MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ రమణ మహర్షి _Shree Ramana maharshi




తపస్సంటే...!
శ్రీరమణులు విరూపాక్షగుహ వద్ద కలుసుకున్న గణపతిశాస్త్రి బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన వారు. భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తీవ్రమైన తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. చివరకు అరుణగిరిపై బ్రాహ్మణస్వామిగా ప్రసిద్ధులైన రమణుల వద్దకు వచ్చి వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను.
వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా ఇప్పటి వరకు తపస్సంటే ఏమిటో తెలియలేదు. అందువల్ల మీ పాదాలను శరణుజొచ్చాను. తపస్సు స్వరూపాన్ని తెలియజేయండి’’ అని అర్థించారు. మౌనంగా ఆయన వైపు చూస్తూ స్వామి ఇట్లా సమాధానమిచ్చారు. ‘‘ ‘నేను’ అనే భావమెక్కడి నుంచి ఉదయిస్తోందని చింతన చేస్తే మనస్సు అందులో విలీనమైపోతుంది అదే తపస్సంటే. ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ
మంత్రోత్పత్తి స్థానంపై మనస్సుని కేంద్రీకరిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే తపస్సంటే.’’ ఈ ఉపదేశానికి గణపతి మనస్సు ఉప్పొంగిపోయింది. వేదకాలం తరువాత ఇటువంటి ఉపదేశం ఎవ్వరూ ఇవ్వలేదని అనిపించిందాయనకి. వెంటనే ఆశువుగా అయిదు శ్లోకాలు చెప్పారు. స్వామి పరిచారకుని వద్ద నుంచి ఆయన పేరు వెంకటరామన్‌ అని తెలుసుకుని ‘భగవాన్‌ శ్రీ రమణమహర్షి’ అని నామకరణం చేశారు. మోక్షానికి మార్గం చూపే వారు మహర్షులు - ఈ నామకరణానికి అదే కారణం. గణపతిశాస్త్రి బ్రాహ్మణస్వాముల కన్నా ఒక ఏడాది పెద్ద వారైనా రమణులని తన గురువుగా స్వీకరించారు. తన శిష్యులందరికీ రమణుల ఔన్నత్యం గురించి చెప్పారు. మరి కొంత కాలానికి రమణులను స్తుతిస్తూ కొన్ని శ్లోకాలనూ, వారి బోధలకు సంబంధించిన గ్రంథాలనూ రాశారు. గణపతిశాస్త్రిని శ్రీరమణులు ‘నాయన’ అనేవారు.
భగవాన్‌ విరూపాక్ష గుహలలో ఉండే రోజులలో జరిగిన ఇంకో సంఘటన వారి గొప్పతనాన్ని సూచిస్తుంది. అది ఇది. వేసవి కాలంలో అక్కడ నీటి కొరత బాగా ఉండేది. దీని గురించి చెబుతూ మహర్షి ఇలా అన్నారు. ‘‘నీటి కొరతను తప్పించుకోవడానికి చూత గుహకి మారే వాళ్లం. మిట్ట మధ్యాహ్నం వేళ కడజాతి స్త్రీలు నెత్తిమీద గడ్డి మోపులను పెట్టుకుని అలసిపోయి ఆ గుహ వద్దకు వచ్చే వాళ్లు. గుహ దగ్గరకు రాగానే ఆ గడ్డి మోపులను కిందపడేసి, వంగి ‘‘స్వామీ, ఒక కడివెడు చల్లని నీళ్లని మా వీపుల మీద పోయరా!’’ అని అడిగేవారు.
(సశేషం...)


