MohanPublications Print Books Online store clik Here Devullu.com

వేసవికాలం..సమ్మర్ హాలీడేస్.._Summer Holidays In India

వేసవి విహారం


 ఫొటో కర్టెసీ :రామ్ నగేష్,హెచ్‌డీపీసీ వ్యవస్థాపకుడు
వేసవికాలం... సమ్మర్ హాలీడేస్.. ఎప్పుడు సెలవులొచ్చినా అమ్మమ్మ..నాన్నమ్మల ఇంటికేనా.. ఈసారి కొత్తగా ఆలోచిద్దాం. అమ్మమ్మ, నానమ్మలే కాదు. అందరం కలసి ఓ టూరేద్దాం. కుంతాల జలపాతం మొదలు కులుమనాలి దాకా..అనంతగిరి కొండల నుంచి కాశ్మీరు హిమశిఖరాల దాకా వెళ్ల్లొద్దాం. మండే ఎండల నుంచి సేద తీరుతూ, కాంక్రీట్ జంగిల్‌ను వదిలి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ రెక్కల గుర్రాలనెక్కేద్దాం. నయాగరా జలపాతాలను తలపించే తెలంగాణ వాటర్ ఫాల్స్ కింద తడిసి ముద్దవుదాం. అమెజాన్ అడవులను మరిపించే ఇక్కడి అభయారణ్యపు చెట్లనీడన సేదదీరుదాం..


ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి పర్యాటక ప్రాంతాలే. వేసవి విడిది అంటే ఎక్కడో దూరాన ఉన్న ఊటీ, కొడైకెనాల్, గోవాలే అనుకోవడం సహజం. కానీ అంతకు మించి.. ప్రకృతి అందాలు.. పరవశింపజేసే జలపాతాలు ఎన్నో మన రాష్ట్రం లోనూ ఉన్నాయి. అందుకే ఈ వేసవిని మన చుట్టూ ఉన్న ప్రకృతికి అంకితం చేద్దామా? అలాగని ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని కాదు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు ఆర్థిక వెసులుబాటును బట్టి తెలంగాణ మట్టి పరిమళాలను ఆస్వాదిస్తూ కాశ్మీరు హిమగిరులనూ తాకేద్దాం. 
Kolleru

యాదాద్రినెక్కి...నర్సన్నకు మొక్కి..

బౌద్దమతం పరిఢవిల్లిన నేల..నరసింహుడు నడయాడిన నేల నల్లగొండ ప్రాంతం. భువనగిరి, యాదాద్రి జిల్లాల పరిధిలో పురాతన దేవాలయాలు, బౌద్ధారామాలు పర్యాటకులను మంత్రముగ్ధ్దుల్ని చేస్తాయి. నాగార్జునసాగర్ ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత ఆనకట్ట. వేసవికాలంలో సాగర్‌లో బోటింగ్ ఎంతో అకర్షణీయంగా ఉంటుంది. సాగర్ నుంచి శ్రీశైలం వరకు విస్తరించిన రిజర్వు ఫారెస్టు, జలాశయం మధ్యలో ఉన్న ద్వీపంపై మ్యూజియం చూడవచ్చు. ఇక్కడి మరో ఆకర్షణ చంద్రవంక జలపాతం. ఎత్తిపోతలకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలోని పచ్చని కొండలపై 213 మీటర్ల ఎత్తు నుంచి దూకే నీటి ప్రవాహాన్ని చూడడానికి రెండు కండ్లు సరిపోవు.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ 153 కి.మీ దూరంలో ఉంది. ఇక యాదాద్రికి జూబ్లీ, ఎంజీబీఎస్ బస్టాండ్ల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్ సౌకర్యం ఉంది.
YADADRI-TEMPLE

హైదరాబాద్ చూడరా బాబు..

వీటన్నింటితో పాటు చరిత్ర చెక్కిన మహానగరం మన హైదరాబాద్. భాగ్యనగరంలో ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలు. పురాతన, ఆధునిక, యాంత్రిక అద్భుతాలకు హైదరాబాద్ నెలవు. కుతుబ్‌షాలు, అసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలెన్నో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ మహానగరంలో చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా, ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లతో పాటు అడుగడుగునా ఓ ఉద్యానవనం కనిపిస్తాయి. లుంబినీ పార్కు, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్, స్టేట్ మ్యూజియం, జీఎస్‌ఐ, నెహ్రూ జూపార్కు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
charminar

ఎలా వెళ్లాలి?

