మార్గదర్శి ఎలా ఉండాలి?
మనకు దారి చూపించే వారు దుష్టబుద్ధి కలవారు, శీలం లేనివారు అయితే... వారిని వెంటనే వదిలి వేయాలి. మార్గాన్ని దాటడానికి, చేరవలసిన చోటుకు చేరడానికి ఇబ్బందులు పడతాం తప్ప, మలిన మనస్కులం కాలేము. ఇదే విషయం స్నేహం విషయంలోనూ వర్తిస్తుంది. దుశ్శీలుర స్నేహం, మార్గదర్శకం మనల్ని వారి దారిలోనే నడిపిస్తుంది. ఇలాంటి దుశ్శీలుర మార్గదర్శకత్వం వదులుకున్న ఒక భిక్షువు కథ ఇది.
బుద్ధుడు తన జీవిత కాలంలో ఎక్కువ కాలం నివసించిన నగరం శ్రావస్తి. అది కోసల రాజధాని. ఆ నగరంలో ఎందరెందరో బుద్ధ ప్రబోధాలు విని బౌద్ధ సంఘంలో చేరి భిక్షువులయ్యారు. అలాంటి వారిలో మహాపాలుడు, చూళపాలుడు అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. ఇద్దరూ మంచి సాధనతో తమ మనసును అదుపు చేసుకొని మంచి భిక్షువులుగా పేరు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకు మహాపాలునికి చూపు మందగించింది. ఆ సమయంలో తమ్ముడైన చూళపాలుడు.. మిగిలిన కొందరు భిక్షువులు శ్రావస్తి వదిలి ధర్మప్రచారం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మహాపాలుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. కొన్నాళ్లకు అతని చూపు పూర్తిగా పోయింది. గుడ్డి వాడైనప్పటికీ అతడికి పరిసరాలు అలవాటై ఉండటం వల్ల అక్కడే ఇబ్బంది లేకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. భిక్షకు పోలేడు కాబట్టి నగర ప్రజలే ఆరామానికి తెచ్చి భిక్ష వేసేవారు. అన్నకు చూపు పూర్తిగా పోయిందన్న విషయం చూళపాలునికి తెలిసింది. ఒక భిక్షువుని పంపి మహాపాలుణ్ణి జాగ్రత్తగా తమ దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. ఆ భిక్షువు శ్రావస్తి వెళ్లి.. విషయం చెప్పి, మహాపాలుణ్ణి వెంట బెట్టుకుని బయల్దేరాడు. వారి ప్రయాణం ఒక అడవి గుండా సాగుతోంది. అడవి మధ్యకు వచ్చేసరికి వారికి ఒక యువతి మధురమైన స్వరం వినిపించింది. మహాపాలుణ్ణి అక్కడే వదిలి ఆ స్వరం కేసి పోయాడు భిక్షువు. కాస్త దూరంలో అందమైన యువతి కనిపించింది. చాలాసేపు ఆమెతో గడిపి, తిరిగి వచ్చాడు భిక్షువు.
‘మహాపాలా! పదండి పోదాం’ అన్నాడు భిక్షువు.
‘ఓయూ! నీవు శీల భ్రష్టుడివి. భిక్ష జీవనానికి తగని వాడవు. నాకు దారి చూపించడానికి అంతకన్నా తగవు. ఇక నీ దారిన నీవు పోవచ్చు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేనే వెళ్తాను. వెళ్లలేకపోతే వెనక్కి తిరిగి పోతాను. లేదంటే అడవిలోనే ఉండిపోతాను. నీలాంటి వాడి సాంగత్యం, మార్గదర్శకత్వం నాకు అవసరం లేదు’ అని అతణ్ణి వెళ్లగొట్టాడు. నానా ప్రయాసలకోర్చి తమ్ముని దగ్గరికి చేరాడు మహాపాలుడు. అనంతర కాలంలో ‘చక్షుపాల భిక్షువుగా’ కీర్తిగాంచాడు. ‘మనో నేత్రంతో చూడగల మహా భిక్షువు’గా బుద్ధుడు అతణ్ణి కీర్తించేవాడు.
- బొర్రా గోవర్ధన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565