MohanPublications Print Books Online store clik Here Devullu.com

చెత్తకి చెక్‌ పెడదాం Clean Unnecessesary Files

చెత్తకి చెక్‌ పెడదాం
Clean Unnecessesary Files

చెత్తకి చెక్‌ పెడదాం!
ల్యాపీ... మొబైల్‌... ట్యాబ్లెట్‌... వాడేది ఏదైనా...ఎదురయ్యే సమస్య ఒకటే...Low Memory! అసలు మెమొరీ ఏమవుతోంది?ఎందుకు నిండిపోతోంది?ఎలా తొలగించాలి?ఇవిగోండి కొన్ని టూల్స్‌, చిట్కాలు! ప్రయత్నించి చూడండి.
కంప్యూటర్‌
రోజూ పర్సనల్‌ కంప్యూటర్‌ వాడతాం. వందల జీబీ మెమొరీ. మొదట్లో బోల్డంత మెమొరీ ఖాళీగా కనిపిస్తుంది. రోజులు గడుస్తున్నకొద్దీ మెమొరీ నిండిపోతుంది. వెంటనే హార్డ్‌డ్రైవ్‌లు అన్నీ ఓపెన్‌ చేస్తారు. అవి ఎంత మెమొరీ తీసుకున్నాయో కూడా చెక్‌ చేస్తారు. అయినప్పటికీ వృథా అయిన మెమొరీ గురించి అంతుచిక్కదు. పెద్ద మొత్తంలో మీరు ఎప్పుడో సేవ్‌ చేసిన హై రిజల్యూషన్‌ ఇమేజ్‌లు, హెచ్‌డీ వీడియోలు డ్రైవ్‌ల్లో ఏ మూలనో నిండి ఉంటాయి. మరైతే, మొత్తం డ్రైవ్‌లపై నిత్యం నిఘా వేస్తూ ఏవి ఎంత మెమొరీ తీసుకున్నాయో తెలుసుకోవచ్చు. అందుకు కొన్ని ప్రత్యేక డెస్క్‌టాప్‌ టూల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అవే ఇవి...
ఇన్‌స్టాల్‌ అక్కర్లేదు
సిస్టంలో 500 జీబీ హార్డ్‌డ్రైవ్‌ వాడుతున్నారనుకుందాం. పలు రకాల పేర్లతో డ్రైవ్‌ని విభజించారు. ఒక్కో దాంట్లో డేటాని భద్రం చేశారు. కొన్నాళ్లకు ఆయా డ్రైవ్‌ల్లో డేటా ఎంతెంత మెమొరీ తీసుకుందో విశ్లేషించాలంటే? అందుకు Space Sniffer అప్లికేషన్‌ని ప్రయత్నిం చొచ్చు. టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేయక్క ర్లేదు. డౌన్‌లోడ్‌ చేసిన జిప్‌ ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి EXE ఫైల్‌ని రన్‌ చేస్తే చాలు. మీరు విభజించిన అన్ని డ్రైవ్‌లతో ముందుకొస్తుంది. ఇక మీరు ఏ డ్రైవ్‌ని విశ్లేషించాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్‌ చేయాలి. అంతే... క్షణాల్లో మొత్తం డేటా చిట్టా ముందు ఉంచుతుంది. ఫైల్స్‌, ఫోల్డర్‌లు అన్నీ రంగుల బాక్స్‌ల్లో మెమొరీ వివరాలతో కనిపిస్తాయి. దీంతో ఏది ఎక్కువ మెమొరీని ఆక్రమించిందో సులువుగా తెలుసుకోవచ్చు. ఫోల్డర్‌ అయితే దానిపై క్లిక్‌ చేస్తే సబ్‌ ఫోల్డర్లు ఓపెన్‌ అవుతాయి. వాటిని కూడా తరచి చూడొచ్చు. ఆయా డేటా బాక్స్‌లపై రైట్‌క్లిక్‌ చేసి ఫైల్స్‌ని విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌లో చూడొచ్చు. అక్కర్లేని వాటిని వెంటనే డిలీట్‌ చేయవచ్చు. ఒక్కో డ్రైవ్‌నే కాకుండా మీకు తెలిసిన ‘ఫైల్‌ పాత్‌’తో కూడా మెమొరీ వాడకాన్ని రివ్యూ చేసే వీలుంది. అప్లికేషన్‌లో పైన కనిపించే టూల్‌బార్‌లోనూ కొన్ని ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. ఒక డ్రైవ్‌ని విశ్లేషించాక మరోటి సెలెక్ట్‌ చేసేందుకు ప్లస్‌ గుర్తుతో (New View) కనిపించే ఐకాన్‌ని సెలెక్ట్‌ చేయండి. డ్రైవ్‌లో ఖాళీగా ఎంత స్పేస్‌ మిగిలి ఉందో తెలియాలంటే స్టార్‌ గుర్తుని (Show Free Space) సెలెక్ట్‌ చేయాలి.
