MohanPublications Print Books Online store clik Here Devullu.com

ebook

ఆ పుస్తకం.. ఈ-బుక్‌...

             పుస్తకాలు అనుభూతులను సృష్టించి మరీ వాటిని మనతో పంచుకునే నేస్తాలు. పుస్తకాలు దారులని పుట్టించి మరీ వాటిపై మనలను నడిపే రాస్తాలు. పుస్తకాలు అజ్ఞానాన్ని చెండాడే అస్త్రాలు.. జ్ఞానాన్ని వ్యాప్తి చేసే శాస్త్రాలు. పుస్తకాలు మన చదువుకి ఆనవాళ్ళు.. మన మేధకు నకళ్ళు. పుస్తకాలు మనుషులను మనుషులుగా ఉంచగలిగే సూత్రాలు. మనిషి ఒంటరిగా ఉండలేని జీవి. అతనికి ఒక తోడు అవసరం. ఆ తోడు మరో వ్యక్తీ కావచ్చు, ఒక జంతువూ కావచ్చు, ఒక మొక్కా, ఒక ప్రకృతే కావచ్చు. లేదా ఒక పుస్తకమే కావచ్చు. అదీ పుస్తకానికున్న విలువ. మానవుడి చేతే సృష్టించబడి, మానవుడికే తోడు కాగలిగిన శక్తి దాని ప్రత్యేకత. ఆ పుస్తకం సుమేరియన్ల మట్టి ట్యాబ్లెట్ల నుంచి నేటి ట్యాబ్‌ల వరకు ప్రస్థానాన్ని సాగిస్తోంది. ఆ మార్పుల గురించే ఈ  కథ.

ఒక పుస్తకం బయటకి రావాలంటే ఒక మానవ మస్తిష్కం నుండి ఒక అంశం, ఒక ఆలోచన, ఒక అనుభూతి, ఒక అనుభవం, ఒక విశ్లేషణ, ఒక సృజన వెలికి రావాలి. అంతే కాకుండా అందుకు తగ్గ అలంకరణ, చిత్ర రచన, అందమైన ముద్రణ, ఆకర్షణీయ మైన ప్రచురణ ....ఇలా ఎన్నో ఇతర అంశాలు కూడా ముడిపడి వున్నాయి. ఇన్ని అంశాలు వున్నా, వచ్చిన పుస్తకాన్ని 'చదవడం' అనేదే అసలు వేడుక. ఇన్ని వేడుకలకు గుర్తింపుగా , పుస్తక ప్రచురణను, పుస్తక పఠనాన్ని, కాపీరైట్‌ని ప్రోత్సహించే దిశలో యునెస్కో ప్రపంచ పుస్తక దినోత్సవం లేదా అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. యూకే, ఐర్లాండ్‌లో మార్చ్‌ మొదటి గురువారం నాడు ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. కానీ మిగతా చోట్ల మాత్రం ఏప్రిల్‌ ఇరవై మూడవ తేదీన జరుపుతారు. ఇదే తేదీని ఎంచుకోవడంలో ఒక గమ్మత్తు వుంది. తమ విశిష్ట రచనలతో పుస్తక ప్రపంచాన్ని పరిపుష్టం చేసిన షేక్స్పియర్‌, విలియం వర్డ్స్‌వర్త్‌ వంటి మహామహులైన రచయితలు ఇదే తేదీన పరమపదించారు. మొదటిసారి ఈ దినోత్సవం 1995లో జరిగింది. యునెస్కో ప్రకారం పుస్తకం అంటే దిన, వార, మాస వంటి పత్రికలు కాకుండా, కనీసం 49 పేజీల (అట్టలు మినహాయించి) ముద్రించినది.
