MohanPublications Print Books Online store clik Here Devullu.com

పెద్దగీత– చిన్నగీత- Self-confidence, Teacher, ఆత్మవిశ్వాసం, గురువు


పెద్దగీత– చిన్నగీత
ఆత్మీయం
పూర్వం ఒక గురువుగారు పాఠం చెబుతూ, నల్లబల్లపై ఒక గీత గీసి, ఆ గీతను చెరపకుండా చిన్నదిగా చేయమని విద్యార్థులను అడిగారు. ఎలా చేయగలం? ఆ గీతను ముట్టుకోకుండా చిన్నదిగా చేయాలి. అపుడు వారిలో ఒక తెలివైన విద్యార్థి లేచి ఆ గీత కింద మరొక పెద్దగీతను గీశాడు. దానితో మొదటి గీత చిన్నదిగా అయిపోయింది. ఇక్కడ నీతి ఏమంటే, మీ కష్టాలు చాలా పెద్దవిగా అనిపించినపుడు, ఒక్కసారి కనులు పైకెత్తి చూడండి. ఎందుకంటే ఇప్పటివరకూ మీ దృష్టిని మీ పైనే కేంద్రీకరించి ఉంచారు. ఒకసారి మీ చుట్టూ ఉన్నవారిని, మీకంటే చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నవారిని చూడండి. మీ కష్టం మీరనుకున్నంత పెద్దదేమీ కాదని మీకు అనిపిస్తుంది.
మీకు ఏదైనా పెద్దకష్టం వచ్చినపుడు మీకంటే పెద్ద కష్టాలు పడుతున్నవారికేసి చూడండి. మీలో ఒక ఆత్మవిశ్వాసం, నా సమస్య చిన్నది, నేను దీనిని అధిగమించగలను అనే నమ్మకం కలుగుతాయి. కాబట్టి, ఆనందంగా ఉండటానికి మొదటి సూత్రం ఏమంటే, ప్రపంచంలో ఎక్కడైతే పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయో అక్కడ చూడండి. అపుడు మీ సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయో అప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే, లేదా పరిష్కరించే శక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. స్థూలంగా చెప్పాలంటే, ఎక్కువ కష్టాలు ఎవరికైతే ఉన్నవో అటువంటివారికి సహాయపడండి. సేవ చేయండి.

నయం చేసే మిరియం
గుడ్‌ఫుడ్‌
మిరియాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. మిరియాలలో యాంటీబయాటిక్‌ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్‌ను నిరోధిస్తాయి. ∙మిరియాలు ఉన్న ఆహారం తిన్న వెంటనే అవి జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవింపజేసేలా చూస్తాయి. అందుకే మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ.
అంతేకాదు మలబద్దకాన్ని, డయేరియా ను సైతం నివారిస్తాయి. ∙జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే ఇంటి చిట్కా మిరియాలే. ఇలా అవి జలుబు, దగ్గులను నివారించడానికి కారణం వాటిలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణమే. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు అరికడతాయి. తద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. నిత్యం మిరియాలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో పొట్ట పెరగదని పరిశోధనలలో తేలింది. ∙మిరియాలు చుండ్రును నివారిస్తాయి. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్‌ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం.

అమ్మ మాట
జెన్‌ గురువు ఆశ్రమంలో జిన్‌ అనే యువకుడు ఉండేవాడు. చురుకైన విద్యార్థిగా పేరు సంపాదించాడు. గురువుల మనసులు గెలుచుకోగలిగాడు. మంచివాడు, తెలివైన వాడు కావడంతో.. విద్యాభ్యాసం పూర్తయ్యాక జిన్‌ని ఆశ్రమంలోనే ఉండిపోవాల్సిందిగా కోరారు గురువులు. అక్కడే ఉండి విద్యార్థులకు పాఠాలు బోధించమని చెప్పారు. జిన్‌ సంతోషంగా అంగీకరించాడు. ఆశ్రమంలోనే ఉంటూ కొత్త విద్యార్థులకు పాఠాలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు. ఆశ్రమంలో సుఖంగా ఉందని, విద్యార్థులు తనను ఎంతో గౌరవిస్తున్నారని లేఖలో రాశాడు.
