MohanPublications Print Books Online store clik Here Devullu.com

టీచరు, బడి-Teacher, school


మునగ..!
గుడ్‌ఫుడ్‌
మునక్కాయను చాలామంది ఇష్టంగా తింటారు. రుచిగా ఉండే మునగతో ఆరోగ్యానికీ చాలా మేలు. మునగతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని...
మునగచెట్టు శాఖలు చాలా బలహీనంగా ఉంటాయేమోగానీ, మునగలో ఎముకలు గట్టిపడటానికి అవసరమైన క్యాల్షియమ్‌ పుష్కలంగా ఉంటుంది. మునగ ఆకుల నుంచి కాస్త రసం తీసి, పాలలో కలిపి పిల్లలకు పట్టిస్తే ఎముకలను పటిష్టం చేస్తుంది ∙ఛాతీ పట్టేసినట్లున్నా, శ్వాస తీసుకోవడం కష్టమైనా, దగ్గు రావడం, గొంతులో పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలన్నింటికీ మునగతో మంచి ఉపశమనం దొరుకుతుంది.
అందుకే ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు మునగ తినడం మంచిది మునగ ఒంట్లోని విష పదార్థాలను క్రమంగా బయటకు పంపించే సమర్థమైన డీ–టాక్సిఫయర్‌. మునగ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ∙మునగతో గొంతు, చర్మ, ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లు వేగంగా నయమవుతాయి. ∙ఇందులో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్న వాళ్లు మునగ ఎక్కువగా తినడం మంచిది. ∙మునగలోని విటమిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులను నివారిస్తాయి.
బాలవాక్కు.. అమ్మ మాట...!
ఆత్మీయం
అనగనగా ఒక బాలుడు. అతడికి జట్కాబండిలో ప్రయాణించడ మంటే చాలా ఇష్టం. అతడు ఇంటినుంచి రోజూ బడికి వెళ్లేది జట్కాలోనే. ఓ రోజు టీచరు బడిలో పిల్లలను... మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని అడిగారు. ఒకరు డాక్టరవుతానని, ఇంకొకరు ఇంజినీరవుతానని, మరొకరు లాయరు అవుతానని చెబుతుండగా, ఓ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానని జవాబిచ్చాడు. టీచరు, పిల్లలు గొల్లున నవ్వారు. బాలుడు ఇంటికి చేరే లోపలే ఈ కబురు ఊరికీ, ఊళ్లోని తల్లికి చేరిపోయింది. ఇంటికి రాగానే తల్లి ప్రశాంతవదనంతో ‘‘బాబూ! పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావ’’ని అడిగింది.
అతడు టీచరుకు చెప్పిన సమాధానమే తల్లికీ చెప్పాడు. అప్పుడామె ‘‘తప్పకుండా అవుదువుగానీ, ఇలా రా’’ అంటూ పూజామందిరం తలుపులు తెరిచింది. ‘‘ఒక్క గుర్రంతో నడిపే బండిని కాదు బాబూ, నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో, ఆ శ్రీకృష్ణుడిలాగా – ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఆ విషయాలను బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడు’’అని చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా! అంటూ అతడి ఆలోచనను చక్కని మలుపు తిప్పింది. ఆ బిడ్డడే నరేంద్రనాథుడు. పెరిగి పెద్దయ్యాక మనందరికీ తెలిసిన వివేకానందుడు. నిజంగా, అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా!!! అమ్మమాటను నిలబెట్టిన వివేకానందుడు నిజంగా ధన్యజీవి.

పాలనతో సాధన
హజ్రత్‌ ఉమర్‌ (రజి) దైవభీతి పరాయణతతో పరిపాలన చేసేవారు. ప్రజల బాగోగులను తెలుసుకునేందుకు రాత్రిళ్లు గస్తీ తిరిగేవారు. ఒకరోజు ఆయన గస్తీ తిరుగుతుండగా.. ఒక గుడిసెలో నుంచి ఎవరో మూలుగుతున్న శబ్దం వచ్చింది. అటుగా వెళ్లి చూడగా.. గుడిసె బయట ఒక పల్లెటూరి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. లోపల నుంచి ఏడుపు వినిపిస్తోంది. విషయం ఏమిటని ఆ వ్యక్తిని అడిగాడు.