దేశం నలుమూలల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సు సౌకర్యం ఉంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఎంత చూసినా తనివి తీరని కాకతీయుల సంపద


తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు తవ్వించి బంగారు పంటలు పండేలా కృషి చేసిన పాలకులు కాకతీయులు. కాకతీయుల రాజధానిగా రెండు శతాబ్దాల పాటు వెలుగొంది వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న జిల్లా ఇది. ప్రకృతి రమణీయతకు, చారిత్రక కట్టడాలకు, అపురూప శిల్ప సంపదకు నెలవు. ఇక్కడి కాకతీయ కళాతోరణం నేటి ప్రభుత్వ ముద్రలో భాగమైంది. రామప్ప దేవాలయం.. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం, రుద్రసముద్రం, ఉదయ సముద్రం, సమ్మక్క సారక్క తదితర పర్యాటక ప్రాంతాలను జిల్లాలో సందర్శించవచ్చు. జిల్లాల విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ప్రొ. జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయం. ఇక్కడే త్రివేణి సంగమం ఉన్నాయి.

ఎలా వెళ్లాలి? :

హైదరాబాద్ నుంచి వరంగల్ 145 కి.మీ దూరంలో ఉంది. ఇమ్లిబన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ల ప్రత్యేక బస్సులు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, వరంగల్‌లకు రైలు సౌకర్యం ఉంది. వరంగల్ నుంచి ఆయా ప్రాంతాలకు బస్సు ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
kakathiya

మోగే చర్చి గంటలు

ఆసియాలోనే అతి పెద్ద చర్చి మెదక్ పట్టణంలో వాటికన్ తరువాత ప్రపంచంలోనే పెద్ద చర్చి ఇది. తెల్లని గ్రానైట్‌తో నిర్మితమైన గోపురాలు ప్రత్యేక ఆకర్షణ. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాలలో ఎన్నో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అటవీ సంపద, నదీ జలాలు కనువిందు చేస్తున్నాయి. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన మెదక్‌కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి ప్రతీక. మంజీర నది ఒడ్డున ఏడుపాయల కనకదుర్గ దేవాలయం ఉంది. కొండాపూర్‌లోని పురావస్తు సంగ్రహాలయంలో బౌద్ధ నిర్మాణాలు, శాతవాహనుల కాలం నాటి అవశేషాలు ఎన్నో దర్శనమిస్తాయి. మెదక్‌కు15 కిలోమీటర్ల దూరంలోని పోచారం అభయారణ్యం, విశాలమైన చెరువు, సింగూరు డ్యాం సందర్శించవచ్చు.

ఎలావెళ్లాలి?

మైదరాబాద్ నుంచి మెదక్ 101 కి.మీ. దూరంలో ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే బస్సులుకూడా సిద్దిపేట మీదుగా వెళతాయి. అనేక ప్రైవేటు వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
medak-church

ఆదీవాసీల నెలవు...

తెలంగాణ కాశ్మీరంగా పేరు గాంచింది ఆదిలాబాద్ జిల్లా. కొమురం భీం, నిర్మల్ తదితర జిల్లాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఒకవైపు ఆదివాసీ సంస్కృతి, మరోవైపు ఆధునిక అలవాట్లతో భిన్న సంస్కృతులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతాన్ని మొఘలాయిలు, మౌర్యులు, చాళుక్యులు, శాతవాహనులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. నిర్మల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో బాసర పుణ్యక్షేత్రముంది. ఇంకా కుంతాల జలపాతం ప్రకృతి చెక్కిన మరో పర్యాటకం. నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే దారిలో నేరడికొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. గాయత్రి జలపాతం కూడా ఇక్కడే ఉంది. పొచ్చెర జలపాతం బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి 6.కిమీ దూరంలో నిర్మల్‌కు 37 కి.మీ, ఆదిలాబాద్‌కు 47 కి.మీ. దూరంలో ఉంది. అదిలాబాద్ అభయారణ్యం మరో పర్యాటక ప్రాంతం. బుగ్గ, కడెం ప్రాజెక్టు, నిర్మల్ బొమ్మల తయారీ ఇలా పలు ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఎలావెళ్లాలి?

