శ్రీరంగాపూర్ రమణీయ రంగనాథుడు
పుణ్య తీర్థం
చెక్కు చెదరని శిల్ప సంపద.. ఆకాశాన్నంటే గాలి గోపురాలు... వర్ణించనలవి కాని అపురూప దేవతామూర్తుల చిత్రాలు... ఆలయం పక్కనే సువిశాల రంగసముద్రం చెరువు.. భక్తి భావాన్ని పెంచే ప్రశాంతమైన దేవాలయం... ఇదే శ్రీరంగాపూర్‌లోని రంగనాథుని ఆలయం. కోరిన కోరికలు తీరుతుండడంతో ఈ ఆలయం భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు.
పెబ్బేరు మండల పరిధిలోని కొర్విపాడు (నేటి శ్రీరంగాపూర్) గ్రామంలో సుమారు 340 సంవత్సరాల క్రితం సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు(క్రీ.శ.1670) కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. గ్రామంలో రంగసముద్రం పేరు గల చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన రంగనాయకస్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. రంగనాయకస్వామి ఆలయం నిర్మాణంతో కొర్విపాడుగా పిలుచుకునే గ్రామం శ్రీరంగాపూర్‌గా వాడుకలోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో సుప్రసిద్ధ వైష్ణవపుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగంకు దీటుగా పాలమూరు జిల్లా శ్రీరంగపూర్ గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామివారిని దర్శించే శక్తి లేని భక్తులు శ్రీరంగాపూర్‌లోని ఆలయాన్ని దర్శించి తరించవచ్చని భక్తుల నమ్మకం.
కట్టిపడేసే శిల్పసంపద
శ్రీరంగనాయకస్వామి ఆలయంలో నెలకొన్న అద్భుతమైన శిల్పసంపద భక్తులను కట్టిపడేస్తుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతో, ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో శ్రీలక్ష్మిదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం ప్రక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన శ్రీరంగసముద్రం అనే సువిశాలమైన చెరువు చూపరులను ఆకట్టుకొంటుంది. చెరువు మధ్యలో రాజులు సాయంత్రం వేళల్లో విడిదిచేసే కృష్ణవిలాస్ భవనం కనిపిస్తుంది. ఆలయంలోని నేలమాళిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారుపూత పూసిన అరుదైన దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. ఈ సుందరమైన నేపథ్యంలో అనేక సినిమాలు, టీవీ సీరియళ్లను చిత్రీకరించారు. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయ డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అరుదైన గాలిగోపురం...
రంగనాయకస్వామి ఆలయంలో అడుగుపెట్టగానే కనిపించే గాలిగోపురం ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకుంది. 1804 సంవత్సరంలో రాణి శంకరమ్మ ఈ గోపురాన్ని కోయంబత్తూరు సుబ్బారావు అనే శిల్పిచేత నిర్మింపచేశారు. ఈ గోపురం ఐదు అంతస్థుల (60 అడుగులు ఎత్తు) ఎత్తుతో 20 అడుగుల ద్వారం కలిగి ఉంది. మొదటి అంతస్తులో క్రమపద్ధతిలో రామాయణగాథను వివరిస్తున్న శిల్పాలు ఉన్నాయి. తర్వాతి అంతస్థులలో వరుసగా అందమైన స్త్ర్రీ మూర్తుల చిత్రాలతోపాటు క్షీరసాగర మథనం, శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, ప్రణయ సన్నివేశాలు, రంగనాయక స్వామి స్వరూపం, నరసింహ అవతారం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి దేవతామూర్తుల చిత్రాలను అందంగా చెక్కించారు. దీంతోపాటు ముగ్గురు రెడ్డిరాజుల వంశస్తుల శిల్పాలు, శ్రీరాముని పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయస్వామి శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ గాలిగోపురం పైభాగాన సింహముఖంతో పూర్తిచేయబడి బంగారుపూతతో కూడిన ఏడుకలశాలు కనిపిస్తాయి. ఈ గాలిగోపురం ఆనాటి శిల్పసౌందర్యానికి ప్రతీకగా నిలిచింది.
ఎప్పటికీ ఎండిపోని కోనేరు..!
రంగనాయకస్వామి ఆలయానికి సమీపంలో నిర్మించిన కోనేరు ఆనాటి అద్భుతమైన రాతికట్టడానికి నిలువుటద్దంగా నిలిచింది. ఈ కోనేరు పూర్తిగా రాతికట్టడాలతో నేటికి చెక్కుచెదరకుండా ఉండడమేగాదు... ఏనాడూ నీళ్లు ఎండిపోయిన పరిస్థితి రాలేదు. అన్నికాలాల్లోనూ నీటితో కళకళలాడుతూ ఉండడం విశేషం. ఆ కాలంలో రంగనాయకస్వామి ఆలయంలోని స్వామివారి పూజకోసం కావాల్సిన పూలు, ఇతర పనుల కోసం ఈ నీటిని ఉపయోగించేవారు. స్వామివారి ఉత్సవాల కోసం ఉన్న ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, వాటి నిర్వహణ కోసం సాగుచేసిన చెరుకుతోట, ఇతర వ్యవసాయ పనుల కోసం ఈ కోనేటి నీటిని మోట పద్ధతిలో ఉపయోగించేవారు. దీంతోపాటు ఆలయానికి వచ్చే భక్తులు ఈ కోనేటి నీటిలో పుణ్యస్నానాలు చేసి గుడిలోనికి వెళ్తారు.
రాజుల విశ్రాంతి గృహం... కృష్ణావిలాస్...
రంగనాయక స్వామి ఆలయం పక్కనే ఉన్న రంగసముద్రం చెరువులో రాజుల విశ్రాంతి గృహం కృష్ణావిలాస్ కనిపిస్తుంది. అందమైన ఆకృతిలో నిర్మించిన రెండంతస్తుల అద్దాల భవనాన్ని కృష్ణావిలాస్‌గా పిలిచేవారు. రాజులు యుద్ధాలు చేసి వచ్చిన తర్వాత ఈ విశ్రాంతిగృహంలో సేదదీరే వారని చరిత్ర చెబుతోంది. పక్కనే ఉన్న రంగసముద్రం చెరువు నీటి అలలతో, చల్లటిగాలులతో ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తుంటుంది. కాని కాలక్రమేణా కృష్ణావిలాస్ భవనం దెబ్బతిని ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.
ఇలా వెళ్లాలి..
44వ నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎంతో సులభంగా చేరుకోవచ్చు. హైద్రాబాద్ నుంచి వచ్చే వారు 150 కిలోమీటర్లు, కర్నూల్ నుంచి వచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించి పెబ్బేరు పట్టణానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న శ్రీరంగాపూర్, రంగనాయక స్వామి ఆలయానికి ఆటోల ద్వారా చేరుకోవచ్చు.
– ఆడెం ఆంజనేయులు, సాక్షి, వనపర్తి జిల్లా
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565