పుస్తకాలు హస్తభూషణం అన్నా, అవి అందం కోసం, ఆనందం కోసం రూపొందవు, కానీ అవి ఇంటికి అందాన్నీ, మనసుకు ఆనందాన్నీ ఇస్తాయి. పుస్తకాలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే ఇవ్వవు. కొన్ని పుస్తకాలు ఆసక్తిని కలిగిస్తాయి, ఇంకొన్ని ప్రోత్సాహాన్నిచ్చి, ప్రేరేపిస్తాయి కూడా. అసలు కొన్ని పుస్తకాలు మన దక్పథాన్నీ, అవగాహననూ, ఆలోచన సరళినీ, విశ్లేషణ విధానాన్నీ, ఏకంగా వ్యక్తిత్వాన్నే మార్చగల శక్తి కలిగి వుంటాయి. కాకపొతే అటువంటి మంచి పుస్తకాలను గుర్తించగల శక్తి మనకి వుండాలి. స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ వారిలో మనకు నచ్చిన వారితోనే ఏ విధంగా సుదీర్ఘకాలం కలిసి ఉంటామో, ఆ విధంగా మంచి పుస్తకాన్ని గుర్తించాలి. అన్ని పుస్తకాలూ ఒకలా వుండవు. ఫ్రాన్సిస్‌ బాకన్‌ చెప్పినట్టు, 'కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, ఇంకొన్నిటిని మింగాలి, మరికొన్నిటిని బాగా నమిలి, అరగదీసుకోవాలి'. ఒక మంచి పుస్తకం ఆలోచింపచేస్తుంది. తనతో తీసుకువెళ్తుంది. తనలో దాచుకుంటుంది. సంచలనాన్ని సష్టిస్తుంది. విప్లవాన్ని రగిలిస్తుంది. ఫలానా విషయం కోసమైనా, ఫక్తు కాలక్షేపం కోసమైనా, విజ్ఞానం కోసమైనా, వినోదం కొరకైనా, మేధకు పదును పెట్టాలన్నా, వ్యక్తిత్వం రూపొందించుకోవాలన్నా పుస్తకాలు మంచి నేస్తాలు. మనిషిని ప్రభావితం చేయగల శక్తులు మూడున్నాయి: మంచి గురువు, మంచి స్నేహితుడు, మంచి పుస్తకం.

చదువుతున్నారా..!
ఆధునిక సమాజంలో ప్రాధాన్యతలు మారాయి. వేగం, చదువులు (తరగతులలో), ఉద్యోగాలతో తీరిక లేకపోవడంతో పాటు ప్రపంచం మొత్తం చేతి వేళ్ళ కిందికి తెచ్చిన టెక్నాలజీ కారణంగా పుస్తకాలు చదవడం అనేది గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు వీధికొక్క లెండింగ్‌ లైబ్రరీ వుండేది. అక్కడ వార, మాస పత్రికల కంటే నవలలకే ఎక్కువ డిమాండ్‌ వుండేది. ముఖ్యంగా యువతలో. ఇప్పుడు అటువంటి లైబ్రరీలు లేవు. కారణం, చదివే వాళ్ళు లేకపోవడమే. సాధారణ లైబ్రరీలకు కూడా తీరుబడిగా వున్నా పెద్దలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలు వెళ్తున్నారు. పుస్తకాలు చదివేవాళ్ల తరం అంతరించి పోతోంది అనుకునే వాళ్ళు వున్నా, పుస్తక ప్రదర్శనలు, వాటికి హాజరయ్యే ప్రజలు మాత్రం తగ్గడం లేదు. కొత్త పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి కానీ కొత్తగా పుస్తకాలు చదివే వాళ్ళు తయారౌతున్నారా అనేదే ప్రశ్న. పుస్తక ప్రదర్శనల్లో కూడా వాస్తు, జాతకం, వ్యక్తిత్వ వికాసం, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు ఎక్కువయ్యాయి. మంచి నవలలు, కథా సంకలనాలు, వ్యాఖ్యానాలు, వ్యాసాలూ, కవితలు ఇతర రచనా ప్రక్రియలూ అసలు పుట్టడమే తక్కువయ్యాయి. పుస్తకాలు బాగా చదివే వీలు యువతకే ఎక్కువ. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో వారి ఆసక్తి ఇంకెక్కడో వుంది. సామాజిక మాధ్యమాల్లో శుష్క కాలక్షేపాలు ఎక్కువయ్యాయి. వాటిమీదే ఎక్కువ కాలం ఖర్చు చేస్తున్నారు. అవన్నీ అప్పటికప్పుడు ఊపునిచ్చే పంచదార నీళ్ళ వంటివే గానీ, వొంటికి సత్తువ నిచ్చే పోషక పదార్థాల వంటివి కావు కదా.
తమతో పాటు...