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ 305 కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్. మంచిర్యాలకు బస్సు సౌకర్యం ఉంది. నాంపల్లి, సికింద్రాబాద్‌ల నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది.
KuntalaFalls

అనంతగిరి కొండలు

సహజ సౌందర్యాల నడుమ ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేసే అనంతగిరి కొండలు వికారబాద్‌కు దగ్గర్లో ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి కేవలం 100 కి.మీ. దూరంలోనే ప్రకృతి అందాలతో మనల్ని మంత్రముగ్ధ్దుల్ని చేసే అనంతగిరి హిల్స్ ఉన్నాయి. వికారాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం మూసీనదికి జన్మస్థానం. అటవీప్రాంతం కావడం వల్ల చుట్టూ పచ్చటి కొండలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి. ఏడాది పొడవునా ఈ ప్రాంతం పర్యాటకులను ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన పరిసరాలతో ఆకట్టుకుంటుంది.
సాయంత్రం 4-5 గంటల సమయంలో సూర్యాస్తమయ సమయాన సూర్యుని బంగారు కిరణాలు పచ్చని ప్రకృతితో కలిసి అద్భుత దృశ్యంగా పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది.
కేవలం పర్యాటక ప్రాంతాంగానే కాకుండా ట్రెక్కింగ్‌కు కూడా ఇది అనువైన ప్రాంతం. అనంతగిరిలో ఎన్నో ట్రెక్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. రెండు ట్రైల్స్ ముఖ్యమైనవి.ఇంకా ఇక్కడ రాక్ ైక్లెంబింగ్, బర్మా బ్రిడ్జి, స్ర్పైడర్స్ వెబ్, టార్జాన్ స్వింగ్ యాక్టివిటీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఎలా వెళ్లాలి?

అనంతగిరికి రోడ్డు మార్గమే అనువైంది సొంత వాహనం లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల ద్వారా చేరుకోవడం ఇంకా సులభంగా ఉంటుంది. బస్సు సౌకర్యం అందుబాటులో ఉండదు. ఇక తినడానికి అవసరమైన ఆహారాన్ని వీలయినంత వరకు ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లడం ఉత్తమం. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించవచ్చు.
ananthagiri

ప్రకృతి చెక్కిన పాలమూరు

అటు అటవీప్రాంతం ఇటు రెండు జీవనదులు ప్రవహిస్తున్న నేల పాలమూరు. జిల్లాలో విశాల నల్లమల అటవీ ప్రాంతం ఉంది. ఇటు కృష్ణా నది, అటు నల్లమల నడుమ కొల్లాపూర్ సంస్థానం ఉంది. ఇక్కడ జోగులాంబ వంటి అనేక చారిత్రక దేవాలయాలు, చెరువులు కనిపిస్తాయి. కృష్ణ, తుంగభద్ర నదులు పాలమూరు నుంచి ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల మధ్యలో గద్వాల సంస్థానం. 17వ శతాబ్దంలో నిర్మించిన గద్వాల కోట ఎన్నో చారిత్రక విశేషాలను చెబుతుంది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండలంలో ఉంది. నగరం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో గల ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రకృతి అందాలు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో గల పిల్లలమర్రికి 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మహావృక్షం దాదాపు 5 ఎకరాలలో విస్తరించి ఉంది. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని మల్లెల తీర్థం ఎంతో రమణీయ ప్రాంతం. ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో గుండాల జలపాతం ఉంది. ఇక్కడ ఎత్తైన బండరాళ్లపై నుంచి కృష్ణనది ప్రవహించడం వల్ల జలపాతం ఏర్పడింది.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి పాలమూరు జిల్లా కేంద్రం 103 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి అయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
Palamuru