‘‘నా భార్య ఇంట్లో ప్రసవవేదన పడుతోంది. సహాయానికి ఎవరూ లేరు’’ అని చెప్పాడతడు. వెంటనే ఉమర్‌ (రజి) ఇంటికి వెళ్లి తన భార్యకు ఈ విషయం చెప్పి.. ఆమెను వెంటబెట్టుకుని గుడిసె దగ్గరికి తీసుకొచ్చాడు. ఉమర్‌ (రజి) భార్య లోనికి వెళ్లి ఆ మహిళకు పురుడు పోసింది. బయటకు వచ్చి ‘‘అమీరుల్‌ మోమినీన్‌! మీ మిత్రుడికి పండంటి కొడుకు పుట్టాడు’’ అని ఉమర్‌ (రజి)తో చెప్పింది. అమీరుల్‌ మోమినీన్‌ అన్న మాట వినేసరికి ఆ ఇంటి యజమాని నిర్ఘాంతపోయాడు. ఉమర్‌ (రజి) అతనికి దైర్యం చెబుతూ.. ‘‘నేను సంఘ సేవకుడినే కదా! ప్రజల ఇబ్బందులను దూరం చేయడం నా బాధ్యత’’ అని వినమ్రతతో చెప్పాడు.
మరొక రోజు రాత్రి హజ్రత్‌ ఉమర్‌ (రజి) తన సేవకుడిని వెంట తీసుకొని గస్తీ తిరుగుతున్నాడు. అర్ధరాత్రి దాటింది. ఒక ఇంటిలో దీపం వెలుగుతోంది. ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. ఒక మహిళ తన పిల్లల్ని నిద్రపుచ్చుతోంది. ఆకలితో ఏడుస్తున్న పిల్లలకు.. పొయ్యి మీద పాత్ర చూపిస్తూ.. ‘భోజనం తయారవుతోంద’ని నచ్చజెబుతోంది. ఇది చూసిన ఉమర్‌ (రజి) ‘‘ఏమిటమ్మా! ఇంకా నిద్రపోలేదు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు’’ అని అడిగాడు. ‘‘నా భర్త చనిపోయాడు. పేదరికం, తిండి గింజలకు కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నాం. అయినా ఖలీఫాకు లేని బాధ నీకు ఎందుకు?’’ అని ఆవేదనగా బదులిచ్చింది. వెంటనే ఉమర్‌ (రజి) తన కోశాగారానికి వెళ్లి గోధుమపిండి బస్తా తీసుకుని... స్వయంగా తన భుజం మీదే వేసుకొని ఆ పేదరాలి ఇంటికి బయల్దేరాడు. ఇంతలో సేవకుడు ‘‘అమీరుల్‌ మోమినీన్‌! మీరు అంత బరువు మోయలేరు. ఆ బస్తా నాకివ్వండి’’ అన్నాడు.
అందుకు ఉమర్‌ (రజి) ‘‘తీర్పు దినాన దైవం ఎదుట హాజరైనప్పుడు నా బరువు నీవు మోస్తావా?’’ అంటూ గోధుమపిండి బస్తాను ఆ మహిళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ‘‘ఖలీఫా (రజీ) నీ సమస్య తెలుసుకోవడంలో ఆలస్యమైనందుకు ఆయన్ను క్షమించమ్మా! ఆయనా నీలాంటి మనిషే! రేపటి నుంచి నీకు రావలసిన జీవన భృతి మొత్తం నీ ఇంటికే వస్తుంది. దైవ సమక్షంలో ఖలీఫాపై ఫిర్యాదు చేయకు తల్లీ’’ అని వెళ్లిపోయారు హజ్రత్‌ ఉమర్‌ (రజి).
హజ్రత్‌ ఉమర్‌ (రజి) దైవభీతికి, దార్శనిక బుద్ధికి మరో ఉదాహరణ ఇది. ఒకరోజు రాత్రి ఒక ఇంట్లో.. తల్లి తన కూతురితో ‘‘పాలల్లో నీళ్లు కలుపు. ఎక్కువ పాలు అమ్మితే డబ్బులు ఎక్కువగా వస్తాయి’’ అంది. అందుకు కూతురు.. ‘అమ్మా! ఖలీఫా గారు పాలల్లో నీళ్లు కలపరాదని ఆజ్ఞాపించారు కదా!’ అని గుర్తు చేసింది. ‘ఖలీఫాకు ఎలా తెలుస్తుంది! ఆయన చూడటం లేదు కదా’ అంది తల్లి. ‘ఖలీఫా చూడకున్నా.. అల్లాహ్‌ చూస్తాడు కదమ్మా!’ అని పలికింది కూతురు. ఈ మాటలు ఖలీఫా చెవిన పడ్డాయి. తెల్లవారగానే.. ఆ అమ్మాయిని రాజప్రాసాదానికి పిలిపించాడు హజ్రత్‌ ఉమర్‌ (రజి). ఆమెను తన కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించి.. తన ఇంటికి కోడలుగా చేసుకున్నాడు.
