MohanPublications Print Books Online store clik Here Devullu.com

జీవితంలో చేయకూడనివి- Life, Unfaithfulness, జీవితం, నమ్మక ద్రోహం





జీవితంలో చేయకూడనివి...
ఆత్మీయం
నమ్మకద్రోహం, అనుబంధాలను తెంపుకోవడం, ఇచ్చిన మాట తప్పడం, ఎదుటివారి మనస్సు నొచ్చుకునేట్లు ప్రవర్తించడం... ఈ నాలుగింటినీ చేయకూడదు. ఎందుకంటే గాయపడిన హృదయం చేసే ఆక్రందన పైకి వినిపించదు, లోలోపలే క్షోభిస్తుంది, నరకయాతన అనుభవిస్తుంది. తద్వారా మనోబలం సన్నగిల్లిపోతుంది.
ఇక, అసత్యాలు ఆడటం... కొందరికి ఊరికే అబద్ధాలాడటం అలవాటు. ఒక అబద్ధం ఎదుటివారి ప్రాణాలనో, కాపురాన్నో, జీవితాన్నో నిలబట్టేలా ఉండాలి కానీ, తీసేసేలా ఉండకూడదు. నమ్మకద్రోహం... అవతలివారికే కాదు, నమ్మకద్రోహానికి పాల్పడేవారికి కూడా అపాయకరమే. మనం ఎదుటివారికి ఏమి చేస్తామో, అటువంటి ఫలం అంతకు మిక్కిలిగా మనకు లేదా మన సంతానానికి సంక్రమించి తీరుతుంది. అదేవిధంగా ఎదుటివారి మనస్సు నొచ్చుకునేటట్లు చేయడం వల్ల తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇవ్వవచ్చునేమో కానీ, వారు ఎంతగా బాధపడతారో, తిరిగి అంత బాధనూ మనం అనుభవించవలసి వస్తుంది. ఇది కర్మసిద్ధాంతం. అనుబంధాలను తెంపుకోవడం కూడా అంతే! మనని ఇష్టపడేవారు, మన బాగోగులు కోరుకునేవారు, మనమీద ఆధారపడేవారితో అనుబంధాలను బలవంతంగా తెంచుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు.
అనుబంధాలకు విలువ ఇచ్చేవారు తమకిష్టమైనవారిలో వంద లోపాలున్నప్పటికీ, వారిని ప్రేమించడానికి ఒక్క కారణం చాలంటారు. నచ్చనప్పుడు ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. అనుబంధాలను తెంచుకున్న మనిషి సముద్రమంతటి ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది వినడానికి సముద్ర ఘోష తప్ప మరెవరూ ఉండరు.