శిలా సంపదకు నిలయం

3 వేల ఏళ్లనాటి మానవ ఆనవాళ్లు కలిగిన ప్రాంతంగా నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలు గుర్తింపు పొందాయి. అద్భుత శిలా సంపదకు ఈ ప్రాంతం నెలవు. కాకతీయులు, చాళుక్యుల కా లం నాటి చారిత్రక కట్టడాలు, అటవీ సంపద ఈ జిల్లాల ప్రత్యేకత. అందమైన శిలలు, ఉద్యానవనాలతో అశోక్ సాగర్ అలరిస్తుంది. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో లింబాద్రి గుట్ట ముఖ్యమైంది. సారంగపూర్ హనుమాన్ దేవాలయం, కంఠేశ్వర్ నీలకంఠుడు, బడాపహాడ్, డిచ్‌పల్లి రామాలయం జిల్లా చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. దోమకొండ కోట, సిర్నాపల్లి, కౌలాస్ కోటలు ప్రసిద్ది చెందాయి. సిర్నాపల్లిలో సిర్నాపల్లి జలపాతం ఉంది. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, పోచారం, ఆలీసాగర్ ముఖ్యమైన ప్రాజెక్టులు.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి నిజామాబాద్ 176 కి.మీ. దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి కొత్త జిల్లాలకు ఇతర పర్యాటక స్థలాలకు బస్సు సౌకర్యం ఉంది.
Sriramsagar

రాములోరి భద్రాద్రి

ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రాంతం భద్రాచలం. దేశంలోనే సుప్రసిద్ధ రామాలయం ఇది. గోదావరి నదీ ఒడ్డున గల ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఏటా లక్షలాది మంది వస్తుంటారు. భద్రాచలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో గల పర్ణశాలలో రామాయణ కాలం నాటి చారిత్రక ఆధారాలు చూడవచ్చు. కిన్నెర సాని అభయారణ్యం, పాపికొండలు ప్రత్యేకమైనవి.
భద్రాచలం దగ్గర పేరంటాల పల్లినుంచి పాపి కొండలకు లాంచీలో దాదాపు 12 గంటలు పచ్చని అడవి మధ్యలోంచి నదీ ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి. జిల్లాలో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం నేలకొండపల్లి బౌద్ధస్థూపం. ఖమ్మం పట్టణానికి 21 కిలో మీటర్ల దూరంలో గల ఈ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపాలు దర్శనమిస్తాయి. ఖమ్మం పట్టణ నడిబొడ్డున గల ఖిల్లా ప్రత్యేకమైన నిర్మాణ కౌశలంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఈ జిల్లా ప్రత్యేకత. జిల్లాలోని వాజేడు మండలంలో బోగత జలపాతం ఉంది. కొండ కోనల నుంచి జాలువారే నీటిపొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది.

ఎలావెళ్లాలి?

హైదరాబాద్ నుంచి భద్రాద్రి 311 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అనేక ప్రైవేటు వాహనాలు 24 గంటలూ ఉంటాయి. భద్రాచలం రోడు వరకు రైలు సౌకర్యం కూడా ఉంది.
badarchalam

చారిత్రక సంపద

ఉత్తర తెలంగాణలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లాలు వెలుగొందుతున్నాయి. దక్షిణకాశిగా పిలిచే వేములవాడ సిరిసిల్లా జిల్లాలో ఉంది. ఇంకా ధర్మపురి, మంథని, కొండగట్టు, బిజ్గిర్ షరీఫ్ ప్రధాన పర్యాటక ప్రాంతాలు. కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో మానేరు తీరంలో ఉన్న ఎలగందల్ కోట పురాతన కట్టడం. దిగువ మానేరు రిజర్వాయర్ సమీపంలో 30 ఎకరాల వైశాల్యంలో రాజీవ్ డీర్ పార్కు ఉంది. కరీంనగర్ పర్యాటక ఆకర్షణలో ఇది ఒకటి. ఎల్లారెడ్డిపేటలో పురాతన రాజ భవనాలు, జక్కుల చెరువు, సొరంగ మార్గం వంటి అనేక విశేషాలను తిలకించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో సబిత గ్రామంలో గుండాల జలపాతం ఉంది. 40 అడుగుల ఎత్తునుండి రెండు పాయలుగా కిందికి జాలువారుతూ అందంగా ఉంటుంది. జేగురురంగు రాతిబండలు, తెల్లని నీరు త్రివర్జాలు కలసి అద్బుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి కరీంనగర్ 164 కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు అక్కడి నుంచి ఆయా పర్యాటక ప్రాంతాలకు బస్సుల సౌకర్యాలు ఉంటాయి. వరంగల్ నుంచి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రైలు సౌకర్యం ఉంది.
Teenminar

హిల్ స్టేషన్లకు దారిదీ..