పుస్తకాల ప్రస్థానం బహు సుదీర్ఘమైంది. ఇప్పటి మన అవగాహన ప్రకారం క్రీస్తు పూర్వం 3500 ఏళ్ళ క్రితం దక్షిణ మెసొపొటేమియాలో నివసించిన సుమేరియన్‌లు అనబడే ప్రాచీన జాతి ప్రజలు తొలిసారి తమతో పాటు తీసుకుపోగలిగే విధంగా బొమ్మలను (అప్పటి భాష అదే!) బంక మన్ను పలకలపై పుల్లల వంటి కలామస్‌ అనే పరికరాలతో గట్టిగా గీసి, ఆ పలకలను నిప్పులో కాల్చి దీర్ఘకాలం ఉండేలా చేశారు. బహుశ అదే తొట్టతొలి ముద్రణ ప్రక్రియగా ఎంచవచ్చు.
క్రీస్తుపూర్వం 2400లో పాపిరస్‌పై రాసిన శకలాలు ఇటీవలే బయటపడ్డాయి. అయితే అటువంటి పాపిరస్‌ చుట్టలు క్రీస్తుపూర్వం 3100లోనే వాడకంలో వున్నట్టు చరిత్రకారులు చెబుతారు. పాపిరస్‌ అనే మొక్క నుండి తయారైన కాగితం వంటి పొరపై సన్నని పుల్లలతో రాసేవారు. ఈ పాపిరస్‌ను గ్రీకులు రోమన్ల కంటే కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఈజిప్షియన్లు వాడకం ప్రారంభించారు. అయితే అప్పట్లో పాపిరస్‌ కాగితాలను చిన్న చిన్న పేజీల లాగా కాకుండా వరుసగా, ఒకదాని తరువాత ఒకటిగా అతికించి, పొడవైన స్క్రోల్‌ తయారు చేసేవారు. ఈజిప్షియన్‌ రాజు రామ్సెస్‌ చరిత్ర ఏకంగా 40 మీటర్ల పొడవుంది! ఈ పద్ధతిలో రాయడం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకూ విరివిగా వాడుకలో వుండేది.
మేకల, గొర్రెల, దూడల చర్మం నుండి చేయబడిన పార్చ్మెంట్‌ అనే పల్చని పొర పాపిరస్‌కు ప్రత్యామ్నాయంగా వాడకంలోకి క్రీస్తు పూర్వం 500-200 మధ్యలో వచ్చింది. క్రీ.పూ. 116-27ల మధ్య కాలంలో నివసించిన వార్రో అనే రోమన్‌ రచయిత ప్రకారం పాపిరస్‌ కొరత కారణంగా పార్చ్మెంట్‌ను కనుగొన్నారట.
క్రీ.పూ. 200 సంవత్సరాల కాలంలో రోమన్లు, గ్రీకులు మైనంతో పలకలను తయారు చేసారు. వాస్తవానికి చెక్క పలకలను మైనపు పూత పూసి సన్నని మొనతో రాసేవారు. దీనితో లాభం ఏమిటంటే, రాసిన దాన్ని చెరిపి, మళ్ళీ మళ్ళీ రాసుకునే వీలు ఉండటం. ఈ పలకలను ఒక వైపు కలిపి పేజీల లాగా అతికించేవారు కూడా. బహుశ ఇదే తొలి బౌండ్‌ పుస్తకం. ఈ తరహా పుస్తకాన్ని కోడెక్స్‌ అనేవాళ్ళు. ఇది యూరప్‌లో బాగా ప్రాచుర్యంలో వుండేది.
క్రీ.శ. 105లో కారు లున్‌ అనే చైనీయుడు కాగితం తయారీని కనుగొన్నాడు. అతను చెట్ల బెరడు, పాత బట్ట పీలికలు, చేపల వలలు వంటివన్నీ కలిపి గుజ్జు తయారు చేసి, దానితో కాగితం చేసాడు. రాయడానికి వాడిన కాగితం క్రీ.పూ. 8లోనే వున్నట్టు ఆధారాలు లభించాయి. కానీ కాగితాన్ని రాయడానికి కాకుండా అట్టల లాగా వాడటం క్రీ.పూ. 200 నుండే ఉండేదట. క్రీ.శ. 1501లో తొలి పేపర్‌ బ్యాక్‌ పుస్తకం తయారయ్యింది. చిన్న సైజులో ఉన్న ఈ పుస్తకం ఇప్పటి పేపర్‌ బ్యాక్‌లకు ఆద్యం.
