MohanPublications Print Books Online store clik Here Devullu.com

మానవజన్మ మహోన్నతం-Manavajanmma


మానవజన్మ మహోన్నతం
పూర్వం ఒక పట్టణంలో బీదవాడు ఉండేవాడు. ఒకరోజు ఆ పట్టణానికి హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చాడు. అతడు అందరి బాధలనూ తీరుస్తున్నాడని తెలిసి ఈ బీదవాడు కూడా యోగి దగ్గరికి వెళ్లాడు. ఆయనతో తన దుస్థితిని చెప్పుకున్నాడు. అప్పుడు యోగి నవ్వి బీదవాడి చేతిలో చిన్న వేరు ముక్కను ఉంచాడు. ‘నాయనా! ఈ వేరును తాకిస్తే చాలు.. ఇనుము బంగారం అవుతుంది. దీని సాయంతో నీ దరిద్రం తీరిపోతుంది. కాకపోతే ఏడాది తర్వాత నేను వచ్చి వేరు ముక్క తీసుకెళ్లిపోతాను’ అని చెప్పాడు.
బీదవాడు సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్తూ.. అంగడిలోని ఇనుము అమ్మే దుకాణం దగ్గర ఆగుతాడు. దుకాణం యజమానితో.. ‘అయ్యా! నీ కొట్టులో ఉన్న ఇనుమంతా నాకు కావాలి. అమ్ముతావా?’ అని అడుగుతాడు. దానికి ఆ యజమాని.. ‘అయ్యా ! ఇప్పుడు ఇనుము ధర మండిపోతోంది. ఆరు మాసాల తర్వాత తగ్గుతుంది. అప్పుడు కొనండి’ అని చెబుతాడు. లోభత్వం కారణంగా.. ‘ఆరు నెలల తర్వాతే వస్తాన’ని వెళ్లిపోతాడు బీదవాడు. ఆరు నెలలు గడిచాక మళ్లీ ఇనుము షాపుకు వెళ్తాడు బీదవాడు. ‘ఇనుమంతా ఎంతకు అమ్ముతావు?’ అని అడుగుతాడు. ‘ధర మరింత పెరిగింది! మరో ఆరు మాసాలు ఓపిక పట్టండి ధరలు నేలకు దిగుతాయి. అప్పుడు మీకు లాభం కలుగుతుంద’ని అన్నాడు. బీదవాడు కూడా సరేనంటాడు. మళ్లీ ఆరు మాసాలు పూర్తయ్యాక ఇనుము కొనేందుకు బయల్దేరుతాడు.
దారిలో ఆ యోగి ఎదురుపడతాడు. ‘నాయనా ఏడాది గడిచిపోయింది. నా వేరు నాకు ఇవ్వు’ అని అడుగుతాడు. బీదవాడు వేరు ముక్క ఇవ్వడానికి తటపటాయిస్తాడు. యోగి ఆగ్రహించడంతో భయంతో వేరుముక్క ఇచ్చేస్తాడు. చేతిలో అదృష్టం ఉన్నా.. లోభత్వం కారణంగా.. అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు బీదవాడు.
దేహం ఉన్నంత కాలం.. విషయ సౌఖ్యాలకు లోబడి.. అంత్యకాలం దాపురించిన తర్వాత.. ‘అయ్యో!’ అనుకున్నా.. ఏం లాభం ఉండదు. మానవ జన్మ మహోన్నతమైనది. ఈ జన్మ పూర్తికాకముందే ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆత్మసాక్షాత్కారం పొందే ప్రయత్నం చేయాలి.