పింగళి సూర్యసుందరం
మనో దర్శనం
(గతవారం తరువాయి)
బ్రాహ్మణస్వామిగా విరూపాక్ష గుహలలో రమణులు ఉన్న రోజులలో శివప్రకాశం పిళ్ళై వారిని కలుసుకున్నారు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఎవరైనా గొప్ప జ్ఞాని దర్శనం లభిస్తే బాగుండుననుకునే వారు. బ్రాహ్మణస్వామిని 1902లో కలుసుకున్నారు. స్వామి వయస్సు అప్పుడు కేవలం 22 ఏళ్లే. మౌనంగా కొండ గుహ బయట కూర్చునేవారు. పిళ్ళై అయన్ని దర్శించుకుని ఎన్నో ప్రశ్నలు వేశారు. ‘‘నేనెవరిని?’’ అన్న ప్రశ్న ఆయన్ని ఎంతోకాలంగా వేధిస్తోంది. అప్పటికే బ్రాహ్మణస్వామిని ఇదే ప్రశ్న అడిగారు. స్వామి ఇసుకమీద సమాధానం రాశారు.
అట్లాగే ఇంకొన్ని ప్రశ్నలు వేశారు. వీటన్నిటినీ మనసులో భద్రపరచుకుని ఒక చిన్న పుస్తకరూపంలో ‘నార్‌యాద్‌’(నేనెవరిని) అని ఇరవయ్యేళ్ల తరువాత తయారుచేశారు. ఇందులో రమణులు క్లుప్తంగా ఇచ్చిన సమాధానాలను తన అవగాహన ప్రకారం విస్తరించి రాశారు పిళ్ళై. ప్రచురించే ముందు రమణులకు చూపారు. దానికి కొన్ని దిద్దుబాట్లు చేసి స్వయంగా ఆ విషయమంతా ఒక వ్యాసరూపంలో రాశారు రమణులు. పిళ్ళైకి లభించిన సమాధానాలే రమణుల తత్త్వబోధ అంతాను. స్థూలంగా చెప్పాలంటే నేను ఇదీ, నేను అదీ అనేవన్నీ మనస్సుతో కల్పితమైనవే. పిళ్ళైకి బ్రాహ్మణస్వామి సన్నిధిలో కూర్చుండగా కొన్ని దివ్యదర్శనాలు కలిగాయి. వాటిని ఆయన ఈ విధంగా స్వామికే చెప్పుకున్నారు. ‘‘మీ సమక్షాన కూర్చున్నప్పుడు (1913 మే 5న) నాకొక మనో దర్శనమైంది. మిమ్మల్ని అనేక పున్నమి చంద్రుల చంద్రికలు పరివేష్ఠించాయి.
బంగారపు వన్నెను మించిపోయిన మెరుపుతో, సూర్యతేజంతో వెలిగిపోయింది మీ దేహం. మీ నేత్రద్వయం దివ్యమైన అనుగ్రహాన్ని విరజిమ్మింది. దానితో బాటు వితరణ శక్తి కూడా కనబడింది. మరి కొంత సేపటికి మీ దేహమంతా ధవళ కాంతులీనే విభూతిపూసి ఉంది. ఇవన్నీ నాకు కనబడ్డాయి గాని నా పక్కన ఉన్న వారెవ్వరూ చూడలేదు. మీరే నా నాథులని నేను గ్రహించిన నాటి నుంచి సూర్యోదయంతో మాయమయ్యే పొగమంచు వలె నా కష్టాలూ మాయమైపోయాయి.’’ శివప్రకాశం పిళ్ళైకి ఈ అనుభవమయ్యే నాటికి స్వామి పేరు భగవాన్‌ శ్రీరమణ మహర్షిగా స్థిరపడిపోయింది. అందరికీ పిళ్ళై వంటి అనుభవాలు కాకపోయినా భగవాన్‌ని దర్శించుకున్న వారందరికీ శోకనాశనమయ్యేది. అందువల్లే కావ్యకంఠ గణపతి ముని భగవాన్‌ని ‘శోకస్యహంత్రే నమః’ అని స్తుతించారు. (సశేషం)
-పింగళి సూర్య సుందరం



దేహానివా? చైతన్యానివా?
శ్రీ రమణ కథామృతం
(గతవారం తరువాయి...)
తేజోమూర్తి అయిన ఆ యువస్వామికి ఆకర్షితులైన వారిలో పళనిస్వామి అనే విరాగి ఒకరు. ఈయన మాతృభాష మళయాళం. స్వామి కన్నా దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దాయన. ఊళ్ళో గ్రంథాలయానికి వెళ్లి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను చెప్పే గ్రంథాలను తెచ్చి స్వామికి ఇస్తూ ఉండేవాడు. అప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవని రమణునకు పళనిస్వామి తెచ్చే పుస్తకాలలోని విషయాలు తనకి అనుభవ సిద్ధమైనవేనని తెలిసొచ్చింది. ఆ విధంగా గ్రంథపఠనం ప్రారంభమైంది.
తల్లిగారు వెళ్లిపోయిన తరువాత రమణులు అరుణగిరిపై నుండే గుహలలో నివాసమేర్పరచుకున్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు విరూపాక్ష గుహలో, ఆ తరువాత ఆరు సంవత్సరాలు స్కందాశ్రమంలో ఉండేవారు. మౌనంగా, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండే ఆ స్వామిని దర్శించుకోవడానికి ఎందరో వచ్చేవారు. వీళ్లంతా ఆ మౌనస్వామి కంటే పెద్దవారే! వీళ్లలో ఇద్దరి, ముగ్గురి గురించి చెప్పుకుందాం.
స్వామి తిరువణ్ణామలైలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ఒక సాధువుండేవారు. ఆయన తరచూ స్వామిని కొండ మీదకు రమ్మంటూ ఉండేవారు. తీరా కొండపైకి స్వామి వెళ్లిన తరువాత ఆ సాధువు గ్రహించినదేమంటే ఇంతకు పూర్వం తన దర్శనానికి వచ్చే సామాన్యజనం ఇప్పుడు స్వామి దగ్గరకు వెళ్తున్నారనీ, తనని నిర్లక్ష్యం చేస్తున్నారని. అసూయను ఆపుకోలేక ఒకసారి స్వామి ముఖం మీద ఉమ్మేశాడు. పళనిస్వామి అతనిని కొట్టబోతే మౌనంగా సంజ్ఞలు చేసి స్వామి వారించారు. ఇదెట్లా సాధ్యమని మనం అనుకుంటాం. దేహం పట్ల ఏ విధమైన అభిమానమూ లేని ఆ మౌనస్వామిని ఆ సాధువు చేసిన అకృత్యం ఏమీ బాధపెట్టలేదు! ఇంతకూ ఆ సాధువు తన దేహాన్నే కదా అవమానపరచాడు? తానేమో చైతన్యస్వరూపుడాయె! స్వామి విరూపాక్షగుహలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ముఖ్యులిద్దరి గురించి చెప్పుకుందాం. ఒకాయన శివప్రకాశం పిళ్ళై! ఇంకొకరు కావ్యకంఠ గణపతిముని! శివప్రకాశం పిళ్ళై పట్టభద్రుడు. కాలేజీలో ఫిలాసఫీ అధ్యయనం చేశాడు. ఆయన స్వామిని ఎన్నో ప్రశ్నలు వేస్తే పలక మీదో, నేల మీదో స్వామి సమాధానాలు రాసి ఇచ్చేవారు. వాటినన్నిటినీ భద్రపరచుకుని కొన్నేళ్ల తరువాత ‘‘నాన్‌ యార్‌’’(నేనెవరిని) అనే గ్రంథంగా రూపొందించారు పిళ్ళై. ఈ ప్రశ్నోత్తరాల సంగతి తరువాత చూద్దాం.
కావ్యకంఠ గణపతిముని రమణుల కంటే ఒక ఏడాది పెద్దవారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేస్తుండేవారు. కాని ఆశించిన ఫలితం దొరకలేదు. చివరికి 1907లో మౌనస్వామిని ఆశ్రయించి, ‘తపస్సంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. గణపతిముని వైపు పదిహేను నిమిషాలు తదేకంగా చూసి మౌనస్వామి నోరు విప్పి మాట్లాడారు. అంటే అప్పటి వరకు (11 సంవత్సరాలు) మౌనంగా ఉన్న స్వామి మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట! రమణులు ఇచ్చిన సమాధానమేమిటో, దాని పర్యవసానమేమిటో తరువాత చూద్దాం.(సశేషం)
- పింగళి సూర్యసుందరం


