మంగళాశాసనం
మహాభారతం అంటే, పంచమ వేదం. అన్ని శాస్త్రాలకు, నీతులకు, ధర్మాలకు అది నిలయం. వేదసారాన్ని కాచి వడబోసిన వ్యాసమహర్షి ఆ పంచమ వేదాన్ని పండిత పామరులకు అనువుగా రచించాడు. సమాజం జ్ఞాన, కర్మ, భక్తిమార్గాల్లో పయనించాలంటూ మహాభారత గ్రంథాన్ని ఆయన ఇతిహాస రూపంలో వెలయించాడు. అది కథారూపంగానే కాక, కవితాత్మకంగానూ ఉండేలా ఓ శిల్పిలా తీర్చిదిద్దాడు. గ్రంథాన్ని మంగళ శ్లోకంతో ప్రారంభించడమే దానికి నిదర్శనం.
ఆ శ్లోక సారాంశం: శ్రీమన్నారాయణుడు దేవతలకు గురువు. ఆయన జగదేక నాథుడు, భక్తప్రియుడు, అన్ని లోకాలకూ వందనీయుడు. త్రిగుణాలకూ అతీతుడైన ఆ స్వామి అంతటా ఉంటాడు. అటువంటి పరమాత్మే అందర్నీ ఉద్ధరిస్తాడు. ఆ సంస్కృత శ్లోకానికి మధ్వాచార్యులు చేసిన పద్యరూప అనువాదం- వ్యాస హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది.
జ్ఞానాన్ని ప్రసాదించే భగవానుడు భక్తలోక పరిపాలకుడు. సర్వ ధర్మాల్నీ పరిరక్షించే ఆయన ఉదారుడు. సద్గుణ సంపన్నమైన అన్ని ఆత్మలకూ ఆయనే శక్తి, మోక్ష ప్రదాత అని మధ్వాచార్య విరచితమైన ఆ పద్యం విష్ణుతత్వాన్ని విశదీకరిస్తుంది. పూర్వభాగంలో- సురులు అంటే, దుఃఖం లేనివారు. వారికి జ్ఞానమిచ్చినవాడే ఆ ‘సుర గురుడు’. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే!
నాశనమన్నదే లేని చేతనా జగత్తుకు ఆధారం- జగత్ ప్రభువైన నారాయణుడు. అందుకే ఆయన సుర గురుడు, జగదేక నాథుడు అయ్యాడన్నది మధ్వాచార్యుల వ్యాఖ్యాన సారాంశం. భగవంతుడు భక్తప్రియుడు కాబట్టి, వారిని ఆదుకుంటాడు. త్రిగుణాతీతుడు కావడం వల్ల తమోగుణాల వంటివిఆయనను అంటవు. ‘నార’ అంటే, నరులకు సంబంధించినది. వారిని ఆ సంసార సాగరం దాటించేవాడే భగవాన్ శ్రీమన్నారాయణుడు.
‘విభు’ అంటే సర్వవ్యాప కుడైన ఆ నారాయణుడే! ‘నార’ అనే పదానికి జగత్తు అనే అర్థమూ ఉంది. దీన్ని సృష్టించిన ఆదిపురుషుడు నారాయణుడే కాబట్టి, ‘ఆది’ అనే శబ్దం ఆయనకే చెల్లుతుంది. ‘ఈశుడు’ అంటే, సంసార సాగర మయమైన ప్రపంచాన్ని నియంత్రించే నారాయణుడు. అంతర్యామి ఆయనే. ‘భవజ్ఞుడు’ అంటే, భవసాగరం అనే సంసార సాగరాన్ని దాటించేవాడు. మానవులకు మోక్షానందం ప్రసాదించేది ఆయనే.
దేవతలకు, రాక్షసులకు (సురాసురులు) వంద్యుడు నారాయణుడే!మోక్షానందం అంటే స్వరూపానందం. అజ్ఞానం మూలంగా మనిషి దుఃఖాలకు లోనవుతుంటాడు. దానికి ముఖ్య కారణం అతడికి తన నిజరూపం తెలియకపోవడమే! అజ్ఞానపు చీకటి అంతరించడం వల్ల కలిగే ఆనందమే మోక్షానందం. ముక్తులు అందరూ జ్ఞానానందమయులే.
వ్యక్తిత్వపు పూర్ణ వికాసమే ముక్తి. ఎవరి సాధన వారిది. సాధన బట్టి వారికి ఫలసిద్ధి కలుగుతుంది. పాత్రలు వేరైనా, నీళ్లు నిండగానే అన్నీ పూర్ణకుంభాలే అవుతాయి. అలాగే పూర్ణత్వం అనేది మానవుల పరిణతిని బట్టి అనుభవానికి వస్తుంది.
భగవంతుడు ఒక్కడే పరిపూర్ణుడు. వ్యక్తిగత పూర్ణత్వాలు ఎన్ని ఉన్నా, అవేమీ ఆయనకు సాటిరావు. పూర్ణత్వం దేనికి అదే అయినా, మూలం ఆ భగవంతుడి పరిపూర్ణత్వమే!అందుకే నిండుకుండల్లా వ్యక్తిత్వాలన్నీ పూర్ణం అవుతాయి. చివరికి మిగిలేది పరిపూర్ణత్వమే అని మంత్రం స్పష్టంగా చెబుతోంది.
ముక్తి లేదా మోక్షం అంటే, వ్యక్తి అంతరించాక కలిగే ఒక ప్రత్యేకమైన సుఖనిలయం కాదు. ఆ వ్యక్తి పూర్ణవికాసమే అతడికి ముక్తి కలిగిస్తుంది. జీవన్ముక్తి అంటే, ఇక్కడే పొందగల భవబంధ విమోచన. ఇదొక వ్యక్తిగత అనుభూతి.
మోక్షం అనేది ఆంతరంగిక వ్యక్తిత్వపు పూర్ణానంద రసానుభూతి.
సత్వగుణం గలవారికి ఆ సాత్విక పూర్ణానందమే మోక్షం. రజోగుణం గలవారికి మోక్షం అంటే, తమను తాము మళ్లీ పొందగలగటం. తమోగుణం గలవారికి అదే ఆనందమయ లోకం. అక్షర తత్వం గల జీవుడికి యోగ్యానుసారం కలిగే ఆనందమే, అతడి జీవన పంచమ వేదానికి మహా మంగళాశాసనం! - ఉప్పు రాఘవేంద్రరావు
జ్ఞాన వాహిని
మహాత్ముల మేధాజగత్తు నుంచి ‘జ్ఞానరాశి’ ఆవిర్భవించి అక్షర రూపాన్ని సంతరించుకుంది. అక్షరం- వాగ్దేవి రూపం. వేదోపనిషత్తులు, ఇతిహాస పురాణాదులు, సమస్త శాస్త్రాలూ మానవుణ్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తాయి. మాధవుడిగా మలుస్తాయి. అక్షరబద్ధమైన ఆ జ్ఞానరాశిని పదిలపరచి భావి తరాలకు అందించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైనా ఉంది.వారసత్వంగా కొనసాగాల్సిన జ్ఞాన ప్రవాహం ఆగిపోకూడదు. అజాగ్రత్త, ఉదాసీనత, నిర్లక్ష్యం వల్ల అది దూరం కారాదు. మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్య రూపం మానవాళికి అందించే సందేశం ఇదే!
సృష్టికర్త అయిన విధాత నిద్రించిన సమయమది. అప్పుడు జలప్రళయం సంభవించింది. సోమకుడు అనే అసురుడు బ్రహ్మ వద్ద గల వేదాల్ని అపహరించాడు. రాక్షసత్వం జ్ఞానప్రపంచాన్ని చెరపట్టినట్లయింది. అంతలో విధాత మేలుకొని, వేదాలు లేవని తెలుసుకొని, శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఆ శ్రీమన్నారాయణుడు మత్స్యరూపుడై అవతరించి, సోమకాసురుణ్ని సంహరించి, వేదోద్ధరణ చేస్తాడు.
వేదాలు సకల ధర్మాలకూ ప్రమాణాలు. అవి విశ్వవిజ్ఞానాన్ని వివరిస్తాయి. మానవజాతి మనుగడకు వేదాలే మూలాధారాలు. సంపూర్ణ జ్ఞానానికి అవి బీజరూపాలు. దేవ వాంగ్మయాల్లోకొన్ని కాలగర్భంలో కలుస్తాయి. మరికొన్ని కొంతమేరకు పునరుద్ధరణ భాగ్యం పొందుతాయి. వాల్మీకిది మూల రామాయణం. అది నిత్య పారాయణ గ్రంథం. భాస్కర, మొల్ల, తులసి, రంగనాథ, కంబ రామాయణాలూ ఉన్నాయి. వాటిని రచించి వారు ధన్యులయ్యారు.
రామచంద్రుడి ప్రాణసమానుడు హనుమంతుడు. ఆయన ‘సుందర హనుమద్రామాయణం’ పేరిట అరవై వేల శ్లోకాల్ని చంద్రకాంత శిలలపై రచించాడని ప్రతీతి. ఆ రచన గురించి శ్రీరాముడికి వెల్లడించినప్పటికీ మిన్నకుండటంతో, తన ప్రభువుకు ఇష్టం లేదేమోనని భావించి సముద్రజలాల పాల్జేస్తాడు హనుమ. ఆ తరవాత రాముడు అడగటంతో, తాను చేసిన పని వెల్లడిస్తాడు. వాల్మీకి రామాయణం భువిపై నిలవాలని, అది ఆదర్శ గ్రంథంగా ఆరాధన పొందాలని రాముడి అభిమతం. ఆయన మౌనానికి అదే కారణం. వాల్మీకికి విధాత ఇచ్చిన వరమూ అదే!
సూర్యభగవానుడి వద్ద హనుమంతుడు వేదవేదాంగాలు అభ్యసించాడు. ఆయన నవ వ్యాకరణ పండితుడు. శ్రీరాముడికి నమ్మినబంటు. అటువంటి హనుమ అద్వితీయ రచన సముద్రం పాలైంది. యుగాలు గడిచాయి. భోజరాజు, కాళిదాసు ఒకసారి సముద్రతీరంలో విహరిస్తుంటే- ఓ శ్లోకం రాసి ఉన్న చంద్రకాంత శిల అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకొస్తుంది. అది హనుమ రాసిన రామాయణ శ్లోకం. భోజరాజు గజ ఈతగాళ్లను రప్పించి, నీటిలో వెతికించి, సాధ్యమైన మేరకు శిలాఫలకాల్ని వెలికి తీయిస్తాడు. శ్లోకాల్లో 682 మాత్రమే లభ్యమైనట్లు చెబుతారు. భోజరాజు వాటితోనే రామాయణ రచన పూరింపజేశాడంటారు. అదే సుందర హనుమద్రామాయణం!
పరమేశ్వరుడు రాజరాజేశ్వరిని స్తుతిస్తూ ‘సౌందర్య లహరి’ రచించాడంటారు. ఆదిశంకరులు అపర పరమేశ్వర అవతారం. పరమేశ్వరుడు స్వయంగా ఆ గ్రంథాన్ని ఆదిశంకరులకిచ్చాడని చెబుతారు.
తనకు వ్యాసుడి భాగవతం ప్రాప్తించడం ‘పురాకృత సుకృత విశేషం’ అని పోతనామాత్యుడు అభివర్ణించాడు. భగవద్గీత సారసంగ్రహం, బ్రహ్మసూత్రాల పరమార్థమే భాగవతం. అది శుకమహర్షి ప్రోక్తం.
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిపై 32 వేల సంకీర్తనలు రచించాడు అన్నమయ్య. శ్రీరామచంద్రుడి భక్తిసామ్రాజ్యాన్ని స్తుతిస్తూ 24 వేల కీర్తనలు రచించాడు త్యాగయ్య. వారి రచనలు సగం కన్నా తక్కువ సంఖ్యలోనే నేడు లభ్యమవుతున్నాయి. ఆధ్యాత్మిక, శాస్త్రసంపదలు ఈ జాతికి తరగని నిధులు. భారతీయ శాస్త్రాలు ప్రపంచానికే తలమానికం.
జ్ఞానాన్ని ఆరాధించడమే దేవతారాధన. పంచుకునే కొద్దీ పెరిగేది ‘జ్ఞానం’ ఒక్కటే! మనసు సైతం ఛేదించలేని చీకటిని జ్ఞానం ఛేదిస్తుంది. జ్ఞానం లేనిదే అనుభవం పండదు. ఆ అనుభవం పండనిదే జీవితం శోభించదు!
- దానం శివప్రసాదరావు
రామచరిత మానస్
‘శ్రీరామనామం సుధామధురం’ అంటారు భక్తులు. భక్తిపూర్వకంగా రామరసాన్ని ఆస్వాదించాలని సదాశివ బ్రహ్మేంద్రులు చెబుతారు. కదళి, ఖర్జూర ఫలాల కన్నా రామనామం ఎంతో రుచి అని కీర్తించాడు రామదాసు. రామభక్తి మనోజ్ఞమే కాక భవ సాగరాన్ని దాటించే తారక మంత్రమనీ భావిస్తారు సాధకులు. అనంత రామభక్తితో సుందర సాహిత్యాన్ని, మధుర సంగీతాన్ని సృజించిన మహానుభావులు ఎందరో ఉన్నారు.శ్రీరాముడికి ప్రథమ భక్తుడు భరతుడు- అని ఆధ్యాత్మిక రామాయణం చెబుతోంది. మరో సోదరుడు లక్ష్మణుడు ఎప్పుడూ శ్రీరాముడి వెన్నంటి ఉన్నాడు. రామబంటుగా పేరొందిన మహావీరుడు హనుమ. వారందరూ సదా రాముణ్నే ధ్యానించి తరించారు. అదే బాటలో మరెందరో రామభక్తితో చరించారు. వారు రసవత్తర రీతిలో రామాయణం రచించారు. కబీర్‌దాసు, తులసీదాసు, సూరదాసు, సుందరదాసు వంటి సాధకులు ఎన్నో గీతాలు, వచనాలు వెలయించారు. తులసీదాసు రాసిన రామచరిత మానసం, జానకీ మంగళం, హనుమాన్ చాలీసా వంటివి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.
వాల్మీకి రామాయణం తరవాత తిరిగి అంతటి ప్రాచుర్యం పొంది, భక్తులకు పారవశ్యం కలిగించే గ్రంథం- రామచరిత మానస్. ఈ గ్రంథ రచయిత తులసీదాసు. ఆయన ఇప్పటి ఉత్తర్ ప్రదేశ్‌లోని రాజపూర్ గ్రామంలో జన్మించాడు. ప్రాచీన హిందీకి రూపాంతరమైన అవధ్- ఆ ప్రాంతపు సామాన్య ప్రజల వాడుక భాష. అందులో భారతదేశ సంస్కృతి నిండిన సంప్రదాయ సాహిత్యాన్ని వెలయించాడు తులసీదాసు. ఆయన రామచరిత మానస్ నాలుగు పాదాల కవిత (చౌపాయి)గా సాగింది. రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన తొలి కవి ఆయనే!
రామాయణం ఓ మహాగ్రంథం. దాని రచనా కార్యక్రమాన్ని రామరాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు తులసీదాసు. భగవంతుడి సగుణ సాకార తత్వాలు, గుణ ప్రభావ విశేషాలు, భక్తితత్వ రహస్యాలు- అన్నింటినీ సుందరమైన సరళ శైలిలో అందించాడాయన. రామచరిత మానసంలోని ప్రతి అక్షరమూ దివ్యమంత్ర సదృశమంటారు భక్తులు. ఆ గ్రంథాన్ని ‘ఆశీర్వాత్మకం’గా వర్ణిస్తారు.
శ్రీరాముడి కృపకు పాత్రుడైన మహాభక్తుడు తులసీదాసు. భగవంతుడి లీలల్ని తన గ్రంథంలో ఆయన అనుభవ పూర్వకంగా వర్ణించాడు. పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం ఆ పుస్తకం రాశానని వెల్లడించాడు. మొదట సీతమ్మకు నమస్కరించి, గ్రంథరచన ప్రారంభించాడు. ఆమెను మహాశక్తి స్వరూపిణిగా భావించి, ‘ఉద్భవ స్థితి కారిణి’గా స్తుతించాడు.
శివధనుర్భంగం గురించి తులసీదాసు విలక్షణంగా అభివర్ణిస్తాడు. ఆ ధనుస్సులో ఇతర రాజుల దురభిమానం, పరశురాముడి అహంకారం కలగలిసి ఉన్నాయని; అటువంటిదాన్ని రాముడు అవలీలగా విరిచాడని విలక్షణమైన రీతిలో వ్యాఖ్యానిస్తాడు. వాల్మీకి రామాయణానికి రామచరిత మానసం యథాతథ అనువాదం కాదు. మూలకథను ఏ మాత్రం మార్చకుండా, భక్తితత్వాన్ని రంగరించి రాసిన గ్రంథం అది. తులసీదాసు అద్భుత రచనా శైలికి అదొక నిదర్శనం.
రామచరిత మానసం రాసిన తరవాత, హనుమ దర్శనం పొందిన ఆనందంతో తులసీదాసు ‘హనుమాన్ చాలీసా’ రచించినట్లు చెబుతారు. హనుమను స్మరించడం వల్ల బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం కలుగుతాయన్నది ఆ కవి వాక్కు.
భక్తి, కావ్యరచన, తాదాత్మ్యత- తులసీదాసులోని విలక్షణతలు. ఆయన వారణాసిలో సంకట మోచన్ దేవాలయాన్ని కట్టించాడంటారు. ఒక సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సన్యాసిగా మారి, అంతటా విస్తృతంగా పర్యటించాడు. చిత్రకూటంలో కొన్నాళ్లు ఉన్నాడు. జీవితాంతం అయోధ్యలో నివసించాడు. అక్కడే ఆయన రామచరిత మానసం సహా పలు రచనలు చేశాడని ప్రతీతి.
