MohanPublications Print Books Online store clik Here Devullu.com

విభీషణుడు_Vibhishana

విభీషణుడు

అద్భుతమైన సృష్టిలో మనిషి జీవితం చాలా విచిత్రమైంది. మనిషి జీవితాన్ని సార్థకం చేసేవి అతను చేసే మంచిపనులే. మంచి ఆలోచనలే మంచి పనులకు ప్రేరణనిస్తాయి. మన జీవితాన్ని మంచి మార్గంలో
నడిపిస్తాయి. మనిషి పుట్టిన వంశం, కులం, జీవన విధానాలు ఎటువంటివైనా ఆశయాలూ, లక్ష్యాలూ, విలువలూ ఉన్నతంగా ఉంటే మనిషి మహనీయుడవుతాడనీ, తాను మానసికంగా ఎంతటి వ్యథను 
అనుభవించినా, తనవారినే నిరోధించాల్సి వచ్చినా ధర్మమార్గమే తన మార్గమని తలంచి చివరిదాకా దానికి కట్టుబడి జీవించిన మనిషే మనిషనీ నిరూపించిన మహానుభావుడు విభీషణుడు. రాక్షసకులంలో 
జన్మించినా రత్నంగా, ధార్మిక జగతిలో శిరోమణిగా, రామాయణ గాథలో కీలకమైన వ్యక్తిగా సమాజానికి పరిచయమైన విభీషణుని మనో విజ్ఞానం అత్యద్భుతం, భావితరాలకు ఆదర్శం.

కైకసీ విశ్రవుల మూడో కొడుకు, రావణుని సోదరుడూ, మంత్రి, శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య. రాక్షస లంకలో రామనామ జపాన్ని రహస్యంగా ధ్వనిస్తూనే ఆ నామ తరంగాలను రాక్షసత్వాన్ని పావనం చేసేందుకు తపించిన రాక్షసోత్తముడు విభీషణుడు. ఒక వ్యక్తి జీవితాన్నీ, అతనిలోని భావోద్వేగాలనూ సంపూర్ణంగా ఓ అంచనాకు తేవడం అసాధ్యం. మన జీవితాన్నే సరిగ్గా వ్యక్తపరచలేని మనం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వెనుకడుగు వేయక తప్పదు. విభీషణుని జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే రాక్షసత్వంలోంచి పరిమళించిన ధార్మికత, నైతికత లోకకళ్యాణం కోసం మరింత నిగ్గుదేలాయనడానికి విభీషణుని వ్యక్తిత్వమే ప్రతీక.

పుట్టుక రాక్షసజాతి నిర్దేశించింది. కానీ విభీషణుని వ్యక్తిత్వం మానవీయ కోణంలో ఎదిగింది. తనజాతి లక్షణాలు స్వతాహాగా మనిషి కోణంలో ఎదిగాయి. తన జాతి లక్షణాలు స్వతహాగా మనిషిలో ప్రభావితమవుతున్నా వాటి జోలికి పోకుండా ఎటువంటి ప్రలోభాలు ప్రేరేపించినా తలొగ్గక, ఎంతటి భోగాలు ఆకర్షించినా ఏమాత్రం సడలక తనదైన వ్యక్తిత్వంతో ధర్మసాధన చేసి విభీషణుడు మహోన్నతుడయ్యాడు. తన కుటుంబం, తన లంకానగరం, తన అన్న రావణుడూ ధర్మం నీడలో బతకాలని కాంక్షించి దానిని కొనసాగించడం కోసం అహర్నిశలూ తపించాడు.

మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి. బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి. 
దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు. 
హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు. రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.
రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.

విభీషణుడు రావణునితో.. స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు. కోపాన్నీ అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.
రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు. ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list