భిక్షాటనలో పరమానందం

గతవారం తరువాయి...
తన జనకుడైన అరుణాచలేశ్వరుని దర్శనం తరువాత దాదాపు రెండేళ్లు స్వామి (వెంకటరామన్‌) తిరువణ్ణామలైలోనే ఉన్నారు. కానీ, చిత్రమేమిటంటే ఆ కాలంలో వారు మళ్లీ ఆలయంలోకి వెళ్లలేదు. ఈ రెండేళ్లలో జరిగిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి.
మొదటిది.. ఆయన రూపంలో, ఆహార్యంలో వచ్చిన మార్పు. ఒత్తుగా పెరిగిన జుట్టునంతా తీయించేసుకున్నారు. యజ్ఞోపవీతాన్ని తీసేశారు. పంచెను చింపేసి.. కేవలం కౌపీనం మాత్రమే ధరించారు.
రెండోది.. భిక్షాటనం. దాని గురించి వారెమన్నారంటే.. ‘‘నేను భిక్షకు పోతుండేవాణ్ణి. రాత్రిళ్లు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్లో పెట్టుకొని చూస్తూ ఉండేవారు. ఆ రోజులలో భిక్షకు వెళ్లడమంటే భలే హుషారుగా ఉండేది. అంతా అన్నం కలిపి నా చేతుల్లో ముద్దలు వేసేవారు. రెండు మూడు ముద్దలు వేయించుకొని తినేవాణ్ణి. నాలుగైదు ఇళ్లల్లో తినేసరికి కడుపు నిండిపోయేది. అలా బిచ్చమెత్తుకోవడంలో నేను అనుభవించిన రాచఠీవీనీ, దర్జానీ మీరు ఊహించలేరు. మొదట్లో పెంపకం ప్రభావం వల్ల కొంత సిగ్గుపడ్డాను. కానీ, ఏమాత్రం న్యూనతాభావం కలుగలేదు. ఒక్కొక్కసారి రాజాధిరాజులాగా ఉండేది నాకు. ఒక్కోసారి పాచిపోయిన గంజి పోసేవారు. ఉప్పురవ్వ కూడా ఉండేది కాదు. దానినే వీధిలో తీసుకునేవాణ్ణి. పండితులూ, ఇతర ప్రముఖులు వచ్చి సాగిలపడి నాకు నమస్కరించేవారు. నేను బిచ్చాన్ని ఆరగించిన తరువాత అరచేతులను తలకి రాసుకునేవాణ్ణి. పరమానందభరితుడినై పోయేవాణ్ణి’’ అని చెప్పేవారు స్వామి. ఆయన చెప్పిన ఈ స్థితిని మనం ఊహించలేం.
(సశేషం)
ఫ పింగళి సూర్య సుందరం

గూటికి చేరిన పక్షి
(గత వారం తరువాయి)
‘‘తిరువణ్ణామలై వెళ్లాలంటే.. ఇంకా 20 మైళ్లు వెళ్లాలి. ఈ ప్రయాణానికి ఖర్చులెవరు ఇస్తారు’’ అనుకున్నాడు వెంకటరామన్‌. వెంటనే తన చెవులకు ఉన్న రాళ్లు పొదిగిన దుద్దులు జ్ఞప్తికి వచ్చాయి. ఆ ఇంటాయన (ముత్తుకృష్ణ భాగవతార్‌) దగ్గర కుదువ పెడితే బాగుంటుందనిపించింది. అటువంటి లావాదేవీల్లో ప్రవేశం లేకపోయినా.. భాగవతార్‌తో తన సామాను ప్రయాణంలో పోయిందనీ, ఇంకా ప్రయాణం కొనసాగించడానికి డబ్బు కావాలనీ చెప్పి కొంత పైకం అప్పు తీసుకున్నాడు. దానికి కావలసిన ప్రామిసరీ నోట్‌ కూడా తీసుకున్నాడు.

గోకులాష్టమి నాడు తమ ఇంటికి అతిథిగా వచ్చిన అబ్బాయికి భోజనం పెట్టడమే కాక.. భాగవతార్‌ సోదరి అతనికి కొన్ని భక్ష్యాలను పొట్లం కట్టి ఇచ్చింది. డబ్బునూ, ఆ భక్ష్యాలనూ తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు రమణుడు.

