MohanPublications Print Books Online store clik Here Devullu.com

, వేసవికాలం, ఐస్‌క్రీములు, ఇంట్లో తయారీ_Summer, Ice creams, Home made






వేసవికాలం
ఐస్‌క్రీములు
ఇంట్లో తయారీ


రకరకాల ఐస్‌క్రీమ్‌లు ఇంట్లోనే చేయండి...
ఇంటిల్లిపాదీ ఎంజాయ్‌ చేయండి...
మండుటెండలు నెత్తి మాడ్చేస్తున్నాయి.
మండుటెండలు మనుషులను ఠారెత్తించేస్తున్నాయి.
మండుటెండలు ముచ్చెమటలు పట్టించేస్తున్నాయి.
మండుటెండలు ఒంట్లోని శక్తినంతా ఆవిరి చేసేస్తున్నాయి.
మండుటెండలు నీరసం తెప్పిస్తున్నాయి.
మండుటెండలు నిస్సత్తువలో ముంచేస్తున్నాయి.
మండుటెండలు వేసవిని చూసి భయపడతారా..?
నో...నెవర్‌..
ఠండా ఠండా ఐస్‌క్రీములను హ్యాపీగా ఎంజాయ్‌ చేయండి.
కూల్‌ కూల్‌గా, డోంట్‌కేర్‌గా వేసవిని చప్పరించేయండి.


కొబ్బరి ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : గుడ్లు – 2, పాలు – 5 కప్పులు, చక్కెర – 1 కప్పు, బేకింగ్‌ సోడా – ఒక టేబుల్‌ స్పూన్, బటర్‌ – పావు కప్పు (కరిగించి), కొబ్బరి పాలు –1 కప్పు, కొబ్బరి తురుము – 3 లేదా 4 టేబుల్‌ స్పూన్స్, వెనీలా – 2 చుక్కలు (అభిరుచిని బట్టి)
తయారీ : ముందుగా ఒక పాన్‌ తీసుకుని అందులో నాలుగు కప్పుల పాలు, చక్కెర కలుపుకుని గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి(సుమారు రెండు కప్పులు అయ్యేలా). లేత పసుపు రంగులోకి వచ్చిన పాల్లో బేకింగ్‌ సోడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బటర్‌ను కరిగించుకుని మిగిలిన పాలల్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో గుడ్లు, ముందుగా కలుపుకుని పక్కనపెట్టుకున్న రెండు మిశ్రమాలను పోసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో వెనీలా ఫ్లేవర్‌ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్‌ను యాడ్‌ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కోకోనట్‌ ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.
https://www.youtube.com/watch?v=vMsh179dLe4

అరటి పండ్ల ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి :  అరటిపళ్లు – 3 లేదా 4, తేనె – 1 కప్పు, పాలు – అర కప్పు
తయారీ : ముందుగా అరటి పళ్లను గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక 10 లేదా 15 నిమిషాలు పాటు మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టుకోవాలి. తరువాత ఆ అరటి ముక్కలను ఒక మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో తేనె, పాలు కలిపి మరో సారి మిక్సీ పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే బనానా ఐస్‌క్రీమ్‌ రెడీ. చల్లబడ్డాక ఈ ఐస్‌క్రీమ్‌ను లొట్టలేసుకుంటూ లాగించెయ్యొచ్చు.

మామిడి ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి :  మామిడి పళ్లు – 2 లేదా 3, పాలు – 3 కప్పులు, చక్కెర – అర కప్పు, బేకింగ్‌ సోడా – అర టేబుల్‌ స్పూన్, తేనె – 1 టేబుల్‌ స్పూన్, పిస్తా – పావు కప్పు
తయారీ : ముందుగా మామిడి ముక్కలు పిస్తా కలిపి జ్యూస్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌ తీసుకుని పాలలో చక్కెర వేసి గరిటెతో తిప్పుతూ మరిగించాలి. పాలు బాగా చిక్కగా (గ్లాస్‌ పాలు అయ్యేదాకా) మరిగించి, అందులో బేకింగ్‌ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాంగో–పిస్తా జ్యూస్, పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని డీప్‌ కూల్‌ చేసుకుంటే మామిడి ఐస్‌ క్రీమ్‌ రెడీ అవుతుంది. సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత చీజ్‌ తురుముతో గార్నిష్‌ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.


