MohanPublications Print Books Online store clik Here Devullu.com

వరప్రదాత కురవి వీరభద్రుడు-Worship, Kuravi Veerabhadrudu, పూజలు, కురవి వీరభద్రుడు


వరప్రదాత కురవి వీరభద్రుడు
పుణ్య తీర్థం
శాంతి స్వరూపులై భక్తులను అనుగ్రహించే దేవతామూర్తులు అనేక మంది భక్తుల గుండె గుడిలో ప్రతిష్ఠితమై ఉన్నారు. దైవకార్యార్థులై దుష్టశిక్షణ చేసి స్వామి కార్యాన్ని నెరవేర్చే ఉగ్ర అవతారులు సైతం దైవంతో సమానంగా పూజలు అందు కుంటున్నారు. అటువంటి ఉగ్రరూపులలో వీరభద్రుడు అగ్రగణ్యుడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా కురవిలో కొలువుదీరాడు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శైవ పుణ్యక్షేత్రం కురవి. ఇందులోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి గిరిజనుల ఆరాధ్యదైవం. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని పునీతులవుతారు.
ఆలయ చరిత్ర...
మహబూబాబాద్‌ (మానుకోట) జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో మానుకోట–మరిపెడ రాజమార్గంలో పెద్ద తటాకాన్ని ఆనుకుని(చెరువు) కురవి గ్రామం ఉంది. క్రీ.శ 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించి చాళుక్యులకు సామంత రాజులు∙రాష్ట్రకూటులు. రాష్ట్రకూట రాజుల్లో... భీమరాజు కురవిని (కురవి అంటే గోరింటాకు పండిన వర్ణం, ఎరుపు) రాజధానిగా చేసుకుని పాలించేవాడని, అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతర కాలంలో కాకతీయ తొలి స్వతంత్రరాజైన ఒకటవ బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండవ బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకాన్ని తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతిదీపస్తంభాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ వీరభద్రస్వామి విగ్రహానికి మీసాలుంటాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మొక్కు తీర్చుకోవడంలో భాగంగా వీరభద్రునికి వెండి మీసాలు సమర్పించారు.
స్వామివారి ప్రాశస్త్యం...
సకల శక్తిమూర్తి వరాల వేలుపు అయిన శ్రీవీరభద్రస్వామి çపశ్చిమాభిముఖుడై ఉంటాడు. పదిచేతులతో, మూడునేత్రాలతో రౌద్రపరాక్రమమూర్తిగా భాసిల్లుతున్నాడు. భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిచిన పలికే దైవంగా వెలుగొందుతున్నాడు. సమస్త భూత ప్రేత పిశాచగణాలు స్వామివారి అధీనంలో ఉంటాయి. రుద్రగణాలు ఆయనను సేవిస్తున్నాయి. భక్తులను ఆదుకునే పరమబోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను ప్రసాదిస్తాడని నమ్మకం. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజాలతో శ్రీ భద్రకాళీ అమ్మవారు ఉన్నారు. ఆలయానికి దక్షిణదిశలో భద్రకాళీ అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటోంది. 
రెండు ముక్కలైన శిలాశాసనం...
కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయ చరిత్రను తెలిపేందుకు అప్పటి రాజులు ఏకశిలస్తంభంపై శిలాశాసనాన్ని చెక్కించారు. ఆ శిలాశాసనం ప్రస్తుతం రెండు ముక్కలైంది. దాన్ని ఆలయం పక్కన ఉంది. ప్రాశస్త్యమైన ఆ శాసనస్తంభాన్ని అతికించి భావితరాలకు చరిత్రను తెలిపేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతి యేడు శివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఆకట్టుకునే రాతిదీపస్తంభం...
వీరన్న సన్నిధిలోకి రాజగోపురం కింద నుంచి వెళ్లగానే ఎదురుగా ఏకశిల స్తంభంపై నందీశ్వరుడి విగ్రహం దర్శనమిస్తుంది. దానిపక్కన కాకతీయ సామ్రాజ్యాధినేత్రి రాణి రుద్రమదేవి విజయానికి నిదర్శనంగా నిర్మించిన ఏకశిల దీపస్తంభం కనిపిస్తుంది. ఈ ఏకశిలా స్తంభాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ఎలా వెళ్లాలంటే..?
కురవి మండల కేంద్రం. కురవికి చేరాలంటే... డోర్నకల్‌ మీదుగా వెళ్లే రైళ్లు లేదా బస్సులలో మహబూబాబాద్‌ వెళ్లాలి. అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో గల కురవి వీరభద్రస్వామి ఆలయానికి ఆర్టీసు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. మహబూబాబాద్‌లో అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list