వేసవికాలంలో హిల్‌స్టేషన్లకు వెళ్లాలనుకునేవారు తప్పకుండా రాష్ట్రం దాటాల్సిందే. తెలుగురాష్ర్టాల్లో కంటే ఇతర రాష్ర్టాల్లోనే హిల్‌స్టేషన్లు అధికం. దేశంలోని సిమ్లా, మనాలి, మున్నార్, డార్జిలింగ్, ఊటీ, నైనిటాల్, కొడైకెనాల్, మాథెరన్, ముస్సొరి, శ్రీనగర్‌లకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడికి వెళ్లేందుకు ప్యాకేజీలు పాతిక వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఉన్నాయి. విమానం అయితే ఎక్కువ, రైళ్లు అయితే ప్యాకేజీలు తక్కువగా ఉంటాయి.

ఊటీ

ఈ పర్యాటక కేంద్రం తమిళనాడులో ఉంది. దక్షిణ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించిన బ్రిటీష్‌వారు ఊటీని సమ్మర్ హెడ్‌క్వార్టర్స్‌గా వాడుకున్నారు. 19వ శతాబ్దం నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు. 22 హెక్టార్లలోని ప్రభుత్వ బొటానికల్ గార్డెన్‌ను చూడడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. టీ తోటలు, పాయకార వాటర్‌పాల్స్, మధుగలై అటవీ ప్రాంతం ప్రత్యేకమైనవి.
Ooty

మాథెరన్ :

ఈ పర్యాటక ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఇది ముంబయికి దగ్గర్లో ఉంటుంది. ఇక్కడ వాహనాలతో పాటు సైకిల్ వాడకం కూడా నిషేధం. నో వాయిస్, నో పొల్యుషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాయి. ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ ఇక్కడ ఫేమస్.

కులూ మనాలి:

హిమాచల్ ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్ ఇది. దీనిని బ్యాక్ డ్రాప్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా అంటారు. కూల్ ఫారెస్ట్, రకరకాల టన్నెల్స్, బ్లైండ్ టన్నెల్స్ ఇక్కడ ఫేమస్. హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఆంగ్లేయుల కాలంలో వేసవి విడిదిగా ఉండేది. ఇక్కడ అతిపురాతన భవనాలు, దేవాలయాలు, చర్చిలు బాగా ప్రాచుర్యం పొందాయి. చారిత్రక రైల్వేస్టేషన్ కూడా ఉంది. ఇక్కడ ఆంగ్లేయులు నిర్మించిన కాలనీలు, పార్కులను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

డార్జిలింగ్ :

డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇక్కడా టీ గార్డెన్స్ ఫేమస్. అందమైన లోయలు, గ్రామాలు, జూపార్కు బాగా ప్రాచుర్యం పొందాయి. వర్షాలు తరచూ పడుతుంటాయి.

ముస్సోరి :

ఉత్తరాఖండ్‌లోని మరో పర్యాటక కేంద్రం ఇది. ఉత్తర భారతీయలు వీకెండ్ విడిదిగా ముస్సోరికి వెళతారు. ఇక్కడ కేబుల్ కారు, గన్స్, వాటర్‌ఫాల్స్, హార్స్ రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు. హిమాలయాలను అత్యంత దగ్గరగా చూడొచ్చు.

కొడైకెనాల్:

తమిళనాడులోని మరో హిల్‌స్టేషన్ ఇది. దీనిని పలానిహిల్స్ అని కూడా పిలుస్తాయి. రకరకాల పూల తోటలు, లోయలు, గార్డెన్స్, బోటింగ్, వాటర్ ఫాల్స్ పర్యాటకులను కట్టి పడేస్తాయి. ఇక్కడ రకరకాల సుగంధ ద్రవ్యాలు అమ్ముతుంటారు.

మున్నార్ :

కేరళలోని ముఖ్యమైన హిల్‌స్టేషన్ ఇది. టీ గార్డెన్స్ ఇక్కడ ప్రత్యేకత. చెరువులు, కొండ ప్రాంతాలతోపాటు ఎర్నాకులం జాతీయ పార్కును చూడొచ్చు.

నైనిటాల్ :

నైనిటాల్ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్‌లో ఉంది. నైనిలేక్, మార్కెట్ కేంద్రాలు, అందమైన లాన్స్‌తో పాటు అత్యంత కూల్‌గా ఉండే అడవిర, జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
 

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list