శివుణ్ని సదా పూజించే తులసీదాసు, తన అవసాన దశలో రుద్రాష్టకం రాశాడని పలువురు గాఢంగా విశ్వసిస్తారు! - అప్పరుసు రమాకాంతరావు
శ్రుతులు-స్మృతులు
భారతీయ సంప్రదాయం ప్రకారం, ఉపనిషత్తుల్ని ‘శ్రుతులు’ అంటారు. రుషుల అంతరంగం నుంచి ప్రాభవోపేతంగా వెలువడిన అవి త్రికాల సత్యాలు. శ్రుతులు అన్నిచోట్లా అన్ని కాలాల్లోనూ అన్వయిస్తాయి. జాతి, మత, కుల, వర్గ, ప్రాంతాల ప్రమేయమే లేని సార్వజనీన సత్యాలవి. అవి క్షరాలు (నశించేవి) కావు.సనాతన వేద వాంగ్మయంలో శ్రుతికి గొప్ప ప్రతిష్ఠ ఉంది. శ్రుతి ప్రామాణికాలు తేటతెల్లం కావడానికి ప్రధాన కారణాలు రెండు. అవి- రుజువు కాగల సత్యాలు, సర్వతోముఖ భావాలు. ధర్మశాస్త్రాలతో సహా మత సంప్రదాయ సాహిత్యాన్ని ‘స్మృతి’గా పరిగణిస్తారు. ఇందులో పురాణాలు, ఇతిహాసాలు, ఆచార వ్యవహారాలు, కర్తవ్యాలు, సిద్ధాంతాలు, ఇతర నియమ నిబంధనలుంటాయి. ఇవన్నీ ప్రముఖంగా కాలమాన పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాయే తప్ప, సర్వ కాలాలకూ అన్వయించవు.
ఒక యుగంలో సమాజాన్ని కాపాడిన స్మృతి, ధర్మం- మరొక కాలంలో సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. కాలమాన స్థితిగతుల్ని బట్టి సాంఘిక, ఆర్థికాది విషయాల్లో మార్పు అనివార్యమవుతుంది. అప్పుడు కొత్త చట్టాలు, నియమ నిబంధనలు ఏర్పడకుంటే సమాజం అల్లకల్లోలంగా మారుతుంది.
చెట్టుకు ఓ కవచంగా ఉండి కాపాడేది- బెరడు. అదీ చెట్టుతో పాటు విస్తరించకుంటే, ఆ చెట్టు బతకదు. సజీవమైన చెట్టే పాత బెరడును రాల్చి, కొత్తది సమకూర్చుకుంటుంది. స్మృతులదీ అదే పద్ధతి. అన్ని మతాల మౌలిక సిద్ధాంతాలు- వాటి ప్రధాన ఆధ్యాత్మిక సత్యాల (శ్రుతుల) నుంచే జన్మిస్తాయి. అందుకే అవి అన్ని కాలాలకూ అన్వయిస్తాయి. స్మృతులు కాలానుగుణంగా మారక తప్పదు.
ఆదిశంకరుల విశ్లేషణ ప్రకారం, వాస్తవాన్ని యథాతథంగా వెల్లడించే జ్ఞానం స్మృతుల్లో ఉంది. వ్యక్తి అభిప్రాయంపై ఆధారపడిన జ్ఞానమూ ఉన్నప్పటికీ, దాన్ని ప్రయత్నం ద్వారా మార్చవచ్చు.
నేటి ప్రపంచంలోని కొన్ని సంప్రదాయాల్లో కొంతవరకు అసంబద్ధత కనిపిస్తుంది. ప్రధానమైన శ్రుతిని- కాలదోషం పట్టిన స్మృతి నుంచి వేరు చేయనందువల్ల కలిగిన స్థితి ఇది. అవసరార్థం కొత్త స్మృతుల్ని ఏర్పరచుకోవడంలో వైఫల్యం ఎదురుకావడమూ దీనికి కారణమే! ఏ పరిస్థితుల్లో విజ్ఞానశాస్త్రం మార్పులు పొందుతోందో, అదే భావనతో మతమూ మార్పునే ఎదుర్కోవాల్సి వస్తోంది. మత సిద్ధాంతాలు (శ్రుతులు) శాశ్వతం కావచ్చు గాని, ఆ సూత్రాల్ని విశ్లేషించే విధానాలు (స్మృతులు) కాలానుగుణంగా మారాలి. ఒకప్పటి స్మృతి అంశాలైన బాల్య వివాహాలు, బహుభార్యత్వం వంటివి నేటి స్మృతిలో శిక్షార్హమైన నేరాలు.
శ్రుతుల (వేదాలు, ఉపనిషత్తుల) ద్వారా భారతదేశం నిర్మించుకున్న తత్వశాస్త్రానికి, మతానికి ఒక అర్థవంతమైన పేరుంది. అది- సనాతన ధర్మం. దాని ప్రమాణం సిద్ధపురుషుల నుంచి గాని, అవతార పురుషుల నుంచి గాని సంక్రమించలేదు.
జీవాత్మ-పరమాత్మల సంబంధాన్ని శ్రుతులు శాశ్వత సత్యాలుగా వర్ణించాయి. మనువు, యాజ్ఞవల్క్య స్మృతులు;ధర్మశాస్త్రాలు, పురాణాలు సత్యాంశాల్ని తెలియజెప్పాయి. వేదాలకు, ఉపనిషత్తులకు సత్య ప్రమాణం ఉంది. అది శ్రీకృష్ణుడి వల్ల వచ్చింది కాదు. ఆయనకే వేదాలు, ఉపనిషత్తులు సత్యప్రమాణాలయ్యాయి. అందుకే ఆ భగవానుడు ‘భగవద్గీత’ ఉపదేశించాడు. మహోన్నత సత్య, ధర్మ వేదజ్ఞానాన్ని జగత్తుకు ప్రసాదించి పరమ పూజ్యుడయ్యాడు.
శ్రుతులు సత్యాన్ని, సనాతన ధర్మాన్ని ప్రవచిస్తాయి. లోకంలోని సత్యానికి, ధర్మానికి వేదాలు, ఉపనిషత్తులు ప్రతిరూపాలు. అందుకే అది అమర వాంగ్మయం. వేదాలు, ఉపనిషత్తులు అంటే- పలువురు వ్యక్తులు, పలు కాలాల్లో కనుగొన్న ఆధ్యాత్మిక త్రికాల సత్యనిక్షేపాలని స్వామి వివేకానంద బోధించారు. అవి ఎవరూ కనుగొన్నవి కావు. అనాది నుంచీ అవి ఉన్నాయి. వాటిని రుషులు తరతరాలుగా ప్రవచించి, ఒకరి నుంచి ఇంకొకరికి అనుశ్రుతంగా అందజేశారు. అవే శాశ్వతంగా నిలిచి ఉన్నాయి!
- విమలారామం
కల్యాణ దంపతులు
భారతీయతకు పునాది కుటుంబం. దానికి నాంది వివాహం. గౌరవప్రద హోదాను, ఉన్నత స్థాయిని తెచ్చిపెట్టే విశిష్ట బంధం అది. దాన్ని మించిన పవిత్రత, ఆత్మీయత, స్నేహం, సంతోషం ప్రపంచంలో మరెక్కడా లభించవు.
మహాభారతంలో యక్షుడు ‘పురుషుడికి నిజమైన నేస్తం ఎవరు’ అని ధర్మజుణ్ని ప్రశ్నిస్తాడు. ‘భార్యే అసలైన స్నేహితురాలు’ అని బదులిస్తాడాయన.
ప్రేమలోని అమరత్వాన్ని, స్త్రీత్వంలోని మాతృత్వాన్ని, అంతర్యామిలోని దైవత్వాన్ని కలగలిపి కుటుంబానికి పంచిపెడుతుంది ఇల్లాలు. భర్తతో పాటు కుటుంబసభ్యులందరి అవసరాల్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నారు. ఈ జగతికి జీవనజ్యోతి ఆమె.
భర్త అంటే అర్థం ‘భరించేవాడు’ అని మాత్రమే కాదు. బాధ్యత గలవాడే భర్త. అతడు ప్రేమను కుటుంబమంతటికీ పంచుతాడు. ఆదరణ కనబరుస్తూ, అందరి పోషణ బాధ్యతా వహిస్తాడు.
వివాహం అనేది, జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికే పరిమితమైనది కాదు. జీవితాన్ని ఎంచుకోవడమే వివాహం. మహాత్మాగాంధీ బోధించినట్లు- ‘అన్నింటి కంటే జీవితం ఓ చక్కని కళ. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తే గొప్ప కళావేత్త’. ప్రతి ఒక్కరి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలా ఉండాలనుకున్నప్పుడు- సంతోషం పొందడానికి కాదు, దాన్ని ఇవ్వడానికే పెళ్లి చేసుకోవాలి. సంతోషాన్ని పంచే వ్యక్తే దాన్ని తప్పక పొందగలడు.
పెళ్లిలోని ఏడడుగుల్లో- మొదటి అడుగు శారీరక శక్తికి, రెండో అడుగు మానసిక బలానికి. మూడో అడుగు- దంపతులు కలిసి బతకడానికైతే, నాలుగో అడుగు ఆయురారోగ్యాల కోసం. అయిదో అడుగు పశుసంపద కోసం, ఆరో అడుగు రుతు పవనాల సానుకూలత కోసం. ఏడో అడుగును సఖ్యత కోసం వేస్తారు. ఏడడుగులూ కలిసి నడుస్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధనకే పెళ్లి. రెండు ఆత్మలూ మూడు ముడులతో ముడివడతాయి. పార్వతీ పరమేశ్వరుల్లా ఇద్దరూ కలిసి ఉండాలని; వాక్కు, అర్థంలా ఒక్కటిగా మెలగాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
అనుకూలంగా, అనుగుణంగా ఉండేదే వివాహం. అలా కుదరడం అందరి విషయంలోనూ సాధ్యం కాదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్యలు దూరమవుతాయి. ఇంకా కొన్ని మిగిలి ఉంటే, వాటికి సంబంధించి వీలైనంతవరకు సర్దుకుపోవడం ఓ సుగుణం. ఆ గుణం అహంకారాన్ని దూరంగా తరుముతుంది. పరిష్కారాన్ని చేరువకు తెస్తుంది. బంధాల్ని పదిలపరుస్తుంది. ప్రేమను పంచుతుంది.
వివేకవంతులకు జీవితం ఒక పండుగ. హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలని అనుకోవడం సహజమే. అలా అనుకున్నప్పుడు ‘జీవిత భాగస్వామి తత్వమే మారాలి, తన తత్వాన్ని నేనే కచ్చితంగా మార్చితీరాలి’ అని పంతానికి పోవడంవల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. భాగస్వామి సరళిని ఏదోవిధంగా మార్చడమే పనిగా పెట్టుకోకుండా, తానే సవ్యమైన దృక్పథంతో మారగలిగితే మేలు.
వివాహ సౌధాన్ని ప్రేమ, నమ్మకం, సహనం, త్యాగం అనే పునాదులపైనే నిర్మించుకోవాలి. అప్పుడు గృహమే స్వర్గసీమగా మారుతుంది.
దైవదత్తమైనది జీవితం. దానికి వరం ప్రేమ. ఆ ప్రేమకు సంతానమే ముద్దు. అందువల్ల దాంపత్య జీవితం ముద్దుముచ్చట్లతో సాగాలి. దంపతులు నిత్య నూతనంగా, సదా సంతోషంగా జీవనయాత్ర సాగించాలి. నవ వేదంలోని ముఖ్య సూత్రం అదే!
ఓ వృద్ధజంటను వివాహ దినోత్సవ సందర్భంగా వూళ్లొవారు సన్మానించారు. వేదికమీద ఇద్దరినీ ఓ ప్రశ్న అడిగారు- ‘ఇన్నేళ్లూ మీ కాపురం ఇంత ఆనందంగా సాగడానికి కారణం ఏమిటి’ అని.
‘ఆమె నా భార్య కాదని అనుకోవడమే’ అన్నాడాయన! ‘ఆయన నా భర్త అని కలలోనైనా అనుకోలేదు’ అని బదులిచ్చిందామె! అందరూ నిర్ఘాంతపోయారు. ఒక్క క్షణం ఆగి, ‘మేమిద్దరం ప్రాణ స్నేహితులం అనుకున్నాం’ అని ఆ దంపతులు ఒకేసారి సమాధానమిచ్చారు. భారతీయ వివాహ వ్యవస్థలోని పరమార్థం అదే!
- గుజ్జుల వీర నాగిరెడ్డి
విశ్వ ప్రతీక
అందరికీ అందంగా కనిపించేది బాల్యదశ. దాన్ని అందరూ ఇష్టపడతారు. గుర్తించి ముద్దుచేస్తారు. బాల్యం వృద్ధిచెందేకొద్దీ, ఎవరి రూపాన్ని వారు అద్దంలో చూసుకుంటారు. అందం ఉందనో లేదనో- ఏదో ఒకటి తలచుకొని సంతోషిస్తారు లేదా బాధపడుతుంటారు. అలా జీవితం నడుస్తుంది, గడుస్తుంది.
మనిషి తాను చూసుకుంటున్న రూపాన్ని ఓ ‘సృష్టి’గా తెలుసుకోవాలి. అంతే తప్ప, ఇతరులతో పోల్చుకొని తనను తాను నిందించుకోకూడదు. అతడు తన దేహాన్ని తాను ప్రేమించాలి. శాస్త్రం, విజ్ఞానం ‘నిన్ను నువ్వు ప్రేమించాలి’ అని చెబుతున్నాయి. అంతటినీ, అన్నింటినీ ప్రేమిస్తూ ఎవరి రూపాన్ని వారు యథాతథంగా స్వీకరించాలంటాయి ఉపనిషత్తులు. దైవానికి మనిషి కృతజ్ఞతగా ఉండాలని అవి బోధిస్తాయి.
ఒకసారి రామకృష్ణ పరమహంస తన ధర్మపత్ని శారదామాత చేతికి ఆమె ఛాయాచిత్రాన్నే ఇచ్చారు. ఆ చిత్రాన్ని చూసి ప్రేమగా ముద్దుపెట్టుకున్న తరవాత, దాన్ని ఆమె తన తలమీద పెట్టుకున్నారు. చిత్రాన్ని భక్తిపూర్వకంగా తలకు తాకించి, తిరిగి ఆయనకు ఇచ్చారు. ‘అదేమిటి... మీ చిత్రాన్ని మీరే తలమీద పెట్టుకున్నారు’ అని అక్కడివారు అడిగారు. ‘ప్రతి దేహంలో దైవం ఉన్నట్లే, ఈ చిత్రంలోనూ ఉంటాడు. అందుకే చిత్రాన్ని తలమీద ఉంచి గౌరవించాను’ అని బదులిచ్చారామె.
మానవుడు తన దేహాన్ని తాను గౌరవించుకోవాలి. అదే సమయంలో, ఆధ్యాత్మికంగా పునఃసృష్టి ప్రాధాన్యాన్ని గ్రహించి మసలుకోవాలి. మనిషి తన శరీరాన్ని తాను పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? చిత్రంగా, వికృతంగా తయారవుతుంది. అలా ఉండటం లేదు మనిషి. తనను తాను చక్కగా మలచుకుంటున్నాడు. అందంగా తయారుచేసుకుంటున్నాడు. తనదైన ఆహార్యంతో ప్రత్యేకంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నాడు. పుట్టిన తరవాత శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం సర్వ సహజమే. అలాగే ధార్మికంగానూ అతడు తనను తాను సరికొత్తగా సృష్టించుకోవాలి. స్వయంగా సరిదిద్దుకోవాలి. మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఎంతో మెరుగ్గా రూపుదిద్దుకోవాలి. ఏవైనా లోపాలుంటే, వాటినే అవకాశాలుగా మార్చుకొని, తన నిర్మాణ కృషి తానే సాగించాలి.
వానర వీరుడైన హనుమంతుడి తోకను లంకంతా హేళన చేసింది. అణుమాత్రం చలించని ఆయన, ఆ తోకతోనే నగరాన్ని దహనం చేశాడు. రాక్షసుల అహంకారాన్ని అణచివేశాడు.
దేహమే దేవాలయం అని ప్రతి మనిషీ గ్రహించాలి. అందులో శివ రూపాన్ని దర్శించుకోవాలి. మధురమైన మాటలే మనిషికి ఆభరణాలు. అతడి నోరు దైవ నామమనే అమృతాన్ని సేవించాలి. కళ్లు ఈశ్వర సృష్టి ఫలితమైన ఈ ప్రపంచాన్ని తిలకించాలి. గురుపాదుకలు ధరించేందుకు వీలుగా, తైల సంస్కార సహితంగా శిరస్సును సిద్ధంగా ఉంచుకోవాలి. అతడి భుజాలు ధర్మాన్ని మోయడానికి ఉపయోగపడాలి. పావనమైన పనులు చేసేందుకే అతడి చేతులు పోటీపడాలి. మానవుడి కాళ్లు, అతడి నడక దైవం చుట్టూ ప్రదక్షిణకు ఉపకరించాలి.
ప్రేమ, దయ, పరోపకార భావాలతో వికసించాలి మానవ హృదయం. తనను తాను వినూత్నంగా సృష్టించుకోవడం అంటే అదే! అదే అతడి పాలిట సరికొత్త ఉనికి. చూసేవారిని అది ఆకట్టుకుంటుంది. స్వయం నిర్మిత వ్యక్తిత్వంగా భాసిస్తుంది. జీవితసత్యం నిరూపితమవుతుంది. అప్పుడు మానవశక్తి ద్విగుణీకృతమవుతుంది. అతడి వ్యక్తిత్వం విశ్వ ప్రతీకగా మారుతుంది!
- ఆనందసాయి స్వామి
నిరీక్షణ
మానవ జీవితకాలమంతా కర్మయోగంతో ముడివడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కర్మఫలితాల్ని ఆశించడం సర్వసాధారణ విషయమైనా, అవి వెంటనే అందవు. కొన్ని పనులు దీర్ఘకాలంలో, మరికొన్ని స్వల్పకాలంలో ఫలితాలనిస్తుంటాయి. వాటి కోసం నిరీక్షణ మనిషికి తప్పనిసరి. దాన్ని ‘ఎదురుచూపు’గా చెబుతారు.