ఆపిల్‌ ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : ఆపిల్‌ – 2, పాలు – 5 కప్పులు, పంచదార – అర కప్పు, వెనీలా – 1 టేబుల్‌ స్పూన్‌
తయారీ : ముందుగా నాలుగున్నర కప్పులు పాలను బాగా మరిగించి ఒక కప్పు కంటే తక్కువగా చేసుకోవాలి. తరువాత పైన పేరుకున్న మీగడను తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పాలను డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అది గడ్డ కట్టిన తరువాత ముందుగా తీసి పక్కన పెట్టిన మీగడను జోడించి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆపిల్‌ ముక్కలు, మిగిలిన అర కప్పు పాలు, పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో వెనీలా వేసుకుని బాగా కలుపుకుని ఒక పాత్రలో తీసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఆపిల్‌ ఐస్‌ క్రీమ్‌ రెడీ అయిపోతుంది. చివరగా ఆపిల్‌ ముక్కలు చాక్లెట్‌ పౌడర్లతో మీకు నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకోవచ్చు.


దానిమ్మ ఐస్‌క్రీమ్‌
పంచదార – అర కప్పు, నీరు – ముప్పావు కప్పు, దానిమ్మ జ్యూస్‌ – 3 కప్పులు,
నిమ్మకాయ – 1
తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటిని 10 నిమిషాలు వేడి చేసుకుని అందులో పంచదార కలుపుకుని బాగా కరగనివ్వాలి. తరువాత దానిమ్మ జ్యూస్‌లో ఈ పంచదార నీళ్లను యాడ్‌ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఐస్‌ క్రీమ్‌ మెషిన్‌లో లేదా డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నోరూరించే దానిమ్మ ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.


సపోటా ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : సపోటాలు – 5 లేదా 6, పాలు – అర కప్పు, తేనె – 1 టేబుల్‌ స్పూన్,
పంచదార పొడి – అర కప్పు, గ్లూకోజ్‌ – పావు కప్పు
తయారీ : ముందుగా సపోటా ముక్కలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌ చేసుకోవాలి. తరువాత అందులో పాలు, పంచదార వేసుకుని  మరో సారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో తేనె, గ్లూకోజ్‌ యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ టేస్టీ సపోటా ఐస్‌క్రీమ్‌ సిద్ధమైపోతుంది.


ద్రాక్ష ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి :
ద్రాక్షపళ్లు – అర కిలో, నిమ్మకాయ – 1, పంచదార పొడి – ఒక కప్పు, పాలు – 1 కప్పు, గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే)
తయారీ : ముందుగా ద్రాక్షపళ్లను జ్యూస్‌ చేసుకుని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌లో నిమ్మరసం, గుడ్డు కలుపుకుని ఒక 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌ తీసుకుని అందులో పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. తరువాత జ్యూస్‌ ఫ్రిజ్‌లోంచి బయటికి తీసి అందులో ఈ పాల మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన ద్రాక్ష ఐస్‌క్రీమ్‌ మిమ్మల్ని చల్లబరుస్తుందిత.


అనాస ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి :
అనాస ముక్కలు – ఒక కప్పున్నర, పాలు – 3 కప్పులు, చక్కెర – అర కప్పు
బేకింగ్‌ సోడా – అర టేబుల్‌ స్పూన్, తేనె – ఒక టేబుల్‌ స్పూన్, గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే)
తయారీ : ముందుగా ఒక పాన్‌ తీసుకుని పాలు, చక్కెర వేసుకుని బాగా  (ఇంచుమించు ఒక కప్పు వాటర్‌ అయ్యేంత వరకు) మరిగించుకోవాలి. అందులో చివరిగా బేకింగ్‌ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అనాస ముక్కలను జ్యూస్‌ చేసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో జ్యూస్, గుడ్డులతో పాటు పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకుని డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.

