MohanPublications Print Books Online store clik Here Devullu.com

వావ్‌... గూగుల్‌_wow..google



వావ్‌... గూగుల్‌
wow..google

వావ్‌... గూగుల్‌
జీమెయిల్‌, సమాచార శోధన, యూట్యూబ్‌... ఇంకా చెప్పాలంటే మ్యాప్స్‌! గూగుల్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఇవే. అయితే అందులో ఇంకా చాలా ఫీచర్లు, ఆప్షన్లున్నాయి.google.co.inఅని బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి, పేజీలో పైన కుడివైపు కనిపించే తొమ్మిది చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. మొత్తం గూగుల్‌ సరకు మీ కళ్ల ముందుంటుంది. వీటిలో కొన్ని ఆప్షన్లు చాలా రోజుల నుంచి అందుబాటులో ఉండగా, ఇంకొన్ని తాజాగా వచ్చాయి. ఇంకొన్ని ప్లేస్టోర్‌లో ఆప్స్‌ రూపంలో ఉన్నాయి కొత్త ఆప్షన్లతో అదిరిపోతున్న గూగుల్‌ సౌకర్యాల గురించి చూద్దాం!
మెసేజ్‌ల కోసం 
మొబైల్స్‌లో మెసేజ్‌ పంపడానికి, అందుకోవడానికి ఓ మెసేజ్‌ ఆప్‌ ఉంటుంది. దాని ద్వారా కేవలం టెక్స్ట్‌ మెసేజ్‌ మాత్రమే పంపే అవకాశం ఉంటుంది. దీనికి ఇమేజ్‌, ఆడియో, స్టిక్కర్లు జోడించాలనుకుంటే మీ మొబైల్‌లో Android Messages ఆప్‌ ఉండాల్సిందే. మెసేజ్‌ల గ్రూపింగ్‌ (ఒకే నంబరుకు చెందిన మెసేజ్‌లన్నీ ఒక దగ్గర), సులువైన బ్లాకింగ్‌ లాంటి ఆప్షన్లున్నాయి. అయితే ఈ మెసేజ్‌లు ఎంఎంఎస్‌ రూపంలో బట్వాడా అవుతాయి. ఈ సౌకర్యమున్న వాళ్లు ఆండ్రాయిడ్‌ మెసేజెస్‌ ఆప్‌ను వాడొచ్చు.
దాచుకోండి... గుర్తుంచుకోండి
ఫలానా తేదీన స్నేహితుడి పుట్టిన రోజు... విష్‌ చేయాలి అనుకుంటారు. కానీ ఆ రోజు గుర్తుండదు. ఆదివారం ఉదయం పది గంటలకు వైద్యుణ్ని కలవడానికి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. తీరా ఆ సమయానికి వెళ్లలేకపోయారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆ విషయాల్ని క్యాలెండర్‌లో రాసుకోండి. అదే గుర్తు చేస్తుంది. ఇంట్లో గోడ మీద ఉన్న క్యాలెండర్‌ కాదు. మొబైల్‌లో ఉండే గూగుల్‌ క్యాలెండర్‌ ఆప్‌. మీ మెయిల్‌ ఐడీని క్యాలెండర్‌తో సింక్‌ చేస్తే అపాయింట్‌మెంట్స్‌ తదితర అంశాలు క్యాలెండర్‌లోకి వస్తాయి. ఇందులో ఈవెంట్స్‌ కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు. క్యాలెండర్‌ ఆప్‌లో ఈవెంట్‌కు సంబంధించిన విషయాన్ని నమోదు చేసుకొని మెయిల్‌ ఐడీ ద్వారా అందరికీ ఇన్విటేషన్‌ పంపొచ్చు.
