ఆలయాలలో గంట ఎందుకు మోగిస్తారు?
మన దేవాలయాల నుంచి వచ్చే ఘంటారావాలను వినడం ఓ అద్భుతమైన అనుభవం. అల్లంత ఎత్తున ఉన్న గంటను అందుకోవడం పిల్లలకు సరదా అయితే పెద్దలకు ఓ ఆచారం. ఇంతకీ ఈ ఘంటారావం వెనుక ఏదన్నా శాస్ర్తీయత ఉందా అంటే చాలా జవాబులే లభిస్తాయి. దేవాలయంలోకి అడుగుపెట్టే సమయంలో మన మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. పైగా ఏదన్నా బాధలోనో, తీరని వ్యధతోనో ఆలయంలోకి ప్రవేశించేవారే ఎక్కువమంది. అలాంటి మనసుని ఒక్కసారిగా మేల్కొలిపి ‘వచ్చిన పని చూడు’ అని హెచ్చరిస్తుంది ఘంటానినాదం. అంటే అన్యమనస్కంగా ఉన్న మన దృష్టిని ఒక్కసారిగా దేవుని మీదకి మరలుస్తుందన్నమాట. గంటలో ఉండే కంచు, రాగి వంటి లోహాలు అన్నీ కలిసి ఓ చిత్రమైన శబ్దాన్ని కలిగిస్తాయి. చాలా సందర్భాలలో ఈ శబ్దం ఓంకార నాదాన్ని పోలి ఉంటుంది. ఆ శబ్దాన్ని వినగానే మనసంతా మనసు భక్తి భావనలతో నిండిపోతుంది.
మనం గంటను మోగించగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోదు. కొన్ని సెకన్ల పాటు దాని శబ్ద తరంగాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ తరంగాలు మన షట్చక్రాల మీదా పనిచేస్తాయని నమ్మకం. శ్రావ్యమైన ఈ ఘంటారావాలు గుడి ఉన్న ప్రతి చోటా ఆధ్మాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి. పండుగలు, పర్వదినాలలో దేవాలయాల నుంచి నిరంతరం వినిపించే ఘంటానాదాలు చుట్టుపక్కల ప్రజలలో భక్తిభావాన్ని నింపి ఉంచుతాయి. గంటను మోగించడం అంటే దేవునికి మన రాకను తెలియచేయడమే కాదు… ‘తండ్రీ! నీ శరణు కోరి, నీ ముందు నిల్చొని ఉన్నాను’ అని సవినయంగా వేడుకోవడమే!
ఇళ్లలో పూజని చేసుకునేటప్పుడు కూడా గణపతిని ప్రార్థించిన తరువాత…
అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
అంటూ గంటని మోగిస్తాము. దైవిక శక్తులను మేల్కొలుపుతూ, చుట్టూ ఉన్న దుష్టశక్తులను పారద్రోలుతూ ఘంటానాదంతో, తాను దేవతలను ఆహ్వానిస్తున్నానని దీని అర్థం. దైవిక శక్తులు అంటే మనలోని ధార్మిక భావనలు అని పెద్దల అంతరార్థం కావచ్చు. పైగా, అలికిడి ఉన్న ప్రదేశాలలో ఎలాంటి పురుగూ పుట్రా తిరగడానికి ఇష్టపడవు. మన దేవాలయాలన్నీ ఒకప్పుడు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండేవి. ఇప్పటికీ చాలా గుళ్లలోని గర్భాలయాలు చీకటిగా ఉంటాయి. రోజులో ఎప్పుడో ఒకప్పుడు ఘంటానాదం వినిపిస్తూ ఉండటం వల్ల, విషకీటకాలు ఆయా ప్రాదేశాలకి దూరంగా ఉంటాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565