కొడుకు పంపిన ఉత్తరం చదివిన ఆ తల్లి.. ప్రత్యుత్తరం పంపింది. అందులో... ‘ఆశీస్సులు నాయనా! నీ విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తయినందుకు సంతోషం. ఆరోగ్యం జాగ్రత్త. ఈ తల్లి కోరిక తీరుస్తావనే నమ్మకంతో నిన్నో మాట అడుగుతున్నాను. ‘బాబూ! నీవు ఇప్పుడున్న ఆశ్రమంలో ఎందరో గురువులు ఉన్నారు. వారు విద్యార్థులకు దిశానిర్దేశం చేయగలరు. నీవు అక్కడ ఉన్నంత మాత్రాన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు! నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్లు లేక.. ఇక్కడ పల్లెల్లో పిల్లలు, పెద్దలు అజ్ఞానంలో బతుకుతున్నారు. నీలాంటి వారి అవసరం ఆశ్రమంలో కన్నా.. ఇక్కడి పల్లెల్లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి.. మీ ఆశ్రమం వీడి ఏదైనా పల్లెటూరికి వెళ్లు. అక్కడే చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకో! అక్కడి పిల్లలకు చదువు చెప్పు. పెద్దలకు జీవన విధానాన్ని బోధించు.’ ఈ తల్లి మాట పాటిస్తావని ఆశిస్తున్నా!’ అని ఉత్తరం పూర్తి చేసింది. ఆ లేఖ చదివిన జిన్‌.. తన తల్లి గొప్ప మనసుకు ప్రణమిల్లాడు. ఆశ్రమంలోని గురువులకు విషయం చెప్పి.. తల్లి దగ్గరికి వెళ్లాడు. అమ్మ అనుజ్ఞ తీసుకొని. ఒక మారుమూల పల్లెకు వెళ్లి ఆశ్రమం నెలకొల్పాడు. పిల్లలకు పాఠాలు, పెద్దలకు మంచి మాటలు చెబుతూ జీవనం కొనసాగించాడు.

కిడ్నీలో రాళ్లకు నీళ్లే...కళ్లెం!
అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా కనపడిన మిత్రుడే! హఠాత్తుగా అతని రెండు కిడ్నీలు ఫెయిల్‌ కావడమేమిటి? డాక్టర్లు డయాలసిస్‌ తప్ప మరో మార్గం లేదని చెప్పడమేమిటి? ఇవన్నీ వింతగానే అనిపిస్తాయి కానీ, ఎంతో మంది జీవితాల్లోని కఠోర సత్యాలివి.
దాహం వేస్తున్నా, నీరు తాగడం లేదూ అంటే, నీరు అందుబాటులో లేకపోవడమో, ఉన్న నీరు శుభ్రంగా లేకపోవడమో కారణమై ఉంటుంది. కొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన కారణాలు ఉంటాయి. అంటే విపరీతమైన పని, మానసిక ఒత్తిళ్లలో పడి కొందరికి నీళ్లు తాగాలన్న ధ్యాసే ఉండదు. వయసు పైబడిన కొందరేమో, నీళ్లు బాగా తాగితే పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నీళ్లే తాగరు. మరికొందరేమో దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తాగకుండా టీ, కాఫీలతో సరిపెడతారు. ఇవన్నీ అంతిమంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి, అధిక రక్తపోటుకు దారి తీసే ప్రమాదం ఉంది.
గొంతు తడుపుకుంటే చాలదు!
వేసవిలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో చెమట రూపంలో ఎంత నీరు పోతోందో గుర్తించలేం. అందుకే నీటి అవసరం ఎంతో గ్రహించడం కష్టం. అందుకే కొందరు కేవలం నీటితో గొంతు తడుపుకోవడంతోనే సరిపెడతారు. వేసవిలోనూ రెండు నుంచి రెండున్నర లీటర్ల మూత్రం రావాలి. అంతకన్నా తక్కువగా మూత్ర విసర్జన అవుతోందీ అంటే అవసరమైనంత నీరు తీసుకోవడం లేదని అర్థం. వేసవిలో రెండు నుంచి రెండున్నర లీటర్ల నీరు తాగితే తప్ప ఒక లీటర్‌ మూత్రం రాదు. అలా చూస్తే, వేసవిలో నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగవలసి ఉంటుంది. అలా అని ఉదయమే ఒకేసారిగా మూడు లీటర్లు తాగేసి రాత్రి దాకా ఏమీ తాగ కుండా ఉండిపోవడం సరికాదు. రోజంతా సమాన మోతాదులో తీసుకుంటూనే ఉండాలి. నిద్రించ డానికి ముందు నీటిని అందుబాటులో ఉంచుకోవడం మరీ మంచిది. ఇది రాళ్లు తయారు కాకుండా కాపాడుతుంది.
విసర్జన పరిమాణం ప్రధానం
కిడ్నీలు దెబ్బ తిన్న వారిలో శరీరంలోని నీరు, సహజంగా బయటికి వెళ్లిపోయే అవకాశం ఉండదు. దీనివల్ల తీసుకున్న నీరంతా శరీరంలోనే ఉండిపోతుంది. నీరు మొదట పాదాల్లో నిలుస్తుంది. ఆ తరువాత మొత్తం కాళ్లు, కడుపు, శ్వాసకోశాల దాకా నీరు నిలిచిపోతుంది. శ్వాసకోశాల్లో నీరు నిలిచిపోవడాన్ని పల్మన రీ ఎడీమా అంటారు. ఈ వాపు తగ్గే దాకా నీరు చాలా నియమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. సహజంగా శరీరంలో ఉండవలసిన పరిమాణం కన్నా ఎక్కువగా నీరు నిలిచిపోవడం ప్రమాదకరం. కాళ్లల్లో నీరు చేరడం అంటే శరీరంలో కనీసం నాలుగు లీటర్ల నీరు అధికంగా ఉందని అర్థం. ఇలాంటి స్థితిలో నీరు తక్కువగా తీసుకోవాలని చెబుతాం. నీరు తాగడాన్ని పరిమితం చేయడం వల్ల వీరికి ఏ ఇబ్బందీ అనిపించదు. దాహాన్ని తెలిపే మెదడులోని ఆస్మోరిసెప్టర్లు శరీరంలో నిలిచిపోయిన నీటిని గుర్తిస్తాయి. అందుకే వారిలో నీరు కావాలన్న తపన ఉండదు. కాకపోతే, దాహం లేకపోయినా ఈ స్థితిలో కొందరి నోరు ఎండిపోవచ్చు. ఈస్థితిలో చల్లని నీటితో నోరు తడిచేసుకోవచ్చు.
క్యాల్షియం రాళ్లు
మిగతా రుతువులతో పోలిస్తే వేసవిలో శరీరానికి అదనపు నీరు అవసరమవుతుంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉండాలి. అలా లేనప్పుడు శరీరంలోని క్యాల్షియం కిడ్నీలో రాళ్లుగా స్థిరపడుతుంది. రాళ్లు ఏర్పడుతున్న తొలిదశలో మూత్ర విసర్జనలో మంట ఉంటుంది. కొన్ని సార్లు ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా రాయి తయారు కావచ్చు. అలాగే రాయి తయారు కావడం వల్ల ఇన్‌ఫెక్షన్ల సమస్యకు లోనుకావచ్చు. రాళ్లు తయారు కాకుండా నిరోధించడానికి నీరు అధికంగా తీసుకోవడం ఉత్తమం.
