MohanPublications Print Books Online store clik Here Devullu.com

వహ్వా...! ఏమి రసం-Super Rasam


వహ్వా...! ఏమి రసం

జీవితంలో నవరసాలు సరే... మరి మనం తినే ‘రసం’లో ఎన్ని రకాలు ఉంటాయబ్బా! అబ్బో ఒకటేంటి బోలెడు‘రసాలు’. రసం - ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారవుతుంది. ప్రాంతాలు వేరయితేనేం... రసం తయారీకి వాడే చింతపండు పిక్క, టొమాటో ముక్క, ధనియాలు, మిరియాలు, జీలకర్ర... దాదాపు పదార్థాలన్నీ అటు ఇటుగా ఒకటే. కాస్త కారంగా, మరికాస్త ఘాటుగా ఉండే ఈ ద్రవపదార్ధం అన్నంలో కలుపుకుంటే రసం... అలానే తాగితే ఎపటైజర్‌గా మారిపోతుంది. ఏదైతేనేం నోటికి రుచిని, వంటికి ఆరోగ్యాన్నిచ్చే రసాన్ని మన తెలుగు రాష్ట్రాలతో కలిపి పొరుగున ఉన్న మిగతా దక్షిణాది రాష్ర్టాల్లో ఎలా తయారుచేస్తారో చదివేయండి. వానలతో వాతావరణం చల్లగా ఉన్న వేళ వేడి వేడి రసంతో నీరసం వదిలించుకోండి.
తక్కాళి రసం
కావలసినవి:
పండిన టొమాటోలు (మరీ పెద్దవి, మరీ చిన్నవి కాకుండా ఓ మాదిరిగా ఉండాలి) - మూడు, వెల్లుల్లి రెబ్బలు (నలిపి) - ఐదు, ఎండుమిర్చి - నాలుగు, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, రసం పొడి - రెండు టేబుల్‌ స్పూన్లు, నల్లమిరియాల పొడి - అర టీస్పూన్‌, ఇంగువ - పావు టస్పూన్‌, కరివేపాకులు - కొన్ని, కొత్తిమీర తరుగు - కొద్దిగా, చింతపండు గుజ్జు - ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - పావు టీస్పూన్‌, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - మూడు కప్పులు.

తయారీ:
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపట మంటున్నప్పుడు స్టవ్‌ మంట తగ్గించాలి.
ఎండుమిర్చి, కరివేపాకులు వేసి కొన్ని సెకన్లు వేగించాలి. తర్వాత వెల్లుల్లి తరుగు, టొమాటోలు వేసి టొమాటోలు మెత్తగా అయ్యే వరకు మధ్యమధ్యలో గరిటెతో కదుపుతూ ఉడికించాలి.
మంట తగ్గించి పసుపు, కారం, రసం పొడి వేసి ఒక నిమిషం పాటు ఉడికాక పాన్‌లో కొత్తిమీర, చింతపండు గుజ్జు వేసి నీళ్లు పోయాలి, ఉప్పు కూడా వేసి స్టవ్‌ మంటను తగ్గించి పదినిమిషాలు నెమ్మదిగా ఉడికించాలి.
తరువాత స్టవ్‌ మీద నుంచి పాన్‌ దింపి మిరియాల పొడి, ఇంగువ వేసి కలపాలి.
రసం పొడి తయారీ:
ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మెంతులు, ఇంగువ కలిపితే రసం పొడి రెడీ అవుతుంది. లేదంటే మార్కెట్‌లో రసం పొడి కొనుక్కోవచ్చు.
ఒక టేబుల్‌ స్పూన్‌ చింతపండు గుజ్జును పావుగ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలిపి వాడొచ్చు. మరికొంచెం చింతపండు గుజ్జును అవసరం మేరకు తరువాత కలుపుకోవచ్చు.
టొమాటో చారు
కావలసినవి:
టొమాటోలు పెద్దవి - రెండు, నీళ్లు - నాలుగు కప్పులు, చింతపండు గుజ్జు - ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి - మూడు, పసుపు - చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కరివేపాకులు - రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు - కొంచెం, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.