బొప్పాయి ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి :
బొప్పాయి – 1 (మీడియం సైజ్‌), పంచదార పొడి – ఒక కప్పు, క్రీమ్‌ – 1 1/2 కప్పు (మార్కెట్‌లో దొరుకుతుంది), వెనీలా – 2 చుక్కలు
తయారీ : ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో క్రీమ్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్‌ మిక్సర్‌తో మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బొప్పాయి ముక్కలను జ్యూస్‌ చేసుకుని అందులో వెనీలా చుక్కలతో పాటు.. క్రీమ్‌ మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పొప్పాయ ఐస్‌క్రీమ్‌ తయారైపోతుంది.

నిమ్మ ఐస్‌ క్రీమ్‌
కావాల్సినవి : గుడ్లు – 4, పాలు – 2 కప్పులు, పాల పౌడర్‌ – అర కప్పు, పంచదార – 1 1/2 కప్పులు, నిమ్మకాయ – 1 (రసంతో పాటు తొక్క కూడా యూజ్‌ అవుతుంది)
తయారీ : ముందుగా నిమ్మకాయపైన ఉండే పసుపు లేయర్‌ను కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. (పసుపు లేయర్‌కు అడుగున ఉండే తెల్ల లేయర్‌ను పూర్తిగా తొలగించాలి లేదంటే చేదు వస్తుంది) తరువాత పాలు వేడి చేసుకుని అందులో పసుపు లేయర్స్‌ను కలుపుకోవాలి. తరువాత అందులో పంచదార కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో పాల పౌడర్, గుడ్లు బాగా కలుపుకుని అందులో పాలు మిశ్రమాన్ని యాడ్‌ చేసుకోవాలి. తరువాత లెమెన్‌ తొక్కలను వడగట్టుకొని అందులో నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన లెమెన్‌ ఐస్‌క్రీమ్‌ రెడీ అయిపోతుంది.
ఖర్జూరం ఐస్‌ క్రీమ్‌
కావాల్సినవి : పంచదార – అర కప్పు, నీరు – 1 కప్పు, ఖర్జూరం – 10 లేదా 15 (గింజలు తీసినవి), పాలు –2 కప్పులు, గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే), వెనీలా – 2 చుక్కలు
తయారీ : ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార, నీరు వేసుకుని... పంచదార కరిగేదాకా మరిగించాలి. తరువాత అందులో ఖర్జూరం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో (మరీ మెత్తగా కాకుండా) మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని అందులో పాలు, గుడ్లు యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్‌లో యాడ్‌ చేసుకుని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లో కానీ డీప్‌ ఫ్రిజ్‌లో కానీ పెట్టుకుంటే నోరూరించే ఖర్జూరం ఐస్‌క్రీమ్‌ తయారుచేసుకోవచ్చు.

