MohanPublications Print Books Online store clik Here Devullu.com

ద్రౌపది కష్టాలకు మారుపేరు ద్రౌపది_Drowpadi



కష్టాలకు మారుపేరు ద్రౌపది


జీవితం ఎంత అందమైందో అంతే గంభీరమైంది. అందులోని అందాన్ని ఆస్వాదించడానికి దొరికే సమయం దానిని నెట్టుకొచ్చే గంభీరతలో కనిపించకుండానే కనుమరుగవుతుంది. జీవితాన్ని నడిపించకుండానే కనుమరుగవుతుంది. అయినా జీవితాన్ని నడిపించమంటుంది మన మానవనైజం. ఎలా ఉండాలో ఉదహరిస్తూనే, ఎలా ఉండకూడదో హెచ్చరిస్తుంది జీవితం. కష్టాలు నిన్నెంత కష్టపెట్టినా కాలుమడవని ధీరత్వం నీదని పదేపదే గుర్తుచేస్తూ సుఖం అంటే ఏంటో చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే దానిని అనుభవించాలి. కష్టాన్ని మాత్రం వినిపించినా చాలు! అందులోని దుఃఖాన్ని అంచనా వేయడం అంతకష్టమేమీ కాదని చెబుతుంది జీవితం. పైగా సమాజం కష్టాన్ని విని కనికరించక పోగా కొన్ని జీవితాలే అంతని తోసిపుచ్చేస్తుంది. అవును.. ఆ కొన్ని జీవితాలే కష్టాలను పరిచయం చేయడం కాదు. కష్టమంటే గుండెనిబ్బరమనీ, చెరగని ఆత్మస్థయిర్యమనీ, అలుపెరుగని శ్రామికతనీ, అంతులేని గాంభీర్యమనీ తెలియజెపుతూ ఆ కష్టాలవారధిని దాటేందుకు బాసటై నిలుస్తామని నిరూపిస్తాయి. కష్టాలకు మారుపేరైన ద్రౌపది జీవితమే ఇందుకు తార్కాణం. ఒక గొప్ప కుటుంబంలో పుట్టి, ఓ గొప్ప ఇంటికి కోడలై ఒక స్త్రీగా తనదైన అస్తిత్వాన్ని కలిగిన ద్రౌపది కథ కష్టతరమైందేగాని కన్నీటి వ్యథ కాలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. ధైర్యమై నిలిచింది. ధర్మమై గెలిచింది.

పాంచాల దేశానికి రాజైన ద్రుపదుని కూతురే ద్రౌపది. యాగాగ్నిలోంచి జనించిన నిప్పు ఆమె. ధర్మ పరిరక్షణ కోసం ముఖ్య కారణమయ్యే స్త్రీ రత్నం ద్రుపదుని ఇంట జన్మించిందని చెప్పుకునే వారట. కౌరవుల పాలిట చీకటి కోణంలా మారే ద్రౌపది నల్లని శరీర ఛాయతో కృష్ణగా పేరొందింది. అందుకేనేమో కృష్ణ-కృష్ణుని అనుబంధం నల్లనిదే కాదు చల్లనైనది. వారిమధ్య గల సత్సంబంధం కూడా అనన్య భక్తిబంధమై అలరారింది. కృష్ణుని పట్ల ద్రౌపదికున్న గౌరవం, విశ్వాసం మాటలకందని మానసిక తత్తం.ద్రౌపది స్వయంవరం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అపురూప లావణ్యంతో, గంభీర వ్యక్తిత్వంతో సభలోకి వచ్చిన ద్రౌపదిని చూసి మహామహులందరూ పోటీపడ్డారు. చివరికి బ్రాహ్మణుడిగా వచ్చిన అర్జునుడు ఆమెను చేపట్టాడు. పాండవులైదుగురూ సంతోషంగా ద్రౌపదిని ఇంటికి తీసుకెళ్ళి కుంతితో అమ్మా మేం అద్భుతమైన భిక్షను తీసుకొచ్చామని చెప్పగానే అదేమిటని కూడా అడుగక కుంతి ఎప్పటిలాగే ఐదుగురూ సమానంగా పంచుకోండని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాటను శిరసావహించిన పాండవులు ఐదుగురూ ద్రౌపదిని పెళ్ళి చేసుకుంటారు. మారు మాట్లాడక అంగీకరిస్తుంది ద్రౌపది. ఎందుకంటే జీవితం చూపించే మజిలీలు దాటుకుంటూ వెళ్ళడమే గాని వెనుదిరిగే స్వభావం కాదు ఆమెది. ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఆవశ్యకమని చెప్పే చరిత్రను మలుపు తిప్పుతూ ఐదుగురి మగవాళ్ళ జీవితాల వెనుకుండి అసలు కథను నడిపింది. పాంచాలి పంచభర్తృక అన్న సమాజానికి అవును అది నాకు అత్యంత గౌరవప్రదమని చెప్పింది ద్రౌపది.