ఎక్కడైనా... ఎప్పుడైనా
ఏదైనా సమాచారం రాయాలంటే మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, లెక్కల పట్టికలు వేసుకోవాలంటే మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, ప్రజెంటేషన్‌ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్‌ పవర్‌ పాయింట్‌. చాలామందికి ఇవే అలవాటు. సిస్టమ్‌లో ఓపెన్‌ చేసి వాడి క్లోజ్‌ చేయాలంటే ఇవి ఓకే. మీకు వీలున్నప్పుడల్లా రాద్దామంటే ఇవి పనికిరావు. బస్సులో ఆఫీసుకు వచ్చేటప్పుడు మొబైల్‌లో రాసుకునేలా... ఆఫీసుకు వచ్చాక సిస్టమ్‌లో దాన్ని కొనసాగించేలా ఉంటే బాగుంటుంది కదా. గూగుల్‌ డాక్స్‌తో ఈ పని చేయొచ్చు. మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా దీంట్లో ఆప్షన్లుంటాయి. ఒకే మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయి ఉన్న మొబైల్‌, ట్యాబ్‌, సిస్టమ్స్‌లో దీన్ని యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇదే ఎక్సెల్‌తో పని అయితే గూగుల్‌ షీట్స్‌ ఉంది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అయితే గూగుల్‌ స్లైడ్స్‌ను వాడొచ్చు. దీనికి సంబంధించిన బ్యాకప్‌ అండ్‌ సింక్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ప్రతిసారి వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయకుండా అందులోనే డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్‌ను వాడుకోవచ్చు.
త్రీడీలో చూస్తారా?
గూగుల్‌ మ్యాప్స్‌ గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా ప్రాంతం చిరునామా తెలుసుకోవాలన్నా, వెళ్దామనుకుంటున్న రూట్‌లో ట్రాఫిక్‌ గురించి తెలియాలన్నా మ్యాప్స్‌ను ఓపెన్‌ చేసేస్తుంటారు. ఆ మ్యాప్స్‌కు త్రీడీ టచ్‌ ఇచ్చి గూగుల్‌ ‘ఎర్త్‌’ అనే ఓ వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేసింది. దీని ద్వారా ప్రపంచాన్ని త్రీడీ కోణంలో వీక్షించొచ్చు. దీంతోపాటు ప్రపంచంలోని ముఖ్యమైన ప్రాంతాల సమాచారాన్ని సంక్షిప్తంగా పొందొచ్చు. విహార యాత్రలకు వెళ్దామనుకునేవాళ్లు, సమాచార శోధన అంటే ఇష్టపడేవాళ్లకు గూగుల్‌ ఎర్త్‌ భలే సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్‌ రూపంలో మొబైల్‌లోనూ వినియోగించొచ్చు.
అన్నీ దాచుకుంటుంది
ఇంటి పద్దుల చిట్టా, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు, ముఖ్యమైన చిరునామాలు, మొబైల్‌ నెంబర్లు... వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా వాడుకునేలా పెట్టుకోవాలి. బయటికెళ్లినప్పుడు మొబైల్‌లో, ఇంట్లో ఉంటే ట్యాబ్‌లో, ఆఫీసుకెళ్తే సిస్టమ్‌లో. దీనికి మీరు చేయాల్సిందల్లా ఆ వివరాల్ని గూగుల్‌ కీప్‌లో రాసుకోవడమే. గతంలో జేబులో ఓ పుస్తకం పెట్టుకొని ముఖ్యమైన సమచారం రాసుకునేవాళ్లం చూడండి. అలా అన్నమాట. ఒకే మెయిల్‌ ఐడీతో అనుసంధానమై ఉండే మొబైల్‌, ట్యాబ్‌, సిస్టమ్స్‌లో దీన్ని యాక్సెస్‌ చేయొచ్చు. అంటే ఇందులో రాసిన విషయాల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా ఎడిట్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో రాసిన నోట్‌ (పుస్తకంలో పేజీ లాంటిది)ను ఇంకొకరితో కలసి షేర్‌ చేసుకోవచ్చు. ఎలా అంటే... గూగుల్‌ కీప్‌లో షాపింగ్‌ లిస్ట్‌ అని ఓ పేజీ ఓపెన్‌ చేయండి. ఆ తర్వాత దిగువన ఉన్న పర్సన్‌ ఐకాన్‌ (మనిషిలా కనిపిస్తూ ప్లస్‌ గుర్తు ఉండేది)ను క్లిక్‌ చేయండి. అప్పుడు ఓ మెయిల్‌ ఐడీ అడుగుతుంది. అక్కడ ఇచ్చిన ఐడీకి చెందిన వ్యక్తి ఆ నోట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. అంటే అందులో రాయడం, చెరపడం లాంటి సౌకర్యాలు ఆ ఇద్దరికీ ఉంటాయన్నమాట. ఇందులో ఇలాంటివి చాలా ఆప్షన్లున్నాయి. 
