పఫ్ షెఫ్
బొరుగులు.. మరమరాలు.. మురుముర.. పఫ్డ్ రైస్... ఇన్ని పేర్లున్న పఫ్డ్ రైస్‌తో అన్ని ఐటమ్స్ చేసుకోవాలి కదా. మరి అన్ని చేయాలంటే.. పెద్ద పెద్ద హోటళ్లలోలా షెఫ్ కావాలి కదా. అవసరం లేదు! హ్యాపీగా మీరే ఒక పఫ్ షెఫ్ అయిపోయి కావలసినవన్నీ వండేసుకోండి! అంత ఈజీ.. వీటి తయారీ.
పఫ్డ్ రైస్ పీనట్ బటర్ బాల్స్
పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆకలి అంటూ గోల చేస్తుంటారు. తక్కువ టైమ్‌లో తక్షణ ఎనర్జీని ఇచ్చే వంటకాలలో ఇది ఒకటి.
కావల్సినవి: మరమరాలు – కప్పు; తేనె – పావు కప్పు; పంచదార పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్; పీనట్ బటర్ – అర కప్పు; కిస్‌మిస్ – 2 టేబుల్‌స్పూన్లు; జెమ్స్ – 15 గ్రాముల పాకెట్
తయారీ: ఒక గిన్నెలో తేనె, పంచదార పొడి, పీనట్ బటర్ వేసి బాగా కలపాలి. దీంట్లో మరమరాలు, కిస్‌మిస్ వేసి కలపాలి. దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేయాలి. బాల్స్ పైన ఒక్కోదాన్ని జెమ్స్‌తో అలంకరించి ఫ్రిజ్‌లో 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత తీసి అందించాలి.
నోట్:
1. పీనట్ బటర్‌కి బదులు చాకొలెట్ మిశ్రమంతోనూ ఇలా తయారు చేసుకోవచ్చు.
2. పాలలో కొద్దిగా బెల్లం తురుము, మరమరాలు, డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి కూడా కలిపి పెట్టవచ్చు.
భేల్ పూరి
భేల్‌పూరీని వీధి చివరలో బండిమీద పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటుంటారు. బయట బండ్ల మీద శుభ్రంగా ఉండదని కంగారు పడకుండా ఇంట్లోనే హెల్తీ స్నాక్‌గా దీనిని తయారుచేసివ్వచ్చు.
కావల్సినవి: మరమరాలు – 1కప్పు; వేయించిన పుట్నాలపప్పు – 100 గ్రాములు; పల్లీలు – 100 గ్రాములు; కీరా – 1 (సన్నని ముక్కలుగా కట్ చేయాలి); బంగాళదుంప – 1 (ఉడికించి, సన్నని ముక్కలు చేసుకోవాలి); ఉల్లిపాయ – 1 (సన్నగా కట్ చేసుకోవాలి); టొమాటో – సన్నగా కట్ చేయాలి; కొత్తిమీర – అలంకరణకు; ఉప్పు – టీ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్; చాట్ మసాలా – టేబుల్ స్పూన్; పసుపు – చిటికెడు; దానిమ్మగింజలు – తగినన్ని
తయారీ: వేయించిన మరమరాలు కరకరలాడుతుంటాయి. వెడల్పాటి గిన్నెలో మరమరాలు, పుట్నాలపప్పు, వేయించిన పల్లీలు, కీరాముక్కలు, బంగాళదంపముక్కలు, ఉల్లిపాయలు, టొమాటో, ఉప్పు, చాట్ మసాలా, సేవియా, నిమ్మరసం, పసుపు వేసి బాగా కలపాలి. దీని పైన కొత్తిమీర చల్లి. సర్వ్ చేయాలి. దీనికి కొత్తిమీర లేదా పుదీనా చట్నీ, అల్లం–బెల్లం పచ్చడి కూడా వాడుకోవచ్చు.
నోట్: 1. సన్నగా కట్ చేసిన అల్లం తరుగు, చింతపండు గుజ్జు, నల్లుప్పు, గరం మసాలా కూడా వేసి కలుపుకోవచ్చు.
సేవియా: రెండు భాగాల బియ్యప్పిండికి ఒక భాగం శనగపిండి, ఉప్పు, కారం కలపాలి. తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. సేవియా చేసే అచ్చులో పిండి పెట్టి, ఒత్తి, కాగుతున్న నూనెలో రెండువైపులా వేయించుకోవాలి.
బొరుగుల ఉప్మా/ఉగ్గాణి
ఇది వేడి వేడిగా, కొద్దిగా కారంగా రుచిగా ఉండే వంటకం. చేయడం సులువు. సాయంకాలం స్నాక్‌గానూ తీసుకోవచ్చు.
కావల్సినవి: మరమరాలు/బొరుగులు – 2 కప్పులు; వేయించిన పుట్నాలపప్పు – పావు కప్పు; ఉల్లిపాయలు – 1; పచ్చిమిర్చి – 1; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; పోపు గింజలు – టీ స్పూన్; వేరుశనగలు
తయారీ: ∙బొరుగుల(మరమరాలు)లో తగినన్ని నీళ్లు పోసి 5 నిమిషాలు ఉంచి, నీళ్లు పోయేలా గట్టిగా పిండి ఒక ప్లేట్‌లో వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి మందపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి వేడయ్యాక 3 టీ స్పూన్ల నూనె వేయాలి. దీంట్లో పల్లీలు, శనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీంట్లో పసుపు వేసి కలిపి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి ∙వేయించిన పుట్నాల పప్పును పిండి చేసుకోవాలి ∙నానిన మరమరాలను మగ్గిన పోపు మిశ్రమంలో వేసి కలపాలి. పైన మూతపెట్టి 2 నిమిషాలు ఆగాలి. తర్వాత పుట్నాలపప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఈవెనింగ్ స్నాక్ ఉగ్గాణి రెడీ.
