MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆశావాదం బతికిస్తుంది!-Optimism, Amitabh Bachchan, ఆశావాదం, అమితాబ్‌ బచ్చన్‌


పల్చని పెదాలకు లేతరంగు...
పెదవులు విచ్చుకున్న గులాబీల్లా కనిపించడానికి కాస్త లిప్‌స్టిక్‌ రాసుకుంటాం కదా.. ఈసారి మీ పెదవుల ఆకృతిని బట్టి.. లిప్‌స్టిక్‌ వేసుకుని చూడండి. పెదవులు ఎలా ఉన్నా.. ఆకట్టుకుంటాయి. 
కొందరికి పై పెదవి లావుగా ఉంటుంది. ఇలాంటివారు ముందు పెదవుల మధ్యలోంచి అవుట్‌లైన్‌ గీసుకోవాలి. ఆ తరవాత ప్రకాశవంతమైన రంగును కింది పెదవికి వేసి.. పై పెదవికి ఇంకాస్త ముదురుగా వేసుకోవాలి. ఆ తరవాత లిప్‌స్టిక్‌కి దగ్గరగా ఉండే ఐషాడోను కాస్త కింది పెదవి మధ్యలో అద్దుకుంటే.. సరిపోతుంది. అదే కింది పెదవి లావుగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన రంగును పై పెదవికి వేసుకుని, కింది పెదవికి ఇంకాస్త ముదురు వర్ణాన్ని ప్రయత్నించాలి. ఐషాడోతో పై పెదవి మధ్యలో అద్దుకుంటే సరిపోతుంది. 
* కొందరికి పెదవులు ఓ ఆకృతిలో ఉండవు. ఇలాంటివారు ముందు లిప్‌ పెన్సిల్‌తో అవుట్‌లైన్‌ గీసుకోవాలి. ఆ తరవాత చాలా జాగ్రత్తగా, తక్కువగా లిప్‌లైనర్‌ వాడితే అంచులు చక్కటి ఆకృతిలో కనిపిస్తాయి. అప్పుడు లేతరంగు లిప్‌స్టిక్‌ వేసుకుంటే సరిపోతుంది. 
* కొందరి పెదవులు వెడల్పుగా ఉంటాయి. ఇలాంటివారు ముదురు ఛాయలో కాకుండా లేత రంగు లిప్‌స్టిక్‌లను ఎంచుకుంటే.. కాస్త చిన్నగా కనిపించేలా చేయొచ్చు. 
* పెదవులు బాగా పల్చగా ఉన్నప్పుడు.. ముందు లిప్‌లైనర్‌తో పెదవుల బయటి నుంచి.. అవుట్‌లైన్‌లా రాసుకోవాలి. ఆ తరవాత కింది పెదవికి ముదురురంగు లిప్‌స్టిక్‌ వేసుకుని.. పై పెదవికి దానికన్నా కాస్త లేత రంగును వేసుకుని రెండింటినీ కలిపినట్లు చేస్తే సరిపోతుంది.