ఆధ్యాత్మిక జగత్తులో, భగవంతుడి అనుగ్రహ ప్రాప్తికి భక్తుల్లో ఎడతెగని నిరీక్షణ కనిపిస్తుంది. అది ఒక్కోసారి విసుగు పుట్టించేలా, వేదన కలిగించేలా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ‘భవతారిణి’ అనుగ్రహం ప్రాప్తిస్తుందని ఎంతో ఆర్తిగా ఎదురుచూసేవారు. నిరీక్షణలో భాగంగా అనేక ఉపాసనలు, పద్ధతులను ఆయన అవలంబించేవారు.
భగవంతుడి అనుగ్రహం సిద్ధించడమన్నది ఒకవిధంగా జీవితకాల నిరీక్షణ ఫలితమే! శ్రీరామ దర్శనం కోసం ఎంతోకాలం నిరీక్షించింది శబరి. ఆయన అరణ్యవాసం ఆమె పాలిట వరంగా మారింది. వనవాటికలో రాముడికి భక్తిపూర్వక ఆతిథ్యమిచ్చిన ఆమె ధన్యురాలైంది. కొన్ని అనాలోచిత, ఆవేశపూరిత నిర్ణయాలు సైతం ఇతరుల్ని భరింప శక్యంగాని నిరీక్షణకు గురిచేస్తాయి. స్వార్థపూరితమైన కైకేయి కోరిక, ఆమె తనయుడు భరతుణ్ని ఎంతో నిరీక్షింపజేసింది. ఆయన పద్నాలుగు సంవత్సరాలు తన అన్న శ్రీరామచంద్రుడి రాక కోసం ఎదురుచూసేలా చేసింది.
లక్ష్మణుడి భార్య వూర్మిళ, తన నిరీక్షణ కాలమంతా నిద్రలో వెళ్లబుచ్చాల్సి వచ్చింది.
ఎవరి నిరీక్షణ కాలమైనా బాధ, అయోమయం, ఆందోళన, అస్థిరత్వాలకు కారణమవుతుంది. మనసును పలు విధాల కుంగదీస్తుంది. మనిషికి ఆత్మవిశ్వాసం, నమ్మకం అవసరం. కర్మాచరణల పట్ల అతడికి స్థిరచిత్తం ఉండాలి. అప్పుడు ఎంత నిరీక్షణ అయినా అంతగా బాధించదు. మనోభారాన్ని దరిచేరనివ్వదు. అందుకే- ప్రతి పనినీ హృదయపూర్వకంగా, ఆత్మీయంగా పూర్తిచేయాలంటారు ఆధ్యాత్మిక తత్వవేత్తలు.
అర్థం లేని నిరీక్షణ- కాలాన్ని వ్యర్థపరుస్తుంది. ఆలోచనల భారాన్ని పెంచుతుంది. అదే నిరీక్షణ విపరీతమైతే, మనోవైకల్యం కలిగిస్తుంది. అందువల్ల నిరీక్షణ కాలాన్ని ఇతర వ్యాపకాల వైపు మళ్లించడం ఎంతో ఉత్తమం. మహాపురుషులు సమాజంలో చైతన్యవంతమైన మార్పును ఆశిస్తారు. అందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. తాము నిర్వర్తించాల్సిన కార్యాలపై మనసు లగ్నం చేస్తారే తప్ప, జరిగిపోయినవాటి ఫలితాల కోసం నిరీక్షిస్తూ కాలాన్ని వృథా చేయరు. ఆ ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని వారికి కొండంత విశ్వాసం!
శ్రీకృష్ణుడి కోసం రాధ నిరీక్షించినవన్నీ మధుర క్షణాలే! ఆమె ఎదురుచూపులన్నీ ప్రేమానురాగాలతో నిండి ఉండేవి. ఆయన బృందావనంలోకి ప్రవేశించక ముందు, రాధకు ప్రతి క్షణమూ ఒక యుగం!
సాహితీమూర్తులకు అక్షరమే ఉపాసన. గంగాప్రవాహంలా సాగే వారి వ్యాసంగం, నిరీక్షణకు ఆస్కారమివ్వదు. ఆహార పానీయాలు సైతం మరచి ప్రయోగశాలల పనుల్లో మునిగితేలే శాస్త్రవేత్తలకూ నిరీక్షణ అనే మాటే ఉండదు. ప్రయోగ ఫలితాలే వారి దైనందిన కార్యకలాపాలు. జీవితం ఓ ప్రయోగశాల. ఇందులో ప్రతి క్షణమూ విలువైనదే. నిరీక్షణతోనే కాలం గడపకూడదు. మానవుడు వివేకి. అతడి నిరీక్షణా అర్థవంతంగా ఉండాలి తప్ప, కాలాన్ని హరించేలా ఉండకూడదు.
చెట్టు నుంచి ఫలాలు లభించేదాకా ఆగడమే అర్థవంతమైన నిరీక్షణ. ఫలాలు లభించేవరకు రోజులు లెక్కిస్తూ కూర్చోవడం అంటే, అది కాలహరణమే! అటువంటి నిరీక్షణ అర్థంలేనిది.
ప్రతి నిరీక్షణ వెనకా ప్రబలమైన సాధన దాగి ఉంటుంది. మనసుకు ఆనందం కలిగించే అంశం, కల సాకారమైతే చూసుకోవాలన్న కోరిక ఉంటాయి. అపురూపమైన కాలాన్ని మనిషి అనుక్షణమూ సద్వినియోగం చేసుకోవాలి. అంతకు మించిన మధుర నిరీక్షణ మరేదీ ఉండదు!
- దానం శివప్రసాదరావు
నిశ్చింత #Antaryami
ప్రపంచంలోని భక్తివిశ్వాసాలకు సంబంధించి- మనుషుల్ని ఆస్తికులు, నాస్తికులుగా భావిస్తుంటాం. భగవంతుణ్ని అర్చించనివారు, నమ్మనివారు అందరూ నాస్తికులేనా? నమ్మనివారు అంటే, వారు భగవంతుడికి శత్రువులని అనుకోలేం. శత్రుత్వమైనా, అసలంటూ అక్కడ ఒక రూపం ఉండాలి. అప్పుడే కదా శత్రుత్వం ఉండేది!
హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపాది రాక్షసులు ‘హరి’ అని ఒక రూపం ఉందని భావించే, ఆయన పట్ల శత్రుత్వం వహించారు. నాస్తికుల కంటే శత్రువులే నిరంతరం హరి స్మరణ చేస్తుంటారు. భక్తుల కంటే అధికంగా స్మరి స్తామన్నారు జయ విజయులు. అందుకే వారు హరి భక్తులుగా ఏడు జన్మలు కాకుండా, హరితో వైరాన్ని మూడు జన్మలపాటు కోరుకున్నారు. ఆయనతో ఎడబాటును మూడు జన్మలకు ముగించాలన్నదే వారి కోరిక!
మానవజాతిలో ఆస్తికులు, నాస్తికులు కాకుండా మధ్యేమార్గంలో కొందరుంటారు. వారిది డోలాయమాన వైఖరి, దయనీయ పరిస్థితి. వారికి భక్తి ఉందా అంటే, లేదనిపిస్తుంది. లేదా అంటే ‘ఉంది’లా ఉంటుంది. ఏమిటిది? భక్తిని అనుసరించాలని, దైవాన్ని నమ్మాలని, దైవభావననే సాధన చేయాలని పలువురికి మనసులో ఉంటుంది. లోపల ఏదో ఒక భయం, బెరుకు ఉంటాయి. భక్తి అంటే ఏమిటి, ఏం చేయాలి; భగవంతుడు నన్ను, నావంటివారిని కరుణిస్తాడా అని ప్రశ్నించుకుంటారు.
వారిలో అనేక నియమ నిష్ఠలుంటాయి. పాపభీతి, దేన్నీ వదులుకోలేని తత్వం నెలకొని ఉంటాయి. ఏ మాత్రం అనుభవం లేని రంగం కాబట్టే- వారిలో ఎన్నో అపోహలు, సందేహాలు. భగవంతుడు లేడని అనుకుందామా అంటే, దానికీ మనసు ఒప్పదు! ఒకవేళ ఆయనంటూ ఉంటే- ఇంతవరకు ఆయన కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయని జీవితం వారిది. ఎటూ తేల్చుకోలేనంతటి సందిగ్ధ, సందేహ అవస్థలు వారివి.
మనిషి ఎప్పుడూ క్రియాశీలుడు, కర్మయోగి కావాలి. మనసు స్థిరంగా ఉండాలి. దేవుడు ఉన్నాడన్న నమ్మకం నూరు శాతం కలిగి ఉంటే, చలించని మానసంతో నిలుస్తాడు మానవుడు. అదే మానవజన్మ పరమార్థం, అతడు నెరవేర్చాల్సిన కర్తవ్యం. ఉత్కృష్ట జీవితం అంటే అదే! భగవత్ స్పృహ సర్వకాలాల్లోనూ శ్రేయస్కరం. తాను పొందింది ఏమిటో మనిషికి తెలియకున్నా- ఏదో కోల్పోయిన వెలితి, బాధ అతడికి ఉండవు.
దేవుడు ఉన్నాడు... ఉన్నాడా, లేడు... లేడా? ఈ డోలాయమాన స్థితి మనిషికి స్థిరత్వమివ్వదు. దేవుడు లేడు అనే కంటే, ‘ఉంటే ఏం చేయాలి, ఆ కృప ఎలా పొందాలి, అది నాకు సాధ్యమేనా’ అనుకొని ఎంతో నమ్మినవారు ఎందరో ఉన్నారు. సాధనలో వారు ముందున్నారు.
ఇవన్నీ కాదు. పుట్టిన ప్రతి జీవీ గిట్టడం ఎంత సత్యమో- అతడితో పాటు అతడి లోపల, బయట భగవంతుడు ఉన్నాడన్నదీ అంతే సత్యం. వేల సంవత్సరాలు చీకటి నిండిన గదిలోనూ, చిరుదీపం వల్ల అంతటా వెలుగు నిండుతుంది. అలాగే మానవుడు దేవుడి పట్ల కలిగించుకునే, వెలిగించుకునే చిన్నపాటి నమ్మకమే అతడి జీవితంలోని గాఢాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. వెలుగు లక్షణం, లక్ష్యం- చీకటిని పారదోలడం. మనిషి జీవితంలో నమ్మకాన్ని వెలిగించుకుంటే చాలు. భక్తి, సాధన, గమనం, గమ్యం... ఆయనే చూసుకుంటాడు. భగవంతుడు ఉన్నాడని నమ్మడమంత భద్రమైన జీవితం మరెక్కడా లేదు.
నిన్నే నమ్ముకున్నానని ఆయనకు హామీ ఇవ్వనక్కర్లేదు. ఒట్టుపెట్టి మరీ చెప్పనక్కర్లేదు. ఆ భావం మనసులో ఉదయిస్తే చాలు. పువ్వును అనుసరించే పరిమళంలా, భగవంతుడి అనుగ్రహ ప్రకాశం భక్తుడి నమ్మకాన్ని వెన్నంటి వస్తుంది. అది ఆహ్లాదకరమైన భావం. జీవితకాలం నిశ్చింత కలిగించే ఆ భావం, ప్రభావం- ఒక్క హృదయాన్నే కాదు, జీవితమంతటినీ ప్రఫుల్లం చేస్తాయి!
- చక్కిలం విజయలక్ష్మి
పరమ శాంతి
‘అర్జునా! అధర్మపరులైన కౌరవులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చావు. నీవే వెనుదిరగడం సముచితం కాదు. యుద్ధానికి నడుం బిగించు. ధీరుడైనవాడు సుఖదుఃఖాల్ని సమానంగా చూస్తాడు. స్వధర్మం వీడవద్దు. హర్షానికి, దుఃఖానికి నీవు అతీతుడివి కావాలి. ఫలాపేక్ష రహితుడివై వ్యవహరించు. నీ పని నీవు ఆచరించు.
సాధకుడైనవాడు ఇంద్రియాల్ని వశంలో ఉంచుకుంటాడు. అతడి బుద్ధి స్థిరంగానే ఉంటుంది. విపరీతమైన ఆసక్తి వల్ల భోగాలపై కోరికలు పెరుగుతాయి. తీరకుంటే, క్రోధం కలుగుతుంది. దాని కారణంగా, వ్యామోహం ఏర్పడుతుంది. ఫలితంగా మానవుడికి బుద్ధి నశిస్తుంది.
ప్రసన్న చిత్తుడైన కర్మయోగి బుద్ధి పరమాత్మపైనే లగ్నమై ఉంటుంది. స్థితప్రజ్ఞుడైనవాడే పరమశాంతి పొందుతాడు. మానవుడు కర్మలు చేయడమే ఉత్తమం. యజ్ఞాలు కామధేనువుల్లా అతడి కోరికలన్నింటినీ నెరవేరుస్తాయి. యజ్ఞాల కారణంగా దేవతలు తృప్తి చెందుతారు. ప్రజల్ని అనుగ్రహిస్తారు. అన్నం వర్షంవల్ల లభిస్తుంది. వర్షాలు యజ్ఞాలవల్ల ఏర్పడతాయి. ఆ యజ్ఞాలకు మూలం కర్మలే! కర్మలకు మూలమైన వేదాలు ఆరాధనీయాలు.
మనిషి అన్ని రాగద్వేషాలకూ అతీతుడు కావాలి. జ్ఞానాన్ని కామం కప్పి ఉంటుంది. అన్ని ఇంద్రియాల కంటే మనసు గొప్పది. దాని కంటే బుద్ధి, ఆ బుద్ధి కంటే ఆత్మ ఉత్తమమైనవి. మనిషి ఆత్మజ్ఞానం పొందాలి. యజ్ఞాల్ని త్రికరణశుద్ధిగా ఆచరించాలి. జ్ఞానయజ్ఞం ఉత్తమమైనది. సేవ, భక్తి, శ్రద్ధల వల్ల- పరమాత్మ గురించిన తత్వజ్ఞానం మానవుడికి లభ్యమవుతుంది. నిత్య సాధకుణ్నే భగవత్ తత్వ జ్ఞానం వరిస్తుంది. పరమ శాంతి లభించేదీ అతడికే!
జ్ఞానులు సమదృష్టి కలిగి ఉంటారు. భోగాలన్నీ దుఃఖహేతువులు. వివేకి వాటిమీద ఆసక్తి చూపడు. మనసును, ఇంద్రియాల్ని, శరీరాన్ని జయించినవాడు తనకు తానే మిత్రుడు. వాటిని జయించనివాడు తనకు తానే శత్రువు. యోగిలో జ్ఞాన విజ్ఞానాలు నిండి ఉంటాయి. అతడు ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తుంటాడు. సాధకుడికే యోగసిద్ధి సాధ్యపడుతుంది.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉంటుంది. ఇది కాక, సమస్త జగతిని ధరించే మరో ప్రకృతీ ఉంది. అదే నా జీవరూప పరాకృతి!
సూర్యచంద్రుల్లో కాంతిని నేనే. వేదాల్లో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, పృధ్విలో సుగంధాన్ని, అగ్నిలో తేజస్సును నేనే! జ్ఞాని అయినవాడు నా స్వరూపమే. అటువంటివాడు నాలోనే స్థితుడు! భగవత్ తత్వం తెలిసినవాడు ‘సర్వం వాసుదేవమయం’గా భావించి, నన్ను శరణు కోరతాడు. దైవీ ప్రకృతిని ఆశ్రయించినవారు నన్ను సకల ప్రాణికోటికీ మూలకారకుడిగా భావించి పూజిస్తారు. మరికొందరు జ్ఞానయజ్ఞం ద్వారా ఉపాసిస్తారు. మృత్యువు, అమృతం- రెండూ నేనే.
క్షమ, సత్యం, మమత, సంతోషం, తపస్సు, దానం, కీర్తి... అన్నీ నా వల్లనే కలుగుతాయి. ప్రాణుల సృష్టి, స్థితి, లయలకు కారకుణ్ని నేనే. ఏకాదశ రుద్రుల్లో శంకరుణ్ని. అష్ట వసువుల్లో అగ్నిని. పురోహితుల్లో బృహస్పతిని. సేనాపతుల్లో కుమారస్వామిని. జలాశయాల్లో సాగరుణ్ని. స్థావరాల్లో హిమాలయాన్ని. వృక్షాల్లో రావిచెట్టుని. దేవర్షుల్లో నారదుణ్ని. గంధర్వుల్లో చిత్రరథుణ్ని. సిద్ధుల్లో కపిల మునిని. ఆయుధాల్లో వజ్రాయుధాన్ని. దైత్యుల్లో ప్రహ్లాదుణ్ని. మృగాల్లో సింహాన్ని. పక్షుల్లో గరుత్ముంతుణ్ని. శస్త్రధారుల్లో శ్రీరాముణ్ని.
తేజస్సు, క్షమ, ధైర్యం, నిరహంకారం- దైవీసంపద గలవారి లక్షణాలు. కపటం, మొండితనం, క్రోధం, అజ్ఞానం వంటివి ఆసురీ స్వభావాలు. అర్జునా! నీవు దైవీ సంపద కలవాడివి. శోకించకు. శాస్త్రోక్త కర్మల్ని తెలుసుకొని వాటినే ఆచరించు.
కామ, క్రోధ, లోభాలు నరక ద్వారాలు. శుచి, నిరాడంబరత, అహింస అనేవి- శారీరక తపస్సులు.
నాపైనే చిత్తం నిలుపు. విజయం నీదే!’
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
++++++++++++++++++++++++
జ్ఞాన సాగరం
‘తెలివి ఒక్కింత కూడా లేనప్పుడు, దర్పం కనబరచాను. మదించిన ఏనుగులా, సర్వమూ నాకే తెలుసునని నిక్కాను. ఇప్పుడు దిగ్దంతుల్లాంటి మహాపండితుల సన్నిధిలో కొద్దిపాటి జ్ఞానం నేర్చుకొన్న తరవాత, నా అహంకారం అణగిపోయింది. ఏమీ తెలియనివాణ్ని అని తెలుసుకొని, వినమ్రతతో నడచుకొంటున్నాను’ అంటాడు అనుభవ క్రమంలో పరిణతి చెందిన ఓ విద్వాంసుడు!