భాషతో పాటే పుస్తకం
మానవుడి పరిణామ క్రమంలో భాష చాలా కీలకమైన మలుపు. ఆ మలుపు ఎక్కడ, ఎప్పుడు తిరిగిందో తెలియదు గానీ, మొత్తానికి తమను తాము ఎదుటివారికి వ్యక్తపరచుకోవడానికి వీలుగా భాష పుట్టింది. క్రమంగా మానవుడి ఆలోచనలు, ఊహలు, ఉద్వేగాలు, కలలు, కథలు చెప్పుకోవడమే కాక రాసుకోవడానికి రాత పుట్టింది. అది ఆదిమానవుడి గుహలలో ముతక గీతే కావచ్చు, ఈజిప్షియన్ల చిత్ర రాతే కావచ్చు, ఆంధ్రుల తాళ పత్రాల పై గంటపు చేతే కావచ్చు, మాట కన్నా రాత పది కాలాల పాటు నిలిచి ఉంటుందన్న వాస్తవం రాత వల్లే తెలిసింది.
మట్టి పలకల నుండి బౌండు పుస్తకాలను దాటి ఈ-బుక్స్‌ వరకూ పుస్తక ప్రస్థానం సుదూరం సాగి వచ్చింది. రాత వల్ల లిపి పుట్టింది. అందుకు అనువైన కలం పుట్టింది, కాగితం పుట్టింది. పూర్వం గ్రీకులు మైనం పూసిన ప్లేట్లపై పదునైన పరికరంతో రాయడం ఆరంభించారు. రాసే పరికరాల కొరకు వాళ్ళు లోహం, దంతం వాడేవాళ్ళు. అవే వాళ్ళ కలాలు. చైనీయులు ఇంకొంచెం ముందుకు వెళ్లి, సిరాను కనుగొన్నారు. చమురు ప్రమిదల పొగలోని మసి, గాడిద చర్మం నుండి జిలాటిన్‌ అనే పదార్థాన్నీ, కస్తూరి జింక నుండి సుగంధాన్నీ కలిపి సిరాను కనిపెట్టారు. దానినే ఇప్పుడు 'ఇండియన్‌ ఇంకు' అంటున్నారు. క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం కనిపెట్టిన ఈ సిరా మరో వెయ్యి సంవత్సరాలకు మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇతర ప్రాంతం వాళ్ళు కూడా రకరకాల మొక్కల రసాలతో, ఖనిజ ద్రావకాలతో సిరాను తయారు చేసి వాడటం మొదలెట్టారు. క్రీస్తు శకం నాలుగు వందల ఏళ్ళ నాటికి మేలు రకం సిరా రూపొందింది.

కాగితమూ.. కలమూ...
క్రీస్తు పూర్వం రెండు వేల ఏళ్ళ క్రితం ఈజిప్టులో పాపిరస్‌ అనేదే మనకు తెలిసిన అతి ప్రాచీన 'కాగితం'. కాగితం, సిరా దొరికాక, రోమన్లు వెదురు ముక్కలతో కలం తయారుచేసారు. కలప గుజ్జుతో కాగితం చైనాలో కనుగొని, దానిని సుమారు ఆరు వందల ఏళ్ళ పాటు రహస్యంగా ఉంచారు. యూరప్‌లో పద్నాలుగవ శతాబ్దంలో కాగితం మిల్లులు మొదలైన తరువాత కాగితం వాడకం ఊపందుకుంది.
మొట్టమొదటి 'నిజమైన' అక్షరాలు క్రీస్తు పూర్వం 1800 - 1300ల మధ్య సెమెటిక్‌ ప్రజలు అభివద్ధి చేశారని అంటారు. నోటితో వచ్చే శబ్దాలను యధావిధిగా సూచించే అక్షరాలు రాయడం అదే ప్రథమం. ఆ తరువాత గ్రీకు అక్షరా లూ, వాటి ఆధారంగా రోమన్‌ అక్షరాలూ వచ్చాయి. ఇప్పుడు మనకు తెలిసిన ఆంగ్ల అక్షరాలు రోమన్‌ అక్షరాల నుండే వచ్చాయి. మన దేశంలో అక్షరాలు ఆరామిక్‌ లిపి నుండి పుట్టాయని అంటారు.