ఇలా ఉంటే జాగ్రత్త సుమా!
రాయి ఏర్పడుతున్న తొలిదశలో మూత్ర విసర్జనలో నొప్పి రావచ్చు కొంతమందికి రక్తమూ రావచ్చు. నడుము భాగంలోనూ నొప్పి రావచ్చు. నొప్పి క్రమంగా పెరిగి దానికదే తగ్గిపోవచ్చు. ఇలా తరచూ నొప్పి రావచ్చు. కి డ్నీ రాళ్లు ఏర్పడే వారసత్వ మూలాలు ఉన్న వారు అధిక పరిమాణంలో నీరు తీసుకోవడం చాలా అవసరం.
మరువకండి
ఆహారం నియమాలు, వ్యాయమాల ద్వారా మధుమేహాన్ని, అధిక రక్తపోటును నిరోధించవచ్చు.
అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగతాగడం, మద్యపానం మానివేయాలి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే లక్షణాలు ఉన్నవారు మాత్రం మరింత ఎక్కువ నీరు తీసుకోవాలి. దాహం లేకపోయినా నీరు తాగుతూ ఉండాలి.
శరీరం బరువు పెరగకుండా చూసుకోవడానికి వ్యాయామం తప్పనిసరి.
వేసవిలో శరీరంలోని నీరు మాత్రమే ఎక్కువగా ఆవిరవుతుంది. తీసుకున్న కేలరీలు మాత్రం ఖర్చుకావు. అందుకే పరిమితంగానే అయినా వేసవిలోనూ వ్యాయామం చేయాలి.
- డాక్టర్‌ సత్యలక్ష్మి, ప్రకృతి వైద్య నిపుణురాలు

మరచిపోకండి!.. బ్రాహ్మిని గుర్తుంచుకోండి!!
అన్నీ చదివినట్లే ఉంటాడు. అర్థమైనట్లే ఉంటాడు. కొండంత ఆత్మవిశ్వాసంతోనూ కనపడతాడు. కానీ, తీరా ఏదైనా అడిగితే మాత్రం.... తెల్లమొహం వేస్తాడు. ఎన్ని పరీక్షలు?ఎన్ని ఇంటర్వ్యూలు.. అన్నింటా అపజయాలే!! ఏమిటీ కారణం అంటే.. చదివినదేదీ అతనికి జ్ఞాపకం ఉండదు. అప్పటిదాకా ఒక అంశం మీద సాగించిన చర్చలు, విశ్లేషణలు ఇవేవీ అతనికి లీలగానైనా గుర్తుకు రావు! శ్రద్ధ లేకపోవడం కాదు! అసలతని మెదడులో అవేవీ రిజిస్టర్‌ కావు కొందరిలో ఇది సహజమే అయినా, దాన్నీ చక్కదిద్దే ఎన్నో ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.