ద్రౌపది నిండుసభలో వస్ర్తాపహరణాన్ని సహించింది. అరణ్యవాసంలో పాండవులను జాగ్రత్తగా చూసుకుంది. సూర్యుని వరప్రసాదంతో పొందిన అద్భుత ఘటంతో అమ్మై వారికి అన్నం పెట్టింది. విరాటుని కొలువులో అజ్ఞాతవాసంలో సైరంధ్రియై కీచకుని ప్రవర్తనను మన్నించింది. కామ్యకవనంలో జయద్రధుడు ద్రౌపదితో అసభ్యంగా నడుచుకునే ప్రయత్నం చేసి పారిపోతాడు. అతణ్ని పట్టితెచ్చిన అర్జునునితో అతణ్ని వదిలేయమని చెబుతుంది. ఇలా ద్రౌపది జీవితంలో అధర్మంగా ప్రవేశించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, జయద్రధ, కీచకుల్లాంటి వారంతా మట్టిలో కలిసిపోయారు. భారతనారి అవమానం చరిత్రకే కళంకమని చాటి చెప్పిన ద్రౌపది జీవితం దుష్టులకు గుణపాఠంగా మారింది. ఎటువంటి పరిస్థితులెదురైనా వెనక్కి తగ్గలేదు. పాండవులనూ విడిచి వెళ్ళిపోలేదు. అనిశ్చిత పరిస్థితుల్లోనే మనకు లభించే తోడు అంతులేని ఆత్మధైర్యాన్నిస్తుందనడానికి ద్రౌపదీ పాండవులే ఉదాహరణ.అమోఘమైన తెలివితేటలు, త్యాగనిరతి, మంచితనం, ఉన్నతమైన ఆలోచన, భావగాంభీర్యం ద్రౌపదితో పుట్టి పెరిగిన విశేషాలు. ఇద్దరు భార్యాభర్తల్లోనే సఖ్యత, ప్రేమ లేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతుంటాయి. అలాంటిది ఐదుగురు భర్తలనూ, సవతులనూ, అత్త కుంతీదేవిని ఒకే తాటిపై ధర్మ వివేచనతో నిలబెట్టిన ద్రౌపది కౌశలం అపారం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కష్టం. ఐదుగురి ఇష్టాయిష్టాలు, పద్ధతులు, గుణగణాలు ఎరిగి వారితో మెలగడం గొప్ప విషయం.ధర్మరాజు కోసం నియమితులైన పదివేల మంది సేవకుల పేర్లు, గుర్రాల సంఖ్య, ఏనుగుల గుంపుల గుర్తులు, రాజ్యాధికార సంబంధిత విషయాలు తటపటాయించకుండా చెప్పేంత జ్ఞానం ద్రౌపదిది. ఇది కేవలం అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి పరిశీలించే మెతుకు వంటిది. అసలు ఆమె విజ్ఞాన, విశేషాలను అంచనా వేయాలనుకోవడం అమాయకత్వమే.








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list