అచ్చొచ్చింది
రాతకి అన్నీ సమకూరినా, రాసిందే పదే పదే రాయడం అంటే ఇబ్బందే కదా. ఆ ఇబ్బందికి పరిష్కారంగా పుట్టిందే ముద్రణ. అది మొదలు సమాచార వ్యాప్తిలో విప్లవమే పుట్టిందని చెప్పుకోవచ్చు. మొదటి ముద్రణ యంత్రం కూడా చైనాలోనే తయారైంది. చెక్క ముక్కపై ఉబ్బెత్తుగా అక్షరాలను చెక్కి, వాటిపై సిరా పూసి, దానిని కాగితంపై నొక్కి పట్టి అచ్చు వొత్తే పద్ధతి అక్కడే మొదలైంది. క్రీస్తు శకం 1045లో బైషేంగ్‌ అనే అతను కదిలే ముద్రణ యంత్రాన్ని రూపొందించాడు. ప్రతి అక్షరానికీ ఒక అచ్చు కావలసి వచ్చింది. కానీ చైనా భాషలో అసంఖ్యాకంగా ఉన్న అక్షరాల కారణంగా ఆ యంత్రం పెద్దగా అభివృద్ధి జరగలేదు.

చుట్లు తిరిగి... 
క్రీస్తు శకం మొదటి సంవత్సరంలో రోమన్లలో ధనికులు చరిత్ర, వేదాంతం, కళలకు సంబంధించిన 'పుస్తకాలను' చదివేవాళ్ళు. కానీ ఆ పుస్తకాలు ఇప్పుడు మనకు తెలిసిన రూపంలో కాకుండా పొడవాటి చుట్టలుగా చుట్టి ఉండేవి. కొన్నైతే ఏకంగా 52 అడుగుల వరకూ ఉండేవి. అటువంటి 'స్క్రోల్‌' ని చదవాలంటే కుడి చేతిలో పట్టుకుని, ఎడమ చేతితో లాగుతూ చదవ వలసి వచ్చేది. అయితే పాపిరస్‌ దీర్ఘకాలం మన్నే పదార్థం కాదు. గ్రీకులు ఇంకో రకం పదార్థాన్ని వాడటం ప్రారంభించారు. పార్చ్‌మెంట్‌ అనేది శుభ్రం చేసి, సాగదీసిన జంతు చర్మం నుండి తయారు చేసినది. నునుపుగా, ద్రుదంగా వుండటం వలన అది రాయడానికి వీలుగా వుండేది. ఆ తరువాత పేజీలు వుండే పుస్తకాలు వచ్చాయి.
ద్రాక్ష ముద్ర..!
1440 ప్రాంతంలో జర్మనీలో గుటెన్బర్గ్‌ ద్రాక్ష పండ్లను వొత్తి, రసం తీసే ఒక యంత్రాన్ని అచ్చు యంత్రంగా మార్చాడు. లోహంతో చేసిన అక్షరాల అచ్చులను ఆ యంత్రంలో పెట్టి కాగితంపై అచ్చు వేసేవాడు. ఆ యంత్రం రోజుకి మూడు వందల కాపీలను ముద్రించ గలిగేది. మరో రెండు శతాబ్దాలకు యూరప్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. గుటెన్బర్గ్‌ ముద్రణ యంత్రం పందొమ్మిదవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఫ్రెడరిక్‌ కొనిగ్‌ అనే మరో జర్మన్‌ వ్యక్తీ ఆవిరితో నడిచే ముద్రణ యంత్రాన్ని 1811లో రూపొందించాడు. ఈ యంత్రం గంటకు 1100 కాగితాలను ముద్రించగలిగేది. రిచర్డ్‌ హౌ అనే అమెరికన్‌ 1846లో గంటకు 20 వేల కాగితాలను ముద్రించే యంత్రాన్ని తయారు చేసాడు. ఇప్పుడు ప్రింటింగ్‌ టెక్నాలజీ అత్యంత అభివద్ధి చెంది అనూహ్య ఫలితాలను అద్భుతమైన వేగంతో ఇవ్వగలుగుతోంది.
బతుకు పాఠం వద్దా...