పఫ్డ్ రైస్ బార్స్
కావల్సినవి: మరమరాలు – 250 గ్రాములు; బెల్లం – 750 గ్రాములు; నీళ్లు – 3 1/2 కప్పులు
తయారీ: ∙బెల్లం తురమాలి. నీళ్లలో వేసి కరిగేంతవరకు గరిటతో కలపాలి. తర్వాత వడకట్టుకోవాలి. దీని వల్ల సన్నటి చెత్తను తీసేయడం సులువు. ∙ఈ బెల్లం నీళ్లు ఉన్న గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట ఉంచాలి. బెల్లం నీళ్లు మరిగేంతవరకు మంట పెద్దగా పెట్టి, తర్వాత సన్నటి మంట మీద ఉడికించాలి ∙పాకం చిక్కగా అయ్యేంత వరకు ఉంచి మరమరాలు పోసి కలపాలి. ∙ కొద్దిగా చల్లారాక మరమరాల మిశ్రమం కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేయాలి. అలాగే రెండు అరచేతులతో రోల్ చేస్తే పొడవు బార్స్ వస్తాయి.
నోట్: 1. మరమరాలు పోయడానికి ముందు బెల్లం పాకంలో చిటికెడు యాలకుల పొడి వేసి కలపాలి. వీటిని లడ్డూలుగానూ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత గ్లాస్‌జార్‌లో భద్రపరిస్తే పిల్లల కంటికి అందంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి.
2. పాకం పట్టేటప్పుడు ఒక చిన్న ప్లేట్‌లో వేడి పాకం మిశ్రమం ఒక చుక్క వేయాలి. నీళ్ల నుంచి బెల్లం పాకం వేరుగా కనపడిందంటే మిశ్రమం సిద్ధం అయినట్టుగా గుర్తించాలి.
3. మరమరాలు బెల్లం పాకంలో పోశాక టూటీ ఫ్రూటీ, డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు.
పఫ్డ్ రైస్ కేక్
మరమరాలను నువ్వుల పొడితో కలిపి తయారు చేస్తే రుచిగా ఉండటమే కాదు ఒంటికి బలం కూడా! ముఖ్యంగా రక్తహీనత ఉన్న అమ్మాయిలకు ఇది మంచి ఔషధం.
కావల్సినవి: మరమరాలు – 5 కప్పులు; తెల్ల నువ్వులు – కప్పు; తేనె – అర కప్పు; తహని పేస్ట్ – 1/2 కప్పు (వేయించిన నువ్వులను పొడి చేసి, ఆలివ్ ఆయిల్ కలపాలి); ఖర్జూరం పేస్ట్ – తగినంత; పంచదార – 1/3 కప్పు; వెన్న – 1/2 కప్పు, జీడిపప్పు పలుకులు – కొన్ని
తయారీ: పొయ్యి మీద పాన్ పెట్టి నువ్వులను వేయించాలి. దీంట్లో తేనె, తహని పేస్ట్, పంచదార కలపాలి. పంచదార కరిగి మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో మరమరాలు పోసి కలపాలి. వెన్నె లేదా నెయ్యి రాసి వెడలాట్పి ప్లేట్‌లో మరమరాల మిశ్రమం పోసి, వెడల్పాటి స్పూన్‌తో ప్లాట్‌గా సర్దాలి. పైన జీడిపప్పు పలుకులను పెట్టాలి. దీన్ని ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి. బయటకు తీసి చాకుతో ముక్కలుగా కట్ చేసి, సర్వ్ చేయాలి. పంచదార బదులు బెల్లం వాడితే మరింత రుచి వస్తుంది.
మరమరాల దోసె
ఇది దోసెకు పట్టినంత సమయమే పడుతుంది. ఇందులో వాడే మరమరాలు మినహా మిగతా దోసెకు కావల్సిన దినుసులన్నీ అవే! అయితే దోసె పిండిలో నానబెట్టిన మరమరాలను కూడా వాడటంతో దోసె మృదువుగా, రుచిగా అవుతుంది.
కావల్సినవి: మరమరాలు – 150 గ్రాములు; బియ్యం – అరకేజీకి వంద గ్రాములు తక్కువ; మినప్పప్పు – 50 గ్రాములు; మెంతులు – అర టీస్పూన్; ఉప్పు – తగినంత; బేకింగ్ సొడా – చిటికెడు; నూనె – తగినంత
తయారీ: ∙బియ్యం, మినప్పప్పు కడిగి 4 గంటలు నానబెట్టాలి. దీంట్లో మెంతులు వేయాలి. మరమరాలలో నీళ్లు పోసి, అరగంట నాననివ్వాలి. నీళ్ల నుంచి గట్టిగా పిండి మరమరాలను మరొక గిన్నెలోకి తీసుకోవాలి. బియ్యం, పప్పులో నానబెట్టిన మరమరాలు కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. సరిపడా ఉప్పు కలిపి మూత పెట్టి 5–6 గంటలు బయటే ఉంచాలి. ∙దోసె వేసే ముందు కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. పిండి జారుగా ఉండటానికి మరికొన్ని కలుపుకోవాలి. ∙నాన్‌స్టిక్ పెనం పొయ్యిమీద పెట్టి వేడి చేయాలి. గరిటెతో దోసె పిండి పెనం మీద వేసి గరిటెను పిండి మీద వృత్తాకారంలో తిప్పాలి. దోసె వెడల్పుగా వచ్చిందనుకున్నాక చుట్టుతా నూనె వేసి 2–3 నిమిషాలు ఉంచి, కాలాక మంట తగ్గించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. పల్లీ లేదా కొబ్బరి చట్నీతో వడ్డించాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565