MohanPublications Print Books Online store clik Here Devullu.com

శీఘ్ర వివాహానికి బ్రహ్మ పురాణం ఆధారముగా శ్రీ అపర్ణాదేవి వివాహ చరిత్ర

శీఘ్ర వివాహానికి బ్రహ్మ పురాణం ఆధారముగా  శ్రీ అపర్ణాదేవి వివాహ చరిత్ర

శీఘ్ర వివాహానికి బ్రహ్మ పురాణం ఆధారముగా
శ్రీ అపర్ణాదేవి వివాహ చరిత్ర
వైవస్వత మన్వంతరములో మేనకా హిమవంతులకు ఉమ అను పేరుతో పార్వతి జన్మించెను.పూర్వజన్మలో సతీదేవిగను, తర్వాత జన్మలో ఉమాదేవిగను పార్వతి ప్రఖ్యాతి పొందెను.గిరిజాపుత్రికగా జన్మించిన పిమ్మట శివ పార్వతులకు ఏ విధముగా వివాహము జరిగెనో వివరింపుమని మునులు బ్రహ్మగారిని అడిగిరి.సర్వసిద్ధిప్రదమైన ఉమాశంకరుల కథ చెప్పెదను వినుమని బ్రహ్మగారు చెప్పుట ప్రారంభించెను.
హిమవంతుడు పుత్రులకై తపస్సు చేయచుండగా శివుడు ప్రత్యక్షమై ముగ్గురు పుత్రికలను వరముగా ఇచ్చితిని అని అంతర్ధానమయ్యెను. ప్రధమ పుత్రిక పాటల. ద్వితీయ పుత్రిక ఏకపర్ణా. తృతీయ పుత్రిక అపర్ణా. ఈ మువ్వురు శివుని వివాహము చేసుకొనవలెనని ప్రయత్నించుచుండిరి.
బ్రహ్మగారు ప్రధమ, ద్వితీయ పుత్రికలకు శివునితో వివాహము జరగదని అపర్ణతో శివుని వివాహము జరగగలదని చెప్పెను. ఈ అపర్ణ ఉమ అను పేరుతో ముల్లోకాలలో కీర్తి పొందును అని చెప్పెను.అపర్ణ నిరాహారిగ ఉండిపోయెను. తల్లి బాధతో "ఉ" మా = వద్దు అని నివారించెను. అప్పటి నుండీ పార్వతి ఉమ గా పిలువబడుచున్నది.
ఓ దేవీ నీ యొక్క తపస్సుచే లోకములన్ని దద్దరిల్లుచున్నవి. నీచే సృష్టించబడిన ఈ ప్రపంచమును చేయవద్దని ఉమ తల్లి మేనక ప్రార్థించెను.నీవు ఎవరికొరకు తపస్సు చేయుచుంటివో వారే స్వయముగా వచ్చి నిన్ను వరింపగలడని బ్రహ్మగారు చెప్పెను.
కైలాసవాసి చరాచర ప్రభువు అప్రమేయుడు చంద్రునితో కూడినవాడు, ఇంద్రునితో సమానుడు, మూడవ కన్ను కలవాడు అయిన మహేశ్వరుడే శివుడని పార్వతికి బ్రహ్మ చెప్పెను. నీ తపస్సుకై నీకు అనువైన ప్రదేశముకు వెళ్ళమని బ్రహ్మగారు ఉమకు చెప్పెను.
ఓ సుందరీ! నీవు శీఘ్రముగా దండకారుణ్యమునకు వెళ్లి నీలలోహితుడైన శివుని గూర్చి తపమాచరింపుమని దేవతలు చెప్పిరి.అపుడు పార్వతి
నా తపస్సు వృథా కాకుండా శివుడే భర్త కాగలడని నిశ్చయించుకుని తల్లిదండ్రులకు, దేవతలకు, బ్రాహ్మణులకు ప్రదక్షణము చేసి పార్వతి దండకారుణ్యమునకు బయలుదేరెను.