తొలుత అరయనినల్లూర్‌ దాకా నడిచి వెళ్లాడు. మర్నాడు ఉదయం తిరువణ్ణామలైకి వెళ్లే రైలు ఎక్కాడు. రైలు ఎక్కినప్పటి నుంచీ అరుణాచలానికి ఎప్పుడెప్పుడు చేరుతానో అనే తొందరే ఆ యువకునికి! ఆ కొండ శిఖరం ఎప్పుడు కనబడుతుందా అని రైలులో నుంచి చూస్తూ ఉన్నాడు. కాసేపటికి గిరి శిఖరం, గిరి పాదం, ఆ పక్కనే ఉన్న అరుణాచలేశ్వర ఆలయ గోపురం ఒకదాని తర్వాత ఒకటి కనిపించాయి. రైలు తిరువణ్ణామలై చేరుకుంది.
ఏవో మరమ్మతులు జరుగుతుండటం వల్ల ఆలయాన్ని కాస్త ఆలస్యంగా తెరుస్తుండేవారు. కానీ, ఆశ్చర్యమేమంటే.. వెంకటరామన్‌ తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‌ నుంచి కొండపైకి వెళ్లేసరికి.. ఆలయ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఎవ్వరూ అడ్డుచెప్పక పోవడంతో.. రమణుడు ఆలయంలో కొలువుదీరిన అరుణాచలేశ్వరుణ్ణి సమీపించి.. ‘‘తండ్రీ! నీ ఆజ్ఞమేరకు వచ్చేశాను. ఇంక నన్నేమి చేసినా నీ ఇష్టం’’ అని ప్రణామాలు సమర్పించి, ఇవతలికి వచ్చేశాడు. అంతటితో కొన్ని నెలలుగా దహించి వేస్తున్న తాపం తీరిపోయింది. పక్షి గూటికి చేరింది!

ఇంతటితో రమణుల వ్యక్తిగత జీవిత చరిత్ర ముగిసినట్లే! అప్పటికి ఆయన వయస్సు పదిహేడేళ్లు మాత్రమే!
(సశేషం)
ఫ పింగళి సూర్య సుందరం
=============================================
వరల్డ్‌ టీచర్‌ హౌసింగ్‌ కాలనీ, చినముషిడివాడ, విశాఖపట్నం.


శ్రీ రమణ కథామృతం
(గత వారం తరువాయి)
అతుల్యనాథేశ్వర ఆలయంలోకి పూజారితో పాటు వెళ్లిన వెంకటరామన్‌ ఒక మూలన కూర్చున్నాడు. కానీ, కొద్దిసేపటిలో ఆలయంలో కాంతిపుంజం వెలిసింది. ఆ కాంతి గర్భగుడి నుంచి వస్తోందేమోనని వెళ్లి చూశాడు. అక్కణ్ణుంచి కాదని గ్రహించి తన స్థానంలోకి వెళ్లి, మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు.
ఇంతలో పూజారి తన పూజని ముగించుకొని ఆలయ ద్వారాన్ని మూయబోతూ కేక వేశాడు. ‘‘ఎవరక్కడ! ఆలయాన్ని మూసివేయాలి బయటకు వచ్చేయండి’’ అని. అప్పటికే వెంకటరామన్‌కి బాగా ఆకలి వేస్తోందేమో! తనకి కాస్త ప్రసాదం ఇవ్వమని పూజారిని కోరాడు. పూజారి మాత్రం చాలా కటువుగా ‘‘అదేం కుదరదు’’ అన్నాడు. సమీపంలోని (కీలూర్‌లో) ఉన్న విరాటేశ్వరాలయంలో కూడా దీపారాధన చేయాల్సిన తొందరలో ఉన్నాడు ఆ పూజారి. అతడి వెంట వెంకటరామన్‌ కూడా వెళ్లాడు.
విరాటేశ్వరాలయంలోనూ పూజారి వరుస మారలేదు. రామన్‌ ప్రసాదం అడగడం.. ఆయన కాదనడం! రమణుని చూస్తున్న ఆలయ వాద్యకారుడు కల్పించుకుని ‘‘అయ్యా! నాకిచ్చే ప్రసాదంలో కొంత భాగం ఆ పిల్లవాడికి ఇవ్వండి’’ అని పూజారితో అన్నాడు. ప్రసాదం రమణుని చేతిలో పడింది. ఆ వాద్యగాడు సమీపంలోనే ఉన్న బ్రాహ్మణులుండే వీధిలోకి రమణుని తీసుకెళ్లాడు. మంచినీళ్లు అవసరం ఉంటుంది కదా అని! ఆ మంచినీళ్లు వచ్చేలోగా రమణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ప్రసాదమంతా నేలపాలైంది. ఇంతలో ఎవరో నీళ్లు తెచ్చారు. మట్టిలో కలిసిపోయిన ఆ మెతుకులనే ఏరుకుని తిన్నాడు రమణుడు. తర్వాత పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై మైమరచి పడుకున్నాడు.
తెల్లవారింది. మళ్లీ ఆకలి! ఎవరైనా భోజనం పెడతారేమోనని.. అటూ ఇటూ తిరిగాడు. ఒక ఇంటి తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆ ఇంటి యజమానిని అడుగగా.. ‘‘కాసేపు ఉండు మా సోదరి వస్తుంది’’ అన్నాడు. ఆనాడు గోకులాష్టమి. ఆ యజమాని సోదరి నదిలో స్నానం చేసి వచ్చింది. జ్యోతిర్మయనేత్రుడైన ఈ నవయుకుని చూసి శ్రీకృష్ణుడే తమ ఇంటికి వచ్చాడని భావించిందామె. సంతోషంతో త్వరగా వంట చేసింది. పిండి వంటలు కూడా చేసింది. ఈలోగా రమణునికి ఒక సందేహం పట్టుకుంది.
(సశేషం)
- పింగళి సూర్య సుందరం