ఇప్పటి పుస్తక ధరలు పుస్తకప్రియులను కూడా దూరంగా వుంచుతున్నాయి. అయినా కొంతమంది అలవాటు మానలేక పుస్తకాలను కొంటున్నారు. పాఠ్యేతర పుస్తకాల జోలికి విద్యార్థులు పోవడం లేదు. ఆ మధ్య హ్యారీ పోటర్‌ పుస్తకాలు తప్ప పిల్లలను ఆకర్షించిన పుస్తకాలు చాలా తక్కువే. పిల్లలకి రంగుల కథల రూపంలో విజ్ఞానాన్నీ, చరిత్రనీ, నీతినీ ఇచ్చిన అమర చిత్ర కథ కామిక్‌లు, చందమామ, బాలమిత్రలు ఇప్పుడు లేవు. ఎనిడ్‌ బ్లయిటన్‌ వంటి చిన్న పిల్లల రచయితల పుస్తకాలూ, ఆర్థర్‌ హైలీ, ఇర్వింగ్‌ వాలెస్‌ వంటి వారి నవలలూ, తెలుగులో ఒకప్పుడు ఉన్నంత ధాటిగా రచనలు ఇప్పుడు లేవు. అవన్నీ ఇప్పుడు పాత పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. ప్రాంతీయ చరిత్రను తెలుసుకోవాలనుకునే వాళ్లెందరు? లియో టాల్స్టారు, చార్లెస్‌ డికెన్స్‌, మార్క్స్‌, ఓ హెన్రీ, టాగోర్‌, గోర్కీ, శ్రీశ్రీ, రాచకొండ, విశ్వనాధ, ముళ్ళపూడి, కొడవటిగంటి, దేవులపల్లి, తిలక్‌, నండూరి, జాషువా, సినారె...అద్భుతమైన తమ సజనా శక్తితో రచనలు చేసి ప్రపంచ ప్రజను తడిపిన వీళ్ళంతా పుస్తకాలు లేకపోతే ఎవరు? పుస్తకాలకు దూరంగా వుండే ఐటీ జాతీయులకు వీళ్ళంతా ఎవరో తెలిసే అవకాశం పుస్తకం చదివితేనేగా తెలిసేది.
భవిష్యత్తులో పుస్తకాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఉంటాయా ఉండవా అన్న మీమాంస ఉంది. టేపులు పోయి సీడీలు, అవి పోయి డీవీడీలు, అవీ పోయి మైక్రోకార్డ్‌లు వచ్చాయి. రేడియో, కాసేట్‌ ప్లేయర్‌, ఫిలిం కెమెరా వంటివి పోయి అన్నీ వున్న సెల్‌ఫోన్లు వచ్చాయి. ఈ-బుక్‌లు వచ్చి ప్రింట్‌ పుస్తకాలను మట్టు పెడతాయని అనుకున్నారు. కానీ పుస్తకాలు ఇంకా వున్నాయి. ఇంకా చాలా కాలం పాటు ఉండాలన్న ఆశా వుంది, ఉంటాయన్న నమ్మకమూ వుంది.
ఈ-విధంలో...