డౌన్‌లోడ్‌ లింక్‌: http:/goo.gl/3T5C1a
ఫోన్‌.. ట్యాబ్‌
నిత్యం వెంటే ఉండే ఫోన్‌, ట్యాబ్‌ల విషయానికొస్తే... ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌లపై ఎప్పుడూ ఓ కన్ను వేయాల్సిందే. లేదంటే ఉన్న మెమొరీ అనవసరంగా నిండిపోవడం ఖాయం. మరైతే పీసీలో మాదిరిగానే ఫోన్‌లోనూ డేటా స్టోరేజ్‌ని విశ్లేషించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసా?
‘జంక్‌’ ఏరేయండి!
ఫోనో... ట్యాబో ఉందంటే ఏదో ఒకటి ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. దీంతో జంక్‌ ఫైల్స్‌ (ఏపీకే ఫైల్స్‌, లాగ్‌ ఫైల్స్‌, ఇతర టెంపరరీ ఫైల్స్‌...) క్రియేట వుతాయి. దీంతో ఉన్న కాస్త ఇంటర్నల్‌ మెమొరీ నిండిపోయి ఫోన్‌ మొరాయిస్తుంది. ఫొటోలు తీయాలన్నా, కొత్త ఆప్స్‌ ప్రయత్నించాలన్నా ‘లో మెమరీ’ అంటూ విసిగిస్తుంది. అందుకే కొన్ని ప్రత్యేక ఆప్స్‌ వాడి అనవసర ఫైల్స్‌ను తీసిపారేయొచ్చు. Clean Master ఆప్‌ని ప్రయత్నించి చూడండి. స్టోరేజ్‌ని క్లీన్‌ చేయడంతో పాటు బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరచొచ్చు. ఇన్‌స్టాల్‌ చేసిన ముఖ్యమైన ఆప్స్‌కి తాళం వేసి సురక్షితంగా వాడుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/uAXu8W
Cleaner & Booster
సెక్యూరిటీ సంస్థ AVG అందిస్తున్న ఆప్‌. దీంతో అక్కర్లేని డేటాని తొలగించి ఫోన్‌ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచొచ్చు. నకిలీ ఫొటోలను గుర్తించి తొలగించొచ్చు. అంతేనా... నాణ్యతలేని ఫొటోలను గుర్తించి చూపిస్తుంది. ఆప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/VzeiWF
CCleaner
పీసీలో సుపరిచితమైన అప్లికేషన్‌. ఆప్‌లోనూ తనదైన ప్రత్యేకతతో చెత్తకి చెక్‌ పెట్టేస్తుంది. సులువైన ఇంటర్ఫేస్‌తో ఆప్‌ని వాడుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/m6TLpW
Clean Doctor, Phone Clean
యాపిల్‌ యూజర్లకు ప్రత్యేకం. నకిలీ ఫొటోలు, కాంటాక్ట్‌లను సులువుగా వెతికి తొలగించొచ్చు. నకిలీగా గుర్తించిన ఫొటోలను గ్యాలరీ నుంచి తొలగించొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/ONwz4l
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/EpsXgG
దేనికి ఎంతో...
స్మార్ట్‌ ఫోన్‌లో స్టోరేజ్‌ని మేనేజ్‌ చేసేందుకు బిల్ట్‌ఇన్‌గానే ‘స్టోరేజ్‌ మేనేజర్‌’ ఉంటుంది. అప్పుడప్పుడు దాంట్లోకి వెళ్లి రివ్యూ చేస్తుంటాం. కానీ, మరింత వివరంగా స్టోరేజ్‌ని విశ్లేషించాలంటే? ప్రత్యేక ఆప్స్‌ ఉన్నాయి. ఒకసారి DiskUsage ఆప్‌ని ప్రయత్నించి చూడండి. రన్‌ చేసి ఎస్‌డీకార్డ్‌లోని డేటాని స్టోరేజ్‌ ఎలా విభజన అయ్యిందో చూడొచ్చు. దేనికి ఎంత మెమొరీ ఖర్చు అయ్యిందో రంగుల్లో బాక్స్‌లో గ్రాఫ్‌ మాదిరిగా కనిపిస్తుంది. తాకితే దాంట్లోని ఇతర విభాగాల్ని చూడొచ్చు. అక్కర్లేని వాటిని సెలెక్ట్‌ చేసి అప్‌ నుంచే తొలగించొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/uXU7GL
అదనపు స్టోరేజ్‌...