తిరువణ్ణామలై వయా విల్లుపురం
తిరువణ్ణామలై వెళ్లాలని భావించి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంకటరామన్‌. నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు ఎక్కి ఒక మూల కూర్చొని మౌనంగా ధ్యానంలో పడ్డాడు. ఇది గమనించిన మౌల్వీ... రామన్‌ని కదిలించాడు. వెంకటరామన్‌ తిరువణ్ణామలై వెళ్తున్నాడనీ, టికెట్టు దిండివనం దాకా కొనుక్కున్నాడనీ తెలిసి..‘‘అలా ఎందుకు చేశావు నాయనా! విల్లుపురంలో దిగి కాట్టాడికి వెళ్లే రైలు ఎక్కావంటే.. తిరువణ్ణామలైలోనే దిగవచ్చు’’ అని చెప్పాడు. వెంకటరామన్‌ చూసుకున్న అట్లా్‌సలో విల్లుపురం నుంచి కాట్టాడికి వేసిన కొత్త రైలు మార్గం లేదు. అందువల్ల దిండివనానికి టికెట్‌ తీసుకున్నాడు. మౌల్వీ కూడా తిరువణ్ణామలై తరువాతి స్టేషన్‌లో దిగుతానని చెప్పాడు. విల్లుపురం చేరేటప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటలైంది.
వెంకటరామన్‌ పొద్దు పొడిచే దాకా ఆగి.. ఒక హోటల్‌లో భోజనం పెడతారని తెలుసుకున్నాడు. భోజనం తయారవడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిసి ఎదురుగుండా ఉన్న ఒక బెంచి మీద కూర్చున్నాడు. పచ్చని మేని ఛాయ, ఉంగరాల జుట్టు, చెవులకు దుద్దులు గల ఆ స్ఫురద్రూపిని చూడగానే హోటల్‌ యజమాని సమ్మోహితుడయ్యాడు. భోజనమైన తర్వాత ‘నీ దగ్గర డబ్బెంత ఉంద’ని అడిగాడు హోటల్‌ యజమాని. ‘‘నా దగ్గర రెండున్నర అణాలే ఉన్నాయ’న్నాడు వెంకటరామన్‌. ఆ మాట విని.. ‘అవి నీ దగ్గరే ఉంచుకో’ అన్నాడు యజమాని.
విల్లుపురం నుంచి తిరువణ్ణామలైకి వెళ్లేదెట్లా? ఎవరినైనా అడుగుదామంటే బిడియం. ఊళ్లో ఎక్కడ చూసినా మాంబళపట్టు అనే ప్రదేశానికి వెళ్లే సూచికలు ఉన్నాయేగానీ, తిరువణ్ణామలై సంబంధించిన సూచికలేమీ కనిపించలేదు. తన దగ్గరున్న డబ్బుతో మాంబళపట్టు వరకే రైలు టికెట్టు దొరుకుతుందని తెలిసి.. అక్కడికే టికెట్టు తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇంకో ఇరవై మైళ్లు వెళ్తేగానీ తిరువణ్ణామలై రాదు. మాంబళపట్టులో రైలు దిగి నడక ప్రారంభించాడు. సాయంత్రం అయిదు గంటలైంది. బాగా అలసిపోయాడు. ఆకలి వేస్తోంది. అప్పటికి అతను అర్కాందనల్లూరు గ్రామం చేరాడు. అక్కడ అత్యుల్యనాథేశ్వరుడిగా శివుడు వెలసి ఉన్నాడు. ఆ గుడి ద్వారాలింకా తెరవలేదు. అక్కడికి వెళ్లి వేచి ఉన్నాడు వెంకట రామన్‌. కాసేపయ్యాక గుడి పూజారి వచ్చి ఆలయ ద్వారాలు తెరిచాడు. స్వామికి దీపారాధన చేయనారంభించాడు. అతని వెంట వెంకటరామన్‌ లోనికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చేవారం...
- పింగళి సూర్య సుందరం



శ్రీరమణ కథామృతం
(గతవారం తరువాయి..)
ఆత్మసాక్షాత్కారమైన తరువాత రమణుని జీవితం యాంత్రికంగా సాగిపోయింది. అతను తరచూ మీనాక్షి దేవాలయానికి వెళ్లనారంభించాడు. అక్కడ శివయోగుల విగ్రహాల ఎదుట నిలబడి కన్నీరు కారుస్తూ ఉండేవాడు. ఆ శివయోగుల లాగానే తనకు కూడా ఈశ్వరుని పట్ల భక్తి అవిచ్ఛిన్నంగా ఉండాలని!

అప్రయత్నంగా జాలువారే ఆ కన్నీటి గురించి రమణులు చెబుతూ.. ‘‘సాధారణంగా ఏ ప్రార్థనా చేసేవాణ్ణి కాదు. నా అంతరంగం, విశ్వంలో అంతర్గమైన దానిని స్పృశించేది. దీనికి చిహ్నంగా కళ్లవెంట నీళ్లు కారేవి. అవి ఏ రకమైన సంతోష, విషాదాలకూ ఫలితాలు కావు’’ అని పేర్కొన్నారు.

