నల్లటి మబ్బులూ, పచ్చటి పొలాలూ, పసుపు కుంకుమల పండుగలూ, పాయసాన్నాల నివేదనలూ... శ్రావణ మాసం అడుగిడితే ఇంటింటా పచ్చతోరణం కళకళలాడాల్సిందే. వరాలతల్లి వ్రతాలే కాదు కన్నయ్య నుంచి గణపయ్య దాకా అందరి పండుగలూ ఈ నెలలో ఉన్నాయి మరి! (రేపే శ్రావణం ప్రారంభం)
మంగళవాయిద్యాలూ, పట్టుచీరల రెపరెపలూ, ధూపాల పరిమళాలూ, ముత్తయిదువల ముచ్చట్లూ... సందడంతా శ్రావణానిదే. పూలకొట్లు కళకళలాడతాయి, చీరల దుకాణాలు దుమ్ముదులుపుకుంటాయి, గడపలు పచ్చరంగేసుకుంటాయి, ముంగిళ్లు ముత్యాల ముగ్గులతో నిండిపోతాయి. పేరంటానికెళ్లి పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే వాళ్లూ, నోముల పేరుతో కొత్త పరిచయాలు పెంచుకునేవాళ్లూ... పల్లె నుంచీ పట్టణం దాకా సందడి కావాలంటే శ్రావణం రావాల్సిందే. ఆహ్లాదకర వాతావరణంతో పాటూ ఆధ్యాత్మిక పరిమళమూ ఈ మాసానికి ఎక్కువే.
ఎన్ని జయంతులో...
వరలక్ష్మీదేవి, హయగ్రీవుడు, శ్రీకృష్ణుడు, వరాహమూర్తి బదరీనారాయణుడు, సంతోషీమాత... వీళ్లంతా ఈ నెల్లోనే జన్మించారట. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధనకు మంచివి. మంగళవారాలు గౌరీ దేవిని పూజిస్తే సర్వసౌభాగ్యదాయకం. ఇక ఈ నెల్లోని సోమవారాలూ విశిష్టమైనవే. ఆ రోజుల్లో శివుడికి అభిషేకం చేస్తే ఎంతో మంచిదంటారు.
కొత్త పెళ్లికూతుళ్లకు...
మాంగళ్యరూపిణి పార్వతీ దేవి. అందుకే శ్రావణమాసంలోని అన్ని మంగళవారాలూ మంగళగౌరీ నోములు నోచుకుంటారు ముత్తయిదువలు. కొత్త పెళ్లికూతుళ్లకు ఇవి మరింత ప్రత్యేకం. పెళ్లయిన తొలి శ్రావణమాసం మొదలు ఐదేళ్లు నియమంగా ఈ నోములు నోచుకుని ఉద్యాపన చెప్పుకుంటారు. కోర్కెలు తీర్చే తల్లిగా వరలక్ష్మిని కొలుస్తారు. ఈ నెల్లోనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్నీ శ్రద్ధగా చేసుకుని వాయనాలు ఇచ్చుకుంటారు స్త్రీలు. ఏ కారణాల వల్లనైనా ఆరోజు కుదరకపోతే మిగతా శుక్రవారాల్లోనూ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే శ్రవణానక్షత్రం రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటారు. శ్రవణా నక్షత్రం స్వామి జన్మనక్షత్రం కనుక ఈ రోజు వ్రతమాచరించడం అత్యంత ఫలదాయకంగా చెబుతారు.