ఏ రంగంలోనైనా నేర్చుకోవాలని కోరేవాడికి, ఆ విద్య ఏ కొంచెమైనా అబ్బితే- ఒక సత్యం బాగా తెలిసివస్తుంది. తన ముందున్నది జ్ఞానసాగరమని, అందులో తనవంటి మానవమాత్రుడు జీవితకాలంలో నేర్చుకోగలిగింది అతి స్వల్పమని అర్థమవుతుంది. ఎంత చిన్న విషయంలోనైనా వృత్తిలోనైనా విభాగంలోనైనా తెలుసుకోవాల్సినదంతా తెలుసుకోవడం- మానవుడి మేధస్సుకు సాధ్యం కాదు. ఎంత శ్రమించినా, ఎన్నాళ్లు అధ్యయనం చేసినా, ‘జ్ఞానసంబంధ పరిపూర్ణత’ అనే గమ్యం మనిషికి ఎప్పుడూ బహుదూరంలోనే ఉంటుంది.
పదహారు సంవత్సరాల వయసుకే కర్ణాటక సంగీతంలో గల డెబ్భై రెండు మేళకర్త రాగాల్లోనూ కృతులు రచించి పాడిన ‘పుంభావ సరస్వతి’ బాలమురళీకృష్ణ. ఎనభై ఆరు సంవత్సరాల పండు వయసులోనూ ఆయన పదేపదే ఒకటి చెప్పేవారు. ‘ఈ అపారమైన సంగీత సాగరంలో నాకు పట్టుబడింది అతి స్వల్పం. నేర్చుకొన్నకొద్దీ, కాలం గడిచినకొద్దీ, వయసు పెరుగుతున్నకొద్దీ ‘నాకు తెలిసింది ఎంతో తక్కువ’ అని బాగా తెలిసివస్తోంది’ అని. ఆదిశంకరుడి నుంచి ఐన్‌స్టీన్ దాకా ‘నా జ్ఞానం గొప్పది’ అని చెప్పుకొనే, అనుకొనే జ్ఞానులు ఒక్కరూ కనిపించరు (అలా అనుకొనే, అనే అజ్ఞానులు మాత్రం అనేకమంది!)
మానవమాత్రుడైనవాడు ఏ రంగంలో ఎంత పాండిత్యం సంపాదించగలిగినా, అతి విస్తారమైన జ్ఞాన మహాసాగరంలో అది అతి స్వల్ప పరిమాణమే! అతడికి తన శక్తియుక్తులమీద అపారమైన విశ్వాసం ఉండవచ్చు. కాని, సృష్టి విస్తృతి ముందు మనిషి అనే ఆ ప్రాణి నిజానికి ఏమంత గొప్ప? వూహించలేనన్ని కాంతి సంవత్సరాల నిడివిలో వ్యాపించి ఉన్న బ్రహ్మాండం ఇది. దీనితో పోలిస్తే, అరంగుళానికి ఆరడుగులకు వ్యత్యాసం ఏముంది?
మానవ మేధ పెరిగి- సరికొత్త శక్తిమంతమైన వైజ్ఞానిక సాధనాలతో వెతికినకొద్దీ ఎన్నో ఆవిష్కారమవుతున్నాయి. ఈ విశాల విశ్వం పెరుగుతూనే ఉంది. సాధనాల పరిమితులే తప్ప, విశ్వ విస్తృతికి హద్దులు కనిపించడం లేదు. మరోవంక- అణువు, పరమాణువు, పరమ పరమాణువు వంటి సూక్ష్మాతి సూక్ష్మ రహస్యాల్ని తెలుసుకోవాలని చూసే మానవ పరిశోధనలకూ అంతు ఉండటం లేదు.
జ్ఞానార్జన అంటే ఏమిటి? అది జగత్పిత అయిన ఆ సృష్టికర్త- మనిషి అనే తన గారాల బిడ్డ కోసం రూపొందించిన బాల్యక్రీడ వంటిది. మనిషి శక్తియుక్తులు ఎంత అద్భుతమైనవైనా కావచ్చు. ప్రకృతి శక్తితో వాటికి పోలికే లేదని గ్రహించి, వినయంతో మసలుకోవడమే మానవ ధర్మం.
‘విద్య కలిగించే వినయం’ లేని వ్యక్తి కేవలం బావిలో కప్ప. ప్రపంచ జ్ఞానం లోపించినప్పుడే ‘నేనే పండితుణ్ని! నా అంత ప్రతిభా సామర్థ్యాలతో నిరంతర కృషితో జ్ఞానార్జన చేసినవాళ్లు ఎవరూ ఉండరు’ అని అహంకరిస్తాడు. ఉన్న ప్రాంతం వదిలి, లోకాన్ని కాస్త చూసి వస్తే, ఉద్దండ పండితులెందరో అతడికి కనిపిస్తారు. లోకజ్ఞానం పెరిగినకొద్దీ అతడు ‘నేనేం పండితుణ్ని! ఈ మాత్రానికే, ఇంత అహంకరించాలా’ అని వాస్తవికతకు దగ్గరవుతాడు.
అపారమైన విజ్ఞానసాగరంలో, ఏ బిందువో చవిచూసినవాడు ‘నేను సర్వజ్ఞుణ్ని’ అని భ్రమించడానికి కారణమేమిటి? అతడు తన కొద్దిపాటి పరిజ్ఞానాన్ని హిమాలయ పర్వతమంత చేసి చూపే ‘భూత’ద్దాన్ని చేతపట్టి చూడటమే కారణం. ఆ భూతద్దం పేరు అమాయకత్వం. దానికే ‘మూర్ఖత్వం’ అనే ఘాటైన పర్యాయపదమూ ఉంది!
- మల్లాది హనుమంతరావు
యుగధర్మం
శ్రీరామ పట్టాభిషేకం భగ్నమైంది. దశరథుడి ఆశ విఫలమైంది. ‘14 ఏళ్లు వనవాసం చేయాల్సిందిగా నిన్ను మీ తండ్రి ఆజ్ఞాపించారు... నీకు బదులు భరతుడికి పట్టం కట్టాలని ఆయన నిర్ణయించారు’ అని కైక ప్రకటించింది. రాముడు నిశ్చలంగా ఆలకించాడు. నిర్వికారంగా వెనుతిరిగాడు.
కైకమ్మ మందిరానికి రాముణ్ని తీసుకెళ్లిన రథసారథి సూతుడు, తిరిగి రథం వైపు దారి చూపించాడు. రాముడు చిరునవ్వుతో తిరస్కరించాడు. కాలినడకన తన నివాసం దిశగా సాగిపోయాడు. ఆ రథం కేవలం ఒక రాజలాంఛనం. తాను ఇప్పుడు రాజు కాడు. అందుకే ఆ తిరస్కరణ. శ్రీరాముడు ‘మర్యాదా పురుషోత్తముడు’ అని లోకం వూరికే అనలేదు!
ఎక్కడో ఘోర రైలుప్రమాదం సంభవించింది. అనేకమంది మరణించడానికి, మరెందరో గాయాలపాలవడానికి ఆ రైలు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అప్పటి కేంద్ర రైల్వేమంత్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తప్పిదానికి తానే బాధ్యుణ్నని భావించారు. నేరుగా ప్రధానమంత్రిని కలిసి, తన మంత్రిపదవికి రాజీనామా సమర్పించారు. ప్రధాని వారిస్తున్నా వినకుండా ఆయన వెనుతిరిగారు. అక్కడికి ఆయనను తీసుకొచ్చిన కారు డ్రైవరు వినయంగా తలుపు తీసి పట్టుకున్నాడు. ఆ మర్యాదను సున్నితంగా నిరాకరిస్తూ, నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లారాయన! ఎందుకంటే, అది అధికార వాహనం. రైల్వేమంత్రికి ప్రభుత్వమిచ్చిన లాంఛనం. తాను ఇప్పుడు మంత్రి కాదు. అందుకే, వాహనం ఎక్కేందుకు ఆ తిరస్కరణ!
అదీ ఆయన నిబద్ధత! అలాంటి మర్యాదస్తులు కలియుగంలోనూఉంటారని నిరూపించిన ఆ మంత్రి పేరు- లాల్‌బహాదుర్ శాస్త్రి. నాడు రాముడు చేసిందే ఆ తరవాత ఆయనా చేశారు.
రామాయణంతోనే పరిచయం ఉండటానికి, రాముడితోనూ పరిచయం ఉందనడానికి తేడా ఉంది. మానవుడు ఉంటున్న స్థితి నుంచి ఉండాల్సిన స్థితికి దారి చూపిస్తుంది రామాయణం! అదే దారిలో పట్టుదలగా ప్రయాణం చేసినవారికి, నేరుగా రాముడితోనే స్నేహం ఏర్పడుతుంది. రామాయణం అంటే ‘రాముడు నడిచిన దారి’ అనే అర్థమూ ఉంది. ఆ దారిలో ప్రయాణం సాగించినవారికి, రాముడి పాదముద్రలు గోచరిస్తాయి. ఆయనలా ఆలోచించడాన్ని, ఆయనలాగే నడుచుకోవడాన్ని అవి ప్రోత్సహిస్తాయి. వందలమంది చెబుతున్నారు, కోట్లాది ప్రజలు వింటున్నారు. వారు చెబుతూనే ఉన్నారు, వీరు వింటూనే ఉండిపోతున్నారు. ‘రామాయణంతో పాటు రాముడు కూడా తెలుసు’ అని ధైర్యంగా చెప్పగలగడం, అందరూ నమ్మడం అతి తక్కువ సందర్భాల్లోనే సాధ్యపడుతుంది. ఆ సంఖ్య బాగా పెరగాలంటే ఏం చేయాలన్నది మన పెద్దలే తెలియజెప్పారు.
శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించాడు. అందరికీ కాదు... భీష్ముడికి, ధర్మజుడికి, యుద్ధం చూడటానికి వచ్చిన మహర్షులకు, అంతరిక్షం నుంచి గమనిస్తున్న దేవతలకు... అర్జునుడి కంటే ఎంతో గొప్పవారని లోకం భావించేవారెవ్వరికీ గీతాబోధన జరగలేదు. ఎదురుగా ఒకే ఒక్కడు- భగవంతుడి నోటి నుంచి గీతోపదేశం వినే మహద్భాగ్యానికి నోచుకున్నాడు. ప్రతిమనిషీ ఆలోచించాల్సింది- ‘ఆ ఒక్కడూ నేనే ఎందుకు కాకూడదు’ అని! ఆలోచించినవారికి ‘గీత’ ప్రసాదమే అవుతుంది. వారంతా విజయులే అవుతారు!
పరీక్షిత్తు ఒక్కడికే శుక మహర్షి భాగవతం బోధించాడు.
ఆ భగవద్గీత, ఆ భాగవతం ఇప్పుడు లోకమంతటికీ వెలుగులు పంచుతున్నాయి. లోకానికి వికాసం పంచే విద్యలు ఒక్కరికే అందే పక్షంలో- ఆ ఒక్కరూ తానే కావాలని ప్రతివారూ ఆలోచిస్తే... ఈ కలియుగం ఆ సత్యయుగం అవుతుంది. అందరం అర్జునులమవుతాం. ప్రతి మంత్రీ లాల్‌బహాదుర్ శాస్త్రి అవుతారు. ఈ దేశానికి రామాయణంతోపాటు రాముడితోనూ మరెంతో సాన్నిహిత్యం పెరుగుతుంది. అదీ ఈ యుగ అవసరం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
సాధన... సాధనం
అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించే నైపుణ్యం గలది మానవ మేధస్సు. దాని సామర్థ్యం ఉత్తమ యోగసాధనతోనే వర్ధిల్లుతుంది. అవసరమైన శిక్షణనిచ్చేవాడు, ఉత్తీర్ణతకు గల యోగ్యతను పరీక్షించేవాడు భగవంతుడు. ఆయన అంతర్యామిగా ఉంటాడు. వ్యక్తి సాధనకు తగిన విధంగా కటాక్షించే సర్వాంతర్యామి ఆయన!
జీవితంలో కొన్ని శిక్షణలు, మనిషికి శిక్షల్లా కనిపిస్తాయి. అవన్నీ పరీక్షలో అంతర్భాగమే తప్ప, కక్షతో కూడిన చర్యలు కానే కావు. సదా ప్రేమను కురిపించే భగవానుడు... క్రీస్తులా కరుణామయుడు, అల్లాహ్‌లా ధర్మస్వరూపుడు.
‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట’ అని చాటిన భక్తపోతన జీవితం ఔన్నత్యానికి సంకేతం. ‘నే పలికిన భవహరమగునట’ అనడంలో ఆయన శరణాగత దృష్టి ప్రస్ఫుటమవుతుంది. భగవంతుడి చేతిలో తాను ఒక సాధనమనే వివేక దృష్టి దర్శనీయమవుతుంది. దైవం చేతి ఆయుధమైన ఖడ్గం- లోకంలోని అజ్ఞానాన్ని ఖండించే సాధనమైంది. అదే అన్నమయ్య రూపు ధరించిందన్న భావన సర్వవిదితం, ఎంతో మనోహరం.
భస్మాసురుణ్ని అంతం చేయడానికి అతడి బుద్ధినే ఓ సాధనంగా ఉపయోగించాడు భగవంతుడు. ఆయన ప్రణాళిక అనూహ్యం, ఆచరణ అసమానం.
భక్తుడు ఏ పని చేపట్టినా, అవసరమైన సాధనాలు అందజేసి ప్రోత్సహించేది భగవానుడే! అవసరమైతే ఏ సాధనమూ అందకుండా చేసి, నియంత్రించేవాడూ ఆయనే! ఆ దయ లేదా దండన సందర్భానుసారంగా, గుణప్రాధాన్యంగా సాగిపోతుంటుంది. వ్యక్తుల్ని సాధనాలుగా వినియోగించడంలో ఆయనే తీర్పరి, నేర్పరి.
భక్తిసంబంధ పరిజ్ఞానంతో మానసిక పరిణతి సాధ్యపడుతుంది. సాధ్యాసాధ్యాల గురించి స్పష్టత ఏర్పడుతుంది. అవసరాలపై సరైన అవగాహన కలుగుతుంది. అదే అవగాహనతో పనులు తలపెడితే అన్నీ అవలీలగా సాగిపోతాయి. కార్య సఫలతకు అవసరమైనవన్నీ ఈశ్వరకృపతో సమకూరతాయని పురాణగాథలు చెబుతున్నాయి.
మనసు, వాక్కు, కర్మలు- ఇవన్నీ అంతర్యామి ప్రబోధంతో మనిషి వాడాల్సిన సాధనాలు. త్రికరణ శుద్ధితో చేసే ఏ పనికైనా తిరుగు ఉండదు. పర్యవసానం గురించి చింతించాల్సిన పరిస్థితీ ఏర్పడదు. ఆత్మవిశ్వాసమే అద్భుత ఫలితాలనిస్తుంది.
సాధనాల్లో సమయస్ఫూర్తి ఒకటి. ఎవరు ఎంత పని హడావుడిలో ఉన్నా- ఎప్పుడు ఏది సరైనదో, ఏ అంశం గురించి ఎప్పుడు ప్రస్తావించాలో తెలియడమే సమయస్ఫూర్తి. అది ఓ మానసిక ప్రజ్ఞ. అర్థం లేని భయాలు, ఆందోళనల నుంచి మనిషి బయటపడాలి. స్థిమితమైన మనసుతో, వర్తమానంలో జీవించే నేర్పుతో అతడు ముందుకు సాగడానికి సమయస్ఫూర్తి దోహదపడుతుంది.
ఆత్మవిశ్వాసం వ్యక్తి ప్రగతి సాధనకు ఉపకరిస్తుంది. భగవంతుడిపై విశ్వాసం సమాజ ప్రగతి సాధనకు సహకరిస్తుంది. ‘ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు...’ అని యోచించే భక్తుడు ‘ఈశ్వరునే శరణంబు వేడెదన్’ అని ముక్తాయించడంలో తాదాత్మ్యత వెల్లివిరుస్తుంది. అది అతడి కర్తృత్వ సామర్థ్య పరిధిని విస్తృత పరుస్తుంది. ఆ సాధన కలిగించే ప్రతిభ, లోక కల్యాణ సాధనే ధ్యేయంగా జీవించాలన్న కాంక్ష- భక్తిని బలోపేతం చేస్తాయి.
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అంటాడు వేమన. సాధన చేయాలే కానీ, నరుడికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. మానవ సాధన ఫలితంగానే అనేక రకాల సాధనాల రూపకల్పన సాగుతోంది.
ఏ రంగంలోనైనా, ఎంత ఏకాగ్రతతో సాధన చేస్తే అంత నైపుణ్యం పెరుగుతుంది. సర్వ ప్రాణుల శ్రేయస్సు కోరే సృష్టికర్త ఆశయ సాధనకు మానవుడు చేయాల్సిందేమిటి? తనకు లభించిన ప్రజ్ఞను సద్వినియోగం చేస్తూ, అతడు సాగించే ఉదాత్త జీవనమే ఉత్తమ యోగ స్థితికి కారణమవుతుంది!
- దువ్వూరి రామకృష్ణ వరప్రసాదు
ఈ భూమండలంపై వేంకటాద్రి వంటి పవిత్రమైన స్థలం మరొకటి లేదని, వేంకటేశ్వరుడి వంటి దేవుడు ‘న భూతో న భవిష్యతి’ అని ‘వరాహ పురాణం’ చెబుతోంది. అంతటి పవిత్రమైన పర్వతం సప్తగిరులకు నిలయమైన తిరుమలలో ఉంది. వేం అనే పదానికి పాపాల సమూహం అని, కట అంటే వాటిని దహించేవాడని అర్థాలున్నాయి. అందువల్ల వేంకటేశ్వర నామానికి ‘పాప నాశకుడైన దేవుడు’ అనేది అంతటా వ్యాపించి ఉన్న భావం.