పుస్తకాలు కూడా రూపాంతరం చెందుతున్నాయి. పుస్తకం అంటే కాగితం పైన ముద్రించి, చక్కగా బైండ్‌ చేసినవి అని అనుకునే రోజులు పోతున్నాయి. ఇప్పుడు 'ఈ-బుక్స్‌' వచ్చాయి. వీటినే ఎలెక్ట్రానిక్‌ బుక్స్‌ అంటారు. సెల్‌ఫోన్లలో సైతం కొన్ని వందల పుస్తకాలని ఈ రూపంలో దాచుకుని చదువుకోవచ్చు. ఇది వినడానికి బాగానే వుంది కానీ, ఎలెక్ట్రానిక్‌ పరికరాలలో చదవడం అంత వెసులుబాటుగా వుండదు. పైగా, ఒక ముద్రించిన పుస్తకాన్ని చేతిలో పట్టుకుని, కుర్చీలో చేరబడి, ఒక్కో పేజీ వేలితో తిప్పుతూ చదువుకోవడంలో వుండే తృప్తి ఇన్స్టంట్‌ ఫూడ్‌ లాంటి ఈ-బుక్స్‌లో ఉండదు. సరే, పద్ధతి ఏదైనా పుస్తకం చదవబడటం ముఖ్యం అనుకుంటే కొంతవరకు ఈ-బుక్స్‌ మెరుగే (కానీ ఓ ఐదారు వందల పేజీల నవలను పూర్తిగా ఈ-బుక్స్‌లో చదవడం అనుమానమే!). నిజానికి ఇప్పుడు ఈ-బుక్స్‌ వ్యాపారం కూడా బాగా దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది. అంటే ముద్రణ పుస్తకానికి మంచి రోజులు వచ్చ్సినట్టే అనుకోవాలి. ఇంటి నిండా బోలెడు పుస్తకాలు అన్న వారింట్లో చూస్తే అన్నీ వాళ్ళ పిల్లలకు సంబంధించిన పోటీ పరీక్షల పుస్తకాలే వుంటాయి. మరి ఆటువంటి పుస్తకాలేవీ చదవడం కిందికి రావా అంటే రావనే చెప్పాలి. పుస్తకాన్ని చదవడం ఒక అనుభవం.. ఒక అనుభూతి. ఒక కొత్త లోకాన్నీ, ఒక కొత్త వాతావరణాన్ని ఆవిష్కరించే సాధన. ఒక కొత్త ఆలోచనకు అక్షర రూపం. వర్తమాన వ్యవస్థను అచ్చొత్తి, దానిని భావి తరాలకు చరిత్రలా చేరవేసే నిధి. మానవ సృజన కు, కల్పనా శక్తికి కాలాతీత రుజువు.
పుస్తక ప్రస్థానం
క్రీ.పూ. 3500 - మట్టి పలకలపై సంకేత రాతలు
క్రీ.పూ. 2400 - పాపిరస్‌ స్క్రోల్‌లు
క్రీ.పూ. 600 - రాయడం అభివ ద్ధి
క్రీ.పూ. 500 - 200 - పార్చ్మెంట్‌
క్రీ.పూ. 200 - మైనపు పలకలు అభివ ద్ధి
క్రీ.శ. 105 - కాగితం అభివ ద్ధి
క్రీ.శ. 400-600 - పుస్తకాలలో బొమ్మలు గీయడం
క్రీ.శ. 868 - మొట్టమొదటి పుస్తకం ముద్రించబడింది
క్రీ.శ. 1041-1230 - మొట్టమొదటి కదిలే ముద్రణ యంత్రం
క్రీ.శ. 1250 - మొదటి బ్లాక్‌ ముద్రణ
క్రీ.శ. 1455 - గుటెన్బర్గ్‌ బైబిల్‌
క్రీ.శ. 1995 - ఆన్‌ లైన్‌ లో పుస్తకాల అమ్మకం
క్రీ.శ. 2000-2006 - ఈ-బుక్స్‌ ఆరంభం
క్రీ.శ. 2007 - కిన్డిల్‌ (మొదటి ఈ-బుక్‌ రీడర్‌)
పుస్తకం పలకరించాలి
పుస్తకం చదవడం అంటే మనతో మనమే మనసారా మాట్లాడుకోవడం. మనసు ద్వారాలు తెరిచి అనుభూతులను ఆస్వాదించడం. ప్రతి పుస్తకం లో ప్రతి పేజీ కనీసం ఒక కొత్త విషయాన్ని తెలియచేస్తుంది. సరైన మనసును వర్శమేఘమై కమ్ముకుంటుంది. అనుభూతుల జడిలో తడుపుతుంది. మళ్ళీ ఎప్పుడో జ్ఞాపకమై గుర్తుకొచ్చి తట్టి లేపుతుంది...మరో సారి చదవమని పురిగొల్పుతుంది. 'ఎవరో ఏదో ఎందుకో రాసి పుస్తకం వేస్తె దాన్ని మనమెందుకు చదవాలి?' అనే వారికి మనం సమాధానం చెప్పనవసరం లేదు. 'పుస్తకాలా...చదివే ఓపిక, తీరిక ఎక్కడుందీ' అంటూ సాగదీసే వారికి మన సానుభూతి చూపనవసరం లేదు. తెలిసిన వాళ్ళు ఎదురు పడితే, 'హలో, బావున్నారా?' అనే బదులు 'కొత్తగా ఏం పుస్తకం చదువుతున్నారు?' అని కుశలం అడిగే రోజు రావాలి. వేడుకలకి వెళ్లి ఆగిపోయే వాచీలు, విరిగి పోయే కప్పులు, చిప్పలు, వాడి పోయే పూల గుత్తులూ, ఖర్చై పోయే నగదులూ ఇచ్చే బదులు మంచి పుస్తకాలని బహుమతులుగా ఇచ్చే రోజు రావాలిబీ అవి అందుకునే వారూ రావాలి. పుస్తకాలని చదువుతూ మనం బతకాలి, కాబట్టి వాటిని బతికించుకోవాలి. పుస్తకాలని చదవాలి. చదివించాలి.