సోంఫ్‌తో శ్వాస తాజాగా...!
గుడ్‌ఫుడ్‌
ఎంత మంచి భోజనం అయినా అది తిన్న తర్వాత సోంఫ్‌ వేసుకుంటే గానీ ఆ భోజనపర్వం సంతృప్తిగా ముగిసినట్లు అనిపించదు కొందరికి. అందుకే చాలా మంచి భోజనం తర్వాత కాసింత సోంఫ్‌ వేసుకుంటారు. భోజనం ముగిశాక వేసుకునే సుగంధద్రవ్యంగానే కాకుండా సోంఫ్‌తో అంతకు మించి ప్రయోజనం ఉందంటున్నారు ఆహార నిపుణులు. వారు సోంఫ్‌ గురించి చెబుతున్న కొన్ని అంశాలివి... సోంఫ్‌లో కళ్లకు మంచి చేసే అంశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇవి గ్లకోమాను అరికట్టడంలో తోడ్పడతాయని అనేక అధ్యయనాల్లో తేలింది.
భోజనం తర్వాత కాసింత సోంఫ్‌ తినే వారిలో మతిమరపు వచ్చే అవకాశాలు ఉండవు. అవి మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాన్ని బలోపేతం చేయడం వల్ల డిమెన్షియా సమస్య రాదంటున్నారు పరిశోధకులు.సోంఫ్‌తో రక్తం బాగా శుద్ధి అవుతుందని పేర్కొంటున్నారు మరికొందరు అధ్యయనవేత్తలు. కాలుష్యం నిండి ఉండే నేటి రోజుల్లో చాలా సులభంగా రక్తంలో పేరుకుపోయే కాలుష్యాలను తొలగించుకునేందుకు ఇది చాలా సులభమైన మార్గంగా వారు చెబుతున్నారు.
సోంఫ్‌ తినేవారిలో ఛాతీ పట్టేసే సమస్య నివారణ అవుతుంది. సోంఫ్‌లో ఉండే అనెథాల్, సినెయోల్‌ అనే రసాయనాలు శ్వాసనాళాలను వెడల్పుగా విప్పారేలా చేస్తాయి. అందుకే అలర్జీ లేదా ఆస్తమా లేదా బ్రాంకైటిస్‌ ఉన్నవారు కాస్తంత సోంఫ్‌ తీసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. అన్నిటి కంటే ముఖ్యంగా... ఇది శ్వాసను తాజాగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. అందరికీ తెలిసిన ప్రధాన ఉపయోగం ఇది. అయితే అతి సర్వత్ర వర్జయేత్‌ అన్న సూత్రం సోంఫ్‌కూ వర్తిస్తుంది. అందుకే ఎంత రుచికరంగా ఉన్నా పరిమితంగా తీసుకోవడం అన్ని విధాలా మేలు.


గోరంత పోషణ
బ్యూటిప్స్‌
గోళ్లు పొడిబారకూడదు: గోరు పొడిబారడం అనేది దేహారోగ్యం మీద, సౌందర్య పోషణ మీద ఆధారపడి ఉంటుంది. దేహంలో అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉంటే గోరు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే... కొందరిలో చేసే పనుల రీత్యా గోళ్లు పొడిబారుతుంటాయి. అలాంటప్పుడు... రోజూ ఉదయం, రాత్రి గోళ్ల మీద ఒక చుక్క ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనె వేసి మునివేళ్లతో గోళ్లను వలయాకారంగా మర్దనా చేయాలి.
గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు: గోళ్లకు సౌందర్య పోషణతోపాటు గోళ్లు, చిగుళ్ల గాయాలకు చికిత్స కూడా చాలా అవసరం. గోళ్లు కత్తిరించేటప్పుడు కానీ మరే ఇతర కారణాలతోనైనా గోరు చిగురు దగ్గర చీలిపోతుంది. దానికి తేనె చక్కటి ఔషధం. గాయాన్ని కడిగి, తడి తుడిచిన తర్వాత అరచేతిలో నాలుగు చుక్కల తేనె వేసుకుని గాయానికి పట్టించాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు గాయానికి తేనె తగులుతూ ఉంటే ఇక గాయానికి ఇన్‌ఫెక్షన్‌ చేరదు.
గోళ్లు విరిగిపోతుంటే: గోళ్లు గరుకుగా మారిపోవడం, పెళుసుబారి మధ్యలో విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి అందులో గోళ్లను ముంచాలి. అలాగే 15 – 20 నిమిషాల సేపు ఉంచిన తర్వాత గోళ్లను నూనెలో నుంచి తీయాలి. కారుతున్న నూనెను మాత్రం తుడిచి గోళ్లను సబ్బుతో కడగకుండా అలాగే ఉంచాలి. ఒకటి– రెండు రోజులు నెయిల్‌ పాలిష్‌ వేయకుండా గోళ్లకు గాలి తగలనివ్వాలి.
గోళ్లకు నొప్పి లేకపోయినప్పటికీ, అవి దేహంలో ప్రాణం ఉన్న ఇతర భాగాల వంటివే. కొద్దిగానైనా సరే వాటికి గాలి అందాలి, పోషకాలు అందాలి, రక్తప్రసరణ కావాలి, సంరక్షణ కావాలి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list