శ్రీవేంకటేశ్వరుడు ‘సప్త గిరీశుడు’గా ప్రసిద్ధుడు. సప్తగిరుల వివరాలు తెలియజేసే శ్లోకం శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కనిపిస్తుంది. శ్రీ, శేష, గరుడ, వేంకట, నారాయణ, వృషభ, వృష అనే పేర్లు గల పర్వతాలే సప్తగిరులు. శ్రీ అనే అక్షరం పలు మంగళకరమైన అర్థాలకు నెలవు. లక్ష్మీదేవి, సంపద, శుభం, క్షేమం, అభ్యుదయం, మంగళం, తేజస్సు, ఓజస్సు- ఇలా ఎన్నో విశిష్టార్థాలు గల శ్రీ గిరి మొదటి పర్వతం. ‘శేష’ శబ్దం ఆదిశేషుడికి, జీవుడికి, సదా మిగిలి ఉండే సంపదకు పర్యాయ వాచకం. శేషాచలం ఆదిశేషుడి ఆకారంలో ఉంటుందని, ఆ శేషుడిపై పవళించే మహావిష్ణువులా వేంకటేశ్వరుడు ఉంటాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
జీవుడు అంటే ప్రాణి. అతడు శేషుడి వంటివాడు. ఆ శేషుడిపై అధిష్ఠించి ఉండేవాడు వేంకటేశ్వరుడు. శేషాచలం- భువిపై కల్పాంతం వరకు చిరస్థాయిగా నిలిచే పర్వతరాజం. ‘గరుడ’ శబ్దం గరుత్మంతుడికి సంకేతం. మహావిష్ణువు వేంకటేశ్వరుడిగా భూలోకంలో అవతరించినప్పుడు, గరుడుడితో పాటు వచ్చాడన్నది పురాణాల కథనం. గరుడ ఆకృతిలో ఉండే ఆ పర్వతాన్ని వేంకటేశ్వరుడు అధిరోహించి ఉంటాడంటారు. గరుత్మంతుడిది స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరి వెళ్లగల స్వభావం. లోక రక్షణ కోసం ఏ క్షణంలోనైనా గరుడ వాహనంపై ప్రయాణించడానికి దేవదేవుడు సిద్ధంగా ఉంచిన పర్వతమే గరుడాద్రి.
‘వేంకట’ శబ్దం పాప వినాశకరం. లోకంలో జీవులు పాపాల్ని నిర్మూలించుకొనేందుకు యత్నిస్తారు. అలాంటివారికి అభయ ప్రదాత వేంకటేశ్వరుడని ఆ పేరు చెబుతోంది. ‘నార’ శబ్దానికి నీళ్లు అని, మానవులు అని అర్థాలున్నాయి. సృష్టి ప్రారంభంలో నీళ్లే ఉండేవి. వాటిపై మర్రి ఆకులో బాలుడిలా పడుకొని ఉండే నారాయణుడే వటపత్ర శాయి. అలా సృష్టికి మూలమైన నీటికి ఆశ్రయమై ఉండే నారాయణుడే వేంకటేశ్వరుడు. మనుషులకూ ఆయనే ఆశ్రయం. వృషభం వంటి ఆకారంలో ఉండే పర్వతం కాబట్టి, అది వృషభాద్రి. వృషభ శబ్దం శౌర్యానికి గుర్తు. సృష్టిలో అత్యంత శౌర్యవంతుడు భగవంతుడు కావడంతో, వృషభ శబ్దం శ్రేష్ఠమైంది. ‘వృష’శబ్దానికి ధర్మం, నీతి, న్యాయం అనే అర్థాలతో పాటు వృషభం అనే అర్థమూ ఉంది.
తిరుమల పర్వతాలకు జ్ఞానాద్రి, తీర్థాద్రి, వైకుంఠాద్రి, సింహాద్రి, అంజనాద్రి, వరాహగిరి, శ్రీనివాస గిరి, ఆనందాద్రి, క్రీడాద్రి అనే పేర్లూ ఉన్నాయని ‘వేంకటాచల మాహా త్మ్యం’ వివరిస్తుంది. బ్రహ్మ సృష్టిలో అమూల్యమైనవిగా భావించే ఆ పర్వతాలు- భౌగోళికంగా పలు సంపదలకు నిలయాలు, చరిత్రకు ఆనవాళ్లు. ప్రకృతి ప్రసాదించిన సంపదల్లో పర్వతాల స్థానం సమున్నతమైంది. పర్వతాలకు ‘భూధరాలు’ అని పేరు. అంటే, అవి భూమిని ధరిస్తున్నాయని అర్థం. భూమి పర్వతాలను మోస్తున్నదా లేక పర్వతాలే భూమిని మోస్తున్నాయా అంటే- శాస్త్రీయంగా పర్వతాలే భూమిని మోస్తున్నాయని చెబుతారు. జాతి సంపద అయిన పర్వతాలు అపార ఖనిజాలతో విరాజిల్లుతున్నాయి.
సప్తగిరుల సౌందర్యం వర్ణనాతీతం. ఆ గిరుల్లో ధగధగలాడే మేలిమి వజ్రం శ్రీవేంకటేశ్వరుడు. పర్వతాల్లో ప్రవహించే పవిత్ర ఝరులు అసంఖ్యాకాలు. అనేక ఓషధుల్ని తెచ్చే జాబాలి, సనకసనందన, కుమారధార, తుంబురు, ఆకాశగంగ, పాండవ, పాపనాశన, దేవ, పద్మ తీర్థాల వైభవం అనంతం.
కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమల- ఎందరు ఎన్నిమార్లు దర్శించినా తనివి తీరని పుణ్యక్షేత్రం. అది శ్రీవేంకటేశ్వరుడి సన్నిధానం!
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
ఆరోహణం
ఎవరెస్టు శిఖరం అధిరోహించాలనుకునే పర్వతారోహకులు తమ తమ దేశాల జాతీయ పతాకాలను వెంట తీసుకెళ్తారు. ప్రమాదకర ప్రయాణం, ప్రతికూల వాతావరణం, దుర్భర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని తమ దేశ ప్రతిష్ఠను ప్రతిబింబించే జాతీయ జెండాలను ఎవరెస్ట్‌పై ప్రతిష్ఠించే ధీరులు వారిలో కొద్దిమందే ఉంటారు. ఎలాంటి దుస్థితి ఎదురైనా ధైర్యం విడవని స్థిరమైన మానసిక స్థితిని ‘ధృతి’ అంటారు. ధృతి- ధీరుల సహజ సంపద. మనిషికి నిజమైన తోడు ఏమిటన్న యక్ష ప్రశ్నలకు ధర్మరాజు బదులిస్తూ- ‘ధైర్యం అసలైన తోడు’ అన్నాడు. కనుక ధృతి, ధైర్యం అనేవి ప్రతి మనిషి అలవరచుకోవాల్సిన గుణాలు.
పట్టుపీతాంబరాలు ధరించి, సింహాసనం అధిష్ఠించాల్సిన సమయంలో నారచీరలు చుట్టుకుని వనవాసానికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది రాముడికి! అయినా ఆయన మానసికంగా కుంగిపోలేదు. తండ్రిని గాని, కైకను గాని పల్లెత్తుమాట అనలేదు. నిశ్చింతగా అడవులకు ప్రయాణమయ్యాడు. పైగా తండ్రిపై తిరగబడ్డ లక్ష్మణుణ్ని సముదాయించాడు. ధృతి అన్నమాటకు అర్థం అది. ధృతిమంతుడు కాబట్టే ‘నా కర్మకాలి కోతులతో కలిసి మెలసి తిరగాల్సి వచ్చింది’ అనిగాని, ‘రాక్షసుడితో చేయి కలపాల్సి వచ్చింది’ అని గాని కించపరుచుకోలేదు, చిన్నబుచ్చుకోలేదు. అయోధ్యలో ఎలా ఉన్నాడో అడవిలోనూ అలానే ఉన్నాడు. భరతుడు, సుగ్రీవుడు, విభీషణుడితో ఒకే సోదర భావం ప్రదర్శించాడు. గుహుణ్ని సైతం అదే దృష్టితో మన్నించగలిగాడు. సమస్థితికి ఉదాహరణగా నిలిచాడు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను గత శతాబ్దపు అత్యుత్తమ శాస్త్రవేత్తగా లోకం కొనియాడింది. సర్ ఐజాక్ న్యూటన్ కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడని పొగిడింది. ఆ పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బు కాలేదు సరికదా, ఐన్‌స్టీన్ వాటిని ఖండిస్తూ ‘భౌతిక శాస్త్ర అధ్యయనంలో నేను న్యూటన్ భుజాలపై ఎక్కి నిలుచున్నా కనుక మీకంత ఎత్తుగా కనపడుతున్నాను. ఆయన కాలానికి ముందు అలాంటి నిచ్చెనలు ఏమీ లేవు. అయినా, న్యూటన్ నాకు గొప్ప నిచ్చెన కాగలిగాడు... గమనించండి’ అన్నాడు. పొగడ్తలకు ఆనందంతో పొంగిపోకుండా ఉండటమూ ధృతిమంతుడి లక్షణమే!
రైలులో ప్రయాణిస్తుండగా గాంధీజీ కాలి చెప్పు ఒకటి జారి బయటపడిపోయింది. మామూలు మనుషులకైతే దాని ధర గుర్తొస్తుంది. దుఃఖం ముంచుకొస్తుంది. గాంధీజీకి కర్తవ్యం స్ఫురించింది. గబగబా రెండో చెప్పు చేతిలోకి తీసుకుని, మొదటిది జారిపడిన దిశగా విసిరేశారు- రెండూ అయితే ఎవరికైనా ఉపయోగపడతాయన్న వూహతో! ఏ సమయంలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చటుక్కున స్ఫురించడమూ ధృతిమంతుడి స్వభావంలో భాగమే!
ఎందరో ప్రతి చిన్న విషయానికీ బెంబేలెత్తిపోవడం గమనిస్తున్నాం. చిన్న ఓటమికి సైతం కుంగిపోవడం చూస్తున్నాం. అవమానం ఎదురైతే అఘాయిత్యాలకు పాల్పడటం వింటున్నాం. అమ్మానాన్నలు ఏదో అన్నారని, ఉపాధ్యాయులు మందలించారని, మార్కులు తక్కువ వచ్చాయని, ప్రేమించినవారు పరిహసించారన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు సైతం తెగిస్తున్న దుస్సంఘటనలను చదువుతున్నాం.
వెదురు వేణువు కావాలంటే, అందులోని గుజ్జు, పోగులు దగ్ధం కావలసిందే! మనిషి ధృతిమంతుడు కావాలంటే పై బలహీనతలను దూరం చేసుకోవాలి. వేణువైన వెదురే కృష్ణుడి పెదవిని తాకగలుగుతుంది. మోహనరాగం వినిపిస్తుంది. మనిషి ధృతిమంతుడు అయినప్పుడే జీవితం పరిమళిస్తుంది. ధృతిమంతుల కథలు అందుకు దారి చూపుతాయి. సేద తీరుస్తాయి. ధైర్యాన్నిస్తాయి. ముందుకు నడిపిస్తాయి. యువతను ఎవరెస్టు శిఖరాలు ఎక్కిస్తాయి. జెండాలు పాతిస్తాయి. విజేతలను చేస్తాయి. వాటిని జాతికి నివేదించడం విద్యావంతుల తక్షణ కర్తవ్యం!
- ఎర్రాప్రగడ
ధ్యేయ సాధన
జీవితమే ఓ లక్ష్యం, జీవన గమనమే ఆ లక్ష్యసాధనకు మార్గం! ప్రతి జీవికీ లక్ష్యాన్ని దేవుడు నిర్దేశిస్తాడంటారు. ప్రకృతిమాత బిడ్డలుగా జీవరాశి అంతటికీ సాధారణ లక్ష్యాలు కొన్ని ఉంటాయి. పాటించాల్సిన ధర్మాలూ ఉంటాయి. అవి వాతావరణ సమతులనాన్ని కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. పట్టుపురుగు తన జీవితాన్నే పణంగా పెట్టి విలువైన పట్టును అందిస్తుంది. తేనెటీగలు అహోరాత్రాలు కష్టపడి తేనెను సమకూరుస్తాయి. పునుగుపిల్లి తైలాన్ని స్రవించి, ‘కలియుగ ప్రత్యక్షదైవం’గా భావించే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి అభిషేక సేవకు సమర్పిస్తుంది. ప్రకృతిలోని పలు రకాల వృక్షాలు అనేక ఫలాల్ని అందరికీ అందిస్తున్నాయి.
నదులు, సరస్సులు, కాలువలు పంటలు పండటానికి అన్నివిధాలా దోహదపడుతున్నాయి. పంచభూతాల్లో ఒకటైన భూమి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! అది వివిధ పంటలకు ఆలవాలమై సస్యశ్యామల క్షేత్రంగా భాసిస్తుంది. అపారమైన జలనిధుల్ని, ఖనిజ వనరుల్ని అందిస్తుంది. పంచభూతాల్లోని మిగిలిన- గాలి, నీరు, నిప్పు, ఆకాశం తమ లక్ష్యాలు అనుసరించి; ఫలితాల్ని కాలానుగుణంగా అందిస్తున్నాయి. ఇవీ- ప్రకృతి లక్ష్యాలు, ఆ లక్ష్యసాధన వల్ల కలిగే ఫలితాలు.
తరతరాలుగా అనేకమంది తమ లక్ష్యాల్ని సాధించడమే కాకుండా, అందరికీ మార్గదర్శకులయ్యారు. ధర్మాచరణలో యుధిష్ఠిరుడు, విలువిద్యలో అర్జునుడు, శారీరక బలంలో గదాకౌశలంలో భీముడు, గుర్రపు స్వారీ- అశ్వశిక్షణలో నకులుడు, జ్యోతిష్య- ఖగోళ విజ్ఞానశాస్త్రాల పరిజ్ఞానంలో సహదేవుడు... ఇలా పాండవులు ఎదురులేని లక్ష్యసాధకులుగా కనిపిస్తారు ‘మహాభారతం’లో!
కావాల్సిన మానసిక, శారీరక సత్తువను సాధకుడు సమకూర్చుకోవాలి. లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు అవి వాటంతట అవే సిద్ధిస్తాయి. గురువు ద్రోణాచార్యుడు ‘చెట్టుపై నీకేం కనిపిస్తోంది’ అని అడిగినప్పుడు, ‘పక్షి కాదు- నేను ఛేదించాల్సిన పక్షి కన్ను కనిపిస్తోంది’ అని బదులిచ్చిన అర్జునుడిలో లక్ష్యశుద్ధిని చూడవచ్చు. గురువు ప్రతిమనే ఆలంబనగా చేసుకొని విలువిద్యా పారంగతుడైన ఏకలవ్యుడిలోనూ ఆ లక్ష్యశుద్ధిని చూడవచ్చు. ఒంటరివాడైనా, తిరుగులేని తన శక్తినెరిగి సముద్రాన్ని అవలీలగా దాటాడు హనుమ. భయంకరమైన రాక్షససేనల్ని మట్టుపెట్టి, సీతమ్మ క్షేమ సమాచారాన్ని రామయ్యకు అందించిన ఆయనలో లక్ష్యశుద్ధిని దర్శించవచ్చు. నిరంతర శ్రమ, కర్తవ్య నిష్ఠ, అకుంఠిత దీక్ష, వెనుదిరగని నైజమే లక్ష్యసాధనకు సోపానాలు.
పదునైన భావజాలంతో కూడిన సంకీర్తన సందేశాలతో తెలుగుజాతిని జాగృతం చేసిన అన్నమాచార్య- ప్రతి మనిషికీ ఓ లక్ష్యం ఉండాలంటాడు. ఏ లక్ష్యమూ లేకుండా కాలయాపన చేయరాదని ఓ సంకీర్తన ద్వారా తెలియజెప్పాడాయన. భూమిమీదకు వచ్చిన తరవాత మనిషి ఏ పనీ లేకుండా ఉండకూడదు. లక్ష్యసాధన దృష్టితో ముందుకు సాగాలన్నదే ఆయన గాన సందేశం. చూడాలన్న సంకల్పం మనిషికి ఉంటే, ఆ భగవంతుణ్నే దర్శించవచ్చు, ఏ లక్ష్యమూ లేనప్పుడు, సమస్త ప్రపంచమూ చీకటిగా కనిపిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగితే, ఈ భూమినే చుట్టిరావచ్చు- అని బోధించాడు అన్నమయ్య.
‘వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ/ జాడతో నూరకుండితే జడుడౌను/ వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ/ కూడక సోమరియైతే గుణహీనుడౌను’- ఆనందంగా చదివేవాడికి వేదశాస్త్ర పాండిత్యం అబ్బుతుంది. ఏదీ చదవనివాడు జడమతి అవుతాడు. కొరగానివాడిగా మారతాడు. తపోనిష్ఠ గలవాడు ఉన్నతుల్లో ఉన్నతుడవుతాడు. సోమరి- గుణహీనుడై చివరికి సమాజానికే భారమవుతాడు. నిత్యసత్యాలతో కూడిన ఇటువంటి సార్వత్రిక సందేశాల్ని ముప్ఫై రెండు వేల సంకీర్తనల ద్వారా సమాజానికి అందించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. తాను నమ్మిన అన్నింటినీ దైవానికి సమర్పించి, వాటిని తెలుగుజాతికి తరగని నిధిగా ప్రసాదించాడాయన. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలి. వాటిని పట్టు వదలని దీక్షతో సాధించుకొని, జీవన సాఫల్యం పొందాలి! - గంధం బసవ శంకరరావు
మనిషికి అణకువ- పెట్టని ఆభరణం కావాలి. అణకువతో ఉండేవారినే అందరూ అభిమానిస్తారు. ఆదరిస్తారు. ఒదిగి ఉండే వారిముందే లోకమూ ఒదుగుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు, ముందుగా అణకువ అలవరచుకోవాలి. అందరితో కలిసి పనిచేసుకుపోవాలి. కొంతమందితో పొరపొచ్చాలు ఏర్పడటం అతి సహజం. అప్పుడే శాంతం అవసరమవుతుంది. ఎటువంటి పరిస్థితులైనా నిదానంగా చక్కబడతాయి.
సృష్టిని నిశితంగా గమనిస్తే- మధుర ఫలాలనిచ్చే వృక్షాలు, సుగంధభరిత పుష్పాలతో తలలూపే మొక్కలు, తీయని జలాలనిచ్చే నదులు గోచరిస్తాయి. అందానికి, ఆనందానికి పర్యాయపదాలుగా నిలిచే ప్రాణులూ కనిపిస్తాయి. వాటితో పాటు మానవ మనుగడకు సహాయకారులైన ఏవీ మిడిసిపడవు. తాము లేకుంటే ప్రకృతి స్తంభించిపోతుందని అహంకరించవు.
