MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆర్తి, Aarthi

ఆర్తి
 Aarthi


+++++++ ఆర్తి +++++++
అందర్నీ రక్షించేవాడే దేవుడు’ అంటారు యోగులు. సమయానికి ఆ రక్షణ అందకపోతే ‘ఎక్కడున్నాడు దేవుడు?’ అని ప్రశ్నిస్తారు కొందరు భక్తులు. అంత సులువుగా భగవంతుడు కనిపించడు. ఇంద్రాది దేవతలు సైతం నారాయణుడి కోసం ఎదురుచూస్తుంటారని పురాణాలు చెబుతాయి. పిలవగానే ఆ నారాయణుడు పలుకుతాడా అంటే, ‘పలికాడు’ అని అవి తేటతెల్లం చేశాయి.
భగవత్‌ జ్ఞానం ఉన్నవాడే ఆయనమీద ఆధారపడగలడు. అలా కానప్పుడు, దైవం కేవలం ఒక వూహ. ‘ఎవరి కర్మ వారు అనుభవించాలి. దేవుడేం చేస్తాడు... మనిషి తప్పు చేస్తే?’ అంటారు మరికొందరు. లోకంలో ఎవరి అనుభవాలు వారివి. పలికెడివాడు, పలికించెడివాడు రామభద్రుండట- అంటాడు భక్తపోతన. ఆయన రాముడి పట్ల భక్తిభావం చూపాడు. రామ రహస్యం తెలుసుకున్నాడు. లోకానికి అదే ప్రకటించాడు. అది పోతన అనుభవం, జీవిత సత్యం.
భగవంతుడి నామం పలకాలంటే, ముందుగా ఆయన అనుగ్రహం ఉండాలి అనేవారు రమణ మహర్షి. అంతా భగవంతుడే అని ఉపనిషత్తులు చాటాయి. బాధలు మనల్ని వదలిపోవు. ‘బాధ అనేదీ ఒక మాయ’ అంటే కొంతమంది నవ్వుతారు. నిజానికి సుఖదుఃఖాలు రెండూ- మాయ! ఈ జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం అంటారు వేదాంతులు. ఈ జ్ఞానం కలిగిన వెంటనే మనిషి అన్ని దుఃఖాల నుంచీ విముక్తుడవుతాడని వేద శాస్త్రాలు చెబుతున్నాయి.
ఏమీ చెయ్యకుండా ఏదీ రాదు. ఏదో ఒక పని చేసి ధనం, ఇల్లు, పొలం సంపాదించుకున్నట్లే- దైవనామ స్మరణ చేసుకుంటూ మనిషి పారమార్థిక ధనం సంపాదించుకోవాలి. ఖర్చుపెట్టుకోవడానికి ధనం కనిపిస్తుంది. పుణ్యం కనిపించదు. ఎటువంటి పరిస్థితిలోనైనా మనిషి కాస్తంత వూపిరి పీల్చుకోగలుగుతున్నాడంటే, అది అతడి పాపభీతి ఫలితమే!
‘దైవాన్ని పొందడానికి సహజ మార్గాన్ని బోధించేవాడే నా గురువు’ అంటారు భక్త కబీర్‌. ద్వారాల్ని బంధించకూడదు. కఠోర ప్రాణాయామం చేయించకూడదు. ‘ప్రపంచంతో బంధాన్ని విడిచిపెట్టు’ అనకూడదు. అలా గురువు నాకు సాయపడాలి. పరమాత్మను తెలుసుకునేందుకు దారి చూపించాలి. మనసు నిశ్చలంగా ఉంచుకోవడం ఎలాగో నాకు ఉపదేశించాలి. అటువంటివారే నా గురువు’ అని ఆయన అనేవారు.
సంసారంలో అనేక సమస్యలు ఉంటాయి. సంసారాన్ని వదిలివెళితే, మనిషి ఏ కొండ కోనల్లోనో నివసించాలి. అక్కడ ఉండే సమస్యలు మరో రకం! భగవంతుడి ప్రణాళికను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. జీవనక్రీడ ఆడుతూనే, దాని రహస్యం తెలుసుకోవాలి.మధ్యలోనే ఆటవిడిచి వెళ్లిపోతే ఎలా? పిల్లలుగా మారితేనే తప్ప, దైవానుభవాలు కలగవు. ‘మనిషి అహంకారంతో చేసే తప్పులకు దైవం ఎన్నటికీ బాధ్యత వహించడు’ అంటారు జ్ఞానులు.
మనం ఎంత బాధలో ఉన్నప్పటికీ, ఎదుటివాడి బాధను విస్మరించకూడదు. ఎదుటివాడు మనకు ఏది చేయకూడదని కోరుకుంటామో, దాన్ని అతడి పట్ల ఎన్నడూ తలపెట్టకూడదు. దీనుల సేవలో లీనమై, మనల్ని మనమే మరచిపోయేంత ధ్యానస్థితి కావాలన్నది పెద్దల మాట.
‘భగవద్గీత పఠనం కంటే, ఆటలో నీకు ఆసక్తి ఉంటే ఆ పనే చెయ్యి. శ్రద్ధ లేనివాడికి జ్ఞానం రాదు’ అనేవారు స్వామి వివేకానంద. బాధను ఓర్చుకున్నవారే నిజమైన భక్తులని షిర్డీ సాయి చెబుతుండేవారు. ఎవరికైనా సహాయం చేసి ఉంటే, తప్పకుండా మనకూ సహాయం అందుతుంది. ఎవరి నుంచీ ఏదీ కోరుకోకుండానే సహాయపడటాన్ని మనిషి అలవరచుకోవాలి. అతడి ఆర్తే... దైవాన్ని చెంతకు రప్పిస్తుంది!
- ఆనందసాయి స్వామి


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list