తయారీ:
టొమాటో ముక్కలు తరగాలి.
టొమాటో ముక్కల్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. అందులోనే పసుపు, చింతపండు గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు వేయాలి.
ఈ మిశ్రమాన్ని ఓ మాదిరి మంట మీద పావు గంట నుంచి 20 నిమిషాలు ఉడికించాలి. లేదా టొమాటోలు ఉడికేంత వరకు ఉంచాలి.
సాస్‌ పాన్‌ను స్టవ్‌ మీద పెట్టి నూనె వేడిచేయాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేయాలి.
అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
తయారుచేసుకున్న టొమాటో రసాన్ని కూడా కలపాలి.
కొత్తిమీర తరుగుతో అలంకరించాలి. వేడివేడిగా ఈ చారును ఎపటైజర్‌గా భోజనానికి ముందు తాగొచ్చు లేదా వేడి వేడి అన్నంతో కలుపుకుని తినొచ్చు.
వెల్లుల్లి రసం
కావలసినవి:
వెల్లుల్లి రెబ్బలు (నలిపి) - పది, చింతపండు - అర టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి - రెండు లేదా రుచికి సరిపడినన్ని, నల్లమిరియాలు - అర టీస్పూన్‌, ధనియాలు - ఒక టీస్పూన్‌, పచ్చిశెనగపప్పు, జీలకర్ర - ఒక్కోటి అర టీస్పూన్‌ చొప్పున, కరివేపాకులు - కొన్ని, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తాలింపులోకి: ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొంచెం, నెయ్యి - ఒక టీస్పూన్‌.

తయారీ:
చింతపండుని ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత చేతితో పిండి రసాన్ని వడకట్టాలి.
ఒక టీస్పూన్‌ నూనెని చిన్న పాన్‌లో వేసి సన్నటి మంట మీద వేడిచేయాలి. తరువాత ఎండుమిర్చి, నల్లమిరియాలు, ధనియాలు, పచ్చిశెనగపప్పు వేసి దాదాపు రెండు నిమిషాలు వేగించాలి.
ఇవి బాగా చల్లారాక గ్రైండర్‌ జార్‌లో వేసి జీలకర్ర, కరివేపాకులు, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
మరో టీస్పూన్‌ నూనెని సన్నటి మంట మీద వేడిచేసి వెల్లుల్లి రెబ్బలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించి ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టాలి.
తీసిపెట్టుకున్న చింతపండు రసంలో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి పెద్దగిన్నెలో పోయాలి. ఇందులో ఉప్పు వేసి ఓ మాదిరి మంట మీద ఉడికించాలి. ఉడుకుపట్టగానే మంట తగ్గించి సన్నటి మంట మీద ఎనిమిది నిమిషాలు ఉంచాలి. లేదా చింతపండు పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి.
తరువాత వేగించిన వెల్లుల్లి రెబ్బలను, కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని వేసి ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. మరో మూడు నిమిషాలు ఉడికించి స్టవ్‌ మీద నుంచి గిన్నె దింపి పక్కన పెట్టాలి.
సన్నటి మంటమీద తాలింపు గిన్నె పెట్టి నెయ్యి వేడిచేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటమనేవరకు ఉంచాలి. తరువాత కరివేపాకులు వేసి కొంచెం వేగించి స్టవ్‌ ఆపేయాలి. దీన్ని తయారైన రసంలో పోసి వడ్డించే గిన్నెలోకి రసాన్ని మార్చాలి. హాట్‌ అండ్‌ స్పైసీ వెల్లుల్లి రసాన్ని తింటుంటే కారంగా, ఘాటుగా, పుల్లగా భలే
భలేగా ఉంటుంది.
టిప్స్‌:
ఒక టొమాటోని సన్నగా తరిగి... మిక్సీ పట్టిన పదార్థాలతో కలిపి గ్రైండ్‌ చేస్తే చింతపండు మోతాదును తగ్గించొచ్చు. ఇలాకానీ చేస్తే పావు టేబుల్‌ స్పూన్‌ చింతపండు సరిపోతుంది.
మసాలా దినుసుల్ని మరీ ఎక్కువగా ముదురురంగుకి వచ్చే వరకు వేగించొద్దు.
చెన్నై రసం
కావలసినవి:
చింతపండు - ఓ మాదిరి ఉసిరికాయంత సైజులో, టొమాటో (మరీ పెద్దది, మరీ చిన్నది కాకుండా మీడియం సైజు)- ఒకటి, మిరియాలు, జీలకర్ర- ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, పసుపు - చిటికెడు, నూనె - రెండు టీస్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెమ్మ, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా.

తయారీ:
చింతపండుని అర కప్పు నీళ్లలో నానబెట్టాలి. అందులోనే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేయాలి.
తరువాత చింతపండు రసం పిండి పక్కన పెట్టాలి.
టొమాటోలను నలిపి చింతపండు రసంలో కలపాలి.
మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి.
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు రెండు ఎండుమిర్చి, కరివేపాకులు వేయాలి.
ఇందులో తయారుచేసుకున్న చింతపండు రసాన్ని, మిక్సీ పట్టిన పొడి, ఉప్పు వేసి వేడిచేయాలి.
ఉడుకుపట్టి నురగలా రావడం మొదలవ్వగానే స్టవ్‌ ఆపేయాలి. అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే చేదెక్కుతుంది. కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే రుచికరమైన రసం సిద్ధం.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list