బుద్ధిజీవులుగా ఉండాల్సిన మానవులే పలు అసమానతలు సృష్టించుకొంటున్నారు. జీవన మాధుర్యాన్ని, మనశ్శాంతిని కోల్పోతున్నారు. పిల్లలు అణకువతో ఉంటే, తల్లిదండ్రులు మురిసిపోతారు. శిష్యుడు బుద్ధిగా, అణకువతో ఉంటే గురువు అతడికి సమస్త విద్యలూ బోధిస్తాడు. తనంతటివాణ్ని చేయాలని ఆరాటపడతాడు. గురువును మించిన శిష్యుడని లోకులు పొగుడుతుంటే, గురువు ఎంతో పొంగిపోతాడు.
సచ్ఛీలతలో వినయమూ ఓ భాగమే! అణకువే విజయానికి మార్గం అనేవారు మహాత్మాగాంధీ. సభలో పదుగురినీ మెప్పించాలంటే వినమ్రపూర్వకంగా ప్రసంగించాలి. అప్పుడే మంచి వక్తగా పేరు లభిస్తుంది. నాయకత్వ లక్షణాల్లోనూ నమ్రతదే ప్రధాన పాత్ర.
ఒకసారి సత్యభామ కొన్ని ఫలాలు తెచ్చి శ్రీకృష్ణుడి ముందు ఉంచుతుంది. ‘ఇవి నా తోటలో పండినవి. వీటిని మీరెక్కడా చూసి ఉండరు. ఎంతో రుచిగా ఉంటాయి’ అని గొప్పలు చెబుతుంది. ఆయన ఒక పండు రుచి చూసి నవ్వి ‘ఇవి సారహీనంగా ఉన్నాయి’ అంటాడు. ఒక గ్రామీణు రాలు దోసిట్లో కొన్ని నేరేడుపళ్లు తెచ్చి ‘స్వామీ! ఇవి మీలాగే శ్యామసుందరాలు. నాకెంతో ఇష్టం. తిని ఎలా ఉన్నాయో చెప్పండి’ అంటుంది. ఆయన వాటిని తిని ఎంతగానో ప్రశంసిస్తాడు. అణకువ కలిగించే ఫలితం అలా ఉంటుంది. తులాభారం సమయంలో సత్యభామ అంతులేని సంపదతో కృష్ణుణ్ని సరితూచాలని చూస్తుంది. అప్పుడు ఆమె ఆభిజాత్యమే ప్రస్ఫుటమవుతుంది. నిండుప్రేమ గల రుక్మిణి కేవలం తులసి ఆకుతోనే ఆయనను సొంతం చేసుకుందంటే, అది అణకువ ఫలితమే! భక్తి ప్రకటితమయ్యేది అణకువతోనే. అందుకే సత్యభామ కంటే రుక్మిణి, సాధారణ గ్రామీణురాలు- కన్నయ్య మనసులో చిరస్థాయిగా నిలిచారు.
శ్రీకృష్ణుణ్ని పాండవ పక్షపాతి అంటారు. అందుకు కారణం, ఆయనను వారిలో ఆకర్షించిన లక్షణం పాండవుల వినయ గుణమే. ఎందరు ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఎంత విలువైనవి సంపాదించినా- చివరికి ముక్తిమార్గం చూపేది భగవంతుడే. వినయంగా ఉంటూ, సదా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ, మానవుణ్ని మాధవుడిగా పరిగణిస్తూ మనుగడ సాగించేవారినే దైవం అక్కున చేర్చుకుంటాడు. మనసును సుగంధ పుష్పంగా చేసి స్వామి చరణాల వద్ద అలంకరిస్తే, మనిషి అనుకున్నది సాధించడం సులభసాధ్యం అవుతుంది. జన్మ చరితార్థమవుతుంది. అన్నింటికీ మూలాధారం అతడి అణకువ స్వభావమే తప్ప, మరొకటి కాదు!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడ
ఈర్షాయసూయలు
సకల ప్రాణికోటికి భిన్నంగా మానవుడికి గల ఒక దుర్లక్షణం ‘ఈర్ష్య’. అదే- అసూయ! మనుషుల్లో ఒకరి పట్ల మరొకరికి అటువంటి లక్షణానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు. అసూయ ఓ దుర్గుణం. అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సరాల్లోని ‘మాత్సర్యం’ అసూయే! ఈ ఒక్క అవగుణం చాలు- మనిషిని నిలువునా ముంచివేయడానికి! ఈర్ష్యను జయించే మార్గాల్ని ఎందరో మహనీయులు అన్వేషించారు. పరిష్కారాలూ చూపారు. సాధన ద్వారా ప్రయత్నపూర్వకంగా మానవుడు ఈర్ష్యను జయించగల వీలుంది. దానికి బానిసగా మారి నిండు జీవితాన్ని బలిచేసుకునే మనిషిని ఎవరూ రక్షించలేరు. అవతలివాడు తనను అధిగమిస్తున్నాడని భావించినప్పుడు- మనిషిలో ఈర్ష్య జనిస్తుంది, జ్వలిస్తుంది. ఓ అత్యున్నత శ్రేణి వ్యక్తి, సాధారణ పౌరుడి మధ్య అసూయకు తావు లేదు. ఎరిగినవారిలోని ఆధిక్యతే మనిషి అసూయకు కారణమవుతుంది. మాత్సర్యం ఓ మానసిక జాడ్యం. అది ప్రబలినప్పుడు, మానవుడు విద్వేషాగ్నిలో దహించుకుపోతాడు. ఈర్ష్య వల్ల పుట్టే ద్వేషం అతడి శారీరక, మానసిక ఆరోగ్యాలకు చెరుపు చేస్తుంది.
అసూయ దరికి రాకుండా జాగ్రత్తపడాలంటారు విజ్ఞులు. ఆ ఈర్ష్యకు ఆవేశం తోడైతే జరిగే అనర్థం మాటల్లో వర్ణించలేనిదంటారు. ఒకరికి గల సంపద, నైపుణ్యం, అందం వేరొకరిలో న్యూనతకు దారితీస్తే- మాత్సర్యం పుడుతుంది. ప్రేమ, అణకువ వల్లనే మనిషి ప్రశాంత జీవనం సాగించగలడు. ‘ఒకరు నీ మీద ఈర్ష్యపడుతున్నారంటే, నీలో ఆ వ్యక్తి మెచ్చే గొప్పతనం ఏదో ఉంది. అందుకు నువ్వు గర్వించవచ్చు. అణకువ ప్రదర్శించడం వల్ల, ద్వేషించే వ్యక్తినుంచి రక్షణ పొందడమే కాక మన్ననా పొందవచ్చు. ద్వేషంతో రగిలే వ్యక్తి తనకు తానే నష్టం కొనితెచ్చుకుంటాడు. అతడి మనసు శాంతిని కోల్పోతుంది’- అంటారు పెద్దలు.
‘అసూయపడకండి! అందుకు బదులుగా- వారినుంచి పాఠాలు నేర్చుకోండి, అధిగమించండి’ అనే బలమైన భావం ఒకటి భాగవతంలో కనిపిస్తుంది. నారదుడు, తుంబురుడు గాన గంధర్వులు. ఒకసారి తుంబురుడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు సమక్షంలో తన గానవిద్య ప్రదర్శించి మన్నన పొందాడు. తుంబురుణ్ని పోటీదారుగా భావించిన నారదుడు, తన సంగీత ప్రజ్ఞను విష్ణువు ఎదుట ప్రదర్శించాలని ప్రయత్నించాడు. అది ఆయనను అలరించలేదు.
తుంబురుడి పట్ల అసూయ జనించిన నారదుడు కైలాసగిరికి వెళ్లి, మహేశ్వరుణ్ని తన రాగాలాపనతో ప్రసన్నం చేసుకున్నాడు. వరాలు పొందాడు. వరబలంతో విష్ణువు మెప్పు పొందాలన్న నారదుడి రెండో ప్రయత్నమూ సఫలం కాలేదు. ఆయన సంగీతం విష్ణుమూర్తిని మెప్పించలేదు. అందుకు కారణం తుంబురుడి పట్ల తనలో కలిగిన అసూయేనని గ్రహించిన నారదుడు ఇక ఆలస్యం చేయలేదు. తుంబురుణ్నే ఆశ్రయించి సంగీతంలోని మెలకువలు తెలుసుకున్నాడు. అటు తరవాత ఆయన గానం శ్రీమన్నారాయణుని మెప్పించడం, పరమానందభరితుణ్ని చేయడం ఏకకాలంలో జరిగాయి.
ఈర్షా్యసూయలు మానవ సహజమైన బలహీనతలు. వాటిని అధిగమించగల ఒకే ఒక తారక మంత్రం- ప్రేమ, వినయసంపద కలిగి ఉండటమే! వినయ విధేయతలు ప్రదర్శించే వ్యక్తి ఎన్నడూ బలహీనుడు కాడు. వినయంతో కూడిన ప్రజ్ఞాపాటవాలు బంగారానికి పరిమళం అబ్బినట్లు భాసిస్తాయి. మనోక్షేత్రాన్ని విస్తరించుకున్న వ్యక్తి ఎప్పుడూ అసూయ కాటుకు గురి కాడు. సౌభ్రాతృత్వ భావన కలిగి ఉంటే, మనిషి ఈర్ష్యవల్ల జనించే దుర్భావాలకు దాసుడు కాబోడు.
ఈర్షా్యసూయలు లేని వ్యక్తికి సమాజంలో గౌరవాదరాలు సమృద్ధిగా లభిస్తాయి. ‘ఈర్షా్యపరుల వల్ల అందుకు కారణమైన సద్గుణ సంపన్నులు ఏనాడూ ఇబ్బందిపడరు. అసూయగలవారినే మాత్సర్యం కాల్చి భస్మం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!’ అని హెచ్చరించాడు విలియం పెన్ అనే పాశ్చాత్య పండితుడు!
- గోపాలుని రఘుపతిరావు
అగ్ని వలయం
మనిషి ఉన్నత గుణాలతో ఎదగాలి. హానికరమైన వాటిని వదిలేయాలి. అటువంటి లక్షణాలు అతడి వ్యక్తిత్వాన్ని, శీలసంపదను కాల్చివేసే నిప్పుకణికలు. అన్నింటికన్నా అత్యంత ప్రమాదకారి- అహంకారం. అది ప్రబల శత్రువు వంటిది. మానవుడి వెన్నంటి ఉంటూనే అధఃపాతాళానికి తొక్కేస్తుంటుంది.
అందం, ఐశ్వర్యం, విద్య, హోదా, పరువు, ప్రతిష్ఠ, అధికారం- ఇవన్నీ మనిషి సాధించుకోవాల్సినవే. వాటి వల్ల ఏ దశలోనూ అహంకారం పెరగకూడదు. అనేక దుర్లక్షణాలకు అదే పుట్టినిల్లు. అహం తన చుట్టూ తానే గిరి గీసుకుంటుంది. అదొక అగ్ని వలయం అని మనిషి అంత త్వరగా గ్రహించలేడు. అహంకార ధోరణితో మిడిసిపడుతూ, అందరి నుంచీ తాను వేరైపోతాడు.
ఆ పరిణామం, సజావుగా సాగే మానవ జీవన గమనాన్ని ఛిద్రం చేసి, చివరికి గతి తప్పే పరిస్థితి కల్పిస్తుంది. పలు ప్రమాదాల్ని కొనితెస్తుంది. అందుకే, ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న ఆర్యోక్తిని అతడు పట్టించుకోడు. వివేకం, విచక్షణ- రెండూ నశిస్తాయి. ఫలితంగా అతడిలో గల సుగుణాలూ నిరర్థకమవుతాయి. ఏదైతే వదిలిపెట్టాలో, దాన్ని అసలే వదలని తత్వం అతడిది. అదే మనిషిలోని పెద్ద బలహీనత.
అహంకార ధోరణికి దుష్ఫలితాలు ఎలా ఉంటాయో పురాణేతిహాసాల్లోని పలు కథలు విడమరచి చెబుతాయి. ఒకసారి దూర్వాస మహర్షికి శ్రీమహావిష్ణువు- తాను ధరించిన వైజయంతి మాలను ఇస్తాడు. దాన్ని రుషి మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. ప్రయాణం తిరుగుముఖంలో ఉండగా, ఐరావతంపై ఎదురైన ఇంద్రుణ్ని చూస్తాడు. తన చేతిలోని వైజయంతిమాలను ఇవ్వడం, ఇంద్రుడు దాన్ని తృణీకార భావంతో గజంపైకి విసిరేయడం జరిగిపోతాయి. స్వామిమాలను అది తొక్కివేస్తుంది.
భగవంతుడికి అలంకరించిన దండలు, అర్పించిన పూలు- వసివాడిన తరవాత తీసివేస్తుంటారు. వాటిని ‘నిర్మాల్యాలు’ అంటారు. అవి పవిత్రమైనవి. వాటిని పలువురు భక్తితో స్వీకరించడమో, ఎక్కడా తొక్కిడికి ఆస్కారం లేని తావులో ఉంచడమో చేస్తుంటారు. సాక్షాత్తు విష్ణుదేవుడే తాను ధరించిన మాలను దూర్వాసుడికిచ్చాడు. ఇంద్రుడి అహంకార పూరిత చేష్టతో, రుషి ఆగ్రహోదగ్రుడయ్యాడు. స్వర్గంలోని కల్పవృక్షం, కామధేనువు సహా సకల సిరిసంపదలూ సముద్రంపాలయ్యేలా శపించాడు. అన్నీ కోల్పోయిన ఇంద్రుడు, అన్నింటికీ కారణం తన అహంకారమే అని తెలుసుకొన్నాడు. ఆయన పట్ల దేవలోకంలో సానుభూతీ కరవైంది. కోల్పోయిన స్వర్గ సంపదను ఆ తరవాత క్షీరసాగర మథనంలో తిరిగి దక్కించుకోగలిగాడు.
నేను, నాది అన్నదే అహంకార భావన. ‘నేను అనేది అంత ఇష్టమైతే, దాన్ని అనంతంగా పెంచు. విశ్వమంతా నీవేనని గ్రహించు. లేదా- దాన్ని పూర్తిగా విడిచిపెట్టు’ అంటారు ఆదిశంకరులు. ‘అహం ఉన్నంత కాలం దైవత్వానికి నీ హృదయంలో చోటు ఉండదు. అది తొలగించుకో. భగవానుడి సేవకుడినని గర్వపడు’ అని బోధిస్తారు శ్రీరామకృష్ణ పరమహంస.
అహంకారం మూడు రూపాల్లో ఉంటుంది. మొదటిది తామసికం. అది ప్రమాదకారి. ఇతరులకు హాని చేస్తుంది. ‘నీవెంత?’ అనే ధోరణితో ఉంటుంది. రెండోది- రాజసిక అహంకారం. దర్పం, హోదా, ఆధిపత్యాల కల గలుపుగా వ్యాపిస్తుంది. ‘అంతా నాదే!’ అంటుంది. మూడోది సాత్విక అహం. ‘అంతా నీవే’ అంటుంది. మనిషిలోని భావాలకు, అనుభూతులకు అనుగుణంగా అది ప్రభావితమవుతుంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహం- దైవాన్ని మరిచేలా చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి అహం తగ్గి, దేవుడు గుర్తొస్తాడు.
సాధకుడు తన సాధనలో విజయం సాధించాడంటే, దాని వెనక వెన్నుదన్నుగా నిలిచే శక్తులు ఎన్నో ఉంటాయి. శిష్యుడి ప్రయోజకత్వం వెనక గురువు శ్రమ, శ్రద్ధ, ప్రేమ ఉంటాయి. ఉన్నతస్థాయిలోని సంతానం వెనక తల్లిదండ్రుల కృషి, త్యాగం నెలకొని ఉంటాయి.
అహంకారాన్ని తొలగించుకోవాలంటే, ప్రేమ తత్వం ఒక్కటే మార్గం. వివేకవంతుడైన మనిషి, తన అహం ప్రమాదకారిగా పరిణమించకుండా చూసుకోవాలి!
- దానం శివప్రసాదరావు
మనసు మర్మం
అందరి మనసులూ మంచివే! అసత్యం చెప్పకూడదని అందరికీ తెలుసు. కానీ, మనసు స్థిరంగా ఉండదు. మనసును కోతితో పోలుస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, రాగ, ద్వేషాలు అనే ఏడు కారణాల ద్వారా మనిషి అసత్యం చెబుతాడు. సత్యం ఒక్కటే, అసత్యం అనేక రకాలు! మనిషి అబద్ధం చెప్పేటప్పుడు ఒక్క మాటపై నిలవడు. నానా విధాలుగా మాట్లాడతాడు. ఇలా పలు విధాలుగా పలకడానికి కారణం కామ క్రోధాదులు.
మనిషి ఔన్నత్యానికి, అధోగతికి- రెండింటికీ మనసే కారణం. అందుకే మనసును నియంత్రణలో పెట్టడం కోసం పెద్దలు కొన్ని పరిమితులు చెప్పారు. రుషి రుణం, దేవ రుణం, పితృ రుణం అనేవాటిని తీర్చకుండా మనసును మోక్షం కోసం వినియోగిస్తే అతడు అధోగతి పాలవుతాడు. మోక్షాన్ని కోరేవాడు ముందుగా ఆ మూడు రుణాలూ తీర్చాలి.