ఒకనాడు పినతండ్రి ఇంట్లో మేడ మీద గదిలో పుస్తకాలు ముందు వేసుకొని కూర్చున్న వెంకట రామన్‌కి ఆ చదువు నిరర్థకమైనదని తోచి, పుస్తకాలను పక్కకు తోసేసి ధ్యానంలో పడ్డాడు. దీనినంతా గమనిస్తున్న వాళ్ల అన్న.. తమ్ముణ్ణి మందలించాడు. ‘‘ఇటువంటి వాడికి ఇక్కడేమి పని?’’ అని. ఆ మాటలు రమణుని హృదయంలోకి చొచ్చుకొని పోయాయి. ‘అవును నేనిక్కడ ఉండటం ఎందుకు?’ అనుకున్నాడు. వెంటనే వాళ్ల అన్నతో... ‘‘నాకొక స్పెషల్‌ క్లాస్‌ ఉంది. స్కూలుకు వెళ్లాలి’’ అని అబద్ధం చెప్పాడు. దానికి వాళ్లన్న ‘‘ఎలాగూ స్కూలుకు వెళ్తున్నావు కదా! కింద పిన్నమ్మను అడిగి అయిదు రూపాయలు తీసుకొని నా కాలేజీ ఫీజు కూడా కట్టు’’ అన్నాడు.

రమణుని ఉద్దేశం అరుణాచలానికి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలని. రైలు ఖర్చులు ఈశ్వరుడు ఇలా ఏర్పాటు చేశాడని అనుకున్నాడు. తిరువణ్ణామలైకి మదురై నుంచి నేరుగా వెళ్లే రైలు లేదని ఒక అట్లా్‌సలో చూసుకొని ఆ ఊరికి అతి సమీపంలో ఉన్న దిండివనమనే ఊరికి టికెట్‌ తీసుకుందామని అనుకున్నాడు. తన అంచనా ప్రకారం ఆ టికెట్టు ఖరీదు మూడు రూపాయల కన్నా కాస్త ఎక్కువే. అయిదు రూపాయల్లో తనకు అవసరమైన పైకం తీసుకొని మిగిలిన డబ్బును ఒక చీటీతో సహా అందరికీ కనబడే చోట పెట్టేశాడు. ‘‘తన తండ్రి ఆజ్ఞను అనుసరించి.. మంచి కార్యానికే ప్రయాణం అవుతున్నాన’’ని ఆ చీటీలో రాశాడు. తనను వెదకడానికి ప్రయత్నించవద్దని అందులో తెలిపాడు. పినతల్లి పెట్టిన భోజనాన్ని ఆదరాబాదరాగా తినేసి మదురై రైల్వే స్టేషన్‌కు గబగబా నడిచాడు.
- సుందరం


జన్మాంతర పుణ్యఫలం
శ్రీరమణ కథామృతం
(గతవారం తరువాయి..)
తన ప్రమేయం ఏమీ లేకపోయినా, ఏ గురూపదేశమూ లేకపోయినా, ఏ సాధనా చేయకపోయినా... పదిహేడేళ్ల ప్రాయంలో ఆత్మసాక్షాత్కారం పొందిన వెంకటరామన్‌ అరుణాచలానికి వెళ్లాలని ఎలా నిర్ణయించుకున్నాడు? మదురైకి అతి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం రామేశ్వరం. అరుణాచలం కాస్త దూరం అయినా.. ఎందుకు అక్కడికే వెళ్లాలనిపించింది? ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీరమణ మహర్షి ఒక శ్లోకంలో ఇలా పేర్కొన్నారు. ‘‘స్థాణురూపుడైన అరుణాచలేశ్వరుని పాదపద్మముల స్మరణతో జన్మనెత్తి, ఆ దేవుని అనుగ్రహంతో పరవశుడై, ఆయనతో తాదాత్మ్యం చెందాను’ అని వివరించారు.
తమిళనాడులో నాడీ గ్రంథాలు ఉన్నాయి. అందులో ‘భృగు నాడి’ అనే గ్రంథంలో శ్రీ రమణుల పూర్వ జన్మ వృత్తాంతముంది. ఒక కొండ మీద కూర్చుని ఈశ్వర సాక్షాత్కారానికై కఠోరమైన నియమంతో, దీక్షతో ఒక యువకుడు తపస్సు చేయగా.. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై... అతనితో ‘నీకింకో జన్మ ఉంది. దానితో నీకు ముక్తి లభిస్తుంద’ని చెప్పారట. ఈ జన్మలో ఏ సాధనా చేయకుండా.. రమణులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారని మనం చెప్పుకుంటున్నా... ఆయన పూర్వజన్మలో కఠోరమైన తపస్సు చేశారు. ఆయన తపమాచరించిన కొండ అరుణాచలమే అయి ఉంటుందని విశ్వసిస్తారు. ‘స్మరణ మాత్రముననే పరముక్తిఫలదమ’ని అరుణాచలానికి పేరు ఉండనే ఉంది. మహానుభావుల జీవితాలలోనే కాదు, సామాన్యుల జీవితాలలో కూడా పూర్వ జన్మల ప్రభావం ఉంటుందని అంటారు. దీనినే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఇట్లా చెప్తారు.. "We carry with us our past. It is an ineffable record which time can't blur nor death erase'' దీని స్వేచ్ఛానువాదం.. ‘‘మనతో మనం మన గతాన్ని తెచ్చుకుంటాం. సమసిపోని ఆ చిట్టాను కాలం మసకబార్చలేదు. మృత్యువు హరించలేదు’’. దీనినే మనం ప్రారబ్ధకర్మ అంటాం. అరుణాచలానికి రమణుల ప్రయాణంలో అడుగడుగునా ఈశ్వరుని ప్రమేయం కనబడుతుంది. ఈ ప్రయాణ వివరాలు తరువాత చూద్దాం..!
- పింగళి సూర్య సుందరం
అరుణగిరితో ఆత్మబంధం
(గతవారం తరువాయి..) వెంకటరామన్‌ మదురైలో చదువుకునే రోజుల్లో ఒకనాడు వాళ్ల స్వగ్రామమైన తిరుచ్చుళికి చెందిన ఒక దూరపు బంధువు కనిపించాడు. ‘ఎక్కడి నుంచి వస్తున్నార’ని ఆయన్ని అడిగాడు వెంకటరామన్‌. ‘అరుణాచలం’ నుంచి అని సమాధానం వచ్చింది. అరుణాచలమన్న పేరుని అంతకు పూర్వం విన్నా, ఈసారి మాత్రం వెంకటరామన్‌ మనసు ఆశ్చర్యంతో, సంభ్రమంతో ఉక్కిరి బిక్కిరి అయింది.
‘ఏమిటీ, అరుణాచలం నుంచా..?’ అని అడిగాడు. అంతేకాక ‘అదెక్కడుంది?’ అని కూడా అడిగాడు. ఆశ్చర్యపోవడం ఆ వచ్చిన వ్యక్తి వంతైంది.