పేగుల్లో క్షయేమో....!
నా వయసు 38. ఈ మధ్య కాలంలో ఆకలి బాగా తగ్గింది. బరువు కూడా చాలా వేగంగా త గ్గిపోతున్నాను. కడుపు ఉబ్బరంగా ఉంటోంది. ఇది పోషకాల లోపం వల్ల వచ్చిన సమస్యా? లేక ఏదైనా జబ్బు లక్షణమా? ఈ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
- డి. ప్రకాశ్‌, కరీంనగర్‌
ఆకలి నశించడం, బరువు త గ్గిపోవడం, కడుపు ఉబ్బరంతో పాటు పొత్తి కడుపులో నొప్పి, జ్వరం, రాత్రుళ్లు చెమటలు పోయడం, నీళ్ల విరేచనాలు, పొత్తి కడుపు పెరగడం, కడుపులోకి నీరుచేరడం, అప్పుడప్పుడు పేగులు మడత పడటం వంటి లక్షణాలు ఉంటే అది పేగుల క్షయగా అనుమానించవచ్చు. పేగుల్లో వచ్చే ఈ క్షయ చాలా అరుదైనది. అందుకే ఊపిరితిత్తుల క్షయ గురించి తెలిసినంతగా చాలా మందికి తెలియదు. అయితే, అప్పటిదాకా శరీరంలో మరెక్కడో ఉన్న క్షయ, రక్తం ద్వారా కడుపులోకి వ్యాపించి, అక్కడ ఉండే లింఫ్‌ గ్రంథులకు సోకి పేగుల్లో క్షయను కలిగిస్తుంది. ఈ క్షయ మూడు రకాలుగా సోకే అవకాశం ఉంది.
కలుషితమైన ఆహారం ద్వారానో, జబ్బు పడిన ఆవు లేదా గేదె పాలను మరిగించకుండా తాగడం ద్వారానో క్షయ క్రిములు నేరుగా జీర్ణాశయంలోకి ప్రవేశించి పేగుల్లో క్షయను (అబ్డామినల్‌ ట్యూబర్‌కులోసిస్‌) కలిగిస్తాయి.
పేగుల్లో వచ్చే రెండవ రకం క్షయకు ఒక మూలస్థానం ఉంటుంది. అంటే అంతకు ముందే ఊపిరితిత్తుల్లో గానీ, మరే ఇతర అవయవంలోనో గానీ, క్షయ క్రిములు ఉండి, జీర్ణవ్యవస్థ మార్గంలోకి ప్రవేశించడం ద్వారా ఈ సమస్య వస్తుంది.
ఈలియో కేజల్‌ ట్యూబర్‌కులోసిస్ గా పిలిచే ఈ క్షయ చిన్న పేగులు, పెద్దపేగులు కలిసే జంక్షన్‌లో వస్తుంది.
మీరు వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్టును సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ ఆ జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయితే, తగిన వైద్య చికిత్సల ద్వారా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
- డాక్టర్‌ ఎల్‌ సురేంద్ర, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌

ఆహా.. అవకాడో ఆర్ట్‌!
మనసుంటే మార్గముంటుంది. హృదయం ఉంటే కళ ఉదయిస్తుంది. తాజాగా అవకాడో పండుపై రకరకాల ఆకృతుల్లో బొమ్మలు గీస్తున్నారు ఔత్సాహిక కళాకారులు. ప్రపంచంలో చాలామందికి ఇష్టమైన ఫ్రూట్‌ ఇది. ఈ పండుపై ప్రేమతో ఆర్టిస్టులు ఏకంగా అవకాడోపైనే బొమ్మలు గీస్తున్నారు. మనుషుల ముఖకవలికల్నీ అవకాడో గింజలపై చిత్రిస్తున్నారు. చూడటానికి ఆశ్చర్యపరిచే అవకాడో ఆర్ట్‌ విషయానికొస్తే కొందరు చిత్రకారులు మాస్టర్‌పీ్‌సలుగా తీర్చిదిద్దుతున్నారు. కొందరైతే ఏకంగా వారి డిజైన్స్‌కి కాపీరైట్స్‌ కూడా చేయించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రమ్‌లో అవకాడో ఆర్ట్‌ మస్తు పాపులర్‌ అవుతోంది.