ఏ పని చేసినా మనసుకు సంతోషం కలిగించే విధంగా ఉండాలి. తల్లిని, తండ్రిని, విద్వాంసులను, గురువులను, ఆవులను కష్టపెట్టకూడదు. అది పెద్దల మనసును బాధ పెట్టడమే కాక, కష్టపెట్టినవారి మనసులో కూడా బాధ మిగులుస్తుంది. అందువల్ల వాటి జోలికి పోకూడదు. వీటిలో సంతోషం కలిగించనివాటిని విపరీత కర్మలు అంటారు. వాటిని వదిలేయాలి. స్వతంత్రంలో ఉండే మానసిక సంతృప్తి బానిసత్వంలో ఉండదు. అలాగే పనులు కూడా. అస్వతంత్రపు పనులు సుఖాన్ని కలిగించవు. చేసే పని తన వశంలో ఉన్నట్లయితే సుఖం కలుగుతుంది. ఉదాహరణకు పెద్దలు ఎవరైనా వస్తే మనం కూర్చున్న ఆసనం వారికి ఇచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించి ఆ తరవాత వారితో మాట్లాడాలి. వారు తిరిగి వెళ్ళేటప్పుడు కొంతదూరం వెంటవెళ్ళి వచ్చినట్లయితే ఇరువురికీ మానసిక తృప్తి ఉంటుంది. మనసు, చిత్తం, బుద్ధి- ఈ మూడు మాటలూ విద్వాంసుల దృష్టిలో ఒకటి కాదు. జనవ్యవహారంలో మాత్రం ఒకటే!
పుష్పం సువాసనలు వెదజల్లుతుంది. బురదలో పుట్టిన పద్మం సైతం సౌకుమార్యంతో కళకళలాడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు ఈ ప్రకృతిని అందమైన పూలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాడు. ఈ సౌకుమార్యం, ఈ స్వచ్ఛత మానవుడి హృదయం అనే పుష్పం పొందితే ఇక లోకంలో అంతా సుగంధమే వ్యాపిస్తుంది. పరమాత్మకు కావలసినది అదే. మనసు స్వచ్ఛంగా ఉండాలి. మనసు, వాక్కు, చేతులు, చెవులు, కన్నులు, బుద్ధులు అనే ఆరు ఇంద్రియాలు మనిషికి ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
మనసుతో చేయగలిగినది ఈశ్వర ధ్యానం. దాన్ని అనుసరించి వాక్కుతో ఈశ్వర స్తుతి, చేతులతో ఈశ్వర పూజ, చెవులతో ఈశ్వర గాథను వినడం, కంటితో ఈశ్వరుడిని చూడటం, ఇంకా బుద్ధిని ఈశ్వరుడిపై లగ్నం చేయడం... ఇలా చేయడం వల్ల ఈ ఆరు ఇంద్రియాలూ సార్థకం అవుతాయి. వారికి వేరే ఆలోచనలు రావు. మనసు చంచలత్వాన్ని గుర్తించిన శంకరాచార్యుల వారు ఇలా అంటారు- ‘ఓ కపాలీ! నా మనసు సదా సంసార వ్యామోహం అనే అడవిలో సంచరిస్తోంది. ఆశ రూపంలో ఉండే కొమ్మలపైకి దూకుతున్నది. కోతిలాగా గెంతుతున్న నా మనసును భక్తి అనే తాడుతో కట్టేసి నన్ను పట్టుకో!’
సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధారణ, లజ్జ, జ్ఞానం, భయం- ఈ లక్షణాలతో ఉన్న తత్వాన్నే మనసు అంటారు. సాధన చేసే వారికి అయిదు విధాలైన స్థితులు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉండటం, నిద్ర, సమాధి ఎక్కువసేపు నిలవక పోవడం, ధ్యాస మళ్లడం, మనసు తనను తానే మరచిపోవడం- వీటిలో చివరిదాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. మహా యోగులు దీన్నే కోరుకుంటారు. విశ్వామిత్రుడు యుగపరివర్తన కోరుకున్నాడు. సత్యవ్రత ఔన్నత్యాన్ని లోకానికి హరిశ్చంద్రుడి ద్వారా నిరూపించాడా బ్రహ్మర్షి. హరిశ్చంద్రుడి మనసు నిండా సత్యమే ఉన్నది. రాజ్యవైభవాన్ని, భార్యాబిడ్డల్ని సత్యం కోసం త్యజించాడు. తుదకు తాను కాటి కాపరిగా ఉండవలసి వచ్చినా సత్యమార్గం తప్పలేదు. కష్టాలు హరిశ్చంద్రుడి మనసును మార్చలేకపోయాయి. హరిశ్చంద్రుడి సత్యనిష్ఠకు పరమేశ్వరుడి మనసు సంతోషంతో పులకరించింది. హరిశ్చంద్రుడి గాథ గాంధీ మహాత్ముడి మనసుపై గాఢమైన ముద్రవేసింది. ఎందరో మహాత్ములకు ఇప్పటికీ మార్గదర్శనం చేస్తున్నది!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
రాజమార్గం
గణాధిపత్యం కోసం భూ ప్రదక్షిణం చేసి రమ్మని వినాయకుడికి, కుమారస్వామికి పందెం పెట్టారు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు. వినాయకుడు లంబోదరుడు. మూషిక వాహనుడు. ఆయన మయూర వాహనుడైన కార్తికేయుడితో ఎలా గెలవగలడు? అందుకే నారదుడి ఉపదేశం అనుసరించి తల్లిదండ్రులిద్దరికీ ప్రదక్షిణ నమస్కారాలు చేసిన వినాయకుడు- భూప్రదక్షిణం చేసినంత ఫలం పొందుతాడు. అందువల్ల ఆయన గణాధిపత్యమూ సాధించాడన్నది పురాణ గాథ.
ఏ పని చేయడానికైనా పలు మార్గాలుంటాయి. శ్రమతో కూడిన బండ పద్ధతులు కొన్ని, ఉపాయంతో సాగే సులభ విధానాలు మరికొన్ని. తెలివైనవాడు సద్గురువుల కారణంగానో, చదువుసంధ్యల ద్వారానో, స్వబుద్ధితో ఆలోచించుకోవడం వల్లనో అలాంటి సులువైన రీతి అనుసరిస్తాడు. తక్కువ శ్రమతో సాధ్యమైనంత ఎక్కువ ఫలితం పొందుతాడు. అది నేర్పరితనం, అంతకుమించి అతణ్ని బుద్ధిశాలిగా నిరూపించే లక్షణం.
ప్రాణికోటి అంతటిలోనూ మానవజాతి మకుటాయమానంగా నిలవడానికి ప్రధాన కారణం- మనిషికి గల ఆ నేర్పరితనమే! సూది, గొడ్డలి మొదలు చురుకు (స్మార్ట్) ఫోన్లు, విమానాల దాకా మనిషి తన బుద్ధిశక్తితో సమకూర్చుకొన్న సదుపాయాలన్నీ- పనులను సులభతరం చేసే మార్గాలే. వాటి ద్వారా అతడు ఎంతో వస్తుసంపదను, సుఖ సాధన సమృద్ధిని సాధించుకోగలిగాడు. కోరిన ఫలాల కోసం ఎన్నో సులభ మార్గాల్ని పరిశోధించి, అన్నింటినీ అందుబాటులోకి తెచ్చుకున్నాడు.
శ్రమ లేకుండా ఫలితాన్ని సాధించిపెట్టేలా అనేక సూక్ష్మ పద్ధతులు ఉంటాయి. అవి మనిషిలో సుఖలాలస పెంచుతాయి. అదే సమయంలో శ్రమకోర్చే తత్వాన్ని, పట్టుదలను, విలువల్ని సడలిస్తాయి. మనిషిని బలహీనపరచే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కొన్ని సందర్భాల్లో అటువంటి ధోరణుల్ని పెద్దలు నిరసిస్తారు. ‘విజయ సాధనకు కఠోర పరిశ్రమను మించిన మార్గం లేదు’ అని ఘనకార్యాలు సాధించిన మహనీయులు చెబుతుంటారు. ‘కష్టే ఫలీ’ అని హితవు పలుకుతుంటారు. అడ్డదారులు తొక్కి అడ్డమైన గడ్డీ తినడం హానికరం అని బోధించే సామెతలు, సుభాషితాలు లోక వ్యవహారంలో అసంఖ్యాకంగా కనిపిస్తాయి.
సకల పురుషార్థ సాధకమైన ‘సాకేత రాముడి భక్తి’ అనే రాజమార్గం ఉండగా, ఇక అడ్డదోవలు ఎందుకు అని ప్రశ్నించినవారున్నారు. ‘చక్కని రాజమార్గములుండగ, సందుల దూరనేల ఓ మనసా?’ అని గానంచేశారు సద్గురు త్యాగరాజస్వామి. ‘నువ్వు చేరే గమ్యం కంటే, దాని కోసం నువ్వు అనుసరించే మార్గమే ముఖ్యం’ అనేవారు గాంధీజీ.
మనిషి కర్తవ్యమేమిటి? ఎలాగోలా సూక్ష్మ పద్ధతులు వాడి, సునాయాసంగా కార్యం సాధించు కోవడమా,నీతిగా, ధర్మంగా పట్టుదలతో పరిశ్రమించి ఫలితాలు పొందడమా? సులభ మార్గాలు, సూక్ష్మ పద్ధతులు అనుసరించడంలో అనైతికత, అధర్మం, అన్యాయం లేవు. అనైతికత అనేది- ఆ మార్గాల అనుసరణలో ఉన్నదే తప్ప, సులభ మార్గాల్లో కాదు. అయిదు నిమిషాల్లో ఉపాయంగా పూర్తి చేయగల పని కోసం అయిదు గంటలు శ్రమించడం సమర్థనీయం కాదు. అలాగని కేవలం పని ముగించేందుకు- తెలిసి తెలిసీ అధర్మ మార్గాలు, నీతిబాహ్యమైన అడ్డదోవలు ఎంచుకోవడంలో విజ్ఞత లేదు. అది స్వల్పకాలంలో సత్ఫలితాలిచ్చినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో దుష్ఫలితాలకే దారితీస్తుంది.
దురాశ వల్ల మనిషి అనైతిక రీతిలో అడ్డదోవలు తొక్కుతాడు. ఆ దారులు అతణ్ని గమ్యానికి చేర్చవు. ఏ కారణంగానైనా చేర్చినా, ఆ గమ్యం అతడికి ఇవ్వవలసినంత ఆనందం ఇవ్వదు. ఆ మార్గంలో గమ్యం చేరినా ఒకటే, చేరకపోయినా ఒకటే. పదిమంది మెచ్చి ఇచ్చిన బహుమతి కాని, బిరుదు కాని, బంగారు పతకం కాని ఎంతో విలువైనది. దాన్ని అంగట్లో కొని తెచ్చుకొంటేనో, దొంగిలించి సొంతం చేసుకొంటామంటేనో ఎలా? అసలైన సత్కారం వల్ల పొందే ఆ ఆనందమే లోకంలో వేరుగా ఉంటుంది.
ఇహపర శ్రేయస్సు కోరుకొనేవారు ఏం చేయాలి? ఇహలోక జీవనంలో సత్యం, ధర్మం, భూతదయ, పాపభీతి వంటివి అవలంబించడమే రాజ మార్గమన్నది పెద్దల మాట. ఆ మార్గం వదిలి అత్యాశతో అడ్డదారిన సాగితే మొదటికే మోసం. అలా ప్రవర్తించినవాళ్లు దుర్యోధనాదుల్లా భ్రష్టులయ్యారే తప్ప, బావుకొన్నదేమీ లేదు. చరిత్రను గమనిస్తే- ఇదే మాట కాలం పెట్టిన పరీక్షల్లో నిలిచి నెగ్గినట్లు కనిపిస్తుంది. అందుకే ఇటువంటి హెచ్చరికలు అన్ని కాలాల్లో, ప్రాంతాల్లో, మత సంప్రదాయాల్లో, నీతిగ్రంథాల్లోనూ చోటుచేసుకున్నాయి!
- మల్లాది హనుమంతరావు
శక్తిరూపం
ధనం అవసరం వచ్చినప్పుడు అన్ని మార్గాలూ వెతుకుతాం. వాటిని ఎలా అయితే ఒక చోటుకు చేర్చి అవసరానికి ఉపయోగించుకుంటామో, అదేవిధంగా మన శక్తులన్నింటినీ సంపుటీకరించాలి. శక్తి రకరకాలుగా విస్తరించి ఉంటుంది- భౌతిక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తిగా.
పరిపూర్ణుడైన శక్తిమంతుడు ఏకాగ్రతతో అనుసంధానం సాధిస్తాడు. ధారణశక్తితో ఒకే చోట మనసును నిలిపి, అనుకున్న ఫలితాలు రాబట్టుకుంటాడు. కార్యసిద్ధికి ఇది ఎంతో అవసరం. అన్ని శక్తుల్నీ కూడగట్టుకొని అమిత వేగంతో మేధను అత్యంత లాఘవంగా పని చేయించాలి. అతి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాల్ని చురుగ్గా సాధించాలి.
పరిపూర్ణుడైన శక్తిమంతుడు ఏకాగ్రతతో అనుసంధానం సాధిస్తాడు. ధారణశక్తితో ఒకే చోట మనసును నిలిపి, అనుకున్న ఫలితాలు రాబట్టుకుంటాడు. కార్యసిద్ధికి ఇది ఎంతో అవసరం. అన్ని శక్తుల్నీ కూడగట్టుకొని అమిత వేగంతో మేధను అత్యంత లాఘవంగా పని చేయించాలి. అతి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాల్ని చురుగ్గా సాధించాలి.
శక్తిలో మనం ఉన్నాం. మనలో శక్తి ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శక్తిని సమన్వయం చేసుకొని, దేన్ని ఎంతవరకు వినియోగించాలో తెలుసుకొని ముందుకు వెళ్లాలి. భౌతిక శక్తి అవసరమైనప్పుడు మానసిక శక్తుల్ని ప్రయోగిస్తే, అవి పనిచేయవు. మానసిక దృఢత్వం అవసరమైనప్పుడు, భౌతికమైన బండ పద్ధతి పనికిరాదు. కనిపించే శక్తులు పనిచేయనప్పుడు, కనపడని దివ్యశక్తిని ఆశ్రయించాలి, ప్రార్థించాలి, దాన్ని ఉపయోగించుకోవాలి... అంటారు ఆధ్యాత్మికవాదులు.
శక్తి రూపాంతరం చెందుతుంది. దాన్ని కొత్తగా సృష్టించలేం, నాశనం చేయలేం అని విజ్ఞానశాస్త్రవేత్తలు చెబుతారు. శక్తి అనేది ఆత్మరూపంలో ఉంటుందంటాయి ఉపనిషత్తులు.
శక్తి లేకుంటే ఒక్క పనీ జరగదు. శక్తే నిరంతరం మనలో ఉండి నడిపిస్తుంది. బాహ్యశక్తుల కంటే ఆంతరంగిక శక్తులు గొప్పవి. అవి కనిపించే చెట్టుకు కనపడని వేళ్లలాంటివి. వాటిని సమీకరించుకుంటే సంకల్పశక్తి బాగా పెరుగుతుంది. అందుకే ఆయా శక్తులకు దివ్యత్వంతో ఉండే సంబంధ బాంధవ్యాలు తెలియాలి. అవన్నీ వెలికి వచ్చేందుకు అనువుగా నిర్ణయించిన శాస్త్రీయ విధానాల్ని, సూత్రాల్ని తెలుసుకోవాలి.
శ్రీరాముడు తనకు అవసరమైన శక్తుల్ని సమయానుసారం వినియోగించుకున్నాడు. సందర్భానుసారం వాటిని ప్రయోగించాడు. విజయం సాధించాడు. లక్ష్మణ మూర్ఛ సందర్భంలో హనుమంతుణ్ని పంపించి సంజీవని పర్వతం తెప్పించాడు. సోదరుడి ప్రాణాల్ని కాపాడి యుద్ధం కొనసాగించాడు. రామచంద్రుడు వివేక శక్తిని వినియోగించాడు. అస్త్రం, శస్త్రం, మంత్రం, భావం, పూజ, ప్రార్థన- అన్నింటినీ ఉపయోగించుకున్నాడాయన.
ఉపయోగించనంతవరకు, శక్తులు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి. తమను ఉపయోగించుకొమ్మని అవి చెప్పవు. వాటిని మనమే గుర్తించాలి. గౌరవించాలి. పూజించాలి. సూత్రబద్ధంగా ప్రయోగిస్తే, అంతులేని శక్తి ఆవిర్భవిస్తుంది. ఇదే విషయం అధునాతన కాలంలో అణు విస్ఫోటనం ద్వారా రుజువైంది.
శక్తుల్ని ఒక దగ్గరకు చేర్చడమే సాధకుడి పని. సానుకూల శక్తుల సమీకరణ వల్లనే లోక కల్యాణం సిద్ధిస్తుంది. చిన్నవాడైన కొడుకు ఒక పెద్దరాయిని ఎత్తలేనప్పుడు ‘నా శక్తి నీ శక్తి కాదా!’ అంటాడు తండ్రి. బిడ్డకు సాయపడతాడు. మోయలేని భారాన్ని ఎవరైనా తలకెత్తుకున్నప్పుడు, దైవం తప్పకుండా తండ్రిలా ఆదుకుంటాడని పురాణగాథలు చెబుతాయి.
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిగా మారుతుంది. జ్ఞానశక్తే క్రియాశక్తిగా రూపొందుతుంది. ప్రపంచాన్ని అదే నడిపిస్తుంది. ప్రకృతిని మనిషి అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో తన పాత్రను అవగాహన చేసుకోవాలి. పనులు సమర్థంగా నిర్వహించాలి.
శక్తుల్ని ధ్వంసం చేసుకోకుండా మనిషి జాగ్రత్తపడాలి. అన్ని శక్తుల్నీ ఒక చోట కేంద్రీకరించే ప్రయత్నం నిరంతరమూ సాగాల్సిందే. అతడు ఎంతో శక్తిమంతుడని అందరూ అనుకునే స్థాయికి చేరాలి. అద్భుతాలు సృష్టించడానికి పలు శక్తియుక్తులు అవసరమవుతాయి. అవన్నీ మానవుడిలో పుష్కలంగా ఉన్నాయి. ఆ గది తలుపుల్ని అతడే తెరవాలి. అందుకు నిరంతర తపనతో కూడిన సాధన ప్రధానం.
అర్జునుడు అలవోకగా విలుకాడు కాలేదు. సాధనతోనే అన్నింటినీ గెలుచుకున్నాడు. గురువు మీద గల అపార విశ్వాసమే ఏకలవ్యుణ్ని చరిత్రలో నిలబెట్టింది. కురుక్షేత్రంలోనూ అంతే. పరమాత్మ శక్తే అక్కడ దశదిశలా వ్యాపించింది!