‘నీకు అరుణాచలం తెలియదా?’ అన్నాడాయన. ‘తిరువణ్ణామలైనే అరుణాచలం అంటారు’ అని సమాధానమిచ్చాడు.
అరుణాచలం అంటే ఏ సుదూర ప్రాంతంలోనో ఉండే ప్రదేశమనీ, అక్కడ ప్రతి ఇసుక రేణువూ పునీతమైనదనీ, సామాన్యులకు అది అనభిగమ్యమనీ అనుకునే వెంకటరామన్‌కి తిరువణ్ణామలై అన్నా, అరుణాచలం అన్నా ఒకటేనన్న సమాచారం... అతనిలోని సంభ్రమాశ్చర్యాలను చల్లార్చివేసింది.
మన దగ్గరికి ఎవరైనా వచ్చి.. ‘నేను కైలాసానికి వెళ్లాను. అక్కడ శివపార్వతులనూ, వినాయకుడినీ, స్కందుడినీ, ప్రమద గణాల్నీ చూశాను’ అని చెప్తే మనం ఎట్లా ఆశ్చర్యపోతామో..! రమణ (వెంకటరామన్‌) కూడా అదేవిధంగా స్పందించాడు. అప్పటికి పదిహేనేళ్ల వయసున్న రమణకి తన భావి జీవితమంతా ఆ అరుణాచలంతోనే ముడిపడి ఉందని తెలియదు.
శేషగిరి.. అన్నమాచార్యునికి, భద్రగిరి.. రామదాసుకు చెందినట్లే.. అరుణగిరి రమణకి ఆత్మబంధువైంది.
-పింగళి సూర్యసుందరం, 040-23546712

భగవాన్ శ్రీ రమణ మహర్షి
- సుధారాణి మన్నె
bhagavaan shree ramana maharshi
భగవాన్ తల్లి అళగమ్మ గారికి ముక్తి నొసగుట

శ్రీ భగవాన్ తల్లిగారు పరమ శ్రోత్రియురాలు. కుల సంబంధమైన పట్టింపులూ, నమ్మకాలు చాలా ఉండేవి ఆమెకి. ఆమె భావాలని శ్రీ భగవాన్ సహించేవారుకాదు. ఆమెలో ఆ అజ్ఞానాన్ని పోగొట్టటానికి ఒక్కోసారి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు. బ్రాహ్మణ వితంతువులకు నిషిద్ధమైన ఉల్లిపాయలు వండటానికి ఆమె అభ్యంతరం చెప్పినప్పుడు శ్రీ భగవాన్ ఒక ఉల్లిపాయను చూపుతూ 'మా అమ్మ స్వర్గానికి వెళ్ళనీయకుండా చేసే శక్తి ఈ ఉల్లిపాయకుంది" అని చెప్పి నవ్వేవారు.


ఒకసారి భగవాన్ తల్లి అళగమ్మ గారు, తీర్థయాత్రలకని బయలుదేరి తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగి, చివరగా అరుణాచలం భగవాన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఎంతోమంది సాధువులు, ముముక్షువులు అన్నిటినీ వదులుకుని తమకు పరమగతిగ భగవాన్ ని ఆశ్రయించారు. అటువంటిది అళగమ్మ గారు ఆయనను విడిచి తీర్థయాత్రలకు వెళ్లారు. తిరిగి రాగానే ఆవిడకు విషజ్వరం వచ్చింది. ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది. ఆవిడ తన భారాన్ని భగవాన్ మీదవేసి, "నాయనా! నా ప్రాణాలు నీచేతిలోనే పోవాలి. వాటిమీద నాకు ఆశలేదు. ఆ తరువాత నా శరీరాన్ని ముళ్ళ తుప్పల్లో పడవేసినా ఫరవాలేదు" అని భగవాన్ దగ్గర మాట తీసుకున్నారు. భగవాన్ మనస్సు చలించి, ఒకే ఒక్కసారి అరుణాచలేశ్వరుని, తన తల్లి గారి ఆరోగ్యం గురించి ప్రార్ధన చేసారు. ఇది 1914 సంవత్సరంలో జరిగింది.