డేటాని సరైన పద్ధతిలో స్టోర్‌ చేయకపోతే! ఎక్స్‌టర్నల్‌, ఇంటర్నల్‌ మెమొరీ ఎంత ఉన్నా ఇట్టే నిండిపోతుంది. అందుకే స్టోరేజ్‌ ఎప్పుడూ కొంత ఖాళీగా ఉండాలంటే? ఫైల్స్‌ని ఓ క్రమ పద్ధతిలో దాచుకోవాలి. ఇంటర్నల్‌ మెమొరీలో ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్స్‌ని రివ్యూ చేసి అవకాశం ఉన్నవాటిని ఎస్‌డీ కార్డ్‌లోకి పంపొచ్చు. అందుకు సెట్టింగ్స్‌లో Move to SD Card ఆప్షన్‌ని వాడొచ్చు. అంతేకాదు... స్కాన్‌ చేసిన డాక్యుమెంట్స్‌, బిల్లులు లాంటివి ఏవైనా ఫోన్‌లో భద్రం చేస్తుంటాం. కానీ, వాటితో ఉండే అవసరం తక్కువ. అలాంటప్పుడు వాటిని ఫోన్‌ మెమొరీలోనే దాచడం వల్ల ఉపయోగం లేనట్టే! అందుకే వాటిని క్లౌడ్‌ సర్వీసుల్లోకి అప్‌లోడ్‌ చేయడం మేలు. అవసరం అయినప్పుడు తిరిగి ఎప్పుడైనా పొందొచ్చు.
* క్లౌడ్‌ సర్వీసుల్ని ఆప్స్‌ రూపంలో ఫోన్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. కావాలంటే ‘గూగుల్‌ డ్రైవ్‌’ని ప్రయత్నించొచ్చు. వాడుతున్న జీమెయిల్‌ ఎకౌంట్‌తోనే పని చేస్తుంది. 15జీబీ ఉచితం. సులువైన పద్ధతిలో డాక్యుమెంట్‌లు, పీడీఎఫ్‌లు, ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసి దాచుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/zPnXIE
* డ్రాప్‌బాక్స్‌ మరోటి. భద్రం చేయడమే కాకుండా ఎక్కువ మెమొరీ కూడిన ఫైల్స్‌ని డ్రాప్‌బాక్స్‌ నుంచే మెయిల్‌ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/g4H2s1
* ఫోన్‌ కెమెరాతో తీసిన ఫోటోలను ఆటోమాటిక్‌గా క్లౌడ్‌లోకి సింక్‌ చేసి ఫొటోగ్యాలరీని ఎప్పటికప్పుడు ఖాళీ చేయవచ్చు. అందుకు ‘ఫ్లిక్కర్‌’ క్లౌడ్‌ స్టోర్‌ సరైన వేదిక. 1000 జీబీని ఉచితంగా అందిస్తున్నారు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/JqUf5M
పీసీ, మ్యాక్‌కి మరికొన్ని...
* సులభమైన పద్ధతిలో తుడిచివేత ప్రక్రియని చేపడదాం అనుకుంటే CCleaner టూల్‌ని వాడొచ్చు. ఎప్పటికప్పుడు సిస్టం సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు అనువైన టూల్‌. మ్యాక్‌ యూజర్లూ వాడుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: www.piriform.com
* మ్యాక్‌ యూజర్లకు ప్రత్యేకంగా MacClean అప్లికేషన్‌ ఉంది. ఒకే క్లిక్‌తో అన్నింటినీ ముగించేస్తుంది. ఉచితంగా టూల్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/n4B24f
* యాపిల్‌ మ్యాక్‌ని వాడుతున్నట్లయితే Disk Inventory X అప్లికేషన్‌ని వాడొచ్చు. విండోస్‌లో మాదిరిగానే వివిధ రంగుల బాక్స్‌ల్లో స్టోరేజ్‌ వివరాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://goo.gl/MVWQ2C
* ఐట్యూన్స్‌లోని అధికారిక అప్లికేషన్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే GrandPerspective టూల్‌ని పొందొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/ATBZ3p
విభాగాలుగా చూడొచ్చు...
సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని మరింత వివరంగా స్టోరేజ్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేసేందుకు WinDirStat అప్లికేషన్‌ని వాడొచ్చు. ఓపెన్‌ సోర్స్‌ కమ్యూనిటీ నుంచి అందుబాటులోకి వచ్చింది. డెస్క్‌టాప్‌పై షార్ట్‌కట్‌ని రన్‌ చేయగానే సిస్టంలోని అన్ని డ్రైవ్‌లతో విండో ఓపెన్‌ అవుతుంది. కావాల్సిన డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేసి డేటా స్టోర్‌ అయిన వివరాల్ని చూడొచ్చు. నాలుగు విభాగాలుగా డీఫాల్ట్‌ వ్యూ కనిపిస్తుంది. ఒక దాంట్లో డ్రైవ్‌లోని ఫోల్డర్స్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు. మరో దాంట్లో ఫైల్‌ ఫార్మెట్‌ రంగులకు సంబంధించిన వివరాల్ని చూడొచ్చు. ఇక మూడో దాంట్లో వివిధ రంగుల్లో బాక్స్‌లు కనిపిస్తాయి. స్టోర్‌ చేసిన ఫైల్స్‌ ఆధారంగా ఒక్కో ఫైల్‌ ఫార్మెట్‌కి ఒక్కో రంగు కనిపిస్తుంది. ఉదాహరణకు JPEG ఫార్మెట్‌ వివరాలు పచ్చ రంగులో కనిపిస్తాయి. దీంతో డ్రైవ్‌ మెమొరీతో ఎంత శాతాన్ని ఫొటోలు అక్రమించాయో సులువుగా తెలుసుకోవచ్చు. 3gp ఫార్మెట్‌ వీడియో ఫైల్స్‌ని అన్నింటినీ డీఫాల్ట్‌గా నీలి రంగుతో గుర్తించొచ్చు. ఇక ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లో ఫోల్డర్స్‌ని బ్రౌజ్‌ చేసి అక్కర్లేని వాటిని తొలగించొచ్చు. ఇలా డిలీట్‌ చేసిన ఫైల్స్‌ రీసైకిల్‌ బిన్‌లోకి వెళ్లకుండా శాశ్వతంగా తొలగిపోవాలంటే రైట్‌క్లిక్‌ చేసి Delete (no way to undelete) సెలెక్ట్‌ చేయండి. అప్లికేషన్‌ టూల్‌బార్‌లోనూ అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఎంపిక చేసిన ఫైల్‌ లేదా ఫోల్డర్‌కి సంబంధించిన అన్ని వివరాల్ని చూడాలనుకుంటే Show Properties ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://goo.gl/WxC1cf
ఇలా తుడిచేద్దాం!
సిస్టంలో పలు అప్లికేషన్ల ప్రాసెస్‌ వల్ల ప్రయోజనం లేని చెత్త మెమొరీలో క్రియేట్‌ అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు బిల్ట్‌ఇన్‌ అప్లికేషన్‌ టూల్స్‌తో తుడిచేయడం మేలు. ‘డిస్క్‌ క్లీన్‌అప్‌’ తెలుసుగా? మై కంప్యూటర్‌ ఓపెన్‌ చేసి క్లీన్‌ చేద్దాం అనుకునే డ్రైవ్‌ని సెలెక్ట్‌ చేసి రైట్‌క్లిక్‌ చేయాలి. తర్వాత Properties-> Disk Cleanup ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. అంతే... క్షణాల్లో చెత్తని తొలగించే ప్రక్రియని చేపడుతుంది. ఒకవేళ మరింత స్పష్టమైన అవగాహనతో అనవసర ఫైల్స్‌ని తొలగించాలనుకుంటే థర్డ్‌పార్టీ అప్లికేషన్స్‌ని ప్రయత్నించొచ్చు. కావాలంటే Glary Utilities అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. పీసీ యూజర్ల అవసరాలకు తగినట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. రన్‌ చేస్తే ఐకాన్‌ గుర్తులతో వరుసగా అప్లికేషన్‌ అందించే సర్వీసులు కనిపిస్తాయి. మెమొరీ డిస్క్‌ల్లోని చెత్తని స్కాన్‌ చేసి తీసేందుకు Disk Cleanup ఐకాన్‌ని సెలెక్ట్‌ చేయాలి. డిస్క్‌లో ఏయే ఫైల్స్‌ ఎంత మేర ఆక్రమించాయో తెలుసుకునేందుకు Disk Space Analyzer సౌకర్యం ఉంది. ఇదే మాదిరిగా రిజిస్ట్రీలోని తప్పుల్ని సరి చేసేందుకు Registry Repair ఆప్షన్‌ ఉంది. ఇంకా చెప్పాలంటే అవసరంగా ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్స్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేసేందుకు Uninstall Manager ఆప్షన్‌ని ప్రయోగించొచ్చు. ఇన్‌స్టాల్‌ చేసిన అప్లికేషన్స్‌ని నిత్యం అప్‌డేట్‌ చేసేందుకు అనువుగా Software Update విభాగం ఉంది. అప్లికేషన్‌ అందించే భిన్నమైన సర్వీసుల్ని ఒకేసారి సెలెక్ట్‌ చేసి రన్‌ చేయవచ్చు. అందుకు 1-Click Maintenance ట్యాబ్‌లోకి వెళ్లాలి.