పుచ్చకాయ ఐస్‌ క్రీమ్‌
కావాల్సినవి : పుచ్చకాయ – 3 కప్పులు, తేనె – 1 టేబుల్‌ స్పూన్, పాలు – అర కప్పు, నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్స్, చాక్లెట్‌ ఫ్లేక్స్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
తయారీ : పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌ చేసుకోవాలి. అందులో తేనె, పాలు కలిపి మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి జ్యూస్‌ తీసుకుని అందులో నిమ్మరసం వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ బౌల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో కాసేపు ఉంచతే టేస్టీ పుచ్చకాయ ఐస్‌క్రీమ్‌ రెడీ. చాక్లెట్‌ ఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేసుకోవచ్చు.
బాదం కుల్ఫీ
పాలు – 4 కప్పులు, యాలకుల పొడి – 1 టేబుల్‌ స్పూన్, పంచదార – పావు కప్పు, మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్, బాదంపప్పులు – 10 లేదా 15
బ్రెడ్‌ – 1 (చివర్లు తొలగించి ముక్కలు చేసుకోవాలి)
తయారీ : ముందుగా బ్రెడ్‌ ముక్కలు, అరకప్పు పాలు, మొక్కజొన్న పిండి కలుపుకుని మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బాదం పప్పులను ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని అందులో మిగిలిన మూడున్నర కప్పులు పాలను మరిగించి కప్పున్నర పాలుగా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ పేస్ట్‌ను అందులో యాడ్‌ చేసుకుని (అడుగంటకుండా) గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం చిక్కపడిన తరువాత పంచదార వేసుకుని దగ్గర పడేదాకా గరిటెతో తిప్పాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి అందులో బాదం ముక్కలు, యాలకుల పొడి కలుపుకుని బాగా చల్లారనివ్వాలి. తరువాత కుల్ఫీ కప్స్‌లోకి లేదా మీకు నచ్చే ఆకారంలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక పుల్ల వేసుకుని డీప్‌ ఫ్రిజ్‌లోకి పెట్టుకుంటే సరిపోతుంది.


బీట్‌రూట్‌ ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : బీట్‌రూట్‌ – 4, నీరు – మరిగించుకోవడానికి సరిపడా, పాలు – 3 కప్పులు, పంచదార – 1 కప్పు, తేనె – పావు కప్పు, గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే)
 తయారీ : ముందుగా బీట్‌రూట్‌ను ఒక కుక్కర్‌లో వాటర్‌ వేసుకుని బాగా బాయిల్‌ చేసుకోవాలి. తరువాత ఒక పాన్‌ తీసుకుని రెండున్నర కప్పుల పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించుకోవాలి. మిగిలిన ఒక కప్పు పాలలో పచ్చసొన వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన బీట్‌ రూట్‌ను ముక్కలు చేసుకుని జ్యూస్‌ చేసుకుని, అందులో పచ్చసొన, పాల మిశ్రమాన్ని వేసుకుని మరోసారి మిక్సీ చేసుకోవాలి. తరువాత పాలు పంచదార మిశ్రమంలో ఈ జ్యూస్‌ను వేసి డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే టేస్టీ బీట్‌ రూట్‌ ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.


క్యారెట్‌ ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : పాలు – 1 కప్పు, పాల పొడి – 1 కప్పు, పంచదార పొడి – అరకప్పు, తేనె – అరకప్పు, క్యారెట్‌ – 2 (మీడియం సైజ్‌ ), కిస్మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్స్, చెర్రీ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌
తయారీ : ముందుగా క్యారెట్స్‌ను గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకుని బాయిల్‌ చేసుకోవాలి. తరువాత పాలు, పంచదార పొడి కలుపుకుని వేడి చేసుకోవాలి. తరువాత అందులో పాలపొడి, తేనె కలుపుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్‌ ముక్కలు, కిస్మిస్‌ యాడ్‌ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో పాల మిశ్రమంతో పాటు చెర్రి ముక్కలను యాడ్‌ చేసుకుని మరోసారి మిక్సీ చేసుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ బౌల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సూపర్‌ టేస్టీ క్యారెట్‌ ఐస్‌క్రీమ్‌ మీ నోటిని తీపిచేస్తుంది.

టమాటా ఐస్‌ క్రీమ్‌
కావాల్సినవి : టమాటా – 3, పంచదార పొడి – 1 కప్పు, తేనె – 4 టేబుల్‌ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, అల్లం పేస్ట్‌ – పావు టేబుల్‌ స్పూన్, పాలపొడి – 3 టేబుల్‌ స్పూన్స్, బటర్‌ – పావు కప్పు, నీరు – మరిగించడానికి సరిపడా, చెర్రీస్‌ – 5 లేదా 6 (గింజలు తొలగించి)
తయారీ : ముందుగా టమాటాలను 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. తరువాత టమాటా, బటర్, అల్లం పేస్ట్, చెర్రీస్‌ కలిపి మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పంచదార పొడి, తేనె, పాలపొడితో పాటు ఉప్పు యాడ్‌ చేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్‌ను డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సూపర్‌ టేస్ట్‌ సొంతమవుతుంది.

