటి సమస్యలు ప్రాణాంతకమైనవి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే దంతాలను శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి చికిత్స తీసుకోవాలంటున్నారు వైద్యులు.
పయోరియా (నోటి దుర్వాసన)
నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నోటి శుభ్రత పాటించకపోవటం. ఈ సమస్యకు తోడు తగినన్ని నీళ్లు తాగక నోరు పొడిబారటం వల్ల, మధుమేహం వల్ల నోటి దుర్వాసన తప్పదు. మధుమేహులు నోటి దుర్వాసనను నిర్లక్ష్యం చేయకూడదు. దీనికి కారణమయ్యే చిగుళ్ల సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి తోడ్పడుతుంది. కాబట్టి మధుమేహులు సాధ్యమైనంత త్వరగా దంత వైద్యుల్ని కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే పని ఒత్తిడి ఉన్నా, పోషకాహారలోపం ఉన్నా, విటమిన్‌ సి లోపం తలెత్తినా, కట్టుడు పళ్ల వల్ల కూడా నోటి దుర్వాసన తలెత్తవచ్చు. ఈ కారణాల ప్రభావం ముందుగా చిగుళ్ల మీద పడుతుంది. ‘జింజివైటిస్‌’ అనే తొలి దశలో చిగుళ్లు వాచి వాటి నుంచి రక్తస్రావమవుతూ ఉంటుంది. ఈ దశను నిర్లక్ష్యం చేస్తే బ్యాక్టీరియా చిగుళ్ల లోపలికి చేరి దంతాలనూ, వాటిని పట్టి ఉంచే ఎముకనూ దెబ్బ తీస్తుంది. ఈ దశను ‘పెరియోడాంటిస్‌’ అంటారు. ఈ దశలో చిగుళ్లలో చీము కూడా చేరుతుంది. దంతాలకు, చిగుళ్లకూ మధ్య గ్యాప్‌ పెరిగి దంతాలు వదులై ఊడిపోవటం మొదలుపెడతాయి. చిగుళ్లకు సంబంధించిన ఈ సమస్యలో ప్రధానంగా కనిపించే లక్షణం...‘నోటి దుర్వాసన’. ఈ సమస్య ఉందంటే మనం తగినంత నోటి శుభ్రత పాటించట్లేదని అర్థం చేసుకోవాలి. నోటి దుర్వాసన లక్షణాలు కనిపించగానే దంత వైద్యుల్ని కలిసి సమస్య తీవ్రతను బట్టి చికిత్స తీసుకోవాలి.
చికిత్స ఇదే!
‘జింజివైటిస్‌’ అనే చిగుళ్ల వాపును ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స చేయటం సులువు. ఈ దశ దాటి ‘పెరియోడాంటి్‌స’కి చేరుకుంటే చిగుళ్ల అడుగున చేరిన ఇన్‌ఫెక్షన్‌ను ‘ఫ్లాప్‌’ లేదా అత్యాధునిక ‘లేజర్‌’ సర్జరీతో తొలగించుకోవచ్చు.
చిగుళ్ల సమస్య ‘వంశపారంపర్యం’
కొందరికి చిగుళ్ల సమస్యలు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. ఇలాంటి వారిలో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా చిగుళ్లు, దంతాలకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చి దంతాలు ఊడిపోవటానికి మిగతా వారికి పదేళ్ల కాలం పడితే, జెనెటిక్‌ అగ్రెషన్‌ ఉన్నవారికి సమస్య మొదలైన సంవత్సరంలోపే దంతాలు ఊడిపోతాయి. కాబట్టి నోటి దుర్వాసన మొదలైతే ఆలస్యం చేయకుండా దంత వైద్యుల్ని సంప్రదించి కారణాన్ని సరిదిద్దటంతో పాటు తగిన చికిత్స తీసుకోవాలి.
ముందు జాగ్రత్తలు తప్పనిసరి
నోటి దుర్వాసనకు కారణమయ్యే చిగుళ్ల వ్యాధిని అరి కట్టాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తప్పక పాటించాలి. అవేంటంటే...
బ్రష్‌ చేసుకునే విధానం తెలుసుకుని పాటించాలి.
6 నెలలకోసారి వైద్యుల చేత క్లీనింగ్‌ చేయించుకోవాలి.
దంతాల స్కేలింగ్‌, పాలిషింగ్‌ చేయించుకోవాలి.