- ముహమ్మద్‌ వహీదుద్దీన్‌, సిద్దిపేట

తులసితో కఫానికి కట్టడి
ప్రతి ఇంటా తులసి మొక్క ఉండాలనీ, ప్రతి రోజూ తులసి పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తి విషయం మాత్రమే లేదు. తులసిలో అనేక వ్యాధులను నయం చేస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే, తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతి రోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇళ్లల్లో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.
తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
తులసి వేరునూ, శొంఠినీ సమతూకంలో తీసుకుని ఈ రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి. ఆ మాత్రల్ని ప్రతి రోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో సేవిస్తే, చాల రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి.
తులసి, వెల్లుల్లిని నూరి, వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే, మూత్రం సాపీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి.
ప్రతి రోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళనలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది.
ఆకలి పెరిగేదెలా?
నా వయస్సు 37 సంవత్సరాలు. కొంత కాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాను. బరువు కూడా చాలా తగ్గాను. నెల రోజులుగా టి.బి. మందులు వాడుతున్నాను. అయితే ఆకలి బాగా తగ్గిపోయింది. ఆకలి బాగా పెరగడానికి ఆయుర్వేదంలో మందులు ఉంటే సూచించండి?
- మాధవరావు, రాయచోటి
క్షయ వ్యాధి బారినపడిన వారు బలవర్దకమైన ఆహారం తీసుకోవాలి. జీర్ణశక్తి సరిగ్గా ఉన్నప్పుడే ఆకలి బాగా ఉంటుంది. ఇందుకోసం మీరు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. రోజూ ఒక బత్తాయి పండు తినాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శొంఠి చూర్ణం, సైంధవ లవణం రెండూ కలిపి భోజనానికి పావుగంట ముందు ఒక అర చెంచా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. చ్యవన్‌ప్రాశ్‌ వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఏమైనా మీరు టీబీ మందులు వాడుతున్నారు కాబట్టి ఒకసారి ఆయుర్వేద వైద్యుణ్ణి కలిసి సలహా తీసుకోవడం మంచిది.
- డా. విఠల్‌రావు, ఆయుర్వేద వైద్యనిపుణులు
ముడతలకు తేనె..
తేనెలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలుచేస్తాయి. అయితే దాన్నెలా వాడాలో తెలుసుకుంటే చాలు..
ముఖ కాంతికి: తరచూ బయట తిరిగే వారి చర్మం నల్లగా మారుతుంది. కళ తగ్గుతుంది. ఇలాంటప్పుడు తేనె చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కాసిని పచ్చిపాలలో చెంచా తేనె, రెండు చెంచాల సెనగపిండి కలపాలి. దాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక చన్నీళ్లతో ముఖాన్ని కడిగేసుకుంటే చాలు. ఇలా రోజూ చేస్తుంటే చర్మంపై పేరుకున్న నలుపుదనం పోతుంది. ముఖం కాంతిమంతంగా మెరిసిపోతుంది.
మొటిమలకు: టీనేజీ అమ్మాయిల ప్రధాన సమస్య మొటిమలు. వాటి తాలూకు మచ్చలూ ఇబ్బంది పెడుతుంటాయి కూడా. ఇలాంటప్పుడు చెంచా తేనెలో రెండు చెంచాల నిమ్మరసం, కాస్త గులాబీనీరూ కలిపి ముఖానికి రాసుకోవాలి. దీన్ని పడుకోవడానికి ముందు రాసుకుని ఆరాక కడిగేసుకుంటే సరి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
ముడతలు: అవును ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ముఖంపై ముడతలు ఇట్టే మొదలవుతాయి. ఇలాంటప్పుడు పావుకప్పు తేనెలో గుడ్డులోని తెల్లసొన కలపాలి. దానికి చెంచా నిమ్మరసం చేర్చి బాగా గిలకొట్టి ముఖం, మెడా, చేతులకు పూతలా వేయాలి. బాగా ఆరాక కడిగేయాలి. ఇది ముడతల ప్రభావాన్ని తగ్గించడమే కాదు.. ముఖానికి యౌవనకాంతినీ ఇస్తుంది.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list