ప్రతి తిథీ ప్రత్యేకమే
శ్రావణ మాసంలో చాలా విశేష తిథులున్నాయి. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అంటారు. గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృతాన్ని అపహరించింది ఈ రోజే. నాగ, గరుడ జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికిన ఈరోజు నాగులకు ప్రీతికరమైనది. అందుకే ఈ నెలలోని చవితితోపాటూ, పంచమి రోజు కూడా నాగులకు పూజలు నిర్వహిస్తారు. ఈ రెండు రోజులూ నాగదేవతను పూజిస్తే వంశవృద్ధీ, సంతానానికి శుభమూ జరుగుతాయట. గరుడ పంచమిరోజు గరుత్మంతుని పూజించడం వల్ల గొప్ప బల పరాక్రమాలు చేకూరుతాయి. శుద్ధషష్ఠినాడు సూపౌదన వ్రతం చేస్తారు. ఆ రోజు నీలకంఠుణ్ని అర్చించి అన్నం, పప్పూ నివేదన చేస్తారు. శుద్ధ సప్తమిని సూర్య సప్తమి లేదా భాను సప్తమి అని పిలుస్తారు. ఆ రోజు సూర్యనారాయణుడికి పరమాన్నం నైవేద్యంగా పెడతారు. తర్వాత వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. సంతానం లేని వాళ్లు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే సత్సంతానం కలుగుతుందట. తర్వాతి ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి.త్రయోదశినాడు అనంగ వ్రతం చేస్తారు. కుంకుమాక్షతలూ, ఎర్రపూలతో రతీమన్మథులని పూజించాలి. అలాచేస్తే దాంపత్య సౌభాగ్యం లభిస్తుందట. శుద్ధ చతుర్దశి రోజు వరాహ జయంతి. శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడ్ని సంహరించిన రోజు ఇదే. ఆ రోజు విష్ణుసహస్రనామాన్ని పఠించడం వల్ల సకల పాపాలూ తొలగిపోతాయన్నది శాస్త్రోక్తి.
పౌర్ణమి విశిష్టం
శ్రావణ శుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. తోబుట్టువులు ఒకరికొకరు రక్షగా ఉండాలన్న సందేశాన్నిస్తూ సోదరీసోదరులు ఈ రోజు రక్షాబంధనాన్ని కట్టుకుంటారు. సంతోషీమాత జన్మించింది కూడా ఈ రోజే. అందరూ అక్కచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుంటుంటే తమకూ కట్టించుకోవాలనిపిస్తోందని గణపతి, కుమారస్వామి శివపార్వతుల్ని అడిగారట. దాంతో శ్రావణ శుద్ధ పౌర్ణమినాడే సంతోషీమాత ఆవిర్భావం జరిగిందట. ఈ రోజునే హయగ్రీవ జయంతి కూడా. గుర్రం ముఖం, మనిషి శరీరం ఉండే ఈ స్వామిని జ్ఞానదేవతగా చెబుతారు. బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు మహావిష్ణువు ఈ అవతారం ఎత్తాడు. మహాలక్ష్మికి ధనాదిపత్యాన్ని అనుగ్రహించిందీ, సరస్వతికి అక్షరాభ్యాసం చేసిందీ ఈ స్వామే. అందుకే ఈ రోజు అక్షరాభ్యాసాలకూ మంచిది. ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు పాత యజ్ఞొపవీతాన్ని తీసి, కొత్త యజ్ఞొపవీతాన్ని ధరిస్తారు.
కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజు గణపతిని పూజిస్తే ఎంతటి ఉపద్రవాలైనా తొలగిపోతాయంటారు. ఇక, గోపాలకృష్ణుడి జన్మతిథి శ్రావణ బహుళ అష్టమినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కన్నయ్య పాదాలను ఇంట్లో వేసి వెన్నా, పాలూ, మీగడ పెరుగూ నైవేద్యంగా పెడతారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, రాత్రిపూట ఉయ్యాల్లో ఉంచి జోల పాడతారు. ఉట్టి కొట్టడం ఈ రోజు సందడిని నెలకొల్పే కార్యక్రమం. తర్వాత వచ్చేది కోర్కెలు తీర్చే కామదా ఏకాదశి. మాసం చివర వచ్చే పోలాల అమావాస్యను పల్లెటూళ్లలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ రోజు పశువులకు పూజ చేస్తారు. దీనివల్ల అకాల మృత్యువు తొలగిపోతుందన్నది శాస్త్రోక్తి. మొత్తానికి శ్రావణం ఆసాంతం పండుగలమయం, పరమ పవిత్రం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565