జివ్వుమనే పళ్లు
అతి చల్లని, వేడి పదార్థాలు ఏం తిన్నా పళ్లు జివ్వుమంటుంటే దంతాల మీది ఎనామిల్‌ పోయుందని అర్థం. దంతాల మీద ఎనామిల్‌, డెంటిన్‌, పల్ప్‌ అనే మూడు పొరలుంటాయి. పల్ప్‌ అనే దంతం లోపలి పొరలో నరాలు, రక్తనాళాలు ఉంటాయి. డెంటిన్‌లో నర్వ్‌ ఎండింగ్స్‌ ఉంటాయి. ఎప్పుడైతే దంతాల పైపొర ఎనామిల్‌ తొలగిపోయి అడుగునున్న డెంటిన్‌ ఎక్స్‌పోజ్‌ అవుతుందో అప్పుడు పళ్లు జివ్వుమనటం మొదలవుతుంది. దంత క్షయం ఉన్నా పళ్లు జివ్వుమంటాయి. సెన్సిటివ్‌ టీత (దంతాలు తీపులు పుట్టడం) సాధారణంగా 20 నుంచి 50 ఏళ్ల వయస్కుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ సమస్యకు కారణాలు....
బిరుసైన బ్రష్‌తో పళ్లు తోమటం
దంతాలు విరగటం
పిప్పి పళ్లు
యాసిడ్‌ అటాక్‌ (ఎసిడిటీ వల్ల నోట్లోకి యాసిడ్‌ తన్నుకొచ్చి దంతాల పైపొరను దెబ్బతీస్తుంది)
చికిత్సలున్నాయి
సెన్సిటివ్‌ టీతకు కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దితే సమస్య అదుపులోకొస్తుంది. ఇందుకోసం ఎసిడిటీ ఉంటే దాన్ని మందులతో అదుపు చేయటం, బ్రష్‌ మార్చటం, పిప్పి పళ్లను సరిచేయటం, విరిగిన దంతాలకు క్యాప్‌ వేయటం చేస్తే పళ్లు జివ్వుమనే సమస్య తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో దంతాలు జివ్వుమనటానికి కారణమైన పంటి భాగాన్ని ఫ్లోరైడ్‌ పేస్ట్‌తో బ్లాక్‌ చేయటం ద్వారా కూడా సమస్యను సరిదిద్దవచ్చు.
నోటి పుళ్లు
నోటి పుళ్లలో రకాలుంటాయి. పై పెదవి, కింద పెదవి లోపల, బుగ్గల దగ్గర తలెత్తి ఇబ్బంది పెట్టే ఈ పుళ్లు సాధారణంగా కొన్ని రోజులు వేధించి తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఇవి తరచుగా వస్తున్నాయంటే అందుకు కారణాలను కనిపెట్టాలి. మౌత అల్సర్లకు ప్రధాన కారణాలు...
విటమిన్‌ బి12 లోపం
ఒత్తిడి
పొడిబారిన నోరు
దంతాలు పదునుగా ఉండి నోరు లోపల నొక్కుకోవటం
ఎసిడిటీ
చికిత్స సులువే!
నోటి పుళ్లకు కారణాన్ని కనిపెట్టి దానికి చికిత్స చేస్తే సరిపోతుంది. తాత్కాలిక ఉపశమనం కోసం ఆయింట్‌మెంట్ల లాంటి పై పూత మందులూ వాడొచ్చు. ఇక విటమిన్‌ లోపాన్ని సప్లిమెంట్లతో సరిదిద్దొచ్చు. పొడిబారిన నోటికి పరిష్కారం నోటిని తడిగా ఉంచటమే! ఇందుకోసం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. దంతాలు పదునుగా ఉండి నోరు లోపల నొక్కుకుంటూ ఉంటే దంత వైద్యుల సహాయంతో వాటిని నున్నగా తయారుచేయించాలి. ఈ చికిత్సలు తీసుకున్నా నోటి పుళ్లు మానకుండా ఎక్కువ రోజులు వేధిస్తూ ఉంటే క్యాన్సర్‌ మొదటి దశగా భావించాలి. నోటి క్యాన్సర్‌లో మొదట కనిపించే లక్షణం మౌత సోర్స్‌. కాబట్టి ఇలా నోటి పుళ్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
పంటి గార (ప్లేక్‌) ప్రతి నాలుగు గంటలకూ దంతాల మీద మనం తిన్న పదార్థాల తాలూకు అవశేషాలు పేరుకుపోతూ ఉంటాయి. ఇవే ప్రారంభంలో మెత్తగా ఉండి క్రమేపీ సిమెంట్‌ పొరలా గట్టిగా మారతాయి. చిగుళ్లు, దంతాల మధ్య, దంతాలు-చిగుళ్లు కలిసే ప్రదేశంలో ఏర్పడే ‘కాలిక్యులస్‌’ అనే ఈ గార గట్టిపడితే అంత తేలికగా తొలగిపోదు. ఇది చిగురును ఇరిటేట్‌ చేసి చిగుళ్లకు దంతాలకు మధ్య దూరాన్ని పెంచుతుంది. ఈ గార లేత పసుపు రంగు మొదలు గోధుమ రంగు, ముదురు ఆకుపచ్చ, నలుపు రంగుల్లోనూ తయారవుతుంది. ధూమపానం చేసేవారిలో ఈ ప్లేక్‌ ఎక్కువగా కనిపిస్తుంది.
