MohanPublications Print Books Online store clik Here Devullu.com

పర్వతం లాంటివాడు-Parvatam Lantidhi


పర్వతం లాంటివాడు
ధమ్మ మార్గాల్లోకి వచ్చేవారు ముఖ్యంగా మూడు రకాలు. అందులో ఏదో ఒక లాభం ఆశించేవారు ఒక రకం. వారికి అందులో ఏ లాభమూ కనిపించకపోతే వారు త్వరగానే ఆ మార్గం వదిలిపోతారు. చాలామంది ఆ మార్గంలోకి పోయారు కాబట్టి తామూ పోవాలనుకునే వారు రెండో రకం. వీళ్లూ మధ్యలో తిరోగమిస్తారు. ఆ మార్గాన్ని విశ్వసించి, దాన్ని పరిశోధించి, ఆచరించి జీవించేవారు మూడో రకం. వీరు చివరి దాకా ఆ మార్గంలోనే ప్రయాణిస్తారు. ఇలాంటి వారిలో పెదకాలుడు, చినకాలుడు అనే అన్నదమ్ములు కూడా ఉన్నారు. వీరిద్దరూ సేతవ్య నగరానికి చెందిన వర్తకులు. బుద్ధుని ప్రబోధం విని ముందుగా పెదకాలుడు బౌద్ధ భిక్షువు అయ్యాడు. సంసార బంధాలు తెంచుకున్నాడు. మంచి భిక్షువుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజల నుంచి గౌరవమర్యాదలు పొందాడు. అన్న పొందే గౌరవాలు చూసి తమ్ముడైన చినకాలుడు కూడా సంసారాన్ని వీడి, భిక్షువయ్యాడు. ఇలా ఒక ఏడాది గడిచింది. ఒకసారి బుద్ధుడు ఈ ఇద్దరు సోదరులతో పాటు మరికొందరు భిక్షువులను తీసుకుని సేతవ్య నగరం వెళ్లాడు. ఈ విషయం తెలిసి చినకాలుడి భార్య వారి దగ్గరికి వెళ్లింది. ఒకరోజు తమ ఇంటికి భిక్షకు రావలసిందిగా ఆహ్వానించింది. ఆమె ఆహ్వానం మేరకు బుద్ధుడు, అతడి పరివారం భిక్షకు వెళ్లారు. భోజనాల అనంతరం గృహస్థులకు ధర్మప్రబోధం ఎవరో ఒక భిక్షువు చేయాలి. ‘ఈ రోజు ఆ కార్యక్రమం చినకాల భిక్షువుగారు చేస్తారు. మిగిలినవారు వెళ్లి విశ్రాంతి తీసుకోండి’ అని వేడుకుంది చినకాలుని ఇల్లాలు. వారంతా వెళ్లిపోగానే ఏడ్చి, మొత్తుకొని, అతనిలో కోరికలు రేపి, చినకాలుడిని తిరిగి తన వశుణ్ణి చేసుకుంది ఆ ఇల్లాలు. ఈ విషయం తెలిసి పెదకాలుని ఇల్లాలు కూడా బౌద్ధ సంఘాన్ని భిక్షకు ఆహ్వానించింది. భోజనం తర్వాత పెదకాలుడే ధర్మప్రబోధం చేయాలని వేడుకుంది. పెదకాలుడిని అక్కడే వదిలి.. వెళ్లిపోయాడు బుద్ధుడు. అప్పుడు భిక్షువులు.. ‘‘భగవాన్‌! చినకాలుణ్ణి పోగొట్టుకున్నాం. ఆ విషయం తెలిసి కూడా పెద్దకాలుణ్ణి ఒంటరిగా ఉంచి వస్తున్నారేం?’’ అని అడిగారు. ‘‘భిక్షువులారా! శరీర అందాలపై మోహం వీడనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, భోజన ప్రియుడు, సోమరి, చిత్తబలం లేనివాడు త్వరగా జారిపోతాడు. ‘‘తం వే పసహతి మారో రుక్ఖంవ దుబ్బలం’’- బలహీనమైన చెట్టును మామూలు గాలే తేలిగ్గా కూల్చి వేస్తుంది. చినకాలుడు అలాంటివాడు. పెదకాలుడు అలాంటి వాడు కాడు. ‘‘తం వే నప్పసహతి మారో వాతో సేలంవ పబ్బతం’’.. పర్వతాన్ని పెనుగాలి కూడా ఇసుమంత కదల్చలేదు’’ అని వివరించాడు. బుద్ధుడు అన్నట్లే.. పెదకాలుడు ధర్మప్రబోధం చేసి ఆరామానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాతి కాలంలో.. అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడా బుద్ధుని అభిమానులయ్యారు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list