మొక్కజొన్న ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : లేత మొక్కజొన్న పొత్తులు – 2 (మీడియం సైజ్‌), పాలు –ఒకటిన్నర కప్పులు, పంచదార – 2 కప్పు, పాలపొడి – అర కప్పు, గుడ్లు – 2, ఉప్పు – చిటికెడు
తయారీ : ముందుగా మొక్కజొన్న పొత్తుల గింజలను వలుచుకుని ఒక పాన్‌లో వేసుకోవాలి. అందులో పాలు, పంచదార వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మొక్కజొన్న గింజలు బాగా మెత్తగా అయిన తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత గుడ్లు, పాలపొడి బాగా కలుపుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకుని మొక్కజొన్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన మొక్కజొన్న (కార్న్‌) ఐస్‌క్రీమ్‌ మీ సొంతమవుతుంది.


చిలగడ దుంప ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : చిలగడ దుంపలు – 3, అరటిపండు – 1, పాలు – 1 కప్పు, పంచదార – అర కప్పు, తేనె – 3 టేబుల్‌ స్పూన్స్, వెనీలా – 2 చుక్కలు
తయారీ : ముందుగా చిలగడ దుంపలను శుభ్రం చేసుకుని కుక్కర్‌లో పెట్టుకుని మెత్తగా ఉండికించుకోవాలి. తరువాత దుంపల తొక్క ఒలిచి, అరటిపండు జోడించి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌ తీసుకుని పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా తేనె, వెనీలా వేసుకుని బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే స్వీట్‌ స్వీట్‌ ఐస్‌క్రీమ్‌ రెడీ అయిపోతుంది. వాల్‌నట్స్‌తో కలిపి దీనిని సర్వ్‌ చేసుకుంటే మరింత టేస్ట్‌ వస్తుంది.

చెర్రీ ఐస్‌ట్యూబ్‌
కావాల్సినవి : చెర్రీస్‌ – ఒకటిన్నర కప్పు, తేనె – పావు కప్పు, పంచదార పొడి– అర కప్పు, పాలు – 1 కప్పు
తయారీ : ముందుగా చెర్రీస్‌ గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని పాలు, చెర్రీస్, పంచదార వేసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా దగ్గరకు అయిన తరువాత స్టవ్‌ మీద నుంచి దించేసుకుని మిక్సీ చేసుకోవాలి. తరువాత తేనె యాడ్‌ చేసుకుని బాగా కలిపి ఐస్‌ ట్యూబ్‌ల్లో వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చెర్రీ ఐస్‌ ట్యూబ్‌ రెడీ అవుతుంది.

తాటి ముంజల ఐస్‌క్రీమ్‌
కావాల్సినవి : తాటి ముంజలు – 2, పంచదార – 1 కప్పు, పాలు – 2 కప్పులు, గుడ్డు – 1 (పచ్చసొన), కిస్మిస్‌ – అర కప్పు
తయారీ : ముందుగా తాటి ముంజల తొక్క తీసేసి శుభ్రం చేసుకోవాలి. వాటిని ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌ తీసుకుని పాలు, పంచదార వేసుకుని  (సుమారు ఒక కప్పు పాలు అయ్యేదాకా) మరిగించాలి. తరువాత అందులో గుడ్డు కలుపుకుని బాగా తిప్పాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ముంజలు, కిస్మిస్‌లతో పాటు పాల మిశ్రమాన్ని యాడ్‌ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. చివరిగా మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని డీప్‌ ప్రిజ్‌లో పెట్టుకుంటే చల్లచల్లని తాటి ముంజల ఐస్‌క్రీమ్‌ రెడీ అయిపోతుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list