డౌన్‌లోడ్‌ లింక్‌:www.glarysoft.com
నకిలీల మాటేంటి?
ఏళ్ల తరబడి సిస్టంలో వివిధ రకాల డేటాని సేవ్‌ చేస్తుంటాం. కొన్నింటినైతే ఒకటి రెండు చోట్ల సేవ్‌ చేయడం సర్వసాధారణం. కొంత కాలం తర్వాత ఇలాంటి డూప్లికేట్‌ ఫైల్స్‌ డ్రైవ్‌ల్లో ఎక్కడున్నాయో చెక్‌ చేసి మెమొరీని ఖాళీ చేద్దాం అనుకుంటే? ఒక్కో డ్రైవ్‌ని వెతుకుతూ వెళ్తే బోల్డంత సమయం పడుతుంది. అంతేనా... కాసేపటికి విసుగొస్తుంది. మరైతే, అత్యంత సులభంగా నకిలీ ఫైల్స్‌ని వెతికేందుకు dupeGuru ఆప్‌ని వాడండి. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే బుల్లి విండో ఓపెన్‌ అవుతుంది. ప్లస్‌ గుర్తుపై క్లిక్‌ చేసి దేంట్లో నకిలీ ఫైల్స్‌ని వెతకాలనుకుంటున్నారో సెలెక్ట్‌ చేసుకోవాలి. డ్రైవ్‌ మొత్తాన్ని వెతకొచ్చు. లేదంటే... ఏదైనా ప్రత్యేక ఫోల్డర్‌ని సెలెక్ట్‌ చేసి ‘స్కాన్‌’ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. సెకన్లలో మొత్తం డూప్లికేట్‌ ఫైల్స్‌ వచ్చేస్తాయి. ఫైల్‌పేరు, ఫోల్డర్‌, సైజు వివరాలతో జాబితాగా అన్నీ వచ్చేస్తాయి. అలాగే, Match కాలమ్‌లో అదెంత శాతం నకిలీనో కూడా అప్లికేషన్‌ చెబుతుంది. ఇక డూప్లికేట్‌ ఫైల్స్‌ని సెలెక్ట్‌ చేసి Actions మెనూలోకి వెళ్లి మేనేజ్‌ చేయవచ్చు. అక్కర్లేదు అనుకుంటే తొలగించొచ్చు. లేదంటే వేరే ఫోల్డర్స్‌లోకి move చేసుకునే వీలుంటుంది. జాబితాలో కేవలం నకిలీ ఫైల్స్‌ మాత్రమే కావాలనుకుంటే Dupes Only ఆప్షన్‌ని చెక్‌ చేయవచ్చు. ఫైల్స్‌కి సంబంధించిన అదనపు వివరాల్ని సెర్చ్‌ రిజల్ట్స్‌లో చూద్దాం అనుకుంటే Columns మెనూలోకి వెళ్లి జత చేయవచ్చు. ఉదాహరణకు ఫైల్‌ ఫార్మెట్‌ ఉండాలనుకుంటే కాలమ్స్‌ మెనూలోకి Kind ఆప్షన్‌ని చెక్‌ చేయాలి. అలాగే, ఎన్ని డూప్లికేట్స్‌ ఉన్నాయో తెలుసుకునేందుకు Dupe Count ఆప్షన్‌ని జత చేయవచ్చు. సెర్చ్‌ ఆప్షన్‌తో కావాల్సిన ఫైల్‌ని వెతికే వీలుంది. మ్యాక్‌ యూజర్ల కూడా అప్లికేషన్‌ని వాడుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/fDO9ml


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list