అతిగా వద్దు!
కొన్ని అలవాట్లు చూడ్డానికీ, వినడానికీ బాగానే ఉంటాయి. కానీ... అవి ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావు. ఎందుకో మీరే చూడండి... 
* రోజూ ఆపకుండా వ్యాయామం చేయడం అనేది మంచి విషయమే! రోజువారీ వ్యాయామం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గొచ్చు. కానీ చాలామంది అదేపనిగా వ్యాయామం చేస్తారు. ఈ తీరు మంచిది కాదు. అది గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందుకని రోజులో 45 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు. 
* నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిదనేది చాలామంది అభిప్రాయం. నిజానికి అంత అవసరం లేదు. రోజులో ఎనిమిది నుంచి పన్నెండు గ్లాజుల నీళ్లు తాగితే చాలు. లేదంటే మూత్రపిండాలపై భారం పడుతుంది. 
* భోజనం చేసిన ప్రతిసారి పళ్లు తోముకోవడం కొందరి అలవాటు. నిజానికి దంతాలపై పేరుకున్న ఆహారపదార్థాలు కొన్నిరకాల ఆమ్లాలని విడుదల చేస్తాయి. అవి దంతాలపై ఉండే ఎనామిల్‌ పొరని బలహీనం చేస్తాయి. దానికితోడు మనం బ్రష్‌ చేసినప్పుడు ఆహారపదార్థాలతోపాటూ ఆ ఎనామిల్‌ పొర కూడా పోతుంది. కాబట్టి నీళ్లతో పుక్కిలించడం లేదా మౌత్‌ ఫ్రెషనర్‌తో నోరు కడుక్కుంటే సరిపోతుంది. 
* పోషకాల కోసం కొందరు సప్లిమెంట్‌ మాత్రలపై ఆధారపడతారు కానీ.. వాటినీ అతిగా వాడకపోవడం మంచిది. ఆ పోషకాలన్నీ ఆహారం ద్వారా అందేలా చూసుకోవాలి. మరీ తప్పనిసరి అయితేనే.. సప్లిమెంట్లు వైద్యుల సలహాతో ఎంచుకోవాలి.


కాటుకతోనే కనికట్టు..
శ్రావణం మాసపు శోభ అమ్మాయిల మోముల్లో సందడి చేస్తుంది. పట్టుబట్టలతో సంప్రదాయంగా కనిపించే ఈ సందర్భంలో ముఖ అలంకరణ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమూ తప్పనిసరే. 
* ముందుగా ముఖానికి గులాబీనీటిని రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఆపై మంచి మాయిశ్చరైజర్‌ని వ్యతిరేక దిశలో ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది. అలంకరణచేసుకున్నా కూడా ముఖమంతా సజావుగా పరచుకుంటుంది. 
* కళ్లకింద నల్లటి వలయాలు, మచ్చలు ఉన్నప్పుడు కన్సీలర్‌ తీసుకుని ఆ ప్రదేశంలో రాసుకోవాలి. ఆపై ఫౌండేషన్‌ రాసినప్పుడూ రెండూ కలిసిపోయేలా చూసుకోవాలి. చివరగా కాస్త పౌడర్‌ని అద్దుకుంటే.. మీ అలంకరణ ఎక్కువసేపు చెదిరిపోదు. ఒకవేళ రెండుమూడు గంటలయ్యాక ముఖం జిడ్డుగా అనిపిస్తుంటే.. కాస్త పౌడరు అద్దుకుంటే చాలు. 
* పండగల వేళ మేకప్‌ వీలైనంత తక్కువగా ఉంటేనే మేలు. అప్పుడే సహజంగా అందంగా కనిపిస్తాం. కొద్దిగా కాటుక, లైనర్‌, మస్కారా, లిప్‌స్టిక్‌లతోనే అద్భుతంగా మెరిసిపోవచ్చు. ఈ కాలంలో కాస్త ముదురురంగు లిప్‌స్టిక్‌లను ఎంచుకుంటే మంచిది. బర్గండీ, మెరూన్‌, లేత గులాబీ రంగులు అద్భుతంగా ఉంటాయి. 
* అలంకరణ చేసుకునేముందు.. ముఖాన్ని ఐసుముక్కలతో కాసేపు రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల వేసుకున్న అలంకరణ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list