దంతాల గారకు కారణాలివే!
దంతాలను సరిగా శుభ్రం చేసుకోలేకపోవటం
తిన్న తర్వాత నీళ్లతో నోరు పుక్కిలించకపోవటం
దంతాల పైన, మధ్య పేరుకునే వీలుండే మెత్తని పదార్థాలు ఎక్కువగా తినటం
చికిత్స
గట్టిపడిన గారను తొలగించటం దంత వైద్యులకే సాధ్యం. అలా్ట్రసౌండ్‌ స్కేలింగ్‌, లేజర్‌ ద్వారా ఈ గారను చిగుళ్లు దెబ్బతినకుండా తొలగించవచ్చు.
దంతక్షయం (డెంటల్‌ ఎరోజన్‌)
దంతాలు అరిగిపోయే సమస్య ఇది. పిహెచ్‌ బ్యాలెన్స్‌ 5.5 కంటే ఎక్కువ ఉన్న పానీయాలు, కూల్‌ డ్రింక్స్‌ తాగటం వల్ల దంతాలు క్రమంగా అరిగిపోతాయి. కొందరు మార్కెట్లో దొరికే వైటెనింగ్‌ టూతపే్‌స్టలు వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా దంతాలు అరిగిపోతాయి. ఎసిడిటీ ఉన్న వ్యక్తుల్లో అన్నవాహిక ద్వారా యాసిడ్‌ నోట్లోకి వచ్చి దంతాల పైపొరను దెబ్బతీస్తుంది. ఇలా ఎక్కువకాలం కొనసాగితే డెంటల్‌ ఎరోజన్‌ తప్పదు.
చికిత్స
ఆహారపుటలవాట్లను మార్చుకోవటం, కూల్‌డ్రింక్‌లకు దూరంగా ఉండటం, ఎసిడిటీని అదుపు చేసుకోవటం, సుగర్‌ ఫ్రీ టూత పేస్ట్‌లు వాడటం, చీజ్‌, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా డెంటల్‌ ఎరోజన్‌ను నియంత్రించవచ్చు. అలాగే ఈ సమస్య ఉన్నవారు బ్రష్‌ చేసిన ఒక గంట వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.
బ్రష్‌ చేసే విధానం
బ్రష్‌ మీద పేస్ట్‌ వేసి ఎడాపెడా రుద్దేసినంత మాత్రాన దంతాలు శుభ్రపడిపోవు. బ్రష్‌ చేయటానికీ ఓ పద్ధతి ఉంటుంది. అదేంటంటే....
దంతాలను అడ్డంగానే కాదు నిలువుగా కూడా బ్రష్‌ చేయాలి. ఇలా చేస్తేనే దంతాల మధ్య ఖాళీల్లో ఇరుక్కున్న వ్యర్థాలు తొలగిపోతాయి.
నిలువుగా రుద్దుతూనే బ్రష్‌ను గుండ్రంగా తిప్పుతూ దంతాల మీద కదిలించాలి.
లోపలి దంతాలను మూడు వైపులా బ్రష్‌ తగిలేలా రుద్దుకోవాలి.
నోట్లో మూలన ఉండే దంతాల వరకూ బ్రష్‌ వెళ్లేలా చూసుకోవాలి.
బ్రష్‌ అంచులతో దంతాల వెనక ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.
ఉపయోగించే బ్రష్‌ నోటిలోని అన్ని మూలలకూ వెళ్లి శుభ్రం చేసేందుకు వీలుగా ఉండాలి.
దంత సమస్యలు రాకుండా జాగ్రత్తలివే!
దంత సమస్యలకు పరిష్కారం దంతాల శుభ్రత పాటించటమే! ఇందుకోసం ఇలా చేయాలి.
ఉదయం లేవగానే, రాత్రి నిద్రపోయేలోపు... రోజుకి రెండుసార్లు బ్రష్‌ చేయాలి.
సుగర్‌ ఫ్రీ టూత పేస్ట్‌లనే వాడాలి.
మెత్తని పదార్థాలు తక్కువగా పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి.
దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపు తునకలను తొలగించుకొనేలా తరచుగా ‘ఫ్లాసింగ్‌’ చేస్తూ ఉండాలి. ఈ టెక్నిక్‌ గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకోవాలి.
తిన్న వెంటనే నీటితో నోరు పుక్కిలించుకోవాలి.
మెత్తని కుచ్చు ఉన్న బ్రష్‌నే వాడాలి.
ప్రతి మూడు నెలలకూ టూత బ్రష్‌ మారుస్తూ ఉండాలి.
డాక్టర్‌ సుష్మా రెడ్డి
సీనియర్‌ కన్సల్టెంట్‌ డెంటల్‌ సర్జన్‌, డెంటీస్‌ హాస్పిటల్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list