పార్వతి తపస్సు చేయచుండగా శివుడు :-
వికృతరూపము, పొట్టి చేతులు, బాహువులు, భిన్నమైన నాసిక, పొట్టివాడు, పింగళ వర్ణములు కేశములతో శివుడు పార్వతి ఎదుట నిలబడెను.
పార్వతి యోగశక్తి ద్వారా శివుడు వచ్చెనని కనుగొని మానసికపూజ గావించెను. మనస్సుతోనే షోడశోపచారములను గావించెను.
ఓ దేవా! నేను స్వతంత్రురాలుని కాను. తండ్రి అధీనములో ఉన్నదానిని. నీవు నా తండ్రి వద్దకు వెళ్లి నీ కుమార్తె అపర్ణను నాకిచ్చి వివాహము జరిపించమని విన్నవింపుడని అపర్ణ చెప్పెను.
ఆ మాటలు విని వికృతాకారముగా హిమవంతుని వద్దకు వెళ్లి అడిగెను.
మరల ఉమ వద్దకు వచ్చి తన తండ్రి చెప్పిన మాటలను ఈ విధముగా చెప్పెను.
నీ తండ్రి స్వయంవరములో అపర్ణ నిన్ను భర్తగా స్వీకరింపగలదని చెప్పెను.
శివుని మాటలు విని పార్వతి రుద్రునిపై మనస్సు లగ్నము చేసి మరల తపస్సు ప్రారంభించెను.
అపుడు బ్రహ్మ గారు ప్రత్యక్షమై ఉమతో ఇట్లు పలికెను.
నాయందు నీకు సందేహము వలదు. ఇచటనే శివుని వరునిగా పొంది నీ కోరిక నెరవేరునని చెప్పెను.
బ్రహ్మ పార్వతి చేతికి పుష్పమాలను యిచ్చి, శివుడు నిన్ను వరించు సమయమునకై వేచి ఉండమని బ్రహ్మ పలికెను. మరియు
ఈ పుష్పమాల తో శివుని వరింపగలవు. నీకు ముసలితనము ఉండదు. అమరత్వము సంభవింపగలదని వక్కాణించెను.
కోరిన రూపము గలదానా! కోరికతో పూవులను ఆభరణముగా చేసి ధరించితివి. ఆ ఫలితమును నీవు పొందగలవు.
ప్రాణములను లెక్క చేయకుండా నీవు చేయి తపస్సుకు విఘ్నములు కలుగవని చెప్పి బ్రహ్మగారు అంతర్థానమయ్యెను.
ఆ తరువాత శివుని కెదురుగా రాతిపై నిలిచి మనస్సు లఘ్నము చేసి తపస్సు చేయిచుండెను.
ఆ సమయములోఆశ్రమమునకు దగ్గరలో సరస్సు తీరమున బాలుని యొక్క ఆర్తనాదము వినిపించెను.
దేవదేవుడైన శివుడు స్వయముగా బాలుని రూపము ధరించి సరస్సునందు ఆడుచుండగా మొసలి బాలుని యొక్క కాలుని పట్టుకొనెను.
యోగమాయను కల్పించి ప్రపంచము ఉద్భవించుటకు కారణభూతుడైన శివుడు బాల రూపముతో ఈ క్రింది విధముగా మాట్లాడెను.
నాకు ఏ కోరిక తీరకుండగనే మొసలి నన్ను తీసుకొనిపొవుచున్నది. నేను బాలుడను. ఈ మొసలి బారినుండి రక్షింపుడని ఆర్తనాదము చేసెను.
మొసలి పట్టుకొనుటచే నా ముఖము పాలిపోయినది. నా ప్రాణములు ఈ మొసలి చేతిలోనే అంతమగునని దుఃఖించుచుండెను.
తపస్సు చేయిచున్న పార్వతిని చూచి ఓ దేవీ! నీవే నా తల్లివి. తండ్రివి. మొసలి పట్టుకుని నన్ను చంప ప్రయత్నిస్తున్నదని అఱచుచున్ననూ నీకు వినబడలేదా!
నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడను. ప్రియమైనవాడిని. నేను ప్రాణములు విడిచినచో నా తల్లిదండ్రులు ఎంతగా దుఃఖింతురో గదా!