జ్ఞాపకాలు, పర్వతారోహణకు తోడ్పడే మెట్లలాంటివి. పై మెట్టు మీద కాలు మోపాలంటే, కింది మెట్టు నిలకడగా ఉండాలి కదా! అదే అటూ ఇటూ ఊగుతూ కిందికి జారిపోయిందనుకోండి. ఇక పైకి ఎక్కడం మాట అటుంచి, జర్రున జారి అఽథఃపాతాళంలోకి పడిపోవడమే! అంతకు ముందేం చేశారో గుర్తు లేకుండా, ఇప్పుడెవరైనా ఏం చేస్తారు? రేపు చేయాల్సిన దాన్ని గురించిన ప్రణాళికలు ఏం వేస్తారు? జ్ఞాపకం అంటే కేవలం సమాచారమే కాదు. సమాచారం ఆధారంగా ఒక విశ్లేషణకు, నిర్ణయానికీ, కార్యాచరణకూ సిద్ధం కావడం కూడా అందులోని కీలకాంశమే. ఇంటర్‌నెట్‌లు సమాచారాన్నయితే ఇవ్వగలవు గానీ, విశ్లేషించలేవు కదా! నిజానికి, మనుగడకు సంబంధించిన ఉద్యోగ వ్యాపారాలన్నీ మనిషి జ్ఞాపకశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. ఎవరైనా, తమ రంగంలో సంభవించే పరిణామాల్ని ఎప్పటికప్పుడు మరిచిపోతుంటే, ఆ రంగంలో వెనుకబడి, ఒక్కోసారి కోలుకోలేనంత ప్రమాదంలోనూ కూరుకుపోవచ్చు. అలాంటి విపరిణామాల్ని అడ్డుకునేందుకే ప్రకృతి కొన్ని అద్భుతమైన ఔషధ మూలికలను మానవాళికి అందించింది. జ్ఞాపక శక్తికీ, బుద్ధి వికాసానికీ తోడ్పడే అలాంటి ఏడు వన మూలికలను సూచించింది. ఆయుర్వేదం వీటిని మేధ్య వర్గంగా గుర్తించింది. బ్రాహ్మి, శంఖపుష్పి, మండూక పర్ణి (సరస్వతి ఆకు), కూష్మాండం, వచ, జ్యోతిష్మతి, ఝఠామాన్సి ఇవే ఆ ఏడు మూలికలు. ఈ ఏడింటిలో బ్రాహ్మికి ఒక విశిష్ట స్థానం ఉంది. దీని శాస్త్రీయనామం బాకోపా మొనీరియా.
జ్ఞాపకం అంటే...
న్యూరాన్‌ల మధ్య ఉండే బంధాన్ని సినాప్స్‌ అంటారు. న్యూరో ట్రాన్స్‌మీటర్‌ అనే కెమికల్స్‌ నాడీ వ్యవస్థలోని ప్రొటీన్లను, ఎంజైములను చైతన్యపరుస్తాయి. ఈ బంధాల సామర్థ్యం మీదే జ్ఞాపక శక్తి ఆధారపడి ఉంటుంది. బంధాలు ఉన్నంత వరకే జ్ఞాపకం ఉంటుంది. ఆ బంధం తెగిపోతే జ్ఞాపకాలు మరుగవుతాయి. వయసు పైబడటం వల్ల, ప్రమాదాల వల్ల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. జ్ఞాపక శక్తి కొందరిలో తాత్కాలికంగా తగ్గిపోతే, మరి కొందరిలో శాశ్వతంగానే పోవచ్చు.
బ్రాహ్మి ఏం చేస్తుంది?
శరీరంలో కైనేస్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. దెబ్బతిన్న నాడీకణాలను చక్కబరుస్తుంది. ఏ కారణంగానైనా ఈ ప్రొటీన్లు దెబ్బతిన్నప్పుడు ఆ కణాలు అలాగే ఉండిపోతాయి. ఈ స్థితిలో బ్రాహ్మి ఎంతో తోడ్పడుతుంది. బ్రాహ్మీలోని బాకోసైట్‌- ఎ, బాకోసైట్‌-బి అనే అంశాలు కైనేస్‌ ప్రొటీన్‌ను తిరిగి శక్తిమంతం చేస్తాయి. శక్తి పుంజుకున్న తరువాత ఇవి దెబ్బ తిన్న కణాలను చక్కదిద్దుకోగలుగుతాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. బ్రాహ్మిని ప్రధానంగా మూడు రూపాలుగా తయారు చేస్తారు. యథాతథంగా తీసుకునే రసాన్ని ‘బ్రాహ్మీ సారస్వతారిష్టం’ అంటారు. నెయ్యితో కలిపి చేసే దాన్ని ‘బ్రాహ్మీఘృతం’ అంటారు. అలాగే ‘బ్రాహ్మీ చూర్ణాన్ని’ తయారుచేస్తారు. ఇవన్నీ కడుపులోకి తీసుకునేవే. ఇవి కాకుండా తలకు మర్దన చేసేందుకు ‘బ్రాహ్మీ తైలాన్ని’ తయారు చేస్తారు. దీని ప్రభావం కూడా మిగతా వాటి కి సమానంగానే ఉంటుంది.
