అరలు.. పొరలతో రవరవలే!
వ్యష్టి కుటుంబవ్యవస్థ వెలిశాక ఒక్కో ఇంట్లో నలుగురికి మించి సభ్యులుండటం లేదు. ఈ నలుగురు నాలుగు స్తంభాల్లా నిలిచి కాపురమనే గోపురం ఔన్నత్యానికి దోహదపడాల్సిందిపోయి, నలుగురు నాలుగు దారుల్లా వ్యవహరిస్తున్నారు. పిల్లల విషయం ఎలా ఉన్నా భార్యాభర్తల అంతరంగాల్లో అంతరాలు గూడుకట్టుకుంటున్నాయి.
భార్యాభర్తల సంబంధంలో వర్తమానంలో వెలితి కనిపిస్తోంది. ఈ కారణంగా ఎన్నో దుష్ఫలితాలను చూస్తున్నాం. ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబ జీవనంలో ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాం. అది ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చినదైనా సరే! విశ్వాసం స్థానంలో అపనమ్మకం తిష్ఠ వేస్తోంది. జీవిత సహచరుల్లా కాకుండా సహాధ్యాయుల్లా, సహోద్యోగుల్లా వ్యవహరిస్తున్నారు. వారిలోనైనా పరస్పర గౌరవాభిమానాలు, విశ్వాసాలు ఉండాల్సిందే! దానికో పరిమితి ఉంటుంది. భార్యాభర్తల అనుబంధంలో.. ప్రేమలో పరిమితులు, షరతులు ఉండకూడదు. కానీ ఎవరి భావాలు వారివి.. ఎవరి సమస్యలు వారివనే ధోరణిలో ఉంటున్నారు. మనసుల్లో పొరలు.. అరలు కట్టుకుంటున్నారు. మనసు విప్పి మాట్లాడుకోరు. ఒకరి విషయాలొకరికి తెలియనే తెలియవంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇద్దరూ ఉద్యోగులైతే పరిస్థితి మరింత విషమం. ఏ విషయమైనా మనసులోనే గుణించుకుంటారు. ఏదైనా మాట్లాడిన సందర్భాలుంటే అందులో మళ్లీ ఆధిపత్య పోరు. భర్త చెప్పిందంతా భార్య చెవులొగ్గి వినాల్సిందే. ఆమెకు చెప్పే స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడైనా స్వగతాలు చెప్పడం మొదలు పెడితే ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’ అన్నట్లు పురుషపుంగవులు తమ ప్రేమాయణాలు కథలు కథలుగా వక్కాణిస్తారు. అవన్నీ భార్య రిక్కించి ఆలకించాలి. పొరపాటున భార్య పెదవి విప్పి అలాంటిది చెప్పిందంటే ఇక జీవితాంతం కోలాటమే! మరి ‘వాడి దగ్గరకే పోకపోయావా?’ అంటూ దెప్పిపొడుస్తుంటాడు. అలాంటపుడు అరమరికలు లేని బంధమెలా సాధ్యం? పిడికెడు క్షమ, గుప్పెడు పరిణతి, సముద్రమంత ప్రేమ భాగస్వాములు అలవరచుకోవాలి.
ఉన్నతోద్యోగులైన జంట ఒకటి ఉండేది. ఇద్దరూ జిల్లాస్థాయిలో ప్రధానస్థానంలో ఉన్నవారే. ఎన్నో బాధ్యతలు. ఎవరి తలనొప్పులు వారివి. ఇంత ఒత్తిడిలోనూ ఆ ఇద్దరూ రాత్రి కలిసి భోజనం చేసి, ఒకగంట చదరంగమో మరో క్రీడో రోజూ ఆడుకునేవారు. అలా గంట వ్యక్తిగతంగా కేటాయించుకోవడం వల్ల కౌటుంబిక, వైయక్తిక అంశాలెన్నో ప్రస్తావనకు వచ్చేవి. ఆ ఆనంద సమయంలో ఇద్దరి ఆలోచనలతో పరిష్కార మార్గాలు తోచేవి. భారమంతా తీసేసినట్లు పోయేది. ఇలా సంతోషంగా ఉండటమనేది సహజంగా సాగిపోవాలి.
ప్రకృతికి భిన్నంగా ఉండటంవలనే భార్యాభర్తలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరైతే విడిపోతే సమస్యలన్నీ పోతాయనీ, ఆనందం సొంతమవుతుందనీ భ్రమిస్తున్నారు. ఒంటరి జీవితం మరింత భయంకరమని గుర్తించలేకపోతున్నారు.
ప్రకృతి అనేక ద్వంద్వాలకు ఆలవాలం. అందులో స్త్రీపురుష విభాగం ప్రధానమైంది. సకల జీవరాసుల్లో ఆడమగ మధ్య ఆకర్షణ అత్యంత సహజం. దానికి ఫలం ఆనందం. ‘సవైనైవ రేమే తస్మాదేకాకీ న రమతే - స ద్వితీయమైచ్ఛత్’ అని బృహదారణ్యకోపనిషత్ వచనం. ఏ వ్యక్తీ ఒంటరిగా జీవించలేడు. ఒంటరిగా ఆనందాన్ని పొందలేడు. స్త్రీపురుషులు కలిసి అడుగుపెట్టిన గృహస్థాశ్రమానికి ఫలాలనేకం ఉన్నప్పటికీ ప్రధాన సూత్రం ఆనందం. అది ఇద్దరి అనుబంధం ద్వారానే సిద్ధిస్తుంది. ఈ దాంపత్యధర్మాన్ని ఉత్తర రామచరిత్రలో భవభూతి మహాకవి అద్వితీయంగా వర్ణించారు.
అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వస్థాసు యద్
విశ్రామోహృదయస్య యత్ర జరసాయస్మిన్నహార్యో రసః
కాలేనావరణాత్యయాత్ పరిణతేయత్‌ప్రేమసారే స్థితమ్
భద్రంతస్యసుమానుషస్య కథమప్యేకం హి తత్‌ప్రార్థ్యతే
దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆవిష్కరించిన శ్లోకమిది. భార్యాభర్తలకు పరస్పరం మానసిక విశ్రాంతి స్థానం భార్యాభర్తలే! భాగస్వామికి మనసువిప్పి చెప్పుకుంటే ఆ రట ఎక్కడా లభించదు. సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతమైనది దాంపత్యబంధం. పెళ్లితో మొదలైన ప్రేమ వార్ధక్యం వచ్చేకొద్దీ అందులోని సారం అనుభవంలోకి వచ్చి ఆ అనుభూతి అమితానందంగా పరిణమిస్తుంది. ఆ అనుబంధమే దాపరికం లేని ప్రణయాన్ని వృద్ధి పొందిస్తుంది. ఇలాంటి వివాహబంధం సమాజంలో అన్ని వర్గాలవారి సుఖసంతోషాలకు హేతువవుతుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565