ఇక్కడ వేయ్‌... అక్కడ తీయ్‌
ఇంట్లో సిస్టమ్‌ డెస్క్‌టాప్‌ మీద ఉన్న ఫొటోలు... ఆఫీసులో ఉన్న మీ మొబైల్‌లోకి నిమిషాల్లో వచ్చేస్తాయి. ఏముంది మెయిల్‌ చేస్తారు, లేదంటే వాట్సాప్‌లో పంపిస్తారు అంతే కదా అంటారా? ఆ రెండూ కాదు. అక్కడ సిస్టమ్‌లో ఉన్న ఓ డబ్బాలో ఫొటో వేస్తే... అది సింక్‌ అయ్యి మీ మొబైల్‌లోని ఫోల్డర్‌లోకి వచ్చేస్తుంది. ఆ ఫోల్డర్‌ పేరు గూగుల్‌ డ్రైవ్‌. ఒకే మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయ్యి ఉన్న మొబైల్స్‌/ట్యాబ్స్‌లో డ్రైవ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. దీని సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ప్రతిసారి బ్రౌజర్‌లో డ్రైవ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయక్కర్లేదు. 
అభిప్రాయ సేకరణ
ఆదివారం సాయంత్రం పార్టీ చేసుకుందామనుకున్నారు... మీ బృందంలో ఎవరెవరు వస్తున్నారో తెలియాలి. అందరికీ ఫోన్‌ చేసి అడగలేరు కదా. ఆఫీసులో కొత్త మార్పులు గురించి సహోద్యోగులతో చర్చించాలి. వాటి గురించి అందరికీ వివరించి అభిప్రాయం తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు గూగుల్‌ ఫామ్స్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో అభిప్రాయ సేకరణకు ఉపయోగపడేలా టెంప్లెట్స్‌ ఉంటాయి. కావల్సిన ప్రశ్న, దాని సమాధానాల్ని (మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో) ఇచ్చి సంబంధిత వ్యక్తులకు మెయిల్‌ చేయాలి. వాళ్లు సమాధానాల్ని చెక్‌ బాక్స్‌లో టిక్‌ మార్క్‌ పెట్టి తిరిగి పంపిస్తారు. ఇలా సేకరణ సులభంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తాజాగా
గూగుల్‌లో న్యూస్‌ అని టైప్‌ చేయగానే... వందల కొద్దీ వార్తలొస్తాయి. అలా ప్రతిసారి మీరు అడిగితేనే గూగుల్‌ వార్తలివ్వాలా? ఒక్కసారి ఏదైనా చెబితే దాన్ని గుర్తుంచుకొని దానికి సంబంధించిన వార్తలొస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే గూగుల్‌ అలర్ట్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లండి. అందులో మీకు కావల్సిన అంశాలను పొందుపరచండి. వ్యక్తులు, రంగాలు, సంగీతం, సినిమా లాంటి విభాగాల నుంచి ఒకదాన్ని ఎంచుకుంటే దానికి సంబంధించిన వార్తలు మీ మెయిల్‌ ఐడీకి ఎప్పటికప్పుడు వస్తాయి. వివిధ వెబ్‌సైట్లలోని ముఖ్యమైన వార్తలన్నింటినీ ఒకే దగ్గర చూడాలనుకుంటే ‘ప్లే న్యూస్‌స్టాండ్‌’ ఓపెన్‌ చేయండి. ఇందులో టాపిక్స్‌, వెబ్‌సైట్ల వారీగా చాలా వార్తలు అందుబాటులో ఉంటాయి.
పాట... ఆట
సినిమా, అందులోని పాటల వీడియోల కోసం గూగుల్‌లో వెతుకుతుంటారు. అప్పుడు యూట్యూబ్‌లో ఉన్న వాటికి సంబంధించిన వీడియోల సమాచారం కనిపిస్తుంది. అయితే కొత్త సినిమాలు, పూర్తి నాణ్యతతో ఉన్న వీడియోలు దొరకడం కష్టం. ఈ ఇబ్బంది లేకుండా గూగుల్‌ సరికొత్త సినిమాలు, పాటల వీడియోలను అందుబాటులో ఉంచింది. ఆ వేదిక పేరు ‘ప్లే మూవీస్‌’. కాకపోతే ఇక్కడ డబ్బులు చెల్లించి వాటిని చూడాల్సి ఉంటుంది. నాణ్యత కావాలంటే ఆ మాత్రం డబ్బులివ్వాల్సిందే మరి. పాటల విషయంలో అయితే ‘ప్లే మ్యూజిక్‌’ వెబ్‌సైట్‌ ఉంది.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list