బ్రాహ్మీ రసాయనాన్ని వాడేముందు డాక్టర్‌ను సంప్రదించాలి.
బ్రాహ్మీ సారస్వతాన్ని ఉదయం రెండు చెంచాలు, సాయంత్రం రెండు చెంచాల చొప్పున తీసుకుంటే ప్రయోజనం. ఈ రసాన్ని వేడి చేయకూడదు. వేడిచేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది.
బ్రాహ్మి మాటల్లో స్పష్టతను కూడా పెంచుతుంది. బ్రాహ్మి రసాయనాన్ని బాల్యదశలో తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
బ్రాహ్మీఘృతం దెబ్బతిన్న కణాలను పునర్నిర్మిస్తుంది. కొన్ని దృష్టిలోపాలను కూడా తొలగిస్తుంది.
దిగులు, ఆందోళన వంటి మానసిక రుగ్మతలను తొలగించడంలోనూ ఇతోధికంగా తోడ్పడుతుంది.
బ్రాహ్మి వల్ల నిద్రలేమి, అసహనం తగ్గుతాయి. శరీరం వణికిపోయే పార్కిన్‌సన్స్‌ వ్యాధికి, వృద్ధాప్యంలో మతిమరుపును కలిగించే అల్జీమర్స్‌ వ్యాధికీ బ్రాహ్మి గొప్ప నివారణగా పనిచే స్తుంది.
అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల సహజంగానే ఏకాగ్రత పెరుగుతుంది.
బ్రాహ్మి జ్ఞాపక శక్తికే కాకుండా రక్తహీనత, అతిమూత్ర వ్యాధుల్లోనూ ఉపకరిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. సంతాన శక్తిని పెంచుతుంది,
జ్ఞాపక శక్తి పెరగడం అన్నది కేవలం బ్రాహ్మి రసాయనాన్ని తీసుకోవడంతోనే అయిపోదు. అనుకున్న విషయం పట్ల మనకు ఎంత ఆసక్తి ఉందన్నది కూడా ముఖ్యమే. విషయాల పట్ల ఆసక్తి ఉండి కూడా జ్ఞాపకం ఉండకపోతే ఈ మందులు ఆ లోపాన్ని సరిచేస్తాయి. జీవితపు పరుగు పందెంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేలా చేస్తాయి.

-డాక్టర్‌ డి. విఠల్‌ రావు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, డాక్టర్‌. బి. ఆర్‌. కె. ఆర్‌ పభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌

చురుకైన మెదడు కోసం!
మెదడు మహత్తరమైన ఆర్గాన్‌. ఇందులో దాదాపు 90 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఇవన్నీ నిరంతరం సిగ్నల్స్‌ పంపిస్తూనే ఉంటాయి కాబట్టే దైనందిన జీవితాన్ని హాయిగా గడిపేయగలుగుతున్నాం. ఇంత కీలకమైన మెదడు సమర్థంగా పని చేస్తూ ఉండాలంటే అందుకు కొన్ని నియమాలను తప్పక పాటించాలి.
బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి: రాత్రంతా ఆహారం లేకుండా నిద్రపోతాం కాబట్టి మరుసటి రోజంతా హుషారుగా ఉండేందుకు ఉదయం అల్పాహారం తప్పనిసరి. బ్రేక్‌ఫాస్ట్‌ వల్ల షార్ట్‌ టర్మ్‌ మెమరీతోపాటు అప్రమత్తత కూడా పెరుగుతుంది. అయితే మరీ ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం కాకుండా సమతులాహారం తీసుకోగలిగితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.