- ఆనందసాయి స్వామి
శివం... సుందరం
అంతర్యామి అయిన పరమేశ్వరుడు ఒక్క భూలోక వాసులకే కాదు, త్రిలోక నివాసులకూ ఆరాధ్యుడు. ఆయన ధరించిన విభూతి కోసమే ఇంద్రాది దేవతలు ప్రార్థిస్తారు. రావణాది దానవుల శివభక్తి లోక విదితమే. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కైలాసగిరినే తన భుజస్కంధాలపై ఎత్తుకొన్నవాడు దశకంధరుడు. స్వామి ఎంతకూ ప్రత్యక్షం కావడం లేదని, తన ఉదరం నుంచి పేగుల్ని వెలికి తీసి వీణలా మోగించిన భక్తి ఆ దశాననుడిది! దేవతాకోటిలోని వారు గంధర్వులు. గానప్రియులైన వీరు అపూర్వ శివభక్తి పరాయణులు. అలాంటి గంధర్వుల్లో ఒకరైన పుష్పదంతుడికి సంబంధించిన శివభక్తిని ఒక కథ విపులీకరిస్తుంది. శివుడి మహిమను అది స్పష్టంగా బోధించడంతో పాటు, భక్తిలో గల విశిష్టతనూ తెలియజేస్తుంది.
పూర్వం శివభక్తుడైన ఒక రాజు ఉండేవాడు. అతడు ప్రతి నిత్యం పుష్పవనంలో పూచిన పూలతో శివుణ్ని అర్చించేవాడు. ఒకనాడు ఉదయమే పూలు తెమ్మని భటుల్ని అక్కడికి పంపాడు. అక్కడ వారికి ఒక్క పూవైనా కానరాలేదు. పూలు ఏమయ్యాయని ఉద్యానవన పాలకుణ్ని అడిగారు. గత రాత్రి ఎవరో వనంలోకి దూరి పూలు తీసుకెళ్లి ఉంటారని బదులివ్వడంతో, భటులు అదే విషయాన్ని రాజుకు నివేదించారు. రాత్రివేళల్లోనూ కాపలా కాయాలంటూ ఆయన అనేకమంది రక్షక భటుల్ని నియమించినా, పూలు మాయమవుతున్నాయి. భటులు రాజుకు విన్నవించారు. శివభక్తుడైన ఆయనకు విషయం అప్పుడు అర్థమైంది. ఎవరో శివభక్తుడు ‘తిరస్కరిణి’ (ఎవరికీ కనిపించకుండా ఉండే శక్తి)తో ఆ పనిచేస్తున్నాడని గ్రహించాడు.
రాజు వెంటనే ఆ పూలతోటలోని దారి అంతటా శివ నిర్మాల్యం (శివుడికి పూజలో సమర్పించిన పవిత్ర పుష్పాలు) చల్లించాడు. అలా చేయడం వల్ల అజ్ఞాత భక్తుడు ఆ పూలను తొక్కి తన మహిమ కోల్పోతాడని, అప్పుడు అతణ్ని సులభంగా పట్టుకోవచ్చని భావించాడు. ఆయనఆదేశించినట్లే భటులు చేశారు. ఎప్పటిలాగే రాత్రివేళ పూలతోటలోకి ప్రవేశించిన గంధర్వుడు ఆ శివ నిర్మాల్యాన్ని తొక్కడంతో, అతడి దివ్య మహిమలన్నీ నశించాయని పురాణ గాథ. అతడి తిరస్కరిణి శక్తి, ఆకాశ గమన శక్తి మాయమయ్యాయి. తెల్లవారితే రక్షకభటులు పట్టి బంధిస్తారని భయపడిన గంధర్వుడు- దయామయుడు, సంకట నాశకుడు అయిన శివుణ్ని రాత్రంతా స్తుతిం చాడు. శివుడు అతణ్ని అనుగ్రహించి, దివ్య శక్తుల్ని తిరిగి ప్రసాదించాడు. అప్పుడు ఆ గంధర్వుడు తన లోకానికి తిరిగి వెళ్లిపోయాడు. ‘పుష్పదంత’ నామధేయుడైన ఆ గంధర్వుడు చేసిన ‘శివ మహిమ్న స్తోత్రం’ జగత్తులో ప్రసిద్ధమైంది.
ఆ అనర్ఘ స్తోత్రమే ఇప్పటికీ శివాలయాల్లో రుద్రాభిషేక వేళ నమక చమకాల రూపంలో వినవస్తోంది. అది భక్తుల గళాల్లో జాలువారుతూ పఠనీయంగా మారింది. ‘ఓ పరమేశ్వరా! లోకంలోని మానవులు వేదాలని, సాంఖ్యమని, యోగమని... ఎన్నో మతాలు సృష్టిస్తున్నారు. తమదే గొప్పదని వాదిస్తున్నారు. ఇవన్నీ వారి అభిరుచులకు అనుగుణంగా సాగుతున్న వాదాలే. ఒక గమ్యస్థానం చేరడానికి పలు దారులుంటాయి. వాటిలో కొన్ని నేరుగా, మరికొన్ని చుట్టుతిరిగేవిగా ఉన్నట్లే- ఈ మతాలు, వాదాలు కనిపిస్తాయి. ఎలా వెళ్లినా, గమ్యస్థానాన్ని చేరడమే పరమార్థం. ఎన్ని మతాల సిద్ధాంతాల్ని అనుసరించినా, అవన్నీ స్వామిని చేరడానికే. నదులు ఎన్ని పాయలుగా చీలినా, చివరికి కలిసేది సముద్రంలోనే’ అంటూ సత్యాల్ని ఆవిష్కరిస్తుంది ఆ స్తుతి!
శివ యథార్థరూపం ఎంతో గొప్పది. స్వర్గమార్గం నుంచి ప్రవహిస్తూ వస్తున్న ఆకాశగంగ ప్రవాహంలో, నక్షత్రాలు చిన్నపాటి బిందువుల్లా మారుతున్నాయి. సముద్రాలతో చుట్టిన భూమి ఒక చిన్న దీవిలా కనిపిస్తోంది. నదులు, సముద్రాలు, భూమి- అన్నీ శివుడి శిరస్సుపై బిందువులా చేరాయి. ఇదీ స్వామి దివ్య స్వరూపం! ఈ రూపాన్ని ఎవరైనా వూహించగలరా... అంటూ సుందర వర్ణనలతో శివపారమ్యాన్ని విశదం చేస్తుందీ స్తోత్రం! అందుకే ఇది శివభక్తుల పాలిట అమృత సింధువు. ఆయన మహిమ అనంతమని వారందరి ప్రగాఢ విశ్వాసం!
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
అన్వేషణ
ఎవరి స్వగృహం వారికి శాశ్వతమైనా, నచ్చిన ప్రాంతాలకు అప్పుడప్పుడు వెళ్లివస్తుంటారు. ఎంత విహారయాత్ర సాగించినా, అది ఎంతో నచ్చిన ప్రదేశమైనా ఎవరూ అక్కడే ఉండిపోరు. తిరిగి ఇంటికే చేరుకుంటారు. మానవ జీవితమూ అంతే! కైవల్యం అనేది శాశ్వతమైనది. జీవితం ఎప్పుడూ తాత్కాలిక విహారమే! ఎంతకాలం విహరించినా, పయనం మొదలైన చోటుకు తిరిగి చేరాల్సిందే. అందుకే మనిషి సత్య శోధన సాగించాలి. జ్ఞాన సముపార్జన సాధించాలి. అవన్నీ అతడి విహారానికి తగిన, అవసరమైన అనుమతి పత్రాలు!
మానవుడు ఏ తరగతిలో ప్రయాణించాలి? అది మొదటిదా, ఆ తరవాతిదా అనేది అతడి జీవన విధానం బట్టి నిర్ణయమవుతుంది. సాధనే వ్యక్తి ప్రయాణించే తరగతిని నిర్దేశిస్తుంది. అతడు కళ్లు మూసుకుని ధ్యానస్థితిలోకి వెళ్లిపోతాడు. అక్కడే అనూహ్యమైన ఓ జ్ఞాన భాండారం ఉంది. అది ‘ఆత్మజ్ఞాన నిధి’.
అనంతమైన ప్రకాశాన్ని సాధకుడు తనలో ఉంచుకొని కూడా, సంసార రూపమైన గాఢాంధకారంలో మగ్గిపోతున్నాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు అతడు కళ్లు మూసుకోవాలి. అనంతర దశల్లో- మనసులోకి, లోపలి పొరల్లోకి, అంతఃస్థితిలోకి, అనంతంలోకి... లోలోపలికి చేరుకోవాలి.
లోపల గమ్యమైతే ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. దాన్ని వెతుకుతూ వెళుతుంటాడు మనిషి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూసి, తెల్లవారగానే లేచి తన పనుల్లో తాను పడిపోయే మనిషి- సాధన వేళ తీరికగా కళ్లెందుకు మూసుకుంటున్నాడు? తనకు, ప్రపంచానికి మధ్య ఎందుకు తెరవేసుకుంటున్నాడు? ఏదో గుహ్యమైంది ఉంది. అనూహ్యమైంది ఉంది. అద్భుతమైంది ఉంది. అదే ఆత్మ. పరమాత్మ. దానికోసమే మానవ అన్వేషణ.
పరమాద్భుతం ఏమిటంటే, ఆ పరమాత్మ ఉనికిని ఈ అర్భక మానవుడు కనుగొనడం, లోకానికి ఎరుకపరచడం! అంతర్యామి అందరికీ కనిపిస్తాడా, కరుణిస్తాడా? అది వేరే విషయం. ఆయనంటూ ఉన్నాడు. ఆయనకంటూ ఒక చిరునామా ఉంది. ఎవరి ప్రయత్నం వారు చేసుకోనీ! కళ్లు మూసుకోనీ, మనసు తెరచుకోనీ, అన్వేషించనీ! ఆయనే తానుగా, తానే ఆయనగా, మరొకరిగా మరొకటిగా మిగలని వస్తువుగా... ఏకాత్మగా!
అంతర్ముఖం కావాలని విజ్ఞులు ఎందుకం టారు? మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చింది మళ్లీ వెనక్కు వెళ్లిపోవడానికేగా! నిజానికది వెనక్కు కాదు. ముందుకు. పైకి. పైపైకి. గొంగళి పురుగు అలాగే ఉండదు. ఉండకూడదు. అది సీతాకోకచిలుక కావాలి. మేఘం నల్లమబ్బుగా మిగలకూడదు. వానచినుకై, అమృతబిందువై కురవాలి. అమ్మ పొట్టలో వూపిరి పోసుకున్న కూన- మానవుడై, పరిపూర్ణుడై బ్రహ్మమై నిలవాలి. పరబ్రహ్మ కావాలి.
సాధారణ మానవుడికి సాకేత రాముడు అందుతాడా అనిపిస్తుంది. దేహమే తాను అనుకునే సామాన్యుడు, తనలోని తానైన దైవత్వాన్ని గ్రహిస్తాడా అనే ప్రశ్నా ఉదయిస్తుంది. భగవంతుడికి ఎందుకీ చిలిపి శోధన? ఆ గుట్టేదో తానే విప్పవచ్చుగా! బిడ్డలకు ఇంత క్లిష్ట పరీక్ష ఎందుకో? విద్యార్థులకు పరీక్ష పత్రాలు ఇచ్చే ఉపాధ్యాయులు తెలిసీ సమాధానాలు ఎందుకు చెప్పరు, అసలు ఎందుకీ పరీక్షలు? తమ విద్యార్థులకు తామే పరీక్ష పెట్టడంలాంటిదే ఇదీ!
ప్రయత్నం ఫలించక మానదు. సాధనతో పనులు సమకూరక మానవు. కళ్లు కలువ రేకుల్లా మారేవరకు (ధ్యాన స్థితిలో కళ్లు సూక్ష్మ చలనాలైనా లేకుండా కలువల్లా ఉంటాయి), ఆసనం స్థిరీకృతం అయ్యేవరకు (ఆసన సిద్ధి కలగకుంటే ధ్యానం కుదరదు)... మానవుడు ధ్యాన సాధన కొనసాగించాల్సిందే.
అంతర్గత ప్రయాణం గురించి తెలుసుకున్న భాగ్యశాలురే కళ్లుమూసుకొని ధ్యానిస్తుంటారు. బయటి ప్రపంచంతో ఎటువంటి సంబం ధమూ లేని గుహ్యమైన పయనం సాగిస్తుంటారు. వారిని చూసి ఇతరులు ఆశ్చర్యపడటం కాదు, చూస్తూ ఆగిపోవడం కాదు. అనుసరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే అంతర్ముఖత్వం, లోపలికి లోలోపలికి ప్రయాణం! - చక్కిలం విజయలక్ష్మి
జ్ఞానానందం
ఉదయం నిద్ర లేచింది మొదలు, మనిషి పాట్లన్నీ ఆనందానికే! ఆంజనేయుడు ప్రతిచోటా రాముణ్ని శోధించినట్లు, మనిషి తనకు అందుబాటులో ఉన్న అన్నింటిలోనూ ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. ఈ వెతుకులాట జీవన పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. అతడికి ఎప్పటికో అసలు నిజం అర్థమవుతుంది- హనుమంతుడి హృదయంలోనే శ్రీరాముడు కొలువై ఉన్నట్లు... తన మనసే ఆనందనిలయమని!
మనిషి జీవితంలో అధికభాగం భౌతిక ఆనందంతోనే గడిచిపోతుంది. అందుకు కారణం అజ్ఞానాంధకారం! చీకటిలా అజ్ఞానమూ అతడికి చిత్తభ్రమ కల్పిస్తుంది. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు అనిపించడమే దాని లక్షణం. చిత్తడినేల మీద నడకలా ఉంటుంది ఆ జీవనయానం!
జారుతూ, పడుతూ లేస్తూ... గమ్యం తెలియక అల్లారుస్తూ... కంటకాలతో ఇక్కట్లపాలవుతూ ఎన్నో అనుభవాలు! ఆస్తికత్వ అవస్థల కన్నా నాస్తికత్వమే మేలేమోనని అనిపించే విహ్వలత్వం... ఆదిశంకరులు చెప్పిన దురవస్థలన్నీ మనిషి అనుభవంలోకి వస్తాయి. అరిషడ్వర్గాలనే ఆరుకొండలు దాటిన తరవాత ఏడో కొండమీద శ్రీనివాసుడి దివ్యదర్శనం అయినట్లు- అతడు నిరంతర ప్రయత్నంతో, ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ అంతర్యామి వైపు పయనించాలి. తన అంతరంగమే అంతర్యామి నిలయమని గ్రహించాలి. అలా గ్రహించడానికి మనిషికి జ్ఞానం ఉండాలి.
నిదురించే విత్తనంలా, జ్ఞానం మనిషిలోనే నిక్షిప్తమై ఉంటుంది. దానికి తృష్ణ అనే తడి తగలాలి. జ్ఞానతృష్ణ (దాహం) మొదలయ్యాక, అది అలా కొనసాగుతుంటుంది. ప్రశ్నలు సమాధానాలు, ఆలోచనలు అనుభవాలు, ఇదే గమ్యం కావచ్చునన్న భ్రమ... అంతలోనే ‘కాదు కాదు’ (నేతి=న+ఇతి=ఇది కాదు) అనే స్పృహగా- ఆధ్యాత్మిక ఒంటరి ప్రయాణం బహుకాలం సాగిపోతుంటుంది. ఆ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎందరెందరో మహనీయుల పరిచయాలు, వారితో జరిగే సత్సంగమే స్ఫటిక జలంలా మానవుడిలోని జ్ఞానబీజానికి వూపిరులూదుతుంది. ఆ తరవాత మొక్క ఎదిగి వృక్షమయ్యేదాకా అతడి జ్ఞానతృష్ణ తీరదు, తృప్తి కలగదు.
మహా వృక్షమయ్యాక నింగికేసి చూస్తూ ‘నేను చాలా అల్పజీవిని, నా జ్ఞానం అత్యల్పం’ అనుకోవడమే మనిషి గమ్యం చేరతాడనడానికి సూచిక. ‘నేనేమీ కాను’ అనుకోవడమే జ్ఞాన స్థితి. ‘జ్ఞానం అనంతం’ అని అర్థమయ్యాక, ఆ జ్ఞాన సముద్రం పరమాత్మకు చెమట బిందువుతో సమం అనీ మనిషి గ్రహిస్తాడు. అప్పుడు ఆయన గురించిన ఎరుక అతడికి కలుగుతుంది. దైవం గురించిన భావరూపాలన్నీ కల్పనలు కావు, అవి నిజాలు అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. ఆనంద సముద్రంలో మునుగుతూ తేలుతూ పరవశిస్తాడు. మానవుడి బాల్యచేష్టల్ని పరమాత్మ మందహాసంతో వీక్షిస్తూ ఆనందిస్తుంటాడని పురాణాలు చెబుతాయి.
తడి ఆరని మనిషి మనసుకు ప్రాపంచిక భ్రమలు అంటుకోవు. ఎందుకంటే, అతడు ఆస్వాదించేది ఆనందామృత లేపనం. భ్రమల్ని దహించగల శక్తి దానికి ఉంటుంది. ఏ ఆనందం, ఏ అనుభూతి చెందాక మానవుడు వేరేవాటికి ఆశపడడో- అదే జ్ఞానానందం. దాన్ని అనుభూతి చెందడానికి ప్రతి సాధకుడూ పట్టుదలగా కృషి చేయాలి.
హయగ్రీవుడు జ్ఞానానందమయుడు, నిర్మలుడు. ఆయన స్ఫటికంలా స్వచ్ఛమైనవాడని పురాణేతిహాసాలు వర్ణిస్తాయి. అన్ని విద్యలకూ హయగ్రీవుడే ఆధారభూతుడని చెబుతాయి. ఆ దైవం ఉపాసనతో ప్రతి మనిషీ పొందాల్సింది ఆత్మజ్ఞాన విద్య. అప్పుడే అతడికి సంపూర్ణ జ్ఞానానందం లభిస్తుంది.- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565