బోధగయ చూద్దాం రండయా!
బౌద్ధమతాన్ని ఆరాధించే వాళ్లు అమితంగా ఇష్టపడే ప్రదేశం బోధగయ. బుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం ఇది. ప్రపంచమంతా బౌద్ధ పరిమళాలు వ్యాపించింది ఇక్కడి నుంచే! బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో ఉండే బోధగయను సందర్శిస్తే మానసిక ప్రశాంతతతో పాటు చారిత్రక ప్రదేశాలను చూసిన అనుభవం సొంతమవుతుంది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన బోధగయ విశేషాలు...
మహాబోధి టెంపుల్
ఇది ప్రధాన ఆలయం. ఈ ఆలయ ప్రాంగణం 12 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. 55 మీటర్ల ఎత్తైన ఆలయ గోపుర నిర్మాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇండియాలో ఉన్న పురాతన ఇటుక ఆలయాల్లో ఇదొకటి. ఆలయంలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న గౌతమ బుద్ధుని విగ్రహాన్ని చూడొచ్చు. ఆలయ ప్రాంగణంలో బౌద్ధ భిక్షువులు మంత్రోచ్చాటన చేస్తుండటాన్ని చూడొచ్చు. పర్యాటకులు ఎక్కువ సమయం ఇక్కడ గడపటాన్ని, ఫొటోలు తీయడాన్ని అనుమతించరు.
బోధి వృక్షం
ఆలయ సముదాయంలో అతి ముఖ్యమైన ప్రదేశం ఇది. గౌతమ బుద్ధుడు ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవాడు. పౌర్ణమి రోజు ధ్యానంలో ఉన్నప్పుడు జ్ఞానోదయం అయింది. అందుకే బుద్ధపూర్ణిమను పండుగలా చేసుకుంటాం. ఈ రావి చెట్టు చుట్టూ గోడను నిర్మించారు. పర్యాటకులు తప్పక సందర్శించి తీరాల్సిన ప్రదేశం ఇది.
మెడిటేషన్ పార్క్
గౌతమ బుద్ధుని సన్నిధిలో ధ్యానం చేయాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ పార్క్‌లో ధ్యానం చేసుకోవచ్చు. పచ్చని పచ్చికతో ఆకట్టుకునే ఈ పార్క్ ప్రశాంతంగా ఉంటుంది. ప్రవేశానికి సాధారణ ఛార్జీ వసూలు చేస్తారు.
మ్యుచలిండ సరోవర్
మెడిటేషన్ పార్క్ దాటి వెళితే ఈ సరోవర్ కనిపిస్తుంది. బుద్ధుడు ఆరో వారం ధ్యానం ఇక్కడ చేశాడు. ఒకరోజు ధ్యానంలో ఉండగా కుండపోతగా వాన కురిసింది. అయినా బుద్ధుడు కదలకుండా ధ్యానం చేశాడట. అప్పుడు ఈ సరస్సులోని మ్యుచలిండ అనే పాము బుద్ధునిపై వర్షం పడకుండా తన పడగ పట్టిందట. సరస్సు మధ్యలో పాము పడగ నీడలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు.
బట్టర్ ల్యాంప్ హౌజ్
ఆలయ సముదాయానికి నైరుతి భాగంలో ఈ హౌజ్ ఉంటుంది. ఇక్కడ దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. బోధి వృక్షం కింద కూడా దీపాలు వెలిగించేవారు. అయితే వేడి వల్ల పవిత్ర వృక్షం దెబ్బతినే అవకాశం ఉండటంతో ల్యాంప్ హౌజ్‌లో మాత్రమే వెలిగించేందుకు అనుమతిస్తున్నారు. దీపాలు వెలిగించడం కోసం పర్యాటకులు ఇక్కడ డబ్బులు విరాళంగా అందించవచ్చు.
అజపల నిగ్రోధ వృక్షం
అయిదో వారం బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేశాడని చెబుతారు. ఆలయ సముదాయానికి ఈశాన్య ద్వారం సమీపంలో ఉంటుందీ వృక్షం. ఈ వృక్షం చుట్టూ బౌద్ధ భిక్షువులు కూర్చుని మంత్రోచ్చాటన చేస్తుంటారు.
రత్నఘర
ఆలయ సముదాయానికి వాయవ్య భాగంలో ఉంటుంది. గోడలన్నీ పింక్ రంగులో ఉంటాయి. బుద్ధుడు నాలుగో వారంలో ఇక్కడ ధ్యానం చేశాడని విశ్వసిస్తారు. బోధగయ వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశాలివి.
ఎలా చేరుకోవాలి?
విమానంలో: బోధగయకు 17కి.మీ దూరంలో గయ ఎయిర్‌పోర్టు ఉంది. కోల్‌కతా నుంచి ఇక్కడికి విమాన సర్వీసులుంటాయి. అయితే చాలా తక్కువ. 135 కి.మీ దూరంలో పాట్నా ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడికి అన్ని ప్రధాన నగరాల నుంచి విమాన సర్వీసులుంటాయి. పాట్నా నుంచి బస్సు లేక క్యాబ్‌లో మూడు గంటల ప్రయాణంలో బోధగయకు చేరుకోవచ్చు.
రైలులో : 13 కి.మీ దూరంలో గయ రైల్వే స్టేషన్ ఉంది. ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రైలు సర్వీసులున్నాయి. ఇక్కడి నుంచి క్యాబ్‌లో బోధగయకు చేరుకోవచ్చు.
బస్సులో : గయ నుంచి బోధగయకు బస్సు సర్వీసులుంటాయి. నలంద, పాట్నా, వారణాసి తదితర పట్టణాల నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565