చేపలు తినాలి: మెదడు ఆరోగ్యానికి ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం. ఇవి చేపల్లో పుష్కలంగా ఉంటాయి. మానసిక వార్ధక్యం నెమ్మదించాలన్నా, డిమెన్షియా రాకుండా ఉండాలన్నా, స్ట్రోక్‌కు గురికాకుండా ఉండాలన్నా వారంలో రెండు సార్లు చేపలు తినటం మేలు.
విటమిన్‌- ఇ: తెలివితేటలు పెరగాలంటే విటమిన్‌-ఇ తీసుకోవాలి. నట్స్‌, సీడ్స్‌, పాలకూరల్లో విటమిన్‌-ఇ ఎక్కువగా ఉంటుంది. రోజుకి సరిపడా విటమిన్‌-ఇ అందాలంటే రోజుకో ఔన్స్‌ పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వేగించి తినాలి.
బ్రెయిన్‌ గేమ్స్‌: మెదడు కణాలైన న్యూరాన్లు చురుగ్గా ఉండాలంటే వాటికి పని చెప్పాలి. ఇందుకోసం పజిల్స్‌, సుడోకు లాంటివి పూరించాలి. కొత్త భాష నేర్చుకోవటం, కొత్త అభిరుచులు అలవరుచుకోవటంలాంటివి చేయాలి. కాలిక్యులేటర్‌ ఉపయోగించకుండా లెక్కలు చేసినా ఫలితం ఉంటుంది.

రెండు భాగాలూ వాడాలి: మెదడులో కుడి, ఎడమ భాగాలను రోజంతా సమంగా ఉపయోగించాలి. లాజిక్‌, రీజనింగ్‌, ఎనాలసిస్‌, కాలిక్యులేషన్లకు మెదడులోని ఎడమ భాగం వాడతాం. సృజనాత్మకత, ఊహాశక్తికి కుడి భాగం ఉపయోగిస్తాం. ఈ రెండు భాగాలూ చురుగ్గా ఉండాలంటే ఈ పనులన్నింటినీ ప్రతి రోజూ చేయాలి.
నిద్ర: నిద్రవల్ల ఙ్ఞాపకశక్తి, లెర్నింగ్‌స్కిల్స్‌ పెరుగుతాయి. నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తూ ఉంటుంది. దీని వల్ల మెలకువగా ఉన్న సమయంలో విషయాలను తేలికగా జ్ఞాపకం తెచ్చుకోగలుగుతాం. నిద్రపోతున్నప్పుడు మెదడులోని విషతుల్యాలు కూడా బయటకి నెట్టివేయబడతాయి.
శారీరక వ్యాయామం: ఆలోచనల్లో చురుకుదనం పెరగాలంటే వ్యాయామం చేయాలి. నడక, పరుగులాంటి వ్యాయామాల్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.

విటమిన్‌ ‘బి12’ లోపిస్తే?
రోజంతా నీరసంగా ఉంటోందంటే దానికి విటమిన్‌ బి12 లోపమే కారణం. పోషకాహార లోపం లేదా తగినన్ని ఎర్ర రక్తకణాలను తయారుచేయలేని శారీరక లోపం ఉంటే విటమిన్‌ బి12 లోపం తలెత్తుతుంది. ఇదే క్రమేపీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
బి12 లోపానికి కారణాలు: జీర్ణాశయంలో తయారయ్యే యాసిడ్‌ను నియంత్రించే మందులు వాడటం, అట్రోపిక్‌ గ్యాస్ట్రయిటిస్‌, ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌.
లక్షణాలు: జ్ఞాపకశక్తి తగ్గటం, కండరాల బలహీనత, నొప్పులు, నీరసం, బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవటం, పాలిపోయిన చర్మం, ఆకలి లేకపోవటం, డిప్రెషన్‌, బరువు తగ్గటం, చేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు.
ఇవి తినాలి: చేపలు, మాంసం, గుడ్లు, సోయా, గ్రెయిన్స్‌, డెయిరీ ప్రొడక్ట్స్‌.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list