పార్వతి ఆ బాలుని యొక్క ఆర్తనాదమును విని సరస్తీరమున ఉన్న బాలుని చూచెను.
ఆ బాలుడు ముగ్ధ మనోహరాకృతి కలిగి యుండెను. భయపడుచున్న బాలుని చూచి సరోవరములోనికి దిగెను.
ఓ మొసలీ! ఈ బాలుడు అతని తల్లిదండ్రులకు ఏకైకపుత్రుడు కావున వెంటనే విడిచిపెట్టుమని పార్వతి అడిగెను.
ఓ దేవీ! బ్రహ్మ నాకు మధ్యాహ్న భోజనముగా ఈ బాలుని స్వీకరింపుమని చెప్పెను, నీ తపస్సును ధారపోసినచో విడిచెదనని మొసలి చెప్పెను.
మొసలికి నమస్కారము చేయుచూ పార్వతి నా తపస్సును నీకు ధారపోసెదను ఈ బాలుని విడిచి పెట్టెదవా అని అడిగెను.
నీ తపస్సును దానము చేసిన విడిచెదనని మరల మొసలి పార్వతితో చెప్పెను.
జన్మ మొదలకుని ఇప్పటివరకు సంపాదించిన పుణ్యము నీకు ధారపోసెదను. బాలుని విడిచిపెట్టుమని మొసలిని ఆతృతతో పార్వతి అడిగెను.
వెంటనే మొసలి యొక్క ముఖము మధ్యాహ్న సూర్యుని వలే ప్రకాశించెను.
ఓ దేవీ! నీవు బాగుగా ఆలోచించి చెప్పుచుంటివి గదా! మరల పుణ్యము సంపాదించుట కష్టమే కదా! అని మొసలి పార్వతిని అడిగెను. బ్రాహ్మణ బాలుని కొఱకు నీ తపస్సు ధార పోయుచుంటివి. నీకేమైనా వరము కావలెనో కోరుకొమ్మని అడిగెను.
అపుడు పార్వతి నేను మరల తపస్సు చేసి పుణ్యము సంపాదించగలను. అందువలన నాకేమీ కోరిక లేదని చెప్పెను.
నాచే ఈయబడిన ఈ దానము తిరిగి తీసుకొనబడదు. నీవే అనుభవించు. బాలుని విడిచిపెట్టుమని పార్వతి అడిగెను.
ఉమాదేవి అడిగిన విధముగా బాలుని విడిచిపెట్టి మొసలి అంతర్థానమమయ్యెను.
మొసలి చేత విడిపింపబడిన బాలుడు కలలో చూచుచున్నట్లుగా బాలుడు కూడా అంతర్థానమమయ్యెను.
మరల పార్వతి తపస్సు చేసుకొనుటకై సన్నద్ధమగుచుండెను.
మరల తపస్సు చేయిటకై వెళ్ళుచున్న పార్వతిని చూచి శంకరుడు తపస్సు చేయవద్దని వారించెను.
నీచే ఈయబడిన ఈ తపోదానము వలన నీ తపస్సు అక్షయమగును. భవిష్యత్తులో అనేక విధములుగా ఈ తపోదానము ఉపయోగపడునని శంకరుడు పలికెను.
నీయొక్క తపఃఫలము అక్షయమగునని శివుని వద్ద వరము పొంది పార్వతి స్వయంవరమునకు సంతోషముగా బయలుదేరెను.
ఈ కథను ఎవరైతే పఠిన్తురో వారికి వెంటనే వివాహము కాగలదు. ఆ తర్వాత గణేశుడు, కుమారస్వామి వంటి పుత్రులు కలిగెదరని శిలా రూపమున ఉన్న పార్వతిని పూజించిన వారికి సమస్త కోరికలు తీరునని చెప్పి శివ పార్వతులిద్దరూ అంతర్థానమయ్యెను.
అపర్ణ అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అను గ్రామములో కలదు. ఈ గ్రామం అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో కలదు. శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list