ఒళ్లంత... తుళ్లింత
వర్షాలు కురిసే సమయంలో జలపాతాల అందాలు చూసి తీరాల్సిందే. వందల అడుగుల ఎత్తు నుంచి దూకే జలధారలు మనసును పరవశింప చేస్తాయి. అలా కనువిందు చేసే జలపాతాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆ విశేషాలేంటో చదవండి మరి.
మల్లెల వాన
మంత్రముగ్ధుల్ని చేసే జలపాతం మల్లెల తీర్థం. కృష్ణా నదిపై ఉంటుంది. హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై మున్ననూర్ చెక్‌పోస్టుకు 30 కి.మీ ముందు
వటవర్లపల్లి అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపు 8 కి.మీ ప్రయాణిస్తే మల్లెలతీర్థం చేరుకోవచ్చు. వాటర్‌ఫాల్స్ సమీపంలోకి చేరుకోవాలంటే మెట్ల మార్గం గుండా నడవాల్సి ఉంటుంది. పక్షుల కిలకిలరావాలు, రంగురంగుల సీతాకోకచిలుకలతో ఆ ప్రదేశమంతా మనోహరంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి 185 కి.మీ ఉంటుంది మల్లెల తీర్థం. వర్షాకాలం తరువాత సందర్శనకు వెళితే బాగుంటుంది. చుట్టుపక్కల మల్లికార్జున టెంపుల్, సాక్షి గణపతి ఆలయం, పాలధార, పంచధార, పాతాళగంగ డ్యామ్‌లను సందర్శించుకోవచ్చు.
పొచ్చెర.. చూసిరా..
విశాలంగా విస్తరించి ఉన్న రాతి బండల నుంచి పరవళ్లు తొక్కుతూ కిందకు జాలువారే ప్రవాహం మనసును కట్టిపడేస్తుంది. ఈ జలపాతంలో చాలా లోతైన ప్రదేశాలుంటాయి. ప్రమత్తంగా ఉండాలి. ఇది కుంటాల జలపాతానికి 22 కి.మీ దూరంలో ఉంటుంది. నిర్మల్‌కు 37 కి.మీ, ఆదిలాబాద్‌కు 47 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 257 కి.మీ దూరం. జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలం సందర్శనకు అనువైనది. ఈ జలపాతం చూడటానికి వెళ్తే చుట్టు పక్కల బాసర సరస్వతీ దేవీ ఆలయం, కవ్వాల్ వైల్డ్‌లైఫ్ శాంక్చరీ, ప్రాణహిత వైల్డ్‌లైఫ్ శాంక్చరీలను చూడొచ్చు.
కుంటాల కనువిందు
వర్షాకాలంలో కనువిందు చేసే జలపాతం ఇది. వర్షాలు బాగా కురిసిన సమయంలో సందర్శిస్తే జలపాతం అందాలు వీక్షించవచ్చు. 147 అడుగుల ఎత్తులో నుంచి జలపాతం పడుతూ ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పిక్నిక్ స్పాట్ ఇది. జలపాతం దగ్గరకు చేరుకోవడానికి మెట్ల మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అడ్వెంచర్ కోరుకునే వారికి ఈ జలపాతం మధురానుభూతిని అందిస్తుంది. హైదరాబాద్ నుంచి 260 కి.మీ దూరం ఉంటుంది. ఆదిలాబాద్‌కు 57 కి.మీ దూరంలో ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు సందర్శనకు అనువైనవి.