మంత్రసాధన
పూర్వం ఒక గ్రామానికి ఒక మహాయోగి వచ్చాడు. గ్రామ పొలిమేరలో ఆశ్రమం నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. యోగి మహిమాన్వితుడని తెలిసి గ్రామస్థులంతా వెళ్లి వారి బాధలు చెప్పుకొని.. పరిష్కారాలు తెలుసుకునేవారు. ఈ విషయం తెలిసి ఒక గ్రామస్థుడు యోగి దగ్గరికి వెళ్లాడు. ‘స్వామి! సంసార బాధలు భరించలేకపోతున్నాను! ఏదైనా మంత్రోపదేశం చేసి నన్ను కాపాడండి’ అని మొరపెట్టుకున్నాడు. ‘నాయనా! ఇప్పుడు మౌఢ్యమి ఉన్నది. నెల రోజుల తర్వాత రమ్మ’ని చెప్పాడు యోగి. ఉసూరుమంటూ ఆశ్రమం నుంచి వెనక్కి వచ్చాడు గ్రామస్థుడు. నెల రోజుల తర్వాత మళ్లీ యోగి దగ్గరికి వెళ్లాడతడు. ‘స్వామి! నెల రోజుల తర్వాత రమ్మన్నారు కదా! ఇప్పుడైనా మంత్రోపదేశం చేయండి’ అని అడిగాడు.
‘నాయనా! ఇప్పుడు గ్రహస్థితి బాగోలేదు. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు తప్పకుండా మంత్రోపదేశం చేస్తాన’ని చెప్పాడు. రోజులు గడిచిపోయాయి. కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందుగానే.. ఆశ్రమానికి వెళ్లాడు గ్రామస్థుడు. పౌర్ణమి నాడు ఉదయం.. యోగి దగ్గరికి వెళ్లి.. ‘అయ్యా! ఈ రోజైనా నాకు మంత్రోపదేశం చేస్తారా!’ అని అడిగాడు. దానికి యోగి స్పందిస్తూ.. ‘ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కోనేరులో స్నానం చేసి వద్దాం పదా!’ అని అతణ్ణి వెంట తీసుకెళ్లాడు. కోనేరులో స్నానం చేస్తుండగా.. గ్రామస్థుడి తలను నీటిలో ముంచి పైకి రాకుండా గట్టిగా పట్టుకున్నాడు యోగి. అర నిమిషం తర్వాత విడిచిపెట్టాడు. నీళ్లల్లో ఊపిరి ఆడక సతమతమైన గ్రామస్థుడు బయటకు రాగానే.. ‘ఇదేమిటి స్వామి! ఇలా చేశారు?’ అని ప్రశ్నించాడు. యోగి నవ్వుతూ.. ‘నాయనా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు’ అన్నాడు.
యోగి: నీళ్లల్లో ఉన్నప్పుడు నీకు నీ భార్య గుర్తొచ్చిందా?,
గ్రామస్థుడు: లేదు
యోగి: నీ పిల్లలు గుర్తొచ్చారా?,
గ్రామస్థుడు: లేదు
యోగి: నీ ఇల్లు, పొలాలు గుర్తొచ్చాయా?,
గ్రామస్థుడు: లేదు
యోగి: మరేమి అనిపించింది?,
గ్రామస్థుడు: ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి గాలి పీల్చుకుందామా! అనిపించింది.
‘మంత్ర సాధన కూడా అంతే నాయనా! చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మంత్ర సాధన కోసం మనసు పరితపించాలి. విషయ వాసనల గురించి ఆలోచన ఉండకూడదు. అప్పుడే ఆధ్యాత్మిక సాధన సాధ్యమవుతుంద’ని తెలిపి మంత్రోపదేశం చేశాడు. యోగి చెప్పినవిధంగా గృహస్థు ధర్మాలు పాటిస్తూనే.. మంత్రసాధన చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాడు గ్రామస్థుడు.
కడుపును క్లీన్‌ చేసే కాలీఫ్లవర్‌...
గుడ్‌ఫుడ్‌
ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో కాలిఫ్లవర్‌ది అగ్రస్థానం అని చాలామంది న్యూట్రిషనిస్ట్‌లు అంటారు. గోబి పువ్వు అని కూడా పిలిచే కాలిఫ్లవర్‌ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్‌ దాదాపుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. ఇది గాయాల/దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గాలనుకున్న వారికి దీన్ని సిఫార్సు చేయవచ్చు. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్, పార్కిన్‌సన్స్‌ వ్యాధులను ఇది నివారిస్తుంది. 
అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించే సామర్థ్యం కాలిఫ్లవర్‌కు ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేకరకాల పోషకాలు కాలిఫ్లవర్‌లో ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌తోనూ సమర్థంగా పోరాడతాయి. అందుకే క్యాన్సర్‌ నివారిణిగా కాలిఫ్లవర్‌కు మంచి పేరుంది.
శరీరంలో పేరుకునే విషాలనూ, వ్యర్థాలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. అందుకే దురలవాట్లు ఉన్నవారూ లేదా వాటిని మానేసిన వారు... వంట్లోని విషపదార్థాలను దూరం చేసుకునేందుకు దీన్ని వాడటం మంచిది. స్థూలకాయులు బరువు తగ్గడానికి వంటల్లో కాలిఫ్లవర్‌ను వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. హార్మోన్ల సమతౌల్యతకు కాలిఫ్లవర్‌ బాగా దోహదపడుతుంది. మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది.

ఆశావాదం బతికిస్తుంది!
ఆత్మీయం
ఇద్దరు ౖఖదీలు జైలు ఊచలనుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆశావాదిగా ఉండాలి. మొదట్లో అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే..నీవాయిస్‌ అంత సూట్‌కాదు అని చెప్పి పంపించేశారు. ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్‌కు వెడితే..నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వాళ్లేమన్నా నిరాశావాదానికి గురయ్యారా? లేదే! అదే అమితాబ్‌ బచ్చన్‌ ఈవేళ ప్రపంచ ప్రఖ్యాత నటుడయ్యాడు. ఆయన కంఠాన్ని ప్రత్యేక కంఠమని దేశం ఆరాధిస్తోంది.

ఈవేళ ఎవరి కంఠం వినబడితే మనందరం కళ్ళు మూసుకుని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు జీవితంలో పొందిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఎంత ఉన్నతశిఖరాలకు ఎదిగినా, తన మూలాలను, తొలినాటి దుర్భరమైన పరిస్థితులను చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. సగం నిండిన గ్లాసును చూపించి ఇదేమిటి అనడిగితే ఆశావాది అయితే, దానిలో సగం వరకు నిండా ఉంది అంటాడు. అదే నిరాశావాది అయితే, సగం ఖాళీగా ఉంది అంటాడు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు కుంగిపోకూడదు. నిరాదరణ వల్ల నిరాశపడి నీరసించకూడదు. అందులోనే అవకాశాలను వెదుక్కోవాలి. గొప్పవారి విజయ గాథలు అందుకే చదవాలి. వాటినుంచి స్ఫూర్తి పొందాలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list