MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రపంచంలోనే ఎత్తయిన కుమారస్వామి విగ్రహం_Kumaraswamy


ప్రపంచంలోనే ఎత్తయిన
 కుమారస్వామి విగ్రహం

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, శరవణుడు... పేరు ఏదైతేనేం! ఆ శివుని కుమారుని తమ ఇష్టదైవంగా భావిస్తారు భక్తులు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఎక్కడ ఉన్నా, ఆయనని పూజించుకునేందుకు ఓ ఆలయాన్ని నిర్మించుకుంటారు. అలా మలేసియాలో స్వామివారి వైభవాన్ని చాటుతున్ని ఆలయమే ‘బటూ గుహ’లో నెలకొల్పిన స్వామివారి సన్నిధి!


తమిళప్రజలు కుమారస్వామిని మురుగన్ అన్న పేరుతో కొలుచుకుంటారు. మురుగన్ అంటే అందమైనవాడు అని అర్థం. మరి ఆ అందమైన రూపం ఎంత ఎత్తుగా ఉంటే, చూసేందుకు అంత కన్నులపండువగా ఉంటుంది కదా! అందుకనే మలేసియాలో 140 అడుగుల ఎత్తయినా మురుగన్ విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచంలోనే ఇది ఎత్తియిన మురుగన్ రూపం! అయితే ఈ విగ్రహం ఒక ఆరంభం మాత్రమే. బటు గుహల ప్రవేశద్వారం వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని దాటుకుని వెళ్తే... కుమారస్వామికి సంబంధించిన అనేక ముఖ్యాలయాలు దర్శనమిస్తాయి.



బటూ గుహలు సున్నపురాతితో ఏర్పడిన సహజసిద్ధమైన గుహలు. ఇవి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందని చెబుతారు. విశాలమైన ఈ సున్నపు గుహలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తూ ఉండేవారు. అలా ఒకసారి మలేసియాలో స్థిరపడిన తంబూస్వామి పిళ్లై అనే ఆయన ఈ గుహల దగ్గరకు చేరుకున్నాడట. గుహని చూస్తున్న ఆయనకు ఓ విచిత్రం కనిపించింది. బటూ గుహలలో ఒకదాని ప్రవేశద్వారం అచ్చు శూలం ధరించిన కుమారస్వామిలా కనిపించింది. దాంతో ఆ గుహలో స్వామివారికి ఒక ఆలయాన్ని ఎందుకు నిర్మించకూడదను అనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే బటూ గుహలలో మురుగన్ ఆలయం.

స్వామివారి ఆలయాన్ని నిర్మించి ఇప్పటికి దాదాపు 125 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి నుంచి ఏటా భక్తులు అసంఖ్యాకంగా బటూ గుహలకు చేరుకుంటూనే ఉన్నారు. ఈ గుహలకు సమీపంలో ఉన్న బటూనదిలో స్నానం చేసి వారు గుహ ఉన్న కొండ దగ్గరకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి గుహలోకి వెళ్లేందుకు 272 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను సునాయాసంగా ఎక్కేందుకు భక్తులకు తోడుగా ఉండేందుకా అన్నట్లు ఆరంభంలో బ్రహ్మాండమైన మురుగన్ విగ్రహాన్ని నెలకొల్పారు.



బటు కొండ మీద కేవలం మురుగన్ ఉన్న గుహలే కాదు.. చిన్నాచితకా చాలా గుహలే కనిపిస్తాయి. వాటిలో రాములవారు, వినాయకుడు, శివుడు, మీనాక్షిదేవి, నవగ్రహాలు ఇలా అనేకమంది దేవతలను ప్రతిష్టించారు. గుహల దిగువున పెద్ద మురుగన్ విగ్రహం ఉన్నట్లే, రాములవారిని నెలకొల్పిన గుహ బయట కూడా 50 అడుగుల ఎత్తయిన ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుంది.

ప్రకృతిసిద్ధమైన ఈ బటూ గుహలలో అరుదైన జీవరాశి కూడా ఉంది. వాటికి నష్టం కలగకుండా ఉండేందుకు కొన్ని గుహలలోకి పర్యటకులను అనుమతించరు. అయినా మురుగన్ భక్తులు, బటూ కొండను ఎక్కాలనుకునే పర్వతారోహకులతో ఈ ప్రాంతం కిటకిటలాడిపోతుంటుంది. ఇక జనవరి/ ఫిబ్రవరిలో వచ్చే తైపూస మాసంలో భక్తులు తాకిడి మరింత పెరిగిపోతుంది. ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎంతో దూరం నుంచి భక్తులు కావడి కట్టుకుని బటు గుహలకు చేరుకుంటారు.

బటు గుహల వెలుపల ఉన్న మురుగన్ విగ్రహాన్ని మనం తరచూ సినిమాల్లో చూస్తూనే ఉంటాము. కానీ ఆ విగ్రహాన్ని, బటు గుహల అందాన్ని, ఆ గుహలలో ఉన్న ఆలయాలని చూడాలంటే ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లాల్సిందే! ఒకవేళ అంతదూరం వెళ్లలేమనుకునేవారు batucaves.org కి వెళ్లి అక్కడ 360 డిగ్రీలలో కనిపించే ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వీడియోలను చూడవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list