తలకోనలో తడవండి
తలకోనలో ప్రకృతి సౌందర్యం కట్టిపడేస్తుంది. ఇక్కడి నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వసిస్తారు. తిరుపతికి 58 కి.మీ దూరంలో, పీలేరుకు 49 కి.మీ దూరంలో ఉంటుందిది. 270 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. తలకోన ఫారె్‌స్టలో అద్భుతమైన మూలికలు ఉన్నాయని గుర్తించి ఈ ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వాయర్‌గా ప్రకటించారు. ఇక్కడ 40 అడుగుల ఎత్తులో ఉండే 240 మీటర్ల పొడవైన రోప్ వాక్‌పై నడిస్తే మధురానుభూతిని సొంతం చేసుకోవచ్చు. జలపాతం సమీపంలో సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని చూడొచ్చు. శివరాత్రి సమయంలో భక్తులతో ఈ ప్రదేశం సందడిగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి జనవరి మధ్య కాలం ఈ జలపాతం సందర్శనకు అనువైనది. చుట్టుపక్కల తిరుమల, శ్రీకాళహస్తి, తుంబురు తీర్థం, డీర్‌పార్క్ చూడొచ్చు.
ఆనందాల ఎత్తిపోతల
చంద్రవంక నదిపై ఉంటుందీ జలపాతం. చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేసే ఆలోచన ఉంటే ఫాల్స్‌కి వెళ్లవచ్చు. నాగార్జునసాగర్‌కు 14 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 176 కి.మీ దూరం ఉంటుంది. వర్షాకాలం సందర్శనకు అనువైనది. జూలై నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జలపాతం చూడటానికి వెళితే నాగార్జునసాగర్ డ్యామ్, క్రొకడైల్ బ్రీడింగ్ సెంటర్, రంగనాథ ఆలయం, దత్తాత్రేయ ఆలయం కూడా చూసి రావొచ్చు.
తడిమడ జడివాన
వంద అడుగుల ఎత్తు నుంచి పడే జలపాతం అందాలు చూసి తీరాల్సిందే. అనంతగిరి నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వాటర్‌ఫాల్స్ చేరుకోవచ్చు. అరకు నుంచి 30 కి.మీ దూరంలో ఉంటుంది. అనంతగిరి నుంచి 3 కి.మీ దూరం ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలం సందర్శనకు అనువైనది.
కటికి.. అందాల కలబోత
గోస్తని నదిపై ఉంటుందీ జలపాతం. సమీపంలో ఉండే గ్రామం పేరు మీదుగా ఈ జలపాతానికి ఆ పేరు స్థిరపడింది. బొర్రా గుహల నుంచి 7 కి.మీ దూరంలో ఉంటుంది. మరోదారి గుండా 1కి.మీ ప్రయాణిస్తే చేరుకోవచ్చు. చుట్టుపక్కల అరకు ట్రైబల్ మ్యూజియం, టైడా పార్క్, పద్మాపురం బొటానికల్ గార్డెన్, బొర్రా గుహలను చూడొచ్చు. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలం సందర్శనకు అనువైనది.
భీమునిపాదంలో జలధార
70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. భీముని పాదం గుర్తును ఇక్కడ చూడొచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఇక్కడ ఏర్పడే ఇంద్ర ధనుస్సు కనువిందు చేస్తుంది. వర్షాకాలంలో జలపాతం ఎక్కువగా ఉంటుంది. గూడూరుకు 10 కి.మీ దూరంలో, వరంగల్‌కు 51 కి.మీ దూరంలో ఉంటుంది. జలపాతం సమీపంలో శివాలయం, నాగదేవతా ప్రతిమలు చూడొచ్చు. వీకెండ్స్‌లో, సెలవుల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది.
మన నయాగరా బొగత
ఈ జలపాతానికి తెలంగాణ నయాగరా అని పేరుంది. ఏడాది పొడవునా జలపాతం కనువిందు చేస్తుంది. వాటర్‌ఫాల్ వరకు చేరుకోవడానికి కొద్ది దూరం నడవక తప్పదు. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం. భద్రాచలానికి 120 కి.మీ దూరంలో, వరంగల్‌కు 140 కి.మీ దూరంలో ఉంటుంది. ముందుగా ఏటూరునాగరం చేరుకోవాలి. అక్కడి నుంచి 25 కి.మీ దూరం ప్రయాణిస్తే బొగత వాటర్‌ఫాల్ చేరుకోవచ్చు. జూన్ నుంచి నవంబర్ మధ్య కాలం సందర్శనకు అనువైనది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565