మహాశివునికి మారేడు ఎందుకిష్టం?
మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ‘శివేష్ట’ అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలాలను ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలం కలది అని అర్థం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు.
ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వపత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.
పూజలు, పురస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వపత్రం ప్రధానమైంది, శ్రేష్ఠమైంది. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565