భగవాన్ అరుణాచలేశ్వరుని ఈవిధంగా ప్రార్ధించారు. "అరుణాచలం! నీవే మృత్యువు అందుచేతనే నిన్ను ప్రార్ధించేది. నిన్ను శరణు జొచ్చినవారు మృత్యుంజయులవుతారు. నీ చితాగ్నిలో ఆవిడను లీనం చెయ్యి. ఆపై చితాగ్నితో పని వుండదు. వారి ప్రార్ధన ఫలించింది. ఎప్పుడూ, దేనికీ, ప్రార్ధించని భగవాన్ ప్రార్ధిస్తే ఈశ్వరుడు ఆప్రార్ధనను ఫలింప చేసాడు. ఆవిడకు విషజ్వరం తగ్గడమే కాక ఆరోగ్యం కూడా చక్కబడింది. ఆపై అళగమ్మ గారు 8 సంవత్సరాలు జీవించారు. చితాగ్నితో పనిపెట్టవద్దు అని కూడా భగవాన్ ఆప్రార్దనలోనే చెప్పారు. ఈశ్వరుడు దానిని కూడా నెరవేర్చారు. 1929 సంవత్సరంలో స్కందాశ్రమ నివాసకాలంలో, తల్లిగారైన అళగమ్మగారి అంత్యకాలంలో భగవాన్ అనుగ్రహ స్పర్శచేత ఎన్నో అడ్డంకులను దాటిపోయినిర్వాన స్థితిని పొందారు. ఆవిడ ప్రాణాలు బహిర్గతం కాక ఆత్మయందు విలీనమైనాయి. ప్రాణాలు బహిర్గతమవడమంటే, దేహాంతములో, హృదయంలో అణగక, వాసనా బలముచేత మరో ఉపాధిని పొందేవరకూ వేచి ఉండటము. ఇవి ప్రాణాలని పిలువబడినా ప్రాణం, మనసు, అహంకారం - వీటితో కూడిన లింగ శరీరం, జీవుడు అని గ్రహించాలి. దీనియందే, దాచబడిన కర్మఫలానికి తగినట్లుగా ఈ లింగశరీరానికి మరల, మరల, ఉపాధులు లభిస్తూ ఉంటాయి. ప్రాణోత్క్రమణ సమయంలో ఈ ప్రాణాలు శరీరం నుండి జీవుని నిష్క్రమణ నవద్వారం (9దారుల ఊరు)గా వర్ణింపబడే శరీరం యొక్క ఏ ద్వారం నుంచైనా బహిర్గతం కావచ్చును. శిరస్సులోని బ్రహ్మరంధ్రంలో నుంచి బ్రహ్మలోక ప్రాప్తి అనీ, కనులద్వారా ఉత్తమలోకాల ప్రాప్తిఅనీ, అంతకంటే క్రింది ద్వారాల నుంచి నీచజన్మలని పెద్దలు చెప్తారు. అలా మరణకాలంలో ఒక మహత్తర సంభవంచేత ప్రాణాలు ఆత్మలోలీనమైన వ్యక్తి స్థితిపైన చెప్పుకున్న జీవన్ముక్తుని, మరియు బ్రహ్మలోక నివాసుల శుభసంస్థితి వలె ముక్తిరూపమై విలసిల్లుతుంది.



రమణులు, తల్లిగారికి హస్తదీక్ష నిచ్చి, శక్తిపాత మొనర్చి, ముక్తిని ప్రసాదించిన విషయం ప్రకటించారు కూడా. అయితే అప్పుడొక చర్చ జరిగింది. ఆవిడ శరీరాన్ని, పూడ్చిపెట్టి సమాధి చెయ్యాలా? దహనం చెయ్యాలా అని.



అధికజనం భగవాన్ తమ్ములైన నిరంజనానందస్వామి పక్షం వహించి, ఆవిడ గృహిణి కాబట్టి దహనం చెయ్యాలన్నారు. భగవాన్ మౌనంగా, ఈశ్వరుని నిర్ణయమే నెరవేరుతుందని ధృడంగా వున్నారు. అక్కడ వున్నవారు గణపతియుని గారి సలహా అడిగారు.



ఆయన "తీర్మానం ఎప్పుడోజరిగిపోయింది. రమణ గీతాసమయంలోనే భగవాన్ పరిష్కరించారు, అని చెప్పి అందులోని శ్లోకాలను, భగవద్ వాణిని అప్పటికప్పుడు వివరించి చెప్పారు. అధికారము ఉట్టిపడే వారి గంభీర వాక్కులకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. సమాధికి "మాతృభూతేశ్వర మహాసన్నిధానము" అనే పేరును గణపతులే పెట్టారు. ఈ సమాధిపై అత్యంత విశేషంగా కాశి నుంచి తెచ్చిన శివలింగమే కాకుండా భూప్రస్థార, మేరు ప్రస్థార, శ్రీ చక్రయంత్ర రాజములను రెండింటినీ ప్రతిష్టించారు. 

శ్రీ రమణార్పణ మస్తు

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list