MohanPublications Print Books Online store clik Here Devullu.com

బోయకొండ గంగమ్మ టెంపుల్_Boyakonda_Gangamma_Temple





పిలిచిన పలికే తల్లి...
బోయకొండ గంగమ్మ!

చిత్తూరు జిల్లా అనగానే తిరుమల వేంకటేశ్వర స్వామి, కాణిపాకం వినాయకుడు, శ్రీ కాళహస్తీశ్వర స్వామి... గుర్తొస్తారు. కానీ ఈ దేవుళ్ల తర్వాత స్థానికంగా అత్యధిక ఆదాయం కలిగిన శక్తి ఆలయం బోయకొండ గంగమ్మ తల్లిదే. గ్రామదేవతగా వెలసి కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోన్న ఈ అమ్మవారిని దర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచీ భక్తులు వస్తుంటారు.అమ్మల గన్న అమ్మ శక్తి స్వరూపిణి... పిలిచినంతనే పలుకుతుందనీ తన భక్తుల్ని కష్టాలనుంచి గట్టెక్కిస్తుందనేది పురాణాల్లో ఉన్న మాటే. ఆ వాక్కుని నిజం చేస్తూ గిరిపుత్రుల ఆర్తనాదాలను విని బోయకొండ గంగమ్మ తల్లిగా దిగివచ్చింది ఆ తల్లి. ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లె మండలం, దిగువపల్లె గ్రామానికి దగ్గర్లో తూర్పు కొండల్లో ఉంది ఈ ఆలయం. కలకత్తా కాళీ మాత, విజయవాడ కనకదుర్గమ్మలకు ప్రతిరూపంగా కొలిచే ఇక్కడి అమ్మవారు క్రీ.శ 18వ శతాబ్దం నుంచే పూజలందుకుంటున్నట్లూ ఆధారాలున్నాయి. ఆ సమయంలో గోల్కొండ నవాబుల కన్ను స్థానిక పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై పడింది. నవాబులు అక్కడికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై సైన్యంతో దండెత్తి, దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆ మార్గంలో చౌడేపల్లె అడవుల్లో గిరిజన జాతులవారైన బోయలూ ఏకిల దొరలు నివసించే గూడేల్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. కనిపించిన ఆడ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. పౌరుషంతో అక్కడి మగవాళ్లు ఎదురు తిరగడంతో దాడిలో గ్రామస్థులతో పాటు నవాబు సైన్యంలోనూ చాలామంది ప్రాణాలు విడిచారు. సేన తగ్గేసరికి వెనుదిరిగిన నవాబులు తర్వాత మరింతమంది సైనికులతో ఆ ప్రాంతాన్ని ముట్టడించడానికి బయలుదేరారు. మాన ప్రాణాలను కాపాడుకోవడానికి బోయలకూ ఏకిల దొరలకూ పారిపోవడం తప్ప మరో దిక్కులేకుండా పోయింది. దగ్గర్లోని కొండ గుట్టల్లో దాక్కుని తమను రక్షించమని అమ్మోరుతల్లిని వేడుకున్నారు. వారి మొర ఆలకించిన జగదంబ అవ్వ రూపంలో అక్కడికి వచ్చి గిరిపుత్రులకు ధైర్యం చెప్పిందట. వారి మీద దాడి చెయ్యడానికి వచ్చిన సైన్యాన్ని చూసి ఆ తల్లి ఉగ్రరూపం దాల్చి తన ఖడ్గంతో సేనలను హతమార్చడం ప్రారంభించిందనేది స్థలపురాణం. అమ్మవారి ఖడ్గదాటికి అక్కడున్న పెద్ద రాయి సైతం నిట్ట నిలువుగా చీలిపోయిందట. ఇప్పటికీ ఇక్కడి కొండపై రెండుగా చీలిన రాతి గుండు కనిపిస్తుంది. తమను రక్షించిన అమ్మవారిని తమతోనే ఉండమని ప్రార్థించారు గిరిజనులు. అలా బోయల కోరిక మేరకు వెలసిన ఆ జగజ్జనని ‘బోయకొండ గంగమ్మ’గా పేరుగాంచింది.ప్రకృతి ఒడిలో... 

ఎన్నో చిన్న చిన్న కొండలూ లోయలూ చిట్టడవులూ నీటి కొలనులతో ఉండే బోయకొండ ఆలయ ప్రాంతం ప్రకృతి రమణీయతకు నెలవు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం చిత్తూరు జిల్లాలో అధికాదాయం (ఏడాదికి రూ.ఆరు కోట్లకు పైనే) కలిగిన శక్తి ఆలయంగా పేరుగాంచింది. ఆది, మంగళ, గురువారాల్లో అయితే లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ గుడిని చేరుకోవాలంటే మూడు కొండలు ఎక్కాలి. 250 మీటర్ల ఎత్తులో ఉండే మొదటి కొండను ఎక్కి పైకెళ్తే రెండో కొండలో రణ భేరమ్మ (రౌద్రాకారంలో ఉన్న గంగమ్మ) ఆలయం ఉంటుంది. భక్తులు తమ తొలి పూజను ఇక్కడే చేస్తారు. మూడో కొండపై ప్రధాన ఆలయం ఉంటుంది. ఇక్కడి నాలుగంతస్తుల గోపురం అష్ట దిక్పాలకులతో అనేక చిత్ర భంగిమలతో అలరారుతోంది. స్వయంగా గంగమ్మ తల్లి సృష్టించిందిగా చెప్పే ఇక్కడి పుష్కరిణిలోని తీర్థాన్ని సేవిస్తే రోగాలు మటుమాయం అవుతాయనీ పంటలపై చిలకరిస్తే చీడలు తొలగుతాయనీ నమ్ముతారు. అందుకే, దేవస్థానం ఈ నీటిని లీటరు రూ.10 చొప్పున అమ్ముతోంది. ఆలయానికి దగ్గర్లో పాతకాలం నాటి రాతి కోట, బురుజుల ఆనవాళ్లూ కనిపిస్తాయి. బోయకొండ గంగమ్మ తల్లి అంటే స్థానికులకు ఎంత నమ్మకం అంటే చుట్టుపక్కల ఉన్న దాదాపు 250 గ్రామాల్లో ఈ తల్లికి ఆలయాలను నిర్మించుకున్నారు.నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకం 

ఆదిపరాశక్తిగా కొలిచే బోయకొండ అమ్మవారికి ఏటా దసరా సమయంలో వార్షిక మహోత్సవాలను నిర్వహిస్తారు. వీటిని నవరాత్రి ఉత్సవాలుగానూ పిలుస్తారు. ఈ సమయంలో గంగమ్మతల్లిని బాలా త్రిపుర సుందరీదేవి, ధనలక్ష్మి, రాజరాజేశ్వరీ దేవి, మహాలక్ష్మి, కాళీ మాత, పార్వతీ దేవి, సరస్వతి, శాకాంబరి, మహిషాసుర మర్దిని, చండీమాత, విజయలక్ష్మి... ఇలా రోజుకో అమ్మవారి రూపంలో పదకొండు రకాలుగా అలంకరిస్తారు. సరస్వతీ దేవి అలంకారం రోజున ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే తమ పిల్లలు విద్యావంతులవుతారనేది భక్తుల నమ్మకం. దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తే కుటుంబ కలహాలూ ఇతర బాధలు దూరమవుతాయనేది మరో నమ్మకం. పుంగనూరు, మదనపల్లె పట్టణాల నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి అక్కణ్నుంచి బస్సు సౌకర్యం ఉంది.





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list