ప్రపంచ పుస్తక రాజధాని
- ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవంగా, ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, ఆ రోజున పలు రచయితలు, ప్రచురణకర్తలనే కాకుండా ఉపాధ్యాయులను, పాఠకులను కూడా గౌరవించాలని యునెస్కో సూచించింది. అంతే కాకుండా ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని 'ప్రపంచ పుస్తక రాజధాని'గా ప్రకటిస్తోంది కూడా. రిపబ్లిక్‌ ఆఫ్‌ గినీలోని 'కొనాక్రీ' నగరాన్ని 2017 సంవత్సరానికి, 2018 సంవత్సరానికి గ్రీస్‌లోని ఏథెన్స్‌ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ఇప్పటికే ప్రకటించింది.
- ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకాన్ని 8వ శతాబ్దంలో చైనాలో ముద్రించారు. అప్పట్లో ముద్రణకు చెక్క పలకలను వాడారు. 14వ శతాబ్దంలో కొరియా కూడా పుస్తకాలను ముద్రించడం మొదలెట్టింది.
- 'టీనీ టెడ్‌ ఫ్రమ్‌ టర్నిప్‌ టౌన్‌' అనే పుస్తకం ప్రపంచంలో అతి చిన్న (సూక్ష్మ అనాలేమో) పుస్తకంగా గుర్తింపు పొందింది. 30 పేజీల ఈ పుస్తకం సైజు 70 మైక్రోమీటర్లు. దీన్ని చదవడానికి సూక్ష్మ దర్శిని.. అదీ మామూలిది కాదు, ఎలెక్ట్రాన్‌ మైక్రో స్కోప్‌ అవసరం.
- అమెరికాలోని 'లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌'లో 16 కోట్లకు పైగా పుస్తకాలు వున్నాయి. యూకేలోని బ్రిటిష్‌ లైబ్రరీలో 15 కోట్ల పుస్తకాలున్నాయి. మనదేశంలోని అతి పెద్ద గ్రంథాలయం అయిన కోల్‌కతాలోని జాతీయ గ్రంథాలయంలో 26 లక్షలకు పైగా పుస్తకాలు వున్నాయి. ఢిల్లీ పబ్లిక్‌ లైబ్రరీలో 18 లక్షల పుస్తకాలు వున్నాయి.
- లేయోనర్దో డా వించీ రాసిన, ఇప్పటికి మిగిలి వున్న ఒకే ఒక ప్రతి 'కోడెక్స్‌ లేసేస్టార్‌' అనే పుస్తకాన్ని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ 1994 లో 30.8 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసాడు.
- పదిహేడవ శతాబ్దంలో రాసిన ఒక నవల 13,095 పేజీలు సాగుతుంది. ఆ నవలలో 2,100,000 పదాలు వున్నాయి. మన దేశపు రచయిత కల్కి క ష్ణమూర్తి రాసిన 'పోన్నియిన్‌ సెల్వన్‌' అనే తమిళ చారిత్రాత్మక నవల 900,000 పదాలతో 2,400 పేజీలు సాగుతుంది.
- పదేళ్ళ క్రితం చేసిన ఒక అంచనా ప్రకారం, పుస్తకాలను ఎక్కువగా చదివే దేశాలలో మొదటి స్థానంలో మన దేశం వుంది. థాయిలాండ్‌, చైనా, ఫిలిప్పీన్స్‌, ఈజిప్ట్‌ తరువాత క్రమంలో వున్నాయి. అతి తక్కువ చదివే వాళ్ళు వున్న దేశాలు: యూకే, బ్రెజిల్‌, తైవాన్‌, జపాన్‌, ఇక చిట్టచివరి స్థానంలో వున్నది కొరియా.
- డా. కాకర్లమూడి విజరు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list