గర్భిణి ఆలయానికి వెళ్లరాదా?
ఆలయానికే కాదు, దీర్ఘప్రయాణాలు కూడా. ఆరవనెల ప్రవేశించిన నాటినుంచి ఆలయాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం సరి కాదు.
ప్రస్తుతం... ఎల్లుండి కాన్పు వస్తుందనగా ఈ రోజు కూడా ఉద్యోగంలో పని చేస్తున్న స్త్రీలెందరో. ఇది చాలా బాధాకరం. ఈ ఉద్యోగపు శారీరక, మానసికమైన ఒత్తిడి ఆ బిడ్డ మీద పడుతుందని గ్రహించలేకపోవటం, గ్రహించినా ఆ ఒత్తిడి నుంచి తప్పించుకో(లే)కపోవటం దురదృష్టకరం. అందుకే వెనకటి కాలంలో మూడోనెల రాగానే గర్భిణి పుట్టింటికి తీసుకుపోతుండేవారు. 6వ నెల ప్రవేశించగానే గర్భిణి ప్రయాణాలను పూర్తిగా మానివేయడం ఆరోగ్యానికి మంచిది. ఏడవ నెలలో పిండానికి జీవం ఏర్పడుతుంది (సప్తమే జీవం భవతి). ఆ కాలంలో శిశువుని యాకినీదేవి రక్షిస్తూ ఉంటుంది.
ప్రదక్షిణలు ఎందుకు?
గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేస్తారు. మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేయడం వల్ల పగలు, రాత్రులు ఏర్పడుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరగడం వల్ల జీవరాశి మనుగడకు కావలసిన శక్తిని సూర్యుని నుంచి పొందుతోంది. భక్తులు ఆత్మప్రదక్షిణ చేయడం, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా దానికి సూచికగానే అన్నమాట. మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మన జ్ఞానానికి అతీతమైన శక్తిని భగవంతుని నుంచి పొందుతాం. ఏ దేవుడి గుడికి వెళ్తే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాలు లేదా నామాలు చదువుతూ, పరుగెడుతున్నట్లుగా గాక మెల్లగా, భక్తి భావంతో చేయాలి. వైష్ణవాలయాల చుట్టూ అయితే సరిసంఖ్యలోనూ, శైవాలయాల చుట్టూ అయితే బేసిసంఖ్యలోనూ ప్రదక్షిణలు చేయాలి.
ద్రోణ ద్రుపద మిత్రభేదం
ద్రుపదుడు, ద్రోణుడు ఒకే గురుకులంలో విద్యార్థులు. అనంతర కాలంలో ద్రుపదుడు మహారాజయ్యాడు. ద్రోణుడు మహారాజును ఆశ్రయించవలసిన బ్రాహ్మణుడు. ‘‘నీకు ఏ ఇబ్బంది కలిగినా మహారాజునైన నా దగ్గరకు రావచ్చు మిత్రమా’’ అని గురుకులంలో అన్న మిత్రుని మాటలు మనసులో మెదిలి, పసివాడయిన తన కొడుకు ఆకలి తీర్చడానికై, ఒక ఆవు కావాలని అడగటానికై ద్రుపదుని దగ్గరకు వెళ్లాడు ద్రోణుడు. మహారాజు అహంకారంతో చిన్ననాటి మిత్రుడిని అనరాని మాటలని పంపించాడు. అవమానం భరించలేని ద్రోణుడు గురుదక్షిణ పేరుతో మిత్రుడి మీద కక్ష సాధించాడు. మిత్రుని అవమానించిన ఫలితమిది.
జ్వాలాముఖి
ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి, దేవతలను బాధించసాగారు. శ్రీమహావిష్ణువుతో కలసి దేవతలు ఆ ప్రాంతానికి వచ్చి తమ శక్తులను కొండమీదకి ప్రసరింపజేశారు. అందరి శక్తులు ఏకమై జ్వాల ఏర్పడింది. అందులో నుండి ఒక బాలిక జన్మించింది. ఆమే జ్వాలాముఖి, సతీదేవి పేరుతో దక్షప్రజాపతి ఇంట పెరిగి పెద్దదై, శివుని వివాహమాడింది. దక్షయజ్ఞ ఘట్టంలో, అవమానానికి తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. శివుడు ఆమె దేహాన్ని భుజాన వేసుకుని తిరుగాడసాగాడు. దేవతలు ఆయనకు ఎదురుపడటానికే భయమేసి, విష్ణుమూర్తితో మొరపెట్టుకు న్నారు. విష్ణుమూర్తి బాణాలతో సతీదేవి దేహాన్ని ముక్కలు చేశాడు. అవి 51 చోట్ల పడ్డాయని, (108 అని కూడా అంటారు) అవే శక్తిపీఠాలని చెబుతారు. జ్వాలాముఖి దగ